స్తుతులు స్తోత్రాలు : గోపికల విరహాలాపములు (మధుర భక్తి ప్రదం)
1
"భ్రూవిక్షేపముతోడ దాపలి భుజంబుం జెక్కుఁగీలించి కె
మ్మోవిన్ వేణువుఁ గూర్చి సుస్వరముగా మ్రోయించుచు న్నంగుళీ
ప్రావీణ్యంబు విభుండు చూపఁ గని సప్రాణేశలై యుండియున్
నీవీబంధము లూడఁ జొక్కుదురుపో నింగిన్ నిలింపాంగనల్.
2
నవమాధుర్యము గల్గు కృష్ణు మురళీ నాదామృతస్యందముల్
చెవులం జొచ్చి హృదంతరాళముల భాసిల్లన్ సవత్సంబులై
యువిదా! మేపులకుం దొఱంగి మృగ గోయూధంబు లుత్కంఠతో
దివికిం గంఠము లెత్తి లోవదలుఁబో దేహేంద్రియవ్యాప్తులన్.
3
ఓ! కంజేక్షణ! కృష్ణుఁ డుజ్జ్వలిత హారోద్దాముఁడై గానవి
ద్యాకౌతూహలతన్ మనోజ్ఞ మురళీ ధ్వానంబు గావింపఁగా
నాకర్ణించి సశంపమై మొఱయు నీలాభ్రంబుగాఁ జూచుచుం
గేకారావము లిచ్చుచున్ మురియుఁ బో కేకీంద్రసంఘాతముల్.
4
లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ?
గలకాలంబు నహంబు గాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా
వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.
5
ఎప్పుడు ప్రొద్దు గ్రుంకు? హరి యెప్పుడు గోవుల మేపి వచ్చు? నా
కెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణ మబ్బు? నతండు వచ్చి న
న్నెప్పుడు గారవించుఁ? దుది యెప్పుడు మద్విరహాగ్నిరాశికిం?
జెప్పఁగదమ్మ! బోటి! మరుచేఁతల నుల్లము తల్లడిల్లెడిన్.
6
చెలియా! కృష్ణుఁడు నన్నుఁ బాసి వనముం జేరంగ నయ్యా క్షణం
బులు నా కన్నియు నుండ నుండగఁ దగన్ బూర్ణంబులై సాగి లో
పలఁ దోఁచుం బ్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై
నెలలై యబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై."
7
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గోపికల విరహాలాపములు (మధుర భక్తి ప్రదం) అను స్తుతి