స్తుతులు స్తోత్రాలు : షష్ఠ స్కంధారంభ ప్రార్థన (కార్య సిద్ది పదము)
1
శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.
2
నిండుమతిం దలంతుఁ గమనీయ భుజంగమరాజమండలీ
మండనుఁ జంద్రఖండ పరిమండితమస్తకుఁ దారమల్లికా
పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారు కో
దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్.
3
హంసతురంగముం బరమహంసము నంచితదేవతా కులో
త్తంసము నాగమాంత విదితధ్రువపుణ్యరమావతంసమున్
కంసజిఘాంసు నంశమును గర్బురసూత్ర సమావృతాంసమున్
హింస నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్.
4
మోద6
విలసత్కంకణరవరవ
కలితం బగు నభయ వరద కరముల బెరయం
జెలరేఁగి భక్తులకు నల
కలుములు దయచేయు జలధికన్యకఁ దలతున్.
7
కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ కరకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.
8
పరమసమాధిధుర్యుఁ బటు పావనకర్మ విధేయు దేవతా
వర నర వంద్యు సద్విమలవాక్యు జనార్దనకీర్తనక్రియా
భరణ సమర్థు వేద చయ పారగు భవ్యుఁ ద్రికాలవేది భా
సురమతిఁ గొల్చుటొప్పు బుధశోభితుఁ బుణ్యుఁ బరాశరాత్మజున్,
9
వ్యాసుని భగవత్పద సం
వాసుని నాగమ పురాణ వర విష్ణుకథా
వాసుని నిర్మల కవితా
భ్యాసుని పదపద్మయుగము భావింతు మదిన్.
10
వరకవిత్వోద్రేకి వాల్మీకిఁ గొనియాడి-
భాగవతార్థ వైభవముఁ బలుకు
శుకమంజులాలాపు శుకయోగిఁ బ్రార్థించి-
బాణ మయూరుల ప్రతిభ నొడివి
భాస సౌమల్లిక భారవి మాఘుల-
ఘన సుధా మధుర వాక్యములఁ దలఁచి
కాళిదాసుఁ గవీంద్రకల్పవృక్షముఁ గొల్చి-
నన్నపాచార్యు వర్ణనలఁ బొగడి
11
వెలయఁ దిక్కన సోమయాజుల భజించి
యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చఁ గొల్చి
సుకవిసోముని నాచనసోమునెఱిఁగి
కవిమనోనాథు శ్రీనాథు ఘనత మెచ్చి.
12
ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.
13
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత షష్ఠ స్కంధార్గత షష్ఠ స్కంధారంభ ప్రార్థన (కార్య సిద్ది పదము)