పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : కరభాజనకృత విష్ణు స్తుతి (కష్ట హరం)

  1
అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ఏకాదశ స్కంధ అంతర్గత కరభాజనకృత విష్ణు స్తుతి (కష్ట హరం)