స్తుతులు స్తోత్రాలు : స్కంధాద్యంత కృష్ణ ప్రార్థనలు (జయ కరములు)
1
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
2
శ్రీకర కరుణా సాగర!
ప్రాకటలక్ష్మీ కళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా!
3
నరదేవాసుర యక్షరాక్షస మునీంద్రస్తుత్య! దివ్యాంబరా
భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠ మం
దిర! బృందావనభాసురప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ
కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా!
4
పరమపదవాస! దుష్కృత
హర! కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా
సురగోపికామనోహర!
సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా!
5
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!
6
శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లోక! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా!
7
జలజభవాది దేవ ముని సన్నుత తీర్థపదాంబుజాత! ని
ర్మల నవరత్న నూపుర విరాజిత! కౌస్తుభ భూషణాంగ! యు
జ్జ్వల తులసీ కురంగ మదవాసనవాసిత దివ్యదేహ! శ్రీ
నిలయ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా!
8
శ్రీ తరుణీ హృదయస్థిత!
పాతకహర! సర్వలోకపావన! భువనా
తీతగుణాశ్రయ! యతి వి
ఖ్యాత! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ!
9
దండితారిసమూహ! భక్తనిధాన! దాసవిహార! మా
ర్తాండమండల మధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసి కో
దండ శంఖ సుదర్శనాంక! సుధాకరార్క సునేత్ర! భూ
మండలోద్ధరణార్త పోషణ! మత్తదైత్య నివారణా!
10
శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.
11
రాజీవరాజపూజ్య
శ్రీజిత గోపీకటాక్ష సేవాంతర వి
భ్రాజితమూర్తి! మదోద్ధత
రాజకులోత్సాద రామరాజాఖ్యనిధీ!
12
మురవిదారణ ముఖ్యకారణ! మూలతత్త్వవిచారణా!
దురితతారణ దుఃఖవారణ! దుర్మదాసురమారణా!
గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయమహారణా!
ధరణిధారణ! ధర్మతారణ తాపసస్తుతిపారణా!
13
కరుణాకర! శ్రీకర! కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!
14
శ్రీ సీతాపతి! లంకే
శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా
ణీసత్యధిభూభవవృ
త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!
15
శ్రీ మరుదశనపతిశయన!
కామితమునిరాజయోగికల్పద్రుమ! యు
ద్దామ! ఘనజనకవరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!
16
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అంతర్గత స్కంధాద్యంత కృష్ణ ప్రార్థనలు (జయ కరములు)