స్తుతులు స్తోత్రాలు : నాగకాంతల కృష్ణస్తుతి (భగవదనుగ్రహ ప్రదం)
1
కని దండప్రణామంబు లాచరించి నిటలతటఘటిత కరకమలలై యిట్లనిరి.
2
"క్రూరాత్ముల దండింపఁగ
ధారుణిపై నవతరించి తనరెడి నీ కీ
క్రూరాత్ముని దండించుట
క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా!
3
పగవారి సుతుల యందును
బగ యించుక లేక సమతఁ బరగెడి నీకుం
బగగలదె? ఖలుల నడఁచుట
జగదవనముకొఱకుఁ గాక జగదాధారా!
4
నిగ్రహమె మము విషాస్యుల
నుగ్రుల శిక్షించు టెల్ల? నూహింప మహా
నుగ్రహము గాక మాకీ
నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్.
5
ఎట్టి తపంబు జేసెనొకొ? యెట్టి సుకర్మము లాచరించెనో?
యెట్టి నిజంబు బల్కెనొకొ? యీ ఫణి పూర్వభవంబు నందు ము
న్నెట్టి మహానుభావులకు నెన్నఁడుఁ జేరువగాని నీవు నేఁ
డిట్టి వినోదలీలఁ దల లెక్కి నటించెద వీ ఫణీంద్రుపై.
6
బహు కాలంబు తపంబు చేసి వ్రతముల్ బాటించి కామించి నీ
మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ
మహిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ
యహి నీ పాదయుగాహతిం బడసె నే డత్యద్భుతం బీశ్వరా!
7
ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ
సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.
8
ఘన సంసారాహతులగు
జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శో
భనము సమక్షంబున నహి
గనియెం దామసుఁడు రోషకలితుం డయ్యున్
9
దేవా! సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలనఁ బరమ బురుషుండ వయ్యు, నపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండ వయ్యు, నాకాశాది భూతసమాశ్రయత్వంబు వలన భూతావాసుండ వయ్యును, భూతమయత్వంబు వలన భూతశబ్ద వాచ్యుండ వయ్యుఁ, గారణాతీతత్వంబు వలనఁ బరమాత్ముండ వయ్యును, జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబు వలన బ్రహ్మంబ వయ్యుఁను, బ్రకృతి ప్రవర్తకత్వంబు వలన ననంతశక్తివై యప్రాకృతుండ వయ్యుఁ, గాలచక్రప్రవర్తకత్వంబు వలనఁ గాలుండ వయ్యుఁ, గాలశక్తి సమాశ్రయత్వంబు వలన గాలనాభుండ వయ్యు, సృష్టి జీవన సంహారాది దర్శిత్వంబు వలనం గాలావయవసాక్షి వయ్యు నొప్పు నీకు నమస్కరించెదము; మఱియును.
10
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు-
విశ్వంబుఁ జేయుచు విశ్వమునకు
హేతువవై పంచభూతమాత్రేంద్రియ-
ములకు మనః ప్రాణ బుద్ధి చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల-
నావృత మగుచు నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి చేయుచు-
మూ డహంకృతులచే ముసుఁగుబడక
11
నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి
గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ
దనరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ!
^ పంచమలములు
12
మఱియుఁ గలండు లేఁడు; సర్వంబు నెఱుంగు; నించుక నెఱుంగు బద్ధుండు; విముక్తుం డొకం; డనేకుఁడు నను నివి మొదలుగాఁ గల వాదంబులు మాయ వలన ననురోధింపుదురు గావున నానావాదానురోధకుండ వయ్యు, నభిధానాభిధేయ శక్తిభేదంబుల వలన బహుప్రభావప్రతీతుండ వయ్యుఁ, జక్షురాది రూపంబుల వలనఁ బ్రమాణ రూపకుండ వయ్యు, నిరపేక్షజ్ఞానంబు గలిమిం గవి వయ్యు, వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోని వయ్యు, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబుల వలనఁ జతుర్మూర్తి వయ్యు, భక్తజనపాలకుండ వయ్యు, నంతఃకరణ ప్రకాశత్వంబు గలిగి సేవకజన ఫలప్రదానంబుకొఱకు గుణాచ్ఛాదకుండ వయ్యుఁ, జిత్తాదివర్తనంబులఁ గానందగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండ వయ్యుఁ, దర్కింపరాని పెంపు వలన నవ్యాహతవిహారుండ వయ్యు, సకలకార్య హేతు వయ్యు, నంతఃకరణప్రవర్తకత్వంబు వలన హృషీకేశుండ వయ్యును, సాధనవశంబు గాని యాత్మారామత్వంబు వలన ముని వయ్యు, స్థూల సూక్ష్మగతుల నెఱుంగుచు నెందుం జెందక నీవు విశ్వంబుగాకయు విశ్వంబు నీ వయ్యును, విశ్వభావాభావ సందర్శనంబు చేయుచు విద్యావిద్యలకు హేతువైన నీకుం బ్రణామంబు లాచరించెదము; అవధరింపుము.
13
లోక జనిస్థితిలయములు
గైకొని చేయుదువు త్రిగుణకలితుఁడవై కా
లాకారమున నమోఘ
శ్రీకలితుఁడ వగుచు నిచ్చ జెందక యీశా!
14
ఈ శాంతులు గాని తనువు
లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్
యీశాంత తనువులందుఁ బ్ర
కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్.
15
నేరము లెన్న నెక్కడివి? నేము దలంచు తలంపు లోపలన్
నేరుపు లున్నవే? సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చరే?
నేరము చేయువారి ధరణీపతు లొక్కకమాటు గావరే?
నేరము గల్గు మద్విభుని నే డిటఁ గావఁగదే కృపానిధీ!
16
బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు
శ్శీలుండౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే?
చాలున్ నీ పద తాండవంబు; పతిభిక్షం బెట్టి రక్షింపవే?
17
ఆకుల మయ్యె భోగ మిదె యౌదల లన్నియు వ్రస్సెఁ బ్రాణముల్
రాకలఁ బోకలం బొలిసె రాయిడి పెట్టక మా నిజేశుపై
నీ కరుణాకటాక్షములు నిల్పఁగదే తగ నో! సమస్త లో
కైకశరణ్య! యో! యభయకారణ! యో! కమలామనోహరా!
18
మమ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.
19
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే."
20
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత నాగకాంతల కృష్ణస్తుతి (భగవదనుగ్రహ ప్రదం)