స్తుతులు స్తోత్రాలు : సింగయకృత షష్ఠ్యంతములు (సంకల్ప సిద్ధికరం)
1
శ్రీపతికి మత్పతికి నుత
గోపతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం
తాప నివారణ మతికిని
బ్రాపితసనకాది తతికి బహుతర ధృతికిన్,
2
హరికి గురు కలుషకుంజర
హరికి బలాభీలహరికి నంతస్థ్సిత గ
హ్వరికి నరహరికి రక్షిత
కరికిఁ గరాగ్రస్థగిరికి ఘనతరకిరికిన్.
3
గుణికి సమాశ్రిత చింతా
మణికి మహేంద్రాది దివిజమండల చూడా
మణికిఁ బ్రకల్పితశయ్యా
ఫణికి నురోభాగ కౌస్తుభప్రియమణికిన్,
4
కంసాసుర సంహారున
కంసాంచిత కర్ణకుండ లాభరణునకున్
హింసాపర పరమస్తక
మాంసకరాళిత గదాభిమత హస్తునకున్.
5
వర యోగిమాన సాంతః
కరణ సుధాంభోధి భావకల్లోల లస
త్పరతత్త్వశేషశాయికిఁ
జిరదాయికి సకలభక్తచింతామణికిన్
6
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత షష్ఠ స్కంధ అంతర్గత సింగయకృత షష్ఠ్యంతములు (సంకల్ప సిద్ధికరం)