శ్రీరామ
up-arrow

నారసింహ విజయము
అను
ప్రహ్లాద భక్తి

ఉపోద్ఘాతము | బ్రహ్మవరము లిచ్చుట | ప్రహ్లాద చరిత్రము | ప్రహ్లాదుని హింసించుట | ప్రహ్లాదుని జన్మంబు | నృసింహరూప ఆవిర్భావము | దేవతల నరసింహ స్తుతి | ప్రహ్లాదుడు స్తుతించుట | పూర్ణి

ముందుమాట:- మన తెలుగుల పుణ్యపేటి, జాతీయ మహా కవి, సహజ కవి, బమ్మెఱ పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతము నందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణీ కళ్యాణము (దశము స్కంధము - పూర్వ భాగము), గజేంద్ర మోక్షణము (అష్టమ స్కంధము), ప్రహ్లాద భక్తి(సప్తమ స్కంధము), వామన చరిత్ర (అష్టమ స్కంధము), కుచేలోపాఖ్యానము (దశమ స్కంధము - ఉత్తర భాగము) అను అయిదూ పంచ రత్నాలుగా బహుళ ప్రసిద్ధి పొందాయి.
ఈ నారసింహ విజయము / ప్రహ్లాద భక్తిఅనెడి ఉపాఖ్యానము ఆబాలగోపాలమునకు మిక్కిలి ప్రీతిపాత్ర మైన కథ. భక్తికి ప్రపత్తికి తార్కాణంగా నిలిచినది. బహుళార్థ సాధకమైనది మఱియు ఇందలి పద్యాలు బహుళ వ్యాప్తిని పొందాయి.
జాలతెలుగులారా! ఇట్టి రత్నాన్ని, మీరు ఆనందంగా ఆస్వాదిస్తారని అందిస్తున్నాము.


ఉపోద్ఘాతము

1
^
శ్రీ ద్విఖ్యాతి లతా
క్రామిత రోదోంతరాళ! మనీయ మహా
జీమూత తులిత దేహ
శ్యాల రుచిజాల! రామచంద్రనృపాలా!
టీక:- శ్రీమత్ = సంపద్యుక్తమైన; విఖ్యాతి = కీర్తి యనెడి; లతా = తీగచే; ఆక్రామిత = అల్లుకొనబడిన; రోదస్ = భూమ్యాకాశములు; అంతరాళ = అందలి ప్రదేశములు గలవాడ; కమనీయ = చూడచక్కని; మహా = గొప్ప; జీమూత = మేఘములతో; తులిత = సరిపోలెడి; దేహ = శరీరపు; శ్యామల = నల్లని; రుచిర = కాంతుల; జాల = సమూహములు గలవాడ; రామచంద్ర = శ్రీరామచంద్ర; నృపాల = మహారాజ.
భావము:- చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! మనోహరమైన నీలి మేఘఛాయను పోలెడి మేను కలవాడా! శ్రీరామచంద్రమహారాజా! అవధరించు

2
అని యిట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులుగొని మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కం బని తమతమ దిక్కులకుం జనిరి; హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలువురు పుత్రు లుద్భవించిరి; అందు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; దనుజమర్దనుండు = నారాయణుడు {దనుజమర్దనుడు - దనుజ (రాక్షసులను) మర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు}; నిర్దేశించినన్ = నిర్ణయించి చెప్పగా; నిలింపులు = దేవతలు; గుంపులు = సమూహములుగా; కొని = కూడుకొని; మ్రొక్కి = నమస్కరించి; రక్కసుండు = రాక్షసుడు; మ్రగ్గుట = నాశన మగుట; నిక్కంబు = తథ్యము; అని = అని; తమతమ = వారివారి; దిక్కుల = గమ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపుని; కున్ = కి; విచిత్ర = అబ్బురమైన; చరిత్రులు = నడవడికలు గలవారు; నలువురు = నలుగురు (4); పుత్రులు = కొడుకులు; ఉద్భవించిరి = పుట్టిరి; అందు = వారిలో.
భావము:- ఇలా అసురవైరి విష్ణువు, దేవతలకు ధైర్యం చెప్పి పంపాడు. వారు రాక్షసుడు ఎలాగైనా చావటం ఖాయం అనే ధైర్యంతో గుంపులుకట్టి, వారి వారి నివాసాలకు వెళ్ళారు. ఇంతలో హిరణ్యకశిపుడికి అబ్బురమైన చరిత్ర కల నలుగురు కొడుకులు పుట్టారు.

ప్రహ్లాద చరిత్రము

3
న యందు నఖిల భూము లందు నొకభంగి;
మహితత్వంబున రుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ;
జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
న్నుదోయికి నన్యకాంత లడ్డం బైన;
మాతృభావము జేసి రలువాఁడు;
ల్లిదండ్రుల భంగి ర్మవత్సలతను;
దీనులఁ గావఁ జింతించువాఁడు;

ఖుల యెడ సోదరస్థితి రుపువాఁడు;
దైవతము లంచు గురువులఁ లఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు;
లితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!
టీక:- తన = తన; అందున్ = ఎడల; అఖిల = ఎల్ల; భూతముల్ = ప్రాణుల; అందున్ = ఎడల; ఒక = ఒకే; భంగిన్ = విధముగ; సమహిత = సమత్వ; తత్వంబునన్ = భావముతో; జరుగు = మెలగు; వాడు = వాడు; పెద్దలన్ = పెద్దలను; పొడగన్న = గమనించినచో; భృత్యుని = సేవకుని; కైవడి = వలె; చేరి = దగ్గరకు వెళ్ళి; నమస్కృతుల్ = నమస్కారములు; చేయు = చేసెడి; వాడు = వాడు; కన్నుదోయి = రెండుకళ్ళ; కిన్ = కి; అన్య = ఇతర; కాంతలు = స్త్రీలు; అడ్డంబు = ఎదురుపడుట; ఐన = జరిగిన; మాతృ = తల్లి యనెడి; భావము = భావము; చేసి = వలన; మరలు = మెలిగెడి; వాడు = వాడు; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; భంగిన్ = వలె; ధర్మవత్సలతన్ = న్యాయబుద్ధితో; దీనులన్ = బీదలను; కావన్ = కాపాడుటకు; చింతించు = భావించు; వాడు = వాడు.
సఖుల = స్నేహితుల; యెడ = అందు; సోదర = తోడబుట్టినవాడి; స్థితిన్ = వలె; జరుపు = నడపు; వాడు = వాడు; దైవతములు = దేవుళ్ళు; అంచున్ = అనుచు; గురువులన్ = గురువులను; తలచు = భావించెడి; వాడు = వాడు; లీలలు = ఆటలు; అందును = లోనయినను; బొంకులు = అబద్ధములు; లేని = చెప్పనేచెప్పని; వాడు = వాడు; లలిత = చక్కటి; మర్యాదుడు = మర్యాద గలవాడు; ఐన = అయిన; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; అధిప = రాజా.
భావము:- ఓ పరీక్షిత్తు మహారాజా! ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగిన వాడూ; సకల ప్రాణులను తనతో సమానులుగా చూచు వాడూ; సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మ్రొక్కు వాడూ; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడూ; దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడూ; మిత్రులతో అన్నదమ్ములులా మెలగు వాడూ; దేవుళ్ళు అంటూ గురువులను భావించే వాడూ; ఆటలలో కూడా అబద్దాలు ఆడని వాడూ; చక్కటి మర్యాద గల వాడూ ప్రహ్లాదుడు అను కొడుకు.

