పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ ఉషాపరిణయము : పూర్ణి

10.2-పూర్ణి

10.2-1340-చ.
సిజపత్త్రనేత్ర! రఘుత్తమ! దుష్టమదాసురేంద్రసం
ణ! దయాపయోధి! జనకాత్మభవాననపద్మమిత్ర! భా
స్కకులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత
స్ఫురితచరిత్ర! భక్తజనపోషణభూషణ! పాపశోషణా!
టీక:-  సరసిజపత్త్రనేత్ర = శ్రీరామా {సరసిజ పత్త్ర నేత్రుడు - పద్మములవంటి నేత్రములు కలవాడు, శ్రీరాముడు}; రఘుసత్తమ = శ్రీరామా {రఘు సత్తముడు, రఘువంశ శ్రేష్ఠుడు, శ్రీరాముడు}; దుష్టమదాసురేంద్రసంహరణ = శ్రీరామా {దుష్ట మదాసురేంద్ర సంహరణుడు, దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) సంహరణుడు (చంపువాడు), శ్రీరాముడు}; దయాపయోధి = శ్రీరామా {దయా పయోధి - దయారసముచేత సముద్రుడు, శ్రీరాముడు}; జనకాత్మభవాననపద్మమిత్ర = శ్రీరామా {జనకాత్మ భవాననపద్మ మిత్రుడు - జనకాత్మభవ (సీతాదేవి యొక్క) ఆనన (ముఖము అను) పద్మమునకు మిత్రుడు (సూర్యుడు), శ్రీరాముడు}; భాస్కరకులవార్ధిచంద్ర = శ్రీరామా {భాస్కర కులవార్ధి చంద్రుడు - భాస్కరకుల (సూర్యవంశము అను) వార్ధి (సముద్రమునకు) చంద్రుడు, శ్రీరాముడు}; మిహికావసుధాధరసూతిసన్నుతస్ఫురితచరిత్ర = శ్రీరామా {మిహికావసుధాధరసూతిసన్నుతస్ఫురితచరిత్రుడు - మిహికా - హిమవత్, వసుధాధర - పర్వతుని, సూతి - కూతురిచేత, సన్నుత - స్తుతించబడిన, స్ఫురిత - ప్రకాశవంతమైన, చరిత్రుడు - నడవడి కలవాడు, పార్వతీదేవిచే కొనియాడబడిన చరిత్ర గలవాడు , శ్రీరాముడు}; భక్తజనపోషణభూషణ = శ్రీరామా {భక్తజనపోషణభూషణుడు - భక్తులైనవారిని కాపాడుట అను భూషణములు కలవాడు, శ్రీరాముడు}; పాపశోషణా = శ్రీరామా {పాపశోషణుడు - సమస్తమైన పాపములను నశింపజేయువాడు, శ్రీరాముడు}.
భావము:-  శ్రీరామా! పద్మములవంటి నేత్రములు కలవాడ! రఘువంశశ్రేష్ఠుడ! దుష్ట మదముగల రాక్షసులను సంహరించు వాడ! దయారసమునకు సముద్రుడ! సీతాదేవి యొక్క ముఖ పద్మమునకు సూర్యుడ! సూర్యవంశము అను సముద్రమునకు చంద్రుడ! పార్వతీ దేవి చేత స్తుతింపబడే సుచారిత్రము కలవాడ! భక్తులను కాపాడుట అను భూషణములు కలవాడ! సమస్త పాపములను నశింప జేయువాడ! శ్రీరామ!

