స్తుతులు స్తోత్రాలు : గోపస్త్రీలు కృష్ణుని వెదకుట (మధురభక్తి ప్రదం)
1
"పున్నాగ కానవే! పున్నాగవందితుఁ-
దిలకంబ! కానవే తిలకనిటలు;
ఘనసార! కానవే ఘనసారశోభితు-
బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే మన్మథాకారుని-
వంశంబ! కానవే వంశధరునిఁ;
జందన! కానవే చందనశీతలుఁ-
గుందంబ! కానవే కుందరదను;
2
నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ;
గువల వృక్షమ! కానవే కువలయేశుఁ;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;"
ననుచుఁ గృష్ణుని వెదకి ర య్యబ్జముఖులు.
3
"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
ఈ పద్యమును పోలిన మరొక బహుళ ప్రసిద్ధమైన పద్యం నవమ స్కంధములో రామ పరంగా ^ (9-361-ఉ) నల్లని వాడు... ఉంది. దానిని కూడా ఆస్వాదించండి.
4
అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ
రంగదురంబు వాఁడు, మధురంబగు వేణురవంబు వాఁడు మ
మ్మంగజుపువ్వుఁదూపులకు నగ్గము చేసె లవంగ! లుంగ నా
రంగములార! మీకడకు రాఁడు గదా! కృప యుంచి చూపరే!
5
మానినీమన్మథు మాధవుఁ గానరే-
సలలితోదార వత్సకములార!
సలలితోదార వత్సక వైరిఁ గానరే-
సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే-
ఘనతర లసదశోకంబులార!
ఘనతర లసదశోకస్ఫూర్తిఁ గానరే-
నవ్య రుచిరకాంచనంబులార!
6
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
గహనపదవిఁ గురవకంబులార!
గహనపదవి గురవక నివాసిఁ గానరే
గణికలార! చారుగణికలార!
7
అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ-
బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితి వని-
యైలేయ లతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా;-
చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి-
మాధవీలతలార! మనుపరమ్మ!
8
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!
9
హరి చరణములకుఁ బ్రియవై
హరి నిను మన్నింప భద్ర మందెడు తులసీ!
హరి నీ దెస రాఁడు గదా
హరి చొప్పెఱిఁగించి శుభము లందింపఁగదే.
10
పొగడఁ దగువానిఁ గానరే పొగడలార!
యీ డెఱుంగని విభుఁ జూపుఁ డీడెలార!
మొల్లమగు కీర్తివాఁ డేడి మొల్లలార!
శుక నిగదితునిఁ జెపుఁడు కింశుకములార!
11
తరుణీకుచ కుంకుమ యుత
హరికంధర దామగంధ మడరెడు చూడ్కిన్
హరిఁ గనిన పగిదిఁ దనరెడి
హరిణీ! హరిజాడఁ బుణ్యమయ్యెడిఁ జెపుమా!
12
కిటి యై కౌఁగిటఁ జేర్చెను
వటుడై వర్ధిల్లి కొలిచె వడిఁ గృష్ణుండై
యిటు పదచిహ్నము లిడెఁ గ్రిం
దటి బామున నేమి నోచి తమ్మ ధరిత్రీ!"
13
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గోపస్త్రీలు కృష్ణుని వెదకుట (మధురభక్తి ప్రదం)