4
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంతే కాకుండా

5
కార జన్మ విద్యార్థవరిష్ఠుఁ డై;
ర్వసంస్తంభ సంతుఁడు గాఁడు
వివిధ మహానేక విషయ సంపన్నుఁడై;
పంచేంద్రియములచేఁ ట్టుబడఁడు
వ్య వయో బల ప్రాభవోపేతుఁడై;
కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోము లెన్ని గలిగిన;
వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు

విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు
స్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
రణినాథ! దైత్యనయుండు హరి పర
తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.
టీక:- ఆకార = అందము నందు; జన్మ = వంశము నందు; విద్య = చదువు నందు; అర్థ = సంపద లందు; వరిష్ఠుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; గర్వ = గర్వము యొక్క; సంస్తంభ = ఘనీభవించుటను; సంగతుడు = కలవాడు; కాడు = కాదు; వివిధ = పలురకముల; మహా = గొప్ప; అనేక = అనేకమైన; విషయ = విషయపరిజ్ఞానము లనెడి; సంపన్నుడు = సంపదలు గలవాడు; ఐ = అయ్యి; పంచేంద్రియముల్ = పంచేంద్రియములు {పంచేంద్రియములు - త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము లనెడి యైదింద్రియములు}; చేన్ = వలన; పట్టుబడడు = లొంగిపోడు; భవ్య = మంచి; వయః = ప్రాయము; బల = బలము; ప్రాభవము = ప్రభుత్వాధికారము; ఉపేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; కామరోషాదులన్ = కామక్రోధాదు లందు {కామక్రోధాదులు - 1కామ 2లోభ 3క్రోధ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి అరిషడ్వర్గములు}; క్రందుకొనడు = చొరడు; కామినీ = కాంత; ప్రముఖ = ఆదులైన; భోగములు = భోగములు; ఎన్ని = ఎన్ని; కలిగినన్ = ఉన్నప్పటికిని; వ్యసన = వ్యసనము లందు; సంసక్తిన్ = తగులముతో; ఆ = అటు; వంకన్ = వైపు; పోడు = వెళ్ళడు.
విశ్వము = జగత్తు; అందున్ = లోన; కన్న = చూసినట్టి; విన్న = వినినట్టి; అర్థములు = వస్తువుల; అందున్ = ఎడల; వస్తుదృష్టిన్ = బ్రహ్మేతరమే లేదన్న దృష్టితో; చేసి = చూసి; వాంఛ = కోరిక; ఇడడు = పెట్టుకొనడు; ధరణీనాధ = రాజా {ధరణీనాధ - ధరణీ (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు}; దైత్యతనయుండు = ప్రహ్లాదుడు {దైత్యతనయుడు - దైత్య (రాక్షసుడైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; హరి = నారాయణుని యందు; పరతంత్రుడు = పరాధీనుడు; ఐ = అయ్యి; హత = అణచివేయబడిన; అన్య = ఇతరమైన; తంత్రుడు = ప్రవృత్తులు గలవాడు; అగుచు = అగుచు.
భావము:- ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తము నందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ లోలుడు కాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధము మొదలగు అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మున్నగు చాపల్య భోగములెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు.

6
ద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
సురరాజ తనయు నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!
టీక:- సద్గుణంబులు = సుగుణములు; ఎల్లన్ = సర్వమును; సంఘంబులు = గుంపులు కట్టినవి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; అసురరాజతనయన్ = ప్రహ్లాదుని {అసురరాజతనయడు - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; అందున్ = అందు; నిలిచి = స్థిరపడి; పాసి = వదలి; చనవు = పోవు; విష్ణున్ = విష్ణుమూర్తిని; పాయని = వదలిపోని; విధమునన్ = విధముగ; నేడు = ఇప్పుడు; తగిలి = లగ్నమై; ఉండున్ = ఉండును; నిర్మలాత్మా = శుద్ద చిత్తము గలవాడా.
భావము:- నిర్మలమైన మనసు గల ధర్మరాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

7
వారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాద సంకాశులన్
సుగుణోపేతుల నెందు నే మెఱుఁగ మంచున్ వృత్తబంధంబులం
బొడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స
ద్భవద్భక్తులు దైత్యరాజ తనయుం బాటించి కీర్తింపరే?
టీక:- పగవారు = శత్రువులు; ఐన = అయిన; సుర = దేవతా; ఇంద్రులున్ = ప్రభువులుకూడ; సభల్ = సభలు; లోన్ = అందు; ప్రహ్లాద = ప్రహ్లాదునికి; సంకాశులన్ = సమానమైనవారిని; సుగుణ = మంచిగుణములు; ఉపేతులన్ = కలవారిని; ఎందున్ = ఎక్కడను; నేము = మేము; ఎఱుంగము = తెలియము; అంచున్ = అనుచు; వృత్త = పద్యవృత్తము లందు; బంధంబులన్ = కూర్చబడినవానిలో; పొగడన్ = స్తుతించ; చొత్తురు = ప్రారంభించిరి; సత్ = మంచి; కవీంద్రుల = కవుల; క్రియన్ = వలె; భూనాథ = రాజా {భూనాథుడు - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు}; మీ = మీ; పోటి = వంటి; సత్ = నిజమైన; భగవత్ = భగవంతుని; భక్తులు = భక్తులు; దైత్యరాజతనయున్ = ప్రహ్లాదుని; పాటించి = లక్షించి; కీర్తింపరే = స్తుతింపరా ఏమి.
భావము:- ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?

8
గునిధి యగు ప్రహ్లాదుని
గుము లనేకములు గలవు గురుకాలమునన్
ణుతింప నశక్యంబులు
ణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.
టీక:- గుణ = సుగుణములకు; నిధి = నిక్షేపము వంటివాడు; అగు = అయిన; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; గుణముల్ = సుగుణములు; అనేకములు = చాలా ఎక్కువ; కలవు = ఉన్నవి; గురు = పెద్ద; కాలమునన్ = కాలములో నైనను; గణుతింపన్ = వర్ణించుటకు; అశక్యంబులు = సాధ్యములు కావు; ఫణిపతి = ఆదిశేషుని {ఫణిపతి - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు}; కిన్ = కి; బృహస్పతి = బృహస్పతి; కిని = కిని; భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ}; కిన్ = కి.
భావము:- ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.

9
ఇట్లు సద్గుణగరిష్ఠుం డయిన ప్రహ్లాదుండు భగవంతుం డయిన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సద్గణ = సుగుణములచే; గరిష్ఠుండు = గొప్పవాడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతుండు = మహిమాన్వితుండు; అయిన = ఐన; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుని - సకల ఆత్మ లందు వసించు వాడు, విష్ణువు}; అందున్ = ఎడల; సహజ = తనంతతనే; సంవర్ధమాన = చక్కగా పెరిగిన; నిరంతర = ఎడతెగని; ధ్యాన = ధ్యానము నందు; రతుండు = తగిలినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన విష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.

10
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ, ;
జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు;
సురారి దన మ్రోల నాడిన యట్లైన, ;
సురబాలురతోడ నాడ మఱచు;
క్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ, ;
రభాషలకు మాఱులుక మఱచు;
సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ, ;
జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు;

రిపదాంభోజయుగ చింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన, నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
డత లేకయు నుండును డుని భంగి.
టీక:- శ్రీవల్లభుడు = హరి {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వల్లభుడు (భర్త), విష్ణువు}; తన్నున్ = తనను; చేరిన = వద్దకు వచ్చిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; చెలికాండ్రన్ = స్నేహితులను; ఎవ్వరిన్ = ఎవరినికూడ; చేరన్ = కలియుటను; మఱచున్ = మరచిపోవును; అసురారి = హరి {అసురారి - అసుర (రాక్షసుల) అరి (శత్రువు), విష్ణువు}; తన = తన యొక్క; మ్రోలన్ = ఎదుట; ఆడిన = మెలగిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అసుర = రాక్షస; బాలుర = పిల్లలు; తోడన్ = తోటి; ఆడన్ = క్రీడించుట; మఱచున్ = మరచిపోవును; భక్తవత్సలుడు = హరి {భక్తవత్సలుడు - భక్తుల యెడల వాత్సల్యము గలవాడు, విష్ణువు}; సంభాషించిన = మాట్లాడిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; పర = ఇతరమైన; భాషల్ = మాటల; కున్ = కు; మాఱు = బదులు; పలుకన్ = చెప్పుట; మఱచున్ = మరచిపోవును; సురవంద్యున్ = హరిని {సురవంద్యుడు - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు}; తన = తన; లోనన్ = అందు; చూచిన = కాంచిన; అట్లు = విధముగా; ఐనన్ = అయినచో; చొక్కి = సోలిపోయి; సమస్తంబున్ = అఖిలమును; చూడన్ = చూచుట; మఱచున్ = మరచిపోవును.
హరి = హరి; పద = పాదములు యనెడి; అంభోజ = పద్మముల; యుగ = జంటను; చింతన = స్మరించుట యనెడి; అమృతమున్ = అమృతముతో; అంతరంగంబు = హృదయము; నిండిన = నిండిపోయిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అతడు = అతడు; నిత్య = నిత్య; పరిపూర్ణుడు = సంతృప్తి చెందినవాడు; అగుచున్ = అగుచు; అన్నియున్ = సర్వమును; మఱచి = మరచిపోయి; జడత = చేష్ట లుడుగుట; లేకయున్ = లేకుండగ; ఉండును = ఉండును; జడుని = వెఱ్ఱివాని; భంగిన్ = వలె.
భావము:- మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి లాగ కనబడతాడు.

11
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ క్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే ద్విశ్వమున్ భూవరా!
టీక:- పానీయంబులున్ = పానీయములను {పానీయము - పానము (తాగుట)కు అనుకూలమైన ద్రవపదార్థములు}; త్రావుచున్ = తాగుతూ; కుడుచుచున్ = తినుచు (ఆహారాదులు); భాషించుచు = మాటలాడుచు; హాస = సంతోషించుట; లీల = ఆటలాడుట; నిద్ర = నిద్రించుట; ఆదులు = మొదలగువానిని; చేయుచున్ = చేస్తూ; తిరుగుచున్ = తిరుగుతూ; లక్షించున్ = గురిపెట్టి; సంతత = ఎడతెగని; శ్రీనారాయణు = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంటను; చింతన = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన్ = ఆస్వాదించుట యందు; సంధానుండు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; మఱచెన్ = మరచిపోయెను; సురారితనయుడు = ప్రహ్లాదుడు {సురారితనయుడు - సురారి (రాక్షసు, హిరణ్యకశిపు)ని తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; ఏతద్విశ్వమున్ = బాహ్యప్రపంచమును; భూవరా = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}.
భావము:- రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.

12
వైకుంఠ చింతా విర్జిత చేష్టుఁ డై;
యొక్కఁడు నేడుచు నొక్కచోట;
శ్రాంత హరిభావనారూఢచిత్తుఁ డై;
యుద్ధతుఁ డై పాడు నొక్కచోట;
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని;
యొత్తిలి నగుచుండు నొక్కచోట;
ళినాక్షుఁ డను నిధాముఁ గంటి నే నని;
యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ;

లుకు నొక్కచోటఁ రమేశుఁ గేశవుఁ
బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై
యొక్కచోట నిలిచి యూరకుండు.
టీక:- వైకుంఠ = నారాయణుని; చింతా = ధ్యానముచేత; వివర్జిత = వదలివేసిన; చేష్టుడు = వ్యాపారములు గలవాడు; ఒక్కడున్ = ఒంటరిగా; ఏడుచున్ = విలపించును; ఒక్కచోట = ఒకమాటు; అశ్రాంత = ఎడతెగని; హరి = నారాయణుని; భావనా = ధ్యానము నందు; ఆరూఢ = నిలుపబడిన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; ఉద్ధతుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; పాడున్ = పాడును; ఒక్కచోట = ఒకమాటు; విష్ణుడు = విష్ణుమూర్తే; ఇంతయున్ = ఇదంతా; కాని = అంతేకాని; వేఱొండు = మరితరమైనది; లేదు = ఏమియు లేదు; అని = అని; ఒత్తిలి = గట్టిగా; నగుచున్ = నవ్వుతూ; ఉండున్ = ఉండును; ఒక్కచోట = ఒకమాటు; నళినాక్షుడు = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అను = అనెడి; నిధానమున్ = నిధిని; కంటిన్ = కనుగొంటిని; నేను = నేను; అని = అని; ఉబ్బి = పొంగిపోయి; గంతులు = ఉత్సాహముతో ఉరకలు; వైచున్ = వేయును; ఒక్కచోట = ఒకమాటు; పలుకున్ = మాట్లాడుచుండును; ఒక్కచోట = ఒకమాటు; పరమేశున్ = నారాయణుని; కేశవున్ = నారాయణుని; ప్రణయ = మిక్కిలి భక్తిచే గలిగిన; హర్ష = సంతోషమువలన; జనిత = పుట్టిన; సలిల = కన్నీటితో; మిళిత = కలగలిసిన; పులకుడు = గగుర్పాటు గలవాడు; ఐ = అయ్య.
నిమీలిత = మూసిన; నేత్రుడు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; ఒక్కచోట = ఒక ప్రదేశములో; నిలిచి = ఆగిపోయి; ఊరకన్ = ఉత్తినే; ఉండున్ = ఉండును.
భావము:- పరీక్షిన్మహారాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి "విష్ణుధ్యానములో విరామం కలిగిం" దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి "విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే" దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట "నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా" అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ "పరమేశ్వరా! కేశవా!" అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు.

13
ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేయుచు నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె" నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పూర్వజన్మ = పూర్వపు పుట్టువు లందలి; పరమ = ఉత్తమ; భాగవత = భాగవతులతోటి; సంసర్గ = చేరికవలన; సమాగతంబు = లభించినది; ఐన = అయిన; ముకుంద = నారాయణుని; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుట యొక్క; అతిరేకంబునన్ = అతిశయమువలన; అఖర్వ = అధికమైన; నిర్వాణ = ఆనంద; భావంబు = అనుభూతి; విస్తరించున్ = పెరుగుతు; ఉన్నప్పటికిని = ఉన్నప్పటికిని; దుర్జన = చెడ్డవారితోటి; సంసర్గ = కలియకల; నిమిత్తంబునన్ = వలన; తన = తన యొక్క; చిత్తంబు = మనసు; అన్యా = ఇతరుల (పర); ఆయత్తంబు = అధీనమైనది; కానీక = అవ్వనియ్యకుండగ; నిజ = తన యొక్క; ఆయత్తంబు = అధీనములో నున్నదిగా; చేయుచున్ = చేయుచు; అప్రమత్తుండును = ఏమరిక లేనివాడు; సంసార = సంసారమును; నివృత్తుండును = విడిచినవాడు; బుధ = జ్ఞానులైన; జన = వారికి; విధేయుండును = స్వాధీనుడు; మహా = గొప్ప; భాగదేయుండును = (విష్ణుభక్తి) సంపన్నుడు; సుగుణ = మంచి గుణములు యనెడి; మణి = రత్నముల; గణ = సమూహములచే; గరిష్ఠుండును = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠుండును = ఉత్తముడు; కర్మబంధ = కర్మబంధము లనెడి; లతా = తీగలకు; లవిత్రుండును = కొడవలివంటివాడు; పవిత్రుండు = పావనుడు; ఐన = అయినట్టి; పుత్రుని = కుమారుని; అందున్ = ఎడల; విరోధించి = శత్రుత్వము వహించి; సురవిరోధి = హిరణ్యకశిపుడు {సురవిరోధి - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; అనుకంప = దయ; లేక = లేకుండగ; చంపన్ = చంపుటకు; పంపెను = పంపించెను; అని = అని; పలికిన = చెప్పిన; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మజుండు = ధర్మరాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు” అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.

14
"పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
త్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?
టీక:- పుత్రుల్ = కొడుకులు; నేర్చినన్ = నేర్చుకొన్నను; నేరకున్నన్ = నేర్చుకొనకపోయినను; జనకుల్ = తండ్రులు; పోషింతురు = పోషించెదరు; ఎల్లప్పుడున్ = ఎప్పుడైనను; మిత్రత్వంబునన్ = చనువుతో; బుద్ధి = మంచిబుద్ధులు; చెప్పి = చెప్పి; దురిత = పాపములు; ఉన్మేషంబునన్ = అభివృద్ధి అగుటను; వారింతురు = అడ్డుకొనెదరు; ఏ = ఎటువంటి; శత్రుత్వంబున్ = విరోధమును; తలపరున్ = తలపెట్టరు; ఎట్టి = ఎటువంటి; ఎడన్ = పరిస్థితులలోను; సౌజన్య = మంచివారి లక్షణములకు; రత్నాకరున్ = సముద్రమువంటివానిని; పుత్రున్ = కుమారుని; లోక = సర్వలోకములను; పవిత్రున్ = పావనము చేసెడివానిని; తండ్రి = తండ్రి; నెగులున్ = కష్టములను; పొందింపన్ = పెట్టించుటకు; ఎట్లు = ఏవిధముగ; ఓర్చెనో = ఓర్చుకొనగలిగెనో కదా.
భావము:- “నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.

15
బాలుఁ బ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతనక్రియా
లోలుఁ గృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా
జాలు న దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.
టీక:- బాలున్ = చిన్నపిల్లవానిని; ప్రభా = తేజస్సు; విశాలున్ = అధికముగా గలవానిని; హరి = నారాయణుని; పాద = పాదము లనెడి; పయోరుహ = పద్మము లందు; చింతన = ధ్యానించెడి; క్రియా = పనిలో; లోలున్ = తగిలి యుండెడివానిని; కృపాళున్ = దయ గలవానిని; సాధు = సజ్జనులు; గురు = పెద్దలు; లోక = అందరి; పద = పాదముల యందు; ఆనత = మోపిన; ఫాలున్ = నొసలు గలవానిని; నిర్మల = స్వచ్ఛమైన; శ్రీలున్ = శోభ గలవానిని; సమస్త = అఖిలమైన; సభ్య = సంస్కారవంతులచేత; నుత = స్తుతింబపడెడి; శీలున్ = నడవడిక గలవానిని; విఖండిత = మిక్కిలి తెంపబడిన; మోహ = అజ్ఞానము యనెడి; వల్లికా = తీగల; చాలున్ = రాశి కలవానిని; అది = అలా; ఏల = ఎందుకు; తండ్రి = (కన్న)తండ్రి; వడిన్ = శ్రీఘ్రముగ; చంపగన్ = చంపుబడుటకు; పంపెన్ = పంపించెను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; చెప్పవే = చెప్పుము.
భావము:- నారదా! ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుఱ్ఱాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ, సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.

16
అనిన నారదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.

17
"భ్యం బైన సురాధిరాజపదమున్ క్షింపఁ డశ్రాంతమున్
భ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై
త్యేభ్యుం డొక్క దినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై.
టీక:- లభ్యంబున్ = పొందదగినది; ఐన = అయిన; సురాధిరాజ = దేవేంద్రుని; పదమున్ = అధికారమును కూడ; లక్షింపడు = లెక్కచేయడు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; సభ్యత్వంబునన్ = సాధుస్వభావముతో; ఉన్న = ఉన్నట్టి; వాడు = వాడు; అబలుడు = బలము లేనివాడు; ఐ = అయ్యి; జాడ్యంబు = మందత్వము; తోన్ = తోటి; వీడు = ఇతడు; విద్య = చదువు; అభ్యాసంబునన్ = చెప్పబడుటచే; కాని = కాని; తీవ్ర = చురుకైన; మతి = బుద్ధిగలవాడు; కాడు = అవ్వడు; అంచున్ = అనుచు; విచారించి = భావించి; దైత్యేభ్యుండు = హిరణ్యకశిపుడు {దైత్యేభ్యుడు - దైత్య (రాక్షసు)లను ఇభ్యుడు (పాలించువాడు), హిరణ్యకశిపుడు}; ఒక్క = ఒక; దినంబునన్ = రోజు; ప్రియసుతున్ = ముద్దులకొడుకును; వీక్షించి = చూసి; సోత్కంఠుడు = ఉత్కంఠ గలవాడు; ఐ = అయ్యి.
భావము:- “హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి “వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్కచేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీను డయి జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని చురుకైనవాడు కా” డని తలచి, ఒకరోజు కొడుకును చూసి ఉత్కంఠ కలవాడై.

18
"చదువనివాఁ డజ్ఞుం డగు
దివిన సదసద్వివేక తురత గలుగుం
దువఁగ వలయును జనులకుఁ
దివించెద నార్యులొద్ధఁ దువుము తండ్రీ!"
టీక:- చదువని = విద్య నేర్వని; వాడు = వాడు; అజ్ఞుండు = జ్ఞానము లేనివాడు; అగున్ = అగును; చదివినన్ = విద్య నేర్చినచో; సత్ = మంచి; అసత్ = చెడుల; వివేక = విచక్షణ యందు; చతురత = నేర్పు; కలుగున్ = కలుగును; చదువగవలయునున్ = విద్య నేర్చితీరవలెను; జనుల = ప్రజల; కున్ = కు; చదివించెదన్ = విద్య నేర్పించెదను; ఆర్యులు = జ్ఞానుల; ఒద్దన్ = వద్ద; చదువుము = విద్యలు చదువుకొనుము; తండ్రీ = నాయనా.
భావము:- ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి
“బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!.”

19
అని పలికి యసురలోకపురోహితుండును భగవంతుండును నయిన శుక్రాచార్యుకొడుకులఁ బ్రచండవితర్కులఁ జండామార్కుల రావించి సత్కరించి యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; అసుర = రాక్షసులు; లోక = అందరకును; పురోహితుండును = పురోహితుడు, గురువు; భగవంతుడునున్ = మహిమాన్వితుడు; అయిన = ఐనట్టి; శుక్ర = శుక్రుడు యనెడి; ఆచార్య = గురువు యొక్క; కొడుకులన్ = పుత్రులను; ప్రచండ = తీవ్రముగా; వితర్కులన్ = తర్కించు వారలను; చండామార్కులన్ = చండామార్కులను; రావించి = పిలిపించి; సత్కరించి = గౌరవించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని పలికి రాక్షస లోకపు పురోహితుడూ, భగవంతుడూ అయిన శుక్రాచార్యుడి కొడుకులు చండమార్కులను పిలిపించాడు. వారు ప్రచండంగా వితర్కం చేసే నేర్పు కలవారు. వారిని సత్కరించి ఇలా అన్నాడు.

20
అంప్రక్రియ నున్నవాఁడు, పలుకం స్మత్ప్రతాపక్రియా
గంధం బించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో
బంధుల్ మాన్యులు మాకుఁ బెద్దలు, మముం బాటించి యీబాలకున్
గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే.”
టీక:- అంధ = గుడ్డివాని; ప్రక్రియన్ = వలె; ఉన్నవాడు = ఉన్నాడు; పలుకండు = స్తుతింపడు; అస్మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమపు; క్రియా = కార్యముల యొక్క; గంధంబున్ = అగరు, వాసన; ఇంచుకన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మీరు = మీరు; గురువుల్ = గురువులు; కారుణ్య = దయ గల; చిత్తుల్ = మనసు గలవారు; మనః = మానసికముగా; బంధుల్ = బంధువులు; మాన్యులు = మన్నింప దగినవారు; మా = మా; కున్ = కు; పెద్దలు = గౌరవించ దగినవారు; మమున్ = మమ్ములను; పాటించి = అనుగ్రహించి; ఈ = ఈ; బాలకున్ = పిల్లవానిని; గ్రంథంబుల్ = మంచి పుస్తకములను; చదివించి = చదివించి; నీతి = నీతిశాస్త్రము నందు; కుశలున్ = నేర్పు గలవానినిగా; కావించి = చేసి; రక్షింపరే = కాపాడండి.
భావము:- “అయ్యా! మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు, ఘనకార్యాలు వాసన మాత్రంగా నైనా వీనికి రాలేదు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మ బంధువులు. మ మ్మనుగ్రహంచి యీ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి.” అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు.

21
అని పలికి వారలకుం బ్రహ్లాదు నప్పగించి “తోడ్కొని పొం” డనిన వారును దనుజరాజకుమారునిం గొనిపోయి యతనికి సవయస్కులగు సహశ్రోతల నసురకుమారులం గొందఱం గూర్చి.
టీక:- అని = అని; పలికి = చెప్పి; వారల్ = వారి; కున్ = కి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; అప్పగించి = అప్పచెప్పి; తోడ్కొని = కూడతీసుకొని; పొండు = వెళ్ళండి; అనినన్ = అనగా; వారును = వారు; దనుజరాజకుమారునినన్ = ప్రహ్లాదుని {దనుజరాజకుమారుడు - దనుజు (రాక్షసు)ల రాజ (రాజు యొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; కొని = తీసుకొని; పోయి = వెళ్ళి; అతని = అతని; కిన్ = కి; స = సమానమైన; వయస్కులు = వయస్సు గలవారు; అగున్ = అయిన; సహ = కూడ, కలిసి; శ్రోతలన్ = పఠించువారు {శ్రోతలు - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు}; అసుర = రాక్షస వంశపు; కుమారులన్ = పిల్లలను; కొందఱన్ = కొంతమందిని; కూర్చి = జతచేసి.
భావము:- అలా పలికి వారికి ప్రహ్లాదుడిని అప్పగించి “మీ కూడా తీసుకు వెళ్లం” డని చెప్పాడు. వారు ఆ హిరణ్యకశిపుడి కొడుకును తీసుకు వెళ్లి అతని సమవయస్కులు అయిన సహాధ్యాయులను రాక్షసుల పిల్లలను కొంత మందిని సమకూర్చారు.

22
అంచితభక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే
శించి సురారి రాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్ పఠిం
పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము లా కుమారుఁ డా
లించి పఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తి పూర్ణుఁడై.
టీక:- అంచిత = చక్కటి; భక్తి = భక్తి; తోడన్ = తోటి; దనుజాధిపు = హిరణ్యకశిపుని {దనుజాధిపుడు - దనుజు (రాక్షసు)లకు అధిపుడు (రాజు), హిరణ్యకశిపుడు}; గేహ = ఇంటి; సమీపమున్ = వద్దకు; ప్రవేశించి = చేరి; సురారిరాజసుతున్ = ప్రహ్లాదుని {సురారిరాజసుతుడు - సురారి (రాక్షసరాజు యొక్క) సుతుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; చేకొని = చేరదీసుకొని; శుక్రకుమారకుల్ = చండామార్కులు {శుక్రకుమారకులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పఠింపించిరి = చదివింపించిరి; పాఠ = చదువ; యోగ్యములున్ = తగినట్టి; పెక్కులు = అనేకమైన; శాస్త్రములు = శాస్త్రములను; ఆ = ఆ; కుమారుడున్ = బాలుడు; ఆలించి = విని; పఠించెన్ = చదివెను; అన్నియున్ = అన్నిటిని; చలింపని = చెదరని; వైష్ణవ = విష్ణుని యెడలి; భక్తి = భక్తితో; పూర్ణుడు = నిండినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా చండమార్కులు శ్రద్ధగా ఆ రాక్షసరాజు ఇంటికి పోయి ప్రహ్లాదుడిని పిలుచుకొని వచ్చి, అతనికి నేర్పాల్సిన సమస్త శాస్త్రాలు చదివించారు. అతడు కూడా విష్ణుభక్తిని మాత్రము వీడకుండా వారు చెప్పిన ఆ విద్యలన్నీ చదివాడు.

23
గిది వారు చెప్పిన
నా గిదిం జదువుఁ గాని ట్టిట్టని యా
క్షేపింపఁడు తా నన్నియు
రూపించిన మిథ్య లని నిరూఢమనీషన్.
టీక:- ఏ = ఏ; పగిదిన్ = విధముగ; వారున్ = వారు; చెప్పినన్ = చెప్పిరో; ఆ = ఆ; పగిదిన్ = విధముగనే; చదువున్ = పఠించున్; కాని = కాని; అట్టిట్టు = అలాకాదు ఇలాకాదు; అని = అని; ఆక్షేపింపడు = అడ్డుచెప్పడు, వెక్కిరించడు; తాను = తను; అన్నియున్ = సర్వమును; రూపించిన = నిరూపించినట్టి; మిథ్యలు = అసత్యములు; అని = అని; నిరూఢ = దృఢమైన; మనీషన్ = ప్రజ్ఞతో.
భావము:- ప్రహ్లాదుడు వారు చెప్పినవి అన్నీ చక్కగా తాను విచారించి అనిత్యాలని తెలుసుకున్న వాడు అయినా, వారు చెప్పినట్లు విని చదివేవాడు తప్ప, అలా కాదని తప్పుపట్టేవాడు కాదు, గురువులకు ఎదురు చెప్పి ఆక్షేపించేవాడు కాదు.

24
అంతం గొన్నిదినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుండై “నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో
భ్రాంతుం డేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ” డని మహాసౌధాంతరాసీనుఁడై.
టీక:- అంతన్ = అంతట; కొన్ని = కొన్ని; దినంబులున్ = రోజులు; ఏగినన్ = గడవగా; సురేంద్రారాతి = హిరణ్యకశిపుడు {సురేంద్రారాతి - సురేంద్ర (దేవేంద్రుని) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; శంక = అనుమానము; ఆన్విత = కలిగిన; స్వాంతుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; నందనున్ = పుత్రుని; గురువులు = గురువులు; ఏ = ఏ; జాడన్ = విధముగ; పఠింపించిరో = చదివించిరో; భ్రాంతుండు = వెఱ్ఱివాడు; ఏమి = ఏమి; పఠించెనో = చదివినాడో; పిలిచి = పిలిచి; సంభాషించి = మాట్లాడి; విద్యా = విద్య లందు; పరిశ్రాంతిన్ = నిలుకడ; చూచెదగాక = పరిశీలించెదనుగాక; నేడు = ఈ దినమున; అని = అని; మహా = పెద్ద; సౌధ = మేడ; అంతర = లో; ఆసీనుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి.
భావము:- తరువాత కొన్నాళ్ళకి, హిరణ్యకశిపుడు పెద్ద రాజగృహంలో కూర్చుని “నా కొడుకు, ప్రహ్లాదుడు వెఱ్ఱిబాగుల పిల్లాడు; ఏం చదువుతున్నాడో; వాళ్ళేం చెప్తున్నారో యేమో? ఇవాళ కొడుకును గురువులను పిలిచి పలకరిద్దాం. ఎంత బాగా చదువుతున్నాడో చూద్దాం” అని అనుకున్నాడు..

25
మోముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా
స్వా కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్.
టీక:- మోదము = సంతోషము; తోడన్ = తోటి; దైత్యకులముఖ్యుడు = హిరణ్యకశిపుడు {దైత్యకులముఖ్యుడు - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) ముఖ్యుడు, హిరణ్యకశిపుడు}; రమ్ము = రావలసినది; అని = అని; చీరన్ = పిలువ; పంచెన్ = పంపించెను; ప్రహ్లాద = ప్రహ్లాదుడు యనెడి; కుమారకున్ = పిల్లవానిని; భవ = సంసార; మహార్ణవ = సాగరమును; తారకున్ = తరించినవానిని; కామ = కామము; రోష = కోపము; లోభ = లోభము; ఆది = మొదలగు; విరోధివర్గ = శత్రుసమూహమును; పరిహారకున్ = అణచినవానిని; కేశవ = నారాయణుని; చింతనా = ధ్యానించుట యనెడి; అమృత = అమృతమును; ఆస్వాద = తాగుటచే; కఠోరకున్ = గట్టిపడినవానిని; కలుష = పాపపు; జాల = పుంజము లనెడి; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; వనీ = అడవులకు; కుఠారకున్ = గొడ్డలి వంటి వానిని.
భావము:- ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు అమందానందముతో తన కొడుకు ప్రహ్లాదుడిని తీసుకురమ్మని కబురు పంపాడు. సంసార సముద్రం తరించినవాడూ, కామ క్రోధాది అరిషడ్వర్గాలను అణచినవాడూ, శ్రీహరి చింత తప్ప వేరెరుగని వాడూ, పాపాలనే ఘోరమైన అడవుల పాలిటి గొడ్డలి వంటి వాడూ అయిన ఆ ప్రహ్లాదకుమారుని పిలుచుకు రమ్మని పంపాడు.

26
ఇట్లు చారులచేత నాహూయమానుం డై ప్రహ్లాదుండు చనుదెంచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చారులు = సేవకుల; చేతన్ = ద్వారా; ఆహూయమానుండు = పిలువబడినవాడు; ఐ = అయ్యి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; చనుదెంచిన = రాగా.
భావము:- అలా భటులు తీసుకురాగా, ప్రహ్లాదుడు వచ్చాడు.

27
"త్సాహ ప్రభుమంత్రశక్తి యుతమే యుద్యోగ? మారూఢ సం
విత్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్?
త్సా! ర” మ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్.
టీక:- ఉత్సాహ = పూనిక; ప్రభుమంత్ర = రాజకీయ జ్ఞాన; శక్తి = బలములతో; యుతమే = కూడినదియేకదా; ఉద్యోగము = పూనిక; ఆరూఢ = పొందిన; సంవిత్ = తెలివి యనెడి; సంపన్నుండవు = సంపద గలవాడవు; ఐతివే = అయితివా; చదివితే = చదువుకొంటివా; వేదంబుల్ = వేదములను; శాస్త్రముల్ = శాస్త్రములను; వత్సా = పుత్రుడా; రమ్ము = రా; అని = అని; చేరన్ = వద్దకు; చీరి = పిలిచి; కొడుకున్ = పుత్రుని; వాత్సల్య = ప్రేమతో; సంపూర్ణుడు = నిండినవాడు; ఐ = అయ్యి; ఉత్సంగాగ్రమున్ = ఒడిలోకి, తొడమీదకు; చేర్చి = తీసుకొని; దానవవిభుండు = హిరణ్యకశిపుడు {దానవవిభుడు - దానవ (రాక్షస) విభుడు (రాజు), హిరణ్యకశిపుడు}; ఉత్కంఠ = ఆసక్తి; దీపింపగన్ = విలసిల్లగా.
భావము:- "హిరణ్యకశిపుడికి పుత్ర వాత్సల్యంతో ఉత్సాహం వెల్లివిరిసింది. “నాయనా! రావోయీ” అని చేరదీసి తొడపై కూర్చోబెట్టుకుని “నాయనా! నీవు చేసే కృషి క్షాత్ర శక్తి సామర్థ్యాలతో కూడినదే కదా? బాగా చదువుకొని జ్ఞానము సంపాదించావా? వేదాలు, శాస్త్రాలు పూర్తిగా చదివావా?

28
”అనుదిన సంతోషణములు,
నితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
యుల సంభాషణములు,
కులకుం గర్ణయుగళ ద్భూషణముల్."
టీక:- అనుదిన = ప్రతిదిన; సంతోషణములు = సంతోషము కలిగించెడివి; జనిత = కలిగిన; శ్రమ = శ్రమను; తాప = బాధను; దుఃఖ = శోకమును; సంశోషణముల్ = బాగుగా ఆవిరి చేయునవి; తనయుల = పుత్రుల; సంభాషణములున్ = మాటలు; జనకుల్ = తండ్రుల; కున్ = కు; కర్ణ = చెవుల; యుగళ = జంటకు; సత్ = మంచి; భూషణముల్ = అలంకారములు.
భావము:- కొడుకుల ముద్దుమాటలు తల్లిదండ్రులకు ప్రతి రోజూ వింటున్నా విసుగు కలిగించవు, పైగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంతటి అలసట, తాపం, దుఃఖం కలిగినా తొలగిస్తాయి. కొడుకుల పలుకులు అంటే తల్లిదండ్రుల రెండు చెవులకు చక్కటి పండుగలు.”

29
అని మఱియుఁ "బుత్రా! నీ కెయ్యది భద్రంబై యున్నది; చెప్పు" మనినఁ గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; నీ = నీ; కున్ = కు; ఎయ్యది = ఏది; భద్రంబు = చక్కగావచ్చి, శుభమై; ఉన్నది = ఉన్నది; చెప్పుము = చెప్పుము; అనినన్ = అనగా; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియనందనుడు = ఇష్టసుతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- ఇలా అని పిమ్మట హిరణ్యాక్షుడు “కుమారా! గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చిన వాటిలో బాగా వచ్చినది చెప్పు.” అన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడి మాటలు వినిన చిన్నారి కొడుకు ఇలా అన్నాడు.

30
ల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!”
టీక:- ఎల్ల = సర్వ; శరీరధారుల్ = మానవుల {శరీరధారులు - దేహము ధరించినవారు, మానవులు}; కున్ = కు; ఇల్లు = నివాసము; అను = అనెడి; చీకటి = చీకటి; నూతి = నుయ్యికి; లోపలన్ = లోపలందు; త్రెళ్ళక = పడకుండగ; వీరున్ = వీళ్ళు; ఏమున్ = మేము; అను = అనెడి; మతిన్ = చిత్త; భ్రమణంబునన్ = వైకల్యముతో; భిన్నులు = భేదభావము గలవారు; ఐ = అయ్యి; ప్రవర్తిల్లక = తిరుగకుండగ; సర్వమున్ = అఖిలము; అతని = అతని యొక్క; దివ్య = అతిగొప్ప; కళా = అంశతో, మాయావిలాసముతో; మయము = నిండినది; అంచున్ = అనుచు; విష్ణున్ = నారాయణుని; అందున్ = అందు; ఉల్లమున్ = హృదయము; చేర్చి = చేర్చి; తారు = తాము; అడవిన్ = అడవిలో; ఉండుట = ఉండుట; మేలు = ఉత్తమము; నిశాచర = రాక్షసులలో; అగ్రణీ = గొప్పవాడ.
భావము:- “ఓ రాక్షసేశ్వరా! లోకులు అందరు అజ్ఞానంతో, ఇల్లనే చీకటిగోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు; “నేను వేరు, ఇతరులు వేరు” అనే చిత్త భ్రమ భేద భావంతో ఉంటారు. అట్టి భేద భావంతో మెలగకుండా; విశ్వం అంతా విష్ణు దేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి; అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని, తాము అడవులలో నివసించినా ఉత్తమమే.”

31
అని కుమారకుం డాడిన ప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె.
టీక:- అని = అని; కుమారకుండు = పుత్రుడు; ఆడిన = పలికిన; ప్రతిపక్ష = విరోధులకు; అనురూపంబులు = అనుకూలమైనవి; అయిన = ఐన; సల్లాపంబులున్ = మాటలను; విని = విని; దానవేంద్రుడు = హిరణ్యకశిపుడు; నగుచున్ = నవ్వుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

32
"ఎట్టాడిన న ట్టాడుదు
రిట్టిట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్
ట్టించి యెవ్వ రేమని
ట్టించిరొ బాలకునకుఁ రపక్షంబుల్
టీక:- ఎట్టు = ఏ విధముగ; ఆడిన = చెప్పినచో; అట్టు = ఆ విధముగనే; ఆడుదురు = పలికెదరు; అట్టిట్టు = అలా ఇలా; అని = అని; పలుకన్ = చెప్ప; ఎఱుగరు = లేరు; ఇతరుల = ఇతరుల యొక్క; శిశువుల్ = పిల్లలు; దట్టించి = ఎక్కించి; ఎవ్వరు = ఎవరు; ఏమి = ఏమి; అని = అని; పట్టించిరో = నేర్పిరో; బాలకున్ = పిల్లవాని; కున్ = కి; పర = శత్రువు; పక్షంబుల్ = పక్క వైనట్టివానిని.
భావము:- “మిగతా వాళ్ళందరి పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు. ఎదురు చెప్పనే చెప్పరు. చిన్న పిల్లాడికి శత్రు పక్షానికి అనుకూలమైన వాదాలు ఎవరు ఇంత గట్టిగా ఎక్కించారో ఏమిటో?

33
నాకుం జూడఁగఁ జోద్య మయ్యెడిఁ గదా నా తండ్రి! యీ బుద్ధి దా
నీకున్ లోపలఁ దోఁచెనో? పరులు దుర్నీతుల్ పఠింపించిరో?
యేకాంతంబున భార్గవుల్ పలికిరో? యీ దానవశ్రేణికిన్
వైకుంఠుండు గృతాపరాధుఁ డతనిన్ ర్ణింప నీ కేటికిన్?
టీక:- నా = నా; కున్ = కు; చూడగన్ = చూచుటకు; చోద్యము = చిత్రము; అయ్యెడిగదా = కలుగుతున్నది; నా = నా యొక్క; తండ్రి = నాయనా; ఈ = ఇట్టి; బుద్ధి = భావము; తాన్ = దానంతటదే; నీ = నీ; కున్ = కు; లోపలన్ = మనసు నందు; తోచెనో = కలిగినదా లేక; పరులు = ఇతరులు; దుర్నీతుల్ = చెడ్డవారు; పఠింపించిరో = చదివించిరా లేక; ఏకాంతమునన్ = రహస్యమున; భార్గవుల్ = చండామార్కులు {భార్గవులు - భర్గుని (శుక్రుని) కొడుకులు, చండామార్కులు}; పలికిరో = చెప్పిరా ఏమి; ఈ = ఈ; దానవ = రాక్షసుల; శ్రేణి = కులమున; కిన్ = కు; వైకుంఠుడు = నారాయణుడు {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, విష్ణువు}; కృత = ఒనర్చిన; అపరాధుడు = ద్రోహము గలవాడు; అతనిన్ = అతనిని; వర్ణింపన్ = స్తుతించుట; నీ = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు.
భావము:- ఓ నా కుమారా! ప్రహ్లాదా! చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఇలాంటి బుద్ధి నీ అంతట నీకే కలిగిందా? లేక పరాయి వాళ్ళు ఎవరైనా ఎక్కించారా? లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా? విష్ణువు మన రాక్షసులకు ఎంతో ద్రోహం చేసినవాడు. అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలచుకోకు.

34
సులం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం
రివేధించుటయో, మునిప్రవరులన్ బాధించుటో, యక్ష కి
న్న గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో,
రి యంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!
టీక:- సురలన్ = దేవతలను; తోలుటయో = తరుముట సరికాని; సురా = దేవతల యొక్క; అధిపతులన్ = ప్రభువులను; స్రుక్కించుటో = భయపెట్టుట సరికాని; సిద్ధులన్ = సిద్ధులను; పరివేధించుటయో = పీడించుట సరికాని; ముని = మునులలో; ప్రవరులన్ = శ్రేష్ఠులను; బాధించుటో = బాధపెట్టుట సరికాని; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; గంధర్వ = గంధర్వులు; విహంగ = పక్షులు; నాగ = నాగవాసుల; పతులన్ = ప్రభువులను; నాశంబున్ = నాశనము; ఒందించుటో = చేయుట సరికాని; హరిన్ = హరి; అంచున్ = అనుచు; గిరి = గిరి; అంచున్ = అనుచు; ఏల = ఎందులకు; చెడన్ = చెడిపోవుట; మోహ = మోహముచే; అంధుడవు = గుడ్డివాడవు; ఐ = అయ్యి; పుత్రకా = కుమారుడా.
భావము:- కుమారా! ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు.”

35
అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె "మోహ నిర్మూలనంబు జేసి యెవ్వని యందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి యొక్క; మాటలు = పలుకుల; కున్ = కు; పురోహితుని = గురువును; నిరీక్షించి = ఉద్ధేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మోహ = మోహమును; నిర్మూలనంబున్ = పూర్తిగా పోగొట్టబడినదిగా; చేసి = చేసి; ఎవ్వని = ఎవని; అందున్ = ఎడల; తత్పరులు = తగిలి యుండువారు; అయిన = ఐన; ఎఱుక = తెలివి; కల = కలిగిన; పురుషుల్ = మానవుల; కున్ = కు; పరులు = ఇతరులు; తాము = తాము; అనియెడు = అనెడి; మాయా = మాయచేత; కృతంబు = కలిగించబడినది; అయిన = ఐన; అసత్ = అసత్తుచేత, మిథ్యాగా; గ్రాహ్యంబు = తెలియునది; అగు = అయిన; భేదంబు = భేదభావము; కానంబడదు = కనబడదు; అట్టి = అటువంటి; పరమేశ్వరున్ = నారయణుని {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; నమస్కరించెద = నమస్కారము చేసెదను.
భావము:- ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు “జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.

