స్తుతులు స్తోత్రాలు : గోపికల విరహపు మొరలు (భక్తి ప్రదం)
1
"నీవు జనించిన కతమున
నో! వల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణము లిడి
నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్.
2
శారదకమలోదరరుచి
చోరకమగు చూపువలన సుందర! మమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరత నొప్పించు టిది వధించుట గాదే?
3
విషజలంబువలన విషధరదానవు
వలన ఱాలవానవలన వహ్ని
వలన నున్నవానివలనను రక్షించి
కుసుమశరునిబారిఁ గూల్పఁ దగునె?
4
నీవు యశోదబిడ్డడవె? నీరజనేత్ర! సమస్తజంతు చే
తో విదితాత్మ; వీశుఁడవు; తొల్లి విరించి దలంచి లోక ర
క్షావిధ మాచరింపు మని సన్నుతి చేయఁగ సత్కులంబునన్
భూవలయంబుఁ గావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్.
5
చరణసేవకులకు సంసార భయమును
బాఁపి శ్రీకరంబు పట్టు గలిగి
కామదాయి యైన కరసరోజంబు మా
మస్తకముల నునిచి మనుపు మీశ!
6
గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా!
7
బుధరంజనియును సూక్తయు
మధురయు నగు నీదు వాణి మరఁగించెను నీ
యధరామృత సంసేవన
విధి నంగజతాప మెల్ల విడిపింపఁ గదే.
8
మగువల యెడ నీ క్రౌర్యము
తగునే? నిజభక్తభీతిదమనుఁడ వకటా!
తగదు భవద్దాసులకును
నగు మొగముం జూపి కావు నళినదళాక్షా!
9
ఘనలక్ష్మీ యుతమై మహా శుభదమై కామాది విధ్వంసియై
సనకాది స్తుతమై నిరంతర తప స్సంతప్తపున్నాగ జీ
వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా
న నిరూఢత్వము లేనివారలకు మానారీమనోహారకా!
10
నీ నగవులు నీ చూడ్కులు
నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్
నీ నర్మాలాపంబులు
మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా!
11
ఘోషభూమి వెడలి గోవుల మేపంగ
నీరజాభమైన నీ పదములు
కసవు శిలలు దాఁకి కడునొచ్చునో యని
కలఁగు మా మనములు కమలనయన!
12
మాపటివేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద
ప్రాపిత ధూళిధూసరిత భాసిత కుంతలమై సరోరుహో
ద్ధీపిత మైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతోఁ
జూపి మనంబులన్ మరునిఁ జూపుదు గాదె క్రమక్రమంబునన్.
13
భక్తకామదంబు బ్రహ్మ సేవిత మిలా
మండనంబు దుఃఖమర్దనంబు
భద్రకరమునైన భవదంఘ్రియుగము మా
యురములందు రమణ! యునుపఁదగదె?
14
సు రతవర్ధనంబు శోకాపహరణంబు
స్వనిత వంశనాళ సంగతంబు
నన్యరాగజయము నైన నీ మధురాధ
రామృతమునఁ దాప మార్పు మీశ!
15
నీవడవిం బగల్ దిరుగ నీ కుటిలాలకలాలితాస్య మి
చ్ఛావిధిఁ జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
గావున రాత్రు లైన నినుఁ గన్నుల నెప్పుడుఁ జూడకుండ ల
క్ష్మీవర! ఱెప్ప లడ్డముగఁ జేసె నిదేల? విధాత క్రూరుఁడై
16
అక్కట! బంధులున్ మగలు నన్నలుఁ దమ్ములుఁ బుత్రకాదులున్
నెక్కొని రాత్రిఁ బోకుఁడన నీ మృదుగీతరవంబు వీనులన్
వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ
వెక్కడ బోయితో? యెఱుఁగ మీ క్రియ నిర్దయుఁ డెందుఁ గల్గునే?
17
మదనుఁ డార్వంగ నీ వాడు మంతనములు
నవరసాలోకనంబగు నగుమొగంబు
కమల కిరవైన మహితవక్షస్థలంబు
మా మనంబుల లోఁగొని మరపెఁ గృష్ణ!
18
అరవిందంబులకంటెఁ గోమలములై యందంబులై యున్న నీ
చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవఁగా
నెఱియంబోలు నటంచుఁ బొక్కుదుము నీ యీ కర్కశారణ్య భూ
పరిసంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణవ్యధం జేయదే?
19
కట్టా! మన్మథు కోలలు
నెట్టన నో నాఁట బెగడి నీ పాదంబుల్
పట్టికొనఁగ వచ్చిన మము
నట్టడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా!
20
హృదయేశ్వర! మా హృదయము
మృదుతరముగఁ జేసి తొల్లి మిక్కిలి కడ నీ
హృదయము కఠినము చేసెను
మదీయ సౌభాగ్య మిట్టి మందము గలదే?
21
క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడిఁదాఁకి వీఁక వా
లమ్ముల తెట్టెలన్ పఱవ నడ్డము వచ్చి జయింతు వండ్రు నిన్
నమ్మిన ముగ్ధలన్ రహితనాథల నక్కట! నేఁడు రెండు మూఁ
డమ్ముల యేటుకాఁ డెగువ నడ్డము రాఁ దగదే కృపానిధీ!
22
తియ్యవిలుకాఁడు డీకొని
వ్రయ్యలుగాఁ దూఱనేసె వనితల మనముల్
నియ్యాన యింక నైనం
గుయ్యాలింపం గదయ్య! గోవింద! హరీ!"
23
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గోపికల విరహపు మొరలు (భక్తి ప్రదం) అను స్తుతి