స్తుతులు స్తోత్రాలు : జాంబవంత కృత కృష్ణ స్తుతి (మోహ హరం)
1
“దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును.
2
"బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి-
నింకించి బంధించి యేపు మాపెఁ
బరఁగ నెవ్వఁడు ప్రతాపప్రభారాశిచే-
దానవగర్వాంధతమస మడఁచెఁ
గంజాతములు ద్రెంచు కరిభంగి నెవ్వఁడు-
దశకంఠుకంఠబృందములు ద్రుంచె
నా చంద్రసూర్యమై యమరు లంకారాజ్య-
మునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె
3
నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ
డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ
డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు
మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు. "
4
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత జాంబవంత కృత కృష్ణ స్తుతి (మోహ హరం)