10.2-1341-క.
మారీచభూరిమాయా
నీరంధ్రమహాంధకారనీరేజహితా!
క్ష్మామణవినుతపాదాం
భోరుహ! మహితావతార! పుణ్యవిచారా!
టీక:-  మారీచభూరిమాయానీరంధ్రమహాంధకారనీరేజహితా = శ్రీరామా {మారీచ భూరిమాయా నీరంధ్ర మహాంధకార నీరేజహితుడు - మారీచుడను రాక్షసుని భూరి (మిక్కుటమైన) మాయలు అనెడి నీరంధ్ర (దట్టమైన) మహా (గొప్ప) అంధకార (చీకటికి) నీరేజహిత (పద్మములకు మిత్రుడు, సూర్యుడు), శ్రీరాముడు}; క్ష్మారమణవినుతపాదాంభోరుహమహితావతార = శ్రీరామా {క్ష్మా రమణ వినుత పాదాంభోరుహ మహితావతారుడు - క్ష్మారమణ (రాజుల చేత) వినుత (కొలచునట్టి) పాద (పాదములు అను) అంభోరుహ (పద్మములుగల) మహిత (మహిమాన్వితమైన) అవతారుడు (అవతారము కలవాడు), శ్రీరాముడు}; పుణ్యవిచారా = శ్రీరామా {పుణ్యవిచారుడు - ధర్మవిచారము కలవాడు, శ్రీరాముడు}.
భావము:-  శ్రీరామ! మారీచుడనే రాక్షసుడిచేత కల్పించబడ్డ మాయ అనే దట్టమయిన అంధకారానికి సూర్యుడా! రాజులు కొలిచే పాదపద్మాలు కలవాడా! మహిమాన్విత అవతారాలు దాల్చినవాడా! పుణ్యాత్ముడా! శ్రీరామ!

10.2-1342-మా.
ధిమదవిరామా! ర్వలోకాభిరామా!
సురిపువిషభీమా! సుందరీలోకకామా!
ణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
టీక:-  శరధిమదవిరామా = శ్రీరామా {శరధి మద విరాముడు - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు}; సర్వలోకాభిరామా = శ్రీరామా {సర్వ లోకాభిరాముడు - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోజ్ఞుడు), శ్రీరాముడు}; సురరిపువిషభీమా = శ్రీరామా {సురరిపు విష భీముడు - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు}; సుందరీలోకకామా = శ్రీరామా {సుందరీ లోక కాముడు - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు}; ధరణివరలలామా = శ్రీరామా {ధరణివర లలాముడు - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు}; తాపస స్తోత్ర సీమా = శ్రీరామా {తాపసస్తోత్రసీముడు - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు}; సురుచిరగుణధామా = శ్రీరామా {సు రుచిర గుణ ధాముడు - సు (మిక్కిలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (ఉనికిపట్టైన వాడు), శ్రీరాముడు}; సూర్యవంశాబ్ధిసోమా = శ్రీరామా {సూర్య వంశాబ్ధి సోముడు - సూర్యవంశము అను అబ్ధి (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు}.
భావము:-  శ్రీరామచంద్ర! సముద్రుని గర్వాన్ని అణచినవాడ! సర్వలోకాలకూ సుందరుడా! రాక్షసులకు పరమ భయంకరుడా! సుందరీ జనులకు మన్మథుడా! రాజ శ్రేష్ఠుడా! మునీంద్రులచేత స్తుతింపబడేవాడా! సుగుణాలకు అలవాలమైన వాడా! సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా! శ్రీరామచంద్ర!

10.2-1343-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందలి బాణున కీశ్వర ప్రసాద లబ్ధియు, నుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుటయుఁ, ద న్నిమిత్తంబునఁ, జిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించి చూపి యనిరుద్ధునిఁ దెచ్చుటయు, బాణాసుర యుద్ధంబును, బాణున కీశ్వర ప్రసాద లబ్ధియును, మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు నను కథలు గల ఉషాపరిణయంబను యపాఖ్యానంబు
భావము:- ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణము లోని బాణునకు శివుని అనుగ్రహము లభించుటయునూ,,ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట; చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట; బాణాసురయుద్ధము; మహేశ వైష్ణవ జ్వరముల విషయములు అనే కథలున్న ఉషాపరిణయము అను ఉపాఖ్యానము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు.