బ్రహ్మదేవుని గర్వభంగము : 3వ భాగము - బ్రహ్మ పూర్ణిజేయుట
10.1-578-క.
సర్వము నీవ యెఱుంగుదు
సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్;
సర్వాపరాధి నను నో!
సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్.
టీక:- సర్వము = సమస్తమును; నీవ = నీవే; ఎఱుంగుదు = తెలియువాడవు; సర్వ = సమస్తమును; విలోకనుడవు = చక్కగా చూచువాడవు; ఈవ = నీవే; జగత్ = విశ్వమంతటికి; అధిపతివిన్ = ఈశుడవు; సర్వ = ఎల్ల; అపరాధిన్ = తప్పులు చేసిన వాడను; ననున్ = నన్ను; ఓ = ఓ; సర్వేశ = కృష్ణా {సర్వేశుడు - సర్వమునకు ప్రభువైనవాడు, విష్ణువు}; అనుగ్రహింపు = కరుణచూపుము; చనియెదన్ = వెళ్ళిపోయెదను; ఇంకన్ = ఇక.
భావము:- సర్వేశ్వరా! శ్రీకృష్ణా! సర్వం నీవే ఎరుగుదువు. నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను.
10.1-579-క.
జిష్ణు! నిశాటవిపాటన!
వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో
వైష్ణవ సాగర హిమకర!
కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ!
టీక:- జిష్ణు = జయశీలుడు, విష్ణువు}; నిశాటవిపాటన = కృష్ణా {నిశాటవిపాటన - నిశాట (రాత్రించరుల, రాక్షసుల)ను విపాటన (పడగొట్టువాడు), విష్ణువు}; వృష్ణికులాంభోజసూర్య = కృష్ణా {వృష్ణికులాంభోజసూర్యుడు - వృష్ణి అనెడి కుల (వంశము) అనెడి అంభోజ (పద్మము)నకు సూర్యునివంటివాడు, కృష్ణుడు}; విప్ర = బ్రాహ్మణులు; అమర = దేవతలు; గో = గోవులు; వైష్ణవ = విష్ణుభక్తులు అనెడి; సాగర = సముద్రమునకు; హిమకర = చంద్రునివంటివాడా {హిమకరుడు - చల్లదనము ఇచ్చు వాడు, చంద్రుడు}; కృష్ణా = కృష్ణా; పాషండ = నాస్తికుల యొక్క; ధర్మ = ఆచారము లనెడు; గృహ = ఇంటికి; దావాగ్నీ = కార్చిచ్చువంటివాడా, కృష్ణా.
భావము:- కృష్ణా! నీవు సాక్షాత్తూ విష్ణుమూర్తివి; రాక్షసులను సంహరించడానికి అవతరించావు; వృష్ణి కులము అనే తామరపూవును వికసింప జేసే సూర్యుడవు నీవు; బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులు అనే పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింప జేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు; ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు.