ఋషభోపాఖ్యానము : పూర్ణి
పూర్ణి
5.1-183-మాలి.
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!00
టీక:- సరసహృదయవాసా = శ్రీకృష్ణ {సరస హృదయ వాసా - సరసుల హృదయము లందు వసించెడివాడ, శ్రీకృష్ణ}; చారులక్ష్మీవిలాసా = శ్రీకృష్ణ {చారులక్ష్మీ విలాసా - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ}; భరితశుభచరిత్రా = శ్రీకృష్ణ {భరిత శుభచరిత్రా - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడ, శ్రీకృష్ణ}; భాస్కరాబ్జారినేత్రా = శ్రీకృష్ణ {భాస్కరాబ్జారి నేత్రా - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ}; నిరుపమఘనగాత్రా = శ్రీకృష్ణ {నిరుపమ ఘన గాత్రా - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్ర (శరీరము కలవాడ), శ్రీకృష్ణ}; నిర్మలజ్ఞానపాత్రా = శ్రీకృష్ణ {నిర్మల జ్ఞాన పాత్రా - నిర్మల (స్వచ్ఛమైన) జ్ఞానముచే పాత్ర (తగినవాడ), శ్రీకృష్ణ}; గురుతరభవదూరా = శ్రీకృష్ణ {గురుతర భవదూరా - గురుతర (మిక్కిలి భారమైన) భవ (సంసారబాధలను) విదూర (తొలగించువాడ), శ్రీకృష్ణ}; గోపికా చిత్తచోరా = శ్రీకృష్ణ {గోపికాచిత్తచోరా - గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ}; = {గురు - గురుతరము -గురుతమము}
భావము:- సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకళతో విలసిల్లే వాడా! గొప్ప శుభచరిత్ర కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా గలవాడా! సాటిలేని మేఘం వంటి శరీరం కలవాడా! స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పేవాడా! గొప్ప సంసార భారాన్ని దూరం చేసేవాడా! గోపికల మనస్సులను దొంగిలించినవాడా! కృష్ణా!
5.1-184-గ.
ఇది సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతపురాణమునందు పంచమ స్కంధంలో ప్రథమాశ్వాసం నందలి ఋషభుని జన్మంబును, ఋషభుని రాజ్యభిషేకం బును, భరతుని జన్మం బును, ఋషభుని తపంబునను కథలు గల ఋషభోపాఖ్యానంబు సుసంపూర్ణము.
టీక:- ఇది = ఇది; సకల = అఖిలమైన; సు = మంచి; కవి = కవులైన; జన = వారికి; ఆనంద = ఆనందమును; కర = కలిగించెడి; బొప్పనామాత్య = బొప్పనామాత్యుని; పుత్ర = పుత్రుడు; గంగన = గంగన యనెడి; ఆర్య = ఉత్తమునిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహా = గొప్ప; భాగవత = భాగవతము అనెడి; పురాణము = పురాణము; అందున్ = లో; పంచమ స్కంధంలో = ఐదవ స్కంధము లోని; ప్రథమాశ్వాసం = మొదటి ఆశ్వాసము; నందలి = లోని; ఋషభుని = ఋషభుని యొక్క; జన్మంబునున్ = పుట్టుక; ఋషభుని = ఋషభుని యొక్క; రాజ్య = రాజ్యమునకు; అభిషేకంబునున్ = పట్టాభిషేకము; భరతుని = భరతుని యొక్క; జన్మంబునున్ = పుట్టుక; ఋషభుని = ఋషభుని యొక్క; తపంబున్ = తపస్సును; అను = అనెడి; కథలు = వృత్తాంతములు; కల = ఉన్నట్టి; ఋషభోపాఖ్యానంబు = ఋషభుని చరితము; సుసంపూర్ణము = సమాప్తము.
భావము:- ఇది సకల సుకవులకు ఆనందాన్ని కలిగించేవాడు, బొప్పనామాత్యుని కుమారుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీ మహాభాగవత పురాణం నందలి పంచమ స్కంధంలో ప్రథమాశ్వాసం లోని ఋషభుని జననం, ఋషభుని పట్టాభిషేకం, భరతుని జననం, ఋషభుని తపస్సు అనే కథలు కలిగిన ఋషభోపాఖ్యానము సమాప్తం.
ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!