పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము : 1వ. భాగము - బ్రహ్మ పూర్ణిజేయుట

10.1-547-వ.

అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబున జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె.

టీక:- అంతన్ = అప్పుడు; అల్లనల్లనన్ = మెల్లగా; లేచి = పైకిలేచి; నిలుచుండి = నిలబడి; నయన = కన్నులు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; తెఱచి = తెరచుకొని; గోవిందునిన్ = శ్రీకృష్ణుని; సందర్శించి = చక్కగా చూసి; చతుర్ముఖుండు = బ్రహ్మదేవుడు; ముఖంబులున్ = మోములను; వంచి = వాల్చి; కృత = చేయబడిన; అంజలి = ముడిచిన చేతులు కలవాడు; ఐ; దిగ్గనన్; డగ్గుతిక = గద్గదస్వరము; ఇడికొనుచు = పెట్టుకొని; ఏక = అచంచలమైన; చిత్తంబునన్ = మనసుతో; చతః = నాలుగు; ముఖంబులన్ = మోములతోను; ఇట్లు; అని; స్తుతియించె.

భావము:- తరువాత, బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలు నాలుగూ వంచి చేతులు జోడించి డగ్గుత్తిక పడిన గొంతుతో ఏకాగ్రమైన మనస్సుతో నాలుగు నోరులారా ఇలా స్తుతించాడు.

10.1-548-సీ.

శంపాలతికతోడి లదంబు కైవడి-
మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
మనీయ మృదులాన్నబళ వేత్ర విషాణ-
వేణుచిహ్నంబుల వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబులవాని-
శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
నపుష్పమాలికావ్రాత కంఠమువాని-
ళినకోమల చరములవానిఁ

10.1-548.1-ఆ.

రుణ గడలుకొనిన డగంటివాని గో
పాలబాలుభంగిఁ రగువాని
గుమొగంబువాని నుఁగన్నతండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

టీక:- శంపా = మెరుపు; లతిక = తీగ; తోడి = తోకూడియున్న; జలదంబు = మేఘము; కైవడిన్ = వలె; మెఱుగు = మెరుస్తున్న; ఒల్లియ = పైబట్ట; తోడి = తోకూడుకొన్న; మేని = దేహముకల; వానిన్ = వానిని; కమనీయ = మనోజ్ఞమైన; మృదుల = మృదువైన; అన్న = అన్నపు; కబళ = ముద్ద; వేత్ర = బెత్తముకఱ్ఱ; విషాణ = కొమ్ము; వేణు = మురళి; చిహ్నంబులన్ = గురుతులుగా; వెలయు = ప్రకాశించెడి; వానిన్ = అతనిని; కుంజా = ఏనుగు దంతంతో; వినిర్మిత = చక్కగాచేయబడిన; కుండలంబుల = చెవికుండలములుకల; వానిన్ = అతనిని; శిఖి = నెమలి {శిఖి - తలపైన శిఖగలది, నెమలి}; పింఛ = పింఛముచేత; వేష్టిత = చుట్టుకొనబడిన; శిరము = తల కలిగిన; వానిన్ = అతనిని; వన = అడవి; పుష్ప = పూల; మాలికా = దండల; వ్రాత = సమూహములున్న; కంఠము = మెడకలిగిన; వానిన్ = అతనిని; నళిన = పద్మములవంటి; కోమల = మృదువైన; చరణముల = పాదములుకలిగిన; వానిన్ = వానిని; కరుణ = దయారసము; కడలుకొనిన = అతిశయించిన.
కడకంటి = కంటిచివరలు కలిగిన; వానిన్ = వానిని; గోపాలబాలు = గొల్లపిలవాని; భంగిన్ = వలె; నగు = నవ్వుతున్న; మొగంబు = ముఖము కలిగిన; వానిన్ = వానిని; ననున్ = నన్ను; కన్న = పుట్టించిన; తండ్రిని = తండ్రిని; నిన్నున్ = నిన్ను; భజింతు = సేవింతును; మ్రొక్కి = నమస్కరించి; నీరజాక్ష = శ్రీకృష్ణా.

భావము:- “మెరపుతీగతోకూడిన మేఘంవలే నీ శరీరం బంగారురంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా ఎంతో అందంగా ఉంది. వెదురుకఱ్ఱ, కొమ్ముబూర, మురళి మొదలైనవి అలంకారాలవలె కలిగి ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో చక్కగా చేసిన నీ కుండలాలు; నెమలి పింఛంతో చుట్టబడిన శిరస్సు; అడవిపూల మాలికతో అలంకరించబడిన నీ కంఠం; తామరపూవులా సున్నితమైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతోంది. నీ గోపాలబాల రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే, నన్ను చూసి నవ్వుతున్న నీ మోము చాలా రమణీయంగా ఉంది. కమలదళాలవంటి కన్నులకల నీవు నన్ను కన్నతండ్రివని ఇప్పుడు గుర్తించాను. ఓ విష్ణుమూర్తీ! నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.

10.1-549-మ.

ను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ
ను రూపం బిదె నా మనంబున కచింత్యం బయ్యె; నీ యుల్లస
ద్ఘ విశ్వాకృతి నెవ్వఁ డోపు? నెఱుఁగన్ గైవల్యమై యొప్పు నా
త్మ నివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో? యీశ్వరా!

టీక:- ననున్ = నన్ను; మన్నించి = క్షమించి; భవత్ = నీ; జనంబులు = వారల; కున్ = కు; ఆనందంబున్ = సంతోషమును; నిండించు = పరిపూర్ణుగా జేయు; నీ = నీ యొక్క; తను = దేహము యొక్క; రూపంబు = స్వరూపము; ఇదె = ఇదిగో; నా = నా యొక్క; మనంబున్ = మనసున; కున్ = కు; అచింత్యంబు = విచారించ శక్యము కానిది; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; ఉల్లసత్ = ప్రకాశించునట్టి; ఘన = గొప్ప; విశ్వాకృతిన్ = విరాడ్రూపమును; ఎవ్వడు = ఎవరు మాత్రము; ఓపున్ = శక్తి కలవా డగును; ఎఱుగన్ = తెలిసికొనుటకు; కైవల్యము = ముక్తి రూపు దాల్చినది; ఐ = అయ్యి; ఒప్పున్ = చక్కగా ఉండునది; ఆత్మ = పరమాత్మను; నివేద్యంబు = ఎరిగింపదగినది; అగు = ఐన; నీదు = నీ యొక్క; వైభవము = మహిమము యొక్క; చందంబు = విధము; ఎట్టిదో = ఎలాంటిదో; ఈశ్వరా = కృష్ణా {ఈశ్వరుడు - సర్వనియామకుడు, విష్ణువు}.

భావము:- పరమేశ్వరా! నన్ను అనుగ్రహించు. నీ వారికి అందరకీ ఆనందం నిండించే నీ ఈ చిన్నరూపమే నా మనస్సుకే ఊహించడానికి సాధ్యం కాలేదు. ఇక నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్థు లెవరు? నాలో నేను గా నున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవ విశేషం ఎంతటిదో ఎవరికి మాత్రం తెలుస్తుంది?

10.1-550-క.

విజ్ఞాన విధము లెఱుఁగక
ద్జ్ఞులు నీ వార్త చెప్పఁ ను వాఙ్మనముల్
జ్ఞేశ! నీకు నిచ్చిన
జ్ఞులు నినుఁబట్టి గెలుతు జితుఁడవైనన్.

టీక:- విజ్ఞాన = అనుభవ జన్య జ్ఞానము; విధముల్ = మార్గములను; ఎఱుగక = తెలియకపోయినను; తద్జ్ఞులు = తత్వజ్ఞానము కలవారు; నీ = నీ యొక్క; వార్తన్ = వృత్తాంతమును; చెప్పన్ = బోధింపగా; తను = దేహమును; వాక్కు = మాటలను; మనముల్ = మనసులను; యజ్ఞేశ = శ్రీకృష్ణా {యజ్ఞేశుడు - యజ్ఞములకు కర్త, విష్ణువు}; నీ = నీ; కున్ = కు; ఇచ్చిన = సమర్పించిన; అజ్ఞులున్ = మూఢులు కూడ; నినున్ = నిన్ను; పట్టి = కనుగొని; గెలుతురు = జయింతురు, పొందెదరు; అజితుడవు = జయింపరానివాడవు; ఐనన్ = అయినప్పటికిని.

భావము:- ఓ యజ్ఞరూపా! శ్రీహరీ! మహా పండితులు తాము వివరించ దలచిన నీ పరబ్రహ్మ తత్వాన్ని “అది (తత్)” అని వ్యవహరిస్తారు. వారు ఆత్మ జ్ఞానాన్ని తెలియ లేక, చెప్పడానికీ ఈ పదాన్నే వాడుతూ ఉంటారు. అంతేతప్ప, ఎంతటి పండితుల కైనా నీవు జయింపరాని వాడవే. అయితే, ఏమీ తెలియని వాళ్ళు సైతం, త్రికరణములు అనే శరీరము వాక్కు మనస్సులతో సహా తమను తాము నీకు సమర్పించుకుని భక్తితో గట్టిగా నిన్ను పట్టుకుంటే, నిన్ను అందుకో గలుగుతారు.

10.1-551-క.

శ్రేములుఁ గురియు భక్తిని
జేక కేవలము బోధసిద్ధికిఁ దపమున్
జేయుట విఫలము; పొల్లున
నాము జేకుఱునె తలఁప ధికం బైనన్.

టీక:- శ్రేయములున్ = శుభములను; కురియు = సమృద్ధిగా ఇచ్చునట్టి; భక్తిని = పూజించుట; చేయక = చేయకుండగ; కేవలము = ఒక్క; బోధ = జ్ఞానము; సిద్ధి = పండుట; కిన్ = కుమాత్రమే; తపమున్ = తపస్సును; చేయుట = చేయుట; విఫలము = ఫలితము లేనిది; పొల్లునన్ = పొట్టునుండి, ఊకనుండి; ఆయము = వచ్చుబడి బియ్యము; చేకుఱునె = లభించునా, లభించదు; తలపన్ = తరచి చూసినచో; అధికంబు = ఎంత ఎక్కువ; ఐనన్ = ఉన్నప్పటికిని.

భావము:- భక్తి అనేది సర్వ శుభాలనూ వర్షిస్తుంది. అటువంటి భక్తిని వదలిపెట్టి కేవలం జ్ఞానంకోసం తపస్సు చేయడం వ్యర్ధం. ఎంత ఎక్కువగా కూడపెట్టినా, ఊక (బియ్యంపైన ఉండే పొట్టు) వల్ల ఏమి ఆదాయం లభిస్తుంది? ఎంత ఊకదంపుడు చేసినా ఏమి ఫలితం దక్కుతుంది?

10.1-552-క.

నిముగ నిన్నెఱుఁగఁగ మును
నివాంఛలు నిన్నుఁ జేర్చి నీ కథ వినుచున్
నికర్మలబ్ధ భక్తిన్
సునులు నీ మొదలిటెంకిఁ జొచ్చి రధీశా!

టీక:- నిజముగన్ = వాస్తవమునకు; నిన్నున్ = నీ తత్వమును; ఎఱుగగన్ = తెలిసికొనుటకు; మునున్ = ముందుగా; నిజ = తమ; వాంఛలున్ = కోరిక లందు; నిన్నున్ = నిన్ను; చేర్చి = పెట్టుకొని; నీ = నీ యొక్క; కథ = వృత్తాంతము; వినుచున్ = శ్రద్ధగా వినుచు; నిజ = తము; కర్మ = చేసిన కర్మలవలన; లబ్ధ = లభించిన; భక్తిన్ = భక్తితో; సుజనులు = సత్పురుషులు; నీమొదలిటెంకి = పరమపదమును {నీ మొదలి టెంకి - నీ (భగవంతుని యొక్క) మొదలి (మూల) టెంకి (నివాసము), వైకుంఠము, పరమపదము}; చొచ్చిరి = ప్రవేశించిరి; అధీశ = ప్రభూ.

భావము:- ప్రభూ! విష్ణుమూర్తీ! నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ యందు సమర్పించి, నీ కథలు వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్ కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులు మాత్రమే నీ మూలస్థానం అయిన పరమపదాన్ని చేరతారు.

10.1-553-సీ.

విక్రియాశూన్యమై విషయత్వమును లేని-
గుచు నాత్మాకారమై తనర్చు
నంతఃకరణ మొక్క ధిక సాక్షాత్కార-
విజ్ఞానమునఁ బట్టి వే ఱొరులకుఁ
నెఱుఁగంగ రానిదై యేపారి యుండుటఁ-
జేసి నీ నిర్గుణ శ్రీవిభూతి
హిరంగవీధులఁ బాఱక దిరములై-
మలంబు లగు నింద్రిములచేత

10.1-553.1-ఆ.

నెట్టకేలకైన నెఱుఁగంగ నగుగాని
గుణవిలాసి వగుచుఁ గొమరుమిగులు
నీ గుణవ్రజంబు నేర రా దెఱుఁగంగ
నొక్క మితము లేక యుంట నీశ!

టీక:- విక్రియా = వికారములు (షడ్విధ) {షడ్విధ వికారములు - 1పుట్టుట 2పెరుగుట 3ముదియుట 4చిక్కుట 5చచ్చుట 6గర్భనరకస్థితి}; శూన్యము = సంపూర్తిగా లేనిది; ఐ = అయ్యి; విషయత్వములేనిది = ఇంద్రియాతీతము {విషయత్వములేనిది - విషయత్వము (ఇంద్రియార్థములైన 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధ లక్షణములేవియును) లేనిది, ఇంద్రియములకందనిది}; అగుచున్ = ఔతూ; = పరబ్రహ్మ; ఆకారము = స్వరూపము; ఐ = అయ్యి; తనర్చు = ఒప్పునట్టి; అంతఃకరణము = అంతరంగము నందు; ఒక్క = అఖండాకారమైన; అధిక = సర్వోత్కృష్టమైన; సాక్షాత్కార = అపరోక్షమైన; విజ్ఞానమునన్ = అనుభవైకజ్ఞానమును; పట్టి = అవలంబించి; వేఱొరులకు = మిగిలినవారి కెవరికిని; ఎఱుంగరానిది = తెలిసికొన శక్యము కానిది; ఐ = అయ్యి; ఏపారి = అతిశయించి; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; నీ = నీ యొక్క; నిర్గుణ = గుణత్రయరహితమైన {నిర్గుణము - శాంత ఘోర మూఢ వృత్తులు కలగిన సత్వ రజస్తమో గుణత్రయ రహితము}; శ్రీ = సంపద; విభూతి = మహాత్మ్యము; బహిరంగవీధులన్ = బాహ్యప్రదేశములందు {బహిరంగవీధులు - అంతర బాహ్య శబ్ద దృశ్యాది విషయ పంచక మార్గములు, బాహ్యప్రదేశములు}; పాఱక = వ్యాపింపక; తిరములు = స్థిరముగా నుండునవి; ఐ = అయ్యి; అమలంబులు = నిర్మలంబులు {అమలంబులు - నిర్మలములు, రాగద్వేషాదులు లేనివి}; అగు = ఐన; ఇంద్రియముల = ఇంద్రియముల; చేత = వలన; ఎట్టకేలకున్ = అతికష్టముచేతనైనను; ఎఱుగంగన్ = తెలిసికొనుట; అగున్ = సాధ్యము; కాని = కాని.
గుణ = సగుణ {సగుణవిలాసి - గుణత్రయముయొక్క విలాసముచే, సత్వగుణమువలన సకల దేవతల రూపములను రజోగుణముచేత సకల భూలోకజీవులను తమోగుణముచేత భౌతిక రూపములైన భూమి పర్వతములు శిలలు మున్నగునవి ధరించినవాడు}; విలాసివి = మెలగెడివాడవు; అగుచున్ = అగుచు; కొమరుమిగులు = అందగించునట్టి; నీ = నీ యొక్క; గుణ = సర్వగుణముల {గుణవ్రజము - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వపాలకత్వ సర్వస్రష్టత్వ సర్వసంహారకత్వ సర్వభోక్తృత్వాది గుణముల సముదాయము}; వ్రజంబున్ = సమూహమును; నేరరాదు = శక్యముకాదు; ఎఱుగంగ = తెలిసికొనుటకు; ఒక్క = ఏదో ఒక; మితము = పరిమితి అన్నది; లేకన్ = లేకుండగ; ఉంటన్ = ఉండుటచేత; ఈశ = కృష్ణా {ఈశుడు - సర్వ నియామకుడు, విష్ణువు}.

భావము:- ఓ పరమేశా! కృష్ణా! నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులూ ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తన కన్నా వేరే తనకు వెలుపల ఏమీ ఉండదు. దానినే తత్ లేదా ఆత్మ అంటాము. అది అన్నింటి లోపల అంతర్యామియైన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకి, ఎదుట కనిపిం చడావికి అవకాశం లేదు. ఎందుకంటే, అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు కదా. అది తనకు తప్ప ఇంకొకళ్ళకు తెలియదు. ఎందుకనగా, దానికి అదే కాని ఇతరము ఏదీ ఉండదు. అది ఎప్పడూ వెలుపల కనిపించేది కాదు. కనుక ఇంద్రియాలను లోపలికి త్రిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తిప్పలుపడి ఎలాగో అలాగ నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అదే కష్టం అనుకుంటారు కానీ, నిజానికి నీ సగుణరూపం తెలుసుకోవడమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు గుణాలతో కూడి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి (గుణాతీతుడవైన) నీ గుణాలకు పరిమితి అన్నదే లేదు కనుక, నీ యొక్క కనిపించే రూపాలను తెలుసుకోవడమే అసాధ్యం.

10.1-554-క.

తారా తుషార శీకర
భూజములకైన లెక్క బుధు లిడుదురు; భూ
భారావతీర్ణకరుఁ డగు
నీ మ్యగుణాలి నెన్న నేర రగణ్యా!

టీక:- తారా = నక్షత్రముల; తుషార = మంచు; శీకర = తుంపరల; భూరజముల = ధూళికణముల; కైనన్ = అయినప్పటికి; లెక్క = లెక్కించి వివరములను; బుధులు = పండితులు; ఇడుదురు = ఇచ్చెదరు; భూ = భూమండలము మీది; భార = భారమును; అవతీర్ణకరుడవు = తగ్గించెడివాడవు; అగు = ఐన; నీ = నీ యొక్క; రమ్య = చక్కటి; గుణ = గుణముల; ఆలిన్ = సమూహమును; ఎన్నన్ = గణించుట; నేరరు = చేయలేరు {ప్రత్యక్షాది ప్రమాణములు (8) - 1ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 5అర్థాపత్తి 6అనుపలబ్ధి 7సంభవము 8ఐతిహ్యము. వీనిలో మొదటి 4 తార్కికులమతము 6వేదాంతులమతము 8పౌరాణికుల మతము ప్రకారము ఎంచబడును}; అగణ్యా = శ్రీకృష్ణా {అగణ్యుడు - ప్రత్యక్షాది అష్ట ప్రమాణములచేతను ప్రమాణింప (గణింప) శక్యము కానివాడు, విష్ణువు}.

భావము:- ఓ గణనాతీతా! శ్రీకృష్ణా! ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులూ లెక్కపెట్టలేరు. నీవు అన్ని లెక్కలకూ పైనున్నవాడవు కదా.

10.1-555-శా.

వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు నం చాఢ్యుఁడై
నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్
నీ వాఁడై తను వాఙ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి వో
కైల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా!

టీక:- ఏ = ఏ; వేళన్ = సమయ మందు; కృపన్ = కరుణాదృష్టితో; చూచున్ = చూచునో (నన్ను); ఎన్నడు = ఎప్పుడు; హరిన్ = నారాయణుని; వీక్షింతున్ = దర్శించెదనో; అంచున్ = అనుచు; ఆఢ్యుడు = అధికాసక్తి గలవాడు; ఐ = అయ్యి; నీ = నీ యందు; వెంటంబడి = లగ్నమై {వెంటంబడి - వెంబడించి, చతుర్దశేంద్రియ వ్యాపారములను నీ యందె చేర్చి}; తొంటి = మునుపటి; కర్మ = ప్రారబ్ధకర్మముల {ప్రారబ్ధ కర్మములు - ఆగామి సంచిత కర్మములు}; చయమున్ = సముదాయమును; నిర్మూలమున్ = మొదలంట చెరచుట; చేయుచున్ = చేస్తూ; నీ = నీ దయకు పాత్రుడైన; వాడు = వాడు; ఐ = అయ్యి; తనువాఙ్మనోగతుల = మనోవాక్కాయ కర్మలను; నిన్ = నిన్ను; సేవించు = కొలిచెడి; విన్నాణిపో = విజ్ఞానియే; కైవల్య = పరమపదమునకు; అధిప = నాధుని సంబంధమైన; లక్ష్మిన్ = సంపదను (మోక్ష); ఉద్దవడిన్ = అతిశీఘ్రముగా; తాన్ = అతను; కైకొన్నవాడు = పొందినవాడు; ఈశ్వరా = సర్వాంతర్యామి అయిన భగవంతుడా.

భావము:- సర్వేశ్వరా! శ్రీకృష్ణా! నన్ను ఏనాటికి దయతో చూస్తాడో ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు. అట్టి నీ భక్తుడు నీ వెంటపడాలి. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని, నీ వాడు కావాలి. మనస్సుతోను, వాక్కుతోను, చేష్టలతోను నిన్నే సేవించాలి. అతడు నిజమైన నేర్పరి. అటువంటి నేర్పరికి గాని మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు.

10.1-556-ఉ.

మాలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ నిన్ను నా
మాయఁ గలంచి నీ మహిమ మానముఁ జూచెద నంచు నేరమిం
జేయఁగఁ బూనితిం; గరుణ చేయుము; కావుము; యోగిరాజ వా
గ్గేయ! దవాగ్నిఁ దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే.

టీక:- మాయలున్ = కపట వ్యాపారములు; కల్గు = కలిగిన; వారలను = వారిని; మాయలన్ = మాయలలో; పెట్టెడి = చిక్కించునట్టి; ప్రోడ = నేర్పరి; నిన్నున్ = నిన్ను; నా = నా యొక్క; మాయన్ = మాయచేత; కలంచి = కలవరపెట్టి; నీ = నీ యొక్క; మహిమన్ = ప్రభావము; మానము = కొలదిని; చూచెదన్ = పరీక్షించెదను; అంచున్ = అనుచు; నేరమిన్ = తెలియకపోవుటచేత; చేయగాన్ = చేయవలె నని; పూనితిన్ = ప్రయత్నించితిని; కరుణచేయుము = దయచూడుము; కావుము = కాపాడుము; యోగి = యోగులలో; రాజ = శ్రేష్ఠుల; వాక్ = వాక్కులచేత; గేయ = కీర్తింపబడువాడ; దవాగ్నిన్ = కార్చిచ్చును; తత్ = దానిలో; జనిత = పుట్టిన; కీలము = మంట; గెల్చి = జయించి, మీరి; వెలుంగన్ = ప్రకాశించ; నేర్చునే = చేయగలదా.

భావము:- ఓ గడసరివాడా! కృష్ణమూర్తీ! యోగీశ్వరులు అందరిచేతా వాక్కుల తోను పాటలతోను స్తుతింపబడుతూ ఉండేవాడా! దావాగ్ని నుండి పుట్టిన ఒక అగ్నిజ్వాల, ఆ దావాగ్నినే మించి ప్రకాశించడం ఎలా సాధ్యం అవుతుంది? నీవు ఎంతటి మాయలు కల వారిని అయినా మాయలో పడవేస్తుంటావు. అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బందిపెట్టి నీ మాయ ఎంతటిదో చూద్దాం అనుకున్నాను. చేత కాదని తెలియక చేయడానికి సాహసించాను. నా యందు దయ చూపి రక్షించు.

10.1-557-సీ.

ర్వేశ! నే రజోనితుండ; మూఢుండఁ-
బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున
ర్వించినాఁడను; ర్వాంధకారాంధ-
యనుండ గృపఁజూడు నుఁ; బ్రధాన
హదహంకృతి నభో రుదగ్ని జల భూమి-
రివేష్టితాండకుంభంబులోన
నేడు జేనల మేన నెనయు నే నెక్కడ?-
నీ దృగ్విధాండంబు లేరి కైన

10.1-557.1-తే.

సంఖ్య జేయంగ రానివి; సంతతంబు
నోలిఁ బరమాణవుల భంగి నొడలి రోమ
వివరముల యందు వర్తించు విపులభాతి
నెనయుచున్న నీ వెక్కడ? నెంతకెంత?

టీక:- సర్వేశా = శ్రీకృష్ణా {సర్వేశుడు - సర్వమునకు నియామకుడు, విష్ణువు}; నీ = నీకు సంబంధించిన; రజస్ = రజోగుణముచేత; జనితుండన్ = పుట్టినవాడను; మూఢుండన్ = ఏమీ తెలియనివాడను; ప్రభుడన్ = అధికారము కలవాడను; నేన్ = నేనే; అని = అనుకొని; వెఱ్ఱి = పిచ్చి; ప్రల్లదమునన్ = పౌరుషముచేత; గర్వించినాడను = గర్వము పొందితిని; గర్వ = గర్వము యనెడి; అంధకార = చీకటిచేత; అంధ = కనిపించని; నయనుండన్ = కళ్ళు కలవాడిని; కృపన్ = దయతో; చూడు = అనుగ్రహింపుము; ననున్ = నన్ను; ప్రధాన = అవ్యక్తము; మహత్ = మహత్తత్వము; అహంకృతి = అహంకారము; నభో = ఆకాశము; మరుత్ = వాయువు; అగ్ని = నిప్పు; జల = నీరు; భూమి = భూమి చేతను; పరివేష్టిత = పూర్తిగా ఆవరింపబడిన (పై అష్టావరణములచేతను); అండకుంభంబు = బ్రహ్మాండభాండము నందు {అండకుంభము - బ్రహ్మాండములు కల కుండ, బ్రహ్మాండభాండము}; ఏడు = ఏడు (7) {ఏడుజానలమేను - దేహి (ఏ మనిషి అయినా) తన జానతో ఏడుజానల పొడుగు ఉండును అన్నది ఒక సాముద్రికశాస్త్ర ప్రమాణము.}; జేనల = జేనల కొలది గల {జేన, జాన - బాగా సాచిన బొటకనవేలు చిటికినవేలుల చివర్ల మధ్య దూరము, (సుమారు 10 అంగుళములుండును)}; మేనన్ = దేహమునందు; ఎనయు = కూడి యుండువాడను; నేను = నేను; ఎక్కడ = ఎక్కడ; ఈ = ఈ యొక్క; దృక్ విధ = కనబడెడి; అండంబులు = బ్రహ్మాండాలు, విశ్వాలు; ఏరి = ఎవరి; కైనన్ = కి అయినప్పటికి.
సంఖ్యచేయంగన్ = లెక్కించుట; రానివి = శక్యముకానివి; సతతంబున్ = ఎల్లప్పుడు; ఓలిన్ = వరుసగా; పరమాణువుల = సూక్ష్మాతిసూక్ష్మకణముల {పరమాణువు - కిటికీలోంచి పడెడి సూర్య కిరణమునందు కనబడెడి రేణువునంద ఆరవ భాగము అణువు. ఇది కంటికి కనబడదు. అట్టి దానిలో ఆరవ భాగము పరమాణువు అనెదరు.}; భంగిన్ = వలె; ఒడలి = ఒంటిమీది; రోమ = వెంట్రుకల; వివరముల = మూలరంధ్రముల; అందున్ = లో; వర్తించు = ఉండునట్టి; విపుల = విస్తారమైన; భాతిన్ = విధముగా; ఎనయుచున్న = అతిశయుంచునట్టి; నీవు = నీవు; ఎక్కడ = ఎక్కడ; ఎంతకెంత = పోల్చలేనంతతేడా ఉంది.

భావము:- సర్వేశ్వరా! కృష్ణా! నేను రజోగుణము నుండి జనించిన వాడను. కనుక మోహం చెంది ఉన్నాను. నేనే ప్రభువును అనుకుని వెఱ్ఱి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కన్నులు చీకట్లు క్రమ్మాయి. ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇలా ఒకదాని చుట్టూ మరియొకటి ఆవరించి యున్న బ్రహ్మాండంలో ఏడుజానల పొడవున్న నేనెంతవాడను? ఎవరికీ లెక్కించనలవి కానన్నిఇలాంటి బ్రహ్మాండాలు కల బ్రహ్మాండ భాండాలు ఎన్నింటినో నిత్యమూ ఒకదానివెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడ? నేనెక్కడ? ఎక్కడి కెక్కడికి పోలిక?

10.1-558-త.

డుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో
డువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై
డఁగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
డుపులోనిదె గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్?

టీక:- కడుపు = గర్భము; లోపలన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; పాపడు = శిశువు; కాలన్ = కాలితో; తన్నినన్ = తన్నినప్పటికిని; కిన్క = కోపముతో; తోన్ = తోటి; అడువబోలునే = అణచివేయవచ్చా; క్రాగి = మండిపడి; తల్లి = మాతృమూర్తి; కిన్ = కి; నాథ = ప్రభువా; సన్నము = చిన్నది; దొడ్డు = పెద్దది; ఐ = అనబడుతు; అడగి = ఒకదానికొకటి అణగి; కారణకార్యరూపము = కార్యకారణ సంబంధమే {కార్యకారణ సంబంధము - సృష్టిలో కార్యము కారణములకు అవినాభావ (విడదీయరాని) సంబంధము కలదు అన్నది ప్రమాణము}; రూపమున్ = స్వరూపముగా గలది; ఐన = అయినట్టి; ఈ = ఈ; సకలంబున్ = సమస్తము; నీ = నీ; కడుపు = గర్భము, అంతర్భాగము; లోనిదె = లోపలిదే; కాదె = కదా; పాపడన్ = శిశువును (గర్భంలోని); కాక = కాకపోతే; నేన్ = నేను; మఱి = ఇక; ఎవ్వడన్ = ఎవరిని.

భావము:- ఓ కృష్ణ ప్రభూ! కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధపెట్టినా తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము, స్థూలము, అయి కారణరూపము కార్యరూపము అయిన ఈసృష్టి సమస్తం నీ కడుపులోనిదే కదా. మరి నేను నీ పాపడనుకాక మరెవ్వడను?

10.1-559-క.

భూరి లయ జలధినిద్రిత
నారాయణనాభికమలనాళమున నజుం
డారఁయఁ బుట్టె ననుట నిజ
మో! రాజీవాక్ష! పుట్టె నోటు తలంపన్.

టీక:- భూరిలయ = విస్తారమైనలయ, విలయ; జలధిన్ = సముద్రము నందు {జలధి - జలము నిధి, కడలి}; నిద్రిత = నిద్రించెడి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క {నారాయణుడు - నారములు (నీరు, జీవులు) యందు నివసించువాడు, విష్ణువు}; నాభి = బొడ్డు; కమల = తమ్మి; నాళమునన్ = కాడ యందు; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - పుట్టుకలేనివాడు, బ్రహ్మ}; ఆరయన్ = చక్కగా; పుట్టెను = జనించెను; అనుట = అని లోకులు చెప్పుట; నిజము = సత్యమే; ఓ = ఓ; రాజీవాక్ష = శ్రీకృష్ణా {రాజీవాక్షుడు - రాజీవము (పద్మము) లవంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; పుట్టెనోటు = ఓటమి కూడ పుట్టింది ; తలంపన్ = తరచిచూసినచో.

భావము:- మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణుని బొడ్డుతామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనే మాట సత్యం. ఆలోచిస్తే, నేను పుట్టినప్పుడే నాతోపాటే నా ఓటమి కూడా పుట్టిందేమో అనిపిస్తోంది..

10.1-560-సీ.

ళినాక్ష! నీ వాది నారాయణుండవు-
లము నారము జీవయము నార
మందు నీవుంట నీ యం దవి యుంటను-
నారాయణుండను నామ మయ్యె
కల భూతములకు సాక్షి వధీశుండ-
బ్ధి నిద్రించు నారాయణుఁడవు
నీ మూర్తి యిది నీకు నిజమూర్తి యనరాదు-
ళిననాళము త్రోవ డచి మున్ను

10.1-560.1-తే.

డఁగి నూఱేండ్లు వెదికి నేఁ గాననయితి
నేకదేశస్థుఁడవు గా వనేక రుచివి
గములోనుందు; నీలోన గములుండు
రుదు; నీ మాయ నెట్లైన గుచు నుండు.

టీక:- నళినాక్ష = శ్రీకృష్ణా {నళినాక్షుడు - నళినము (కమలము)ల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; నీవు = నీవు; ఆది = ప్రపంచాదియైన {ప్రపంచము - 1పంచభూతములు 2పంచజ్ఞానేంద్రియములు 3పంచకర్మేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు అనెడి పంచ పంచకప్రవర్తకము}; నారాయణుండవు = నారాయణుడవు; జలము = జలము; నారము = నారము అనబడును; జీవ = సకలజీవుల; చయము = జాలము; నారము = నారము అనబడును; అందు = వానిలో; నీవు = నీవు; ఉంటన్ = ఉండుటచేత; నీ = నీ; అందున్ = లోపల; అవి = అవి; ఉంటను = ఉండుటచేత; నారాయణుడవు = నారాయణుడు {నారాయణుడు - శ్లో. ఆపోనారా ఇతి ప్రోక్తాః ఆపోవైనరసూనవః: ఆయనంతస్యతాః ప్రోక్తాః తేన నారాయణ స్మృతః:: - విష్ణుపురాణ ప్రమాణము}; అను = అనెడి; నామము = పేరు; అయ్యెన్ = కలిగినది; సకల = సమస్తమైన; భూతములకు = జీవులకు; సాక్షివు = అతీతముగా నుండి చూచువాడవు; అధీశుండవు = అధిపతివి; అబ్ధిన్ = సముద్రము నందు; నిద్రించు = నిద్రపోయెడి; నారాయణుడ = నారాయణుడవు; నీ = నీ; మూర్తి = స్వరూపము; ఇది = ఇది (గోపాలరూపము); నీకు = నీకు; నిజమూర్తి = స్వస్వరూపము; అనరాదు = అనితలపరాదు; నళిన = పద్మము; నాళము = కాడరంధ్రపు; త్రోవన్ = దారిలో; నడచి = వెళ్ళి; మున్ను = పూర్వము.
కడగి = పూని ప్రయత్నించి; నూఱు = వంద (100); ఏండ్లు = సంవత్సరములు; వెదికితిన్ = అన్వేషించితిని; నేన్ = నేను; కాననైతి = చూడలేకపోతిని; ఏక = ఒకే; దేశస్థుడవు = తావుననుండెడివాడవు; కావు = కావు; అనేక = బహువిధముల; రుచివి = ప్రకాశించెడివాడవు; జగము = విశ్వము; లోన్ = అంతటను; ఉందు = ఉంటావు; నీ = నీ; లోనన్ = లోపల; జగములు = లోకములన్నియు; ఉండున్ = ఉండును; అరుదు = అద్భుతమైనది; నీ = నీ యొక్క; మాయ = ప్రభావము, మహిమ; ఎట్లు = ఏవిధముగను; అయినన్ = అయినప్పటికి; అగుచున్ = జరుగుతునే; ఉండు = ఉండును.

భావము:- తామరరేకులవంటి కన్నుల కలవాడా! కృష్ణా! నీవు త్రిమూర్తులకూ మూలమైన ఆదినారాయణుడవు. జలములు, జీవరాసులు నారములు అని పిలవబడతాయి. నారములలో నీవు ఉండడం చేత, నీ యందు అవి ఉండడంచేతా నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. భూతములు జీవరాశులు సర్వం వస్తూ పోతూ ఉంటే, నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటికి అన్నింటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే నారాయణా అదే నీ నిజమైన రూపం అనడానికీ వీలులేదు. నేను పూర్వం తామరతూడు లోపల పయనిస్తూ నూరేండ్లు వెదకినా నీ అసలు రూపం ఏమిటో చూడలేకపోయాను కదా. నీవు ఒకచోట ఉంటావు అనడానికీ వీలులేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవు ఉంటావు నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయాప్రభావంతో ఏ విధంగా నైనా ఉండగలవు.

10.1-561-మ.

వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా
నిజంబైన యశోద యెట్లుగనియెం? న్నార నీ కుక్షిలోఁ
నెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంశ్రీఁ బ్రపంచంబు చ
క్క లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్;

టీక:- వినుము; ఓ; ఈశ్వర = కృష్ణా; వెల్పలన్ = బయట, నీకంటె అన్యముగ; వెలుగు = ప్రకాశించెడి; ఈ; విశ్వంబు = భువనములు; నీ = నీ యొక్క; మాయ = మాయయే; కాక = అలా కాకుండ; నిజంబు = సత్యమైనది; ఐన; యశోద; ఎట్లు = ఏ విధముగా; కనియెన్ = చూచెను; కన్నారన్ = కళ్ళారా; నీ; కుక్షి = కడుపు; లోన్; కనెబో = చూసింది అనుకో; క్రమ్మఱన్ = మరల; కాంచెనే = చూసినది కదా; భవత్ = నీ యొక్క; అపాంగ = కడకంటిచూపు యొక్క; శ్రీ = ప్రకాశముచేత; ప్రపంచంబు = లోకములన్నియు; చక్కనన్ = ఒప్పుగా; లోన్ = లోపలున్నవి; ఔన్ = అగును; వెలియు = బయటనున్నవి; ఔన్ = అగును; లోను = లోపలనున్నవి; వెలియున్ = బయటనున్నవికూడా; కాదా = లేదా; తత్ = వాటికి (లోని బయటికి); అన్యంబు = భిన్నమైనవి; అగున్.

భావము:- ఓ శ్రీకృష్ణ ప్రభూ! వెలుపల కనిపిస్తున్న ఈ విశ్వం అంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే, యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్లీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటిచూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలది అవుతుంది; నీ బయటది అవుతుంది; లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది; లోపలా వెలుపలా కూడా అవుతుంది.

10.1-562-మ.

కఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్
లోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ
బ్రటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ
ల్ల యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీత్వంబుఁ గంటిం గదే?

టీక:- ఒక్కడు = అన్యరహితుడవు; ఐ]; ఉంటివి; బాల = పిల్లలు; వత్సములు = దూడల; లోన్ = అందు; ఒప్పారితి = చక్కగా ఉండి; ఈవు = నీవు; అంతటన్ = సర్వత్ర; సకల = సర్వ ప్రాణులచేత; ఉపాసితులు = సేవించునవి; ఔ = అయిన; చతుర్భుజులున్ = నాలుగు చేతులు కలవాడను; ఐ; సంప్రీతిన్ = మిక్కిలి ఇష్టముతో; నేన్ = నేను; కొల్వగాన్ = సేవించుచుండగా; ప్రకట = ప్రసిద్ధమైన; శ్రీ = సంపద; కల = కలిగిన; వాడవు = వాడివి; ఐతివి = అయినావు; అటపై = పిమ్మట; బ్రహ్మాండముల్ = విశ్వగోళములు; చూపి = జనింపజేసి, ప్రకటితముజేసి; ఒల్లక = అంగీకరించక; ఇట్లు]; ఒక్కడవు = ఒంటరివి; ఐతి = అయిపోతివి; నీ = నీ యొక్క; వివిధ = బహుళత్వము యొక్క; లీలత్వంబున్ = క్రీడను; కంటిన్ = చూసితిని; కదే = కదా.

భావము:- మొదట నీవు ఒక్కడవే ఉన్నావు; తరువాత గోపబాలురలో లేగలలో వెలుగొందేవు; ఆ తరువాత అందరిచేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు; ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు; తరువాత అది కాదని మళ్లీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు; ఆహ! ఏమి నా భాగ్యం? ఇన్నాళ్ళకు ఇన్నిరకాల నీ లీలలు చూసాను.

10.1-563-క.

ఱిఁగిన వారికిఁ దోఁతువు
నెఱిఁ బ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా
తెఱఁగున రక్షింపఁగ నీ
తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా!

టీక:- ఎఱిగినవారి = బ్రహ్మజ్ఞానుల; కిన్; తోతువు = భావములో కనబడెదవు; నెఱిన్ = క్రమముగా; ప్రకృతిన్ = మాయతో; చేరి = కూడుకొని; జగమున్ = జగత్తును; నిర్మింపగాన్ = సృష్టించుటకు; నా; తెఱంగునన్ = విధముగను; రక్షింపన్ = పాలించుటకు; నీ = నీ (విష్ణుని); తెఱంగునన్ = విధముగను; ప్రహరింపన్ = సంహరించుటకు; రుద్రు = పరమ శివుని; తెఱగునన్ = విధముగను; ఈశ = భగవంతుడా {ఈశుడు - సర్వనియామకుడు, విష్ణువు}.

భావము:- శ్రీకృష్ణ ప్రభూ! నీవు ప్రకృతితోకూడి జగత్తును నిర్మిస్తూ ఉండి నేను గానూ; రక్షిస్తూ ఉండి నీవు గానూ; లయం చేస్తూ ఉండి రుద్రుని గానూ జ్ఞానులకు నీవే తెలుస్తూ ఉంటావు.