స్తుతులు స్తోత్రాలు : ::కృష్ణ స్తుతులు::
అక్రూరుడు రామకృష్ణుల పొగడుట (భవపాశ హరం)
1
"అనుచరులుఁ దానుఁ గంసుఁడు
చనియెన్ మీచేత జమునిసదనంబునకున్
ఘనులార! మీ బలంబున
నొనరఁగ యాదవకులంబు నుద్ధృత మయ్యెన్.
2
మహాత్ములార! మీరు విశ్వాదిపురుషులరు, విశ్వకారణులరు, విశ్వమయులరగుట మీకుఁ గార్యకారణంబులు లే; వధరింపుము. పరమేశ్వరా! నీవు రజోగుణంబున నఖిలంబు సృజియించి కారణరూపంబునఁ దదనుప్రవిష్టుండవై కృతదృష్టకార్యరూప ప్రపంచాకారంబున దీపించుచుందువు; కార్యరూప చరాచర దేహంబులకుం గారణంబులైన భూప్రముఖంబు లనుగతంబులైనఁ గార్యరూప దేహంబులునై ప్రకాశించు చందంబున నొక్కండవుఁ గారణరహితుండవు నాత్మతంత్రుండవునై యుండియు విశ్వాకారంబునఁ బెక్కగుదువు సృష్టి స్థితి లయంబులఁ జేయుచుండియును విజ్ఞానమూర్తి వగుటం బరిభ్రాంతుండైన జీవుని భంగి గుణకర్మబద్ధుండవు కావు; కావున సిద్ధంబు తన్నిమిత్తంబున బంధహేతువు సిద్ధింపదు.
3
పరఁగ జీవునికైన బంధమోక్షము లంట-
వంటునే పరతత్వమైన నిన్ను
నంటునే యీశ! దేహాద్యుపాధులు నని-
ర్వచనీయములుగాన వరుస నీకు
జన్మంబు జన్మసంశ్రయ భేదమును లేదు-
కావున బంధమోక్షములు లేవు;
గణుతింప ని న్నులూఖలబద్ధుఁ డనుటయు-
నహిముక్తుఁ డనుటయు నస్మదీయ
4
బాలబుద్ధిఁ గాదె? పాషండ ముఖర మా
ర్గములచేత నీ జగద్ధితార్థ
మైన వేదమార్గ మడఁగిపో వచ్చిన
నవతరించి నిలుపు దంబుజాక్ష.
5
ఆ నీవు ధరణిభారము
మానిచి రక్కసుల నెల్ల మర్దించుటకై
యానకదుందుభి యింటను
మానక జన్మించితివి సమంచితకీర్తిన్.
6
త్రిజగత్పావన పాదతోయములచే దీపించి వేదామర
ద్విజముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం జేసి మా
నిజగేహంబులు ధన్యతం దనరెఁ బో; ని న్నార్యు లర్చింపఁగా
నజితత్వంబులు వారి కిత్తు వనుకంపాయత్త చిత్తుండవై.
7
ఏపుణ్యాతిశయప్రభావముననో యీజన్మమం దిక్కడన్
నీపాదంబులు గంటి నిన్నెఱిఁగితిన్ నీవుం గృపాళుండవై
నాపైనర్మిలిఁజేసి మాన్పఁ గదవే నానా ధనాగార కాం
తాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాతచింతామణీ!"
8
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత అక్రూరుడు రామకృష్ణుల పొగడుట (భవపాశ హరం) అను నుతి