36
జ్ఞుల్ కొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా
జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
జ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ ర్శింపఁగా నేర్తురే?
టీక:- అజ్ఞుల్ = జ్ఞానము లేనివారు; కొందఱు = కొంతమంది; నేము = మేము; తాము = వారు; అనుచున్ = అనుచు; మాయన్ = మోహమును; చెంది = పొంది; సర్వాత్మకున్ = నారాయణుని {సర్వాత్మకుడు - సర్వము తానైనవాడు, విష్ణువు}; ప్రజ్ఞాలభ్యున్ = నారాయణుని {ప్రజ్ఞాలభ్యుడు - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు}; దురన్వయక్రమణునిన్ = నారాయణుని {దురన్వయక్రమణుడు - అన్వయ (ఘటింప) రాని (శక్యముగాని) క్రమణుడు (ప్రవర్తన గలవాడు), విష్ణువు}; భాషింపగాన్ = పలుకుటను; నేరరు = చేయలేరు; ఆ = ఆ; జిజ్ఞాసా = తెలిసికొనెడి; పథము = విధానము; అందున్ = లో; మూఢులు = మూర్ఖులు; కదా = కదా; చింతింపన్ = భావించుట; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారు; వేదజ్ఞులు = వేదము తెలిసినవారు; తత్ = అట్టి; పరమాత్మున్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; ఇతరుల్ = ఇతరులు; దర్శింపగాన్ = దర్శించుటను; నేర్తురే = చేయగలరా ఏమి.
భావము:- కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!

37
ను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత
గు హృషీకేశు సన్నిధి నా విధమునఁ
రఁగుచున్నది దైవయోమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.
టీక:- ఇనుము = ఇనుము; అయస్కాంత = అయస్కాంతమునకు; సన్నిధిని = వద్ద; ఎట్లు = ఏ విధముగ; భ్రాంతము = లోలము, లోనైనది; అగు = అగునో; హృషీకేశు = నారాయణుని {హృషీకేశుడు - హృషీకము (ఇంద్రియము) లకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సన్నిధిన్ = సన్నిధానము నందు; ఆ = అట్టి; విధమునన్ = విధముగనే; కరగుచున్నది = కరిగిపోవుచున్నది; దైవయోగమునన్ = దైవగతి; చేసి = వలన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తమ = ఉత్తముడా; చిత్తంబు = మనసు; భ్రాంతము = చలించునది; అగుచున్ = అగుచు.
భావము:- ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! చండామార్కుల వారూ! అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడు విధంగా, దైవ నిర్ణయానుసారం, నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతోంది, ఇంకే విషయంలోనూ నా మనసు నిలవటం లేదు.

38
మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
ధుపంబు వోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
రుగునే సాంద్ర నీహారములకు?

నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
టీక:- మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; ఐ = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.
దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
భావము:- సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”
(ఈ పద్య రత్నం అమూలకం; సహజ కవి స్వకీయం; అంటే మూల వ్యాస భాగవతంలో లేనిది; పోతన స్వంత కృతి మరియు పరమ భాగవతులు ప్రహ్లాదుని, పోతన కవీంద్రుని మనోభావాల్ని, నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో, బమ్మెర వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగులకు అందించారు.)

39
అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుం జూచి తిరస్కరించి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; రోషించి = కోపించి; రాజ = హిరణ్యాక్షుని యొక్క; సేవకుండు = సేవకుడు; ఐన = అయిన; పురోహితుండు = చండామార్కులు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; తిరస్కరించి = తెగడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు, హిరణ్యకశిప మహారాజు సేవకుడు అయిన ఆ బ్రాహ్మణుడు కోపించి అతనితో ఇలా అన్నాడు.

40
"పంశర ద్వయస్కుఁడవు బాలుఁడ వించుక గాని లేవు భా
షించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని యర్థ మొ
క్కించుక యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట, మాకు నౌఁదలల్
వంచుకొనంగఁ జేసితివి వైరివిభూషణ! వంశదూషణా!
టీక:- పంచ = ఐదు (5); శరత్ = సంవత్సరముల; వయస్కుడవు = వయస్సు గలవాడవు; బాలుడవు = పిల్లవాడవు; ఇంచుక = కొంచెము; కాని = అయినను; లేవు = లేవు; భాషించెదు = చెప్పుతుంటివి; తర్క = వాదన పూర్వక; వాక్యములున్ = మాటలను; చెప్పిన = నేర్పినట్టి; శాస్త్రము = శాస్త్రము; లోని = అందలి; అర్థమున్ = విషయములను; ఒక్కించుకన్ = బాగా కొంచెము, కొద్దిగా; ఐనన్ = అయినను; చెప్పవు = పలుకవు; అసురేంద్రుని = హిరణ్యకశిపుని; ముందటన్ = ఎదురుగ; మా = మా; కున్ = కు; ఔదలల = శిరస్సులను; వంచుకొనంగ = వంచుకొనునట్లు; చేసితివి = చేసితివి; వైరి = శత్రువులను; భూషణ = మెచ్చుకొను వాడ; వంశ = స్వంత వంశమును; దూషణ = తెగడువాడ.
భావము:- “ఓరీ! రాక్షస కులానికి మచ్చ తెచ్చే వాడా! శత్రువులను మెచ్చుకునే వాడా! ప్రహ్లాదా! నిండా అయిదేళ్లు లేవు. చిన్న పిల్లాడివి. ఇంత కూడా లేవు. ఊరికే వాదిస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పటం లేదు. రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా?

41
యుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
వనమందుఁ గంటక యు క్షితిజాతము భంగిఁ బుట్టినాఁ
వరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి చేయుచుండు, దం
మునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతిన్."
టీక:- తనయుడు = పుత్రుడు; కాడు = కాడు; శాత్రవుడు = విరోధి; దానవభర్త = హిరణ్యకశిపుని; కున్ = కి; వీడు = ఇతడు; దైత్య = రాక్షస (వంశము) యనెడి; చందన = గంధపుచెట్ల; వనము = అడవి; అందున్ = లో; కంటక = ముళ్లుతో; యుత = కూడిన; క్షితిజాతము = చెట్టు {క్షితిజాతము - క్షితి (నేల)లో జాతము (పుట్టినది), చెట్టు}; భంగిన్ = వలె; పుట్టినాడు = జన్మించెను; అనవరతంబున్ = ఎల్లప్పుడు; రాక్షసకులాంతకున్ = నారాయణుని {రాక్షసకులాంతకుడు - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు}; ప్రస్తుతిన్ = మిక్కిలి కీర్తించుటను; చేయుచుండున్ = చేయుచుండును; దండనమునన్ = కొట్టుటవలన; కాని = తప్పించి; శిక్షల్ = చదువుచెప్పు పద్ధతుల; కున్ = కు; డాయడు = చేరడు; పట్టుడు = పట్టుకొనండి; కొట్టుడు = కొట్టండి; ఉద్ధతిన్ = మిక్కిలిగా.
భావము:- హిరణ్యకశిప మహారాజుకు శత్రువు తప్పించి వీడు కొడుకు కాడు. నిర్మలమైన రాక్షస కులం అను గంధపు తోటలో ఈ దుర్మాత్ముడు ముళ్ళ చెట్టులా పుట్టాడు. ఎప్పుడూ రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తాడు. వీడిని కఠినంగా దండిస్తే గాని చదువుల దారికి రాడు. పట్టుకొని గట్టిగా కొట్టండి.”
అని గురువు చండామార్కులు హిరణ్యాక్షుడితో మళ్ళీ ఇలా అన్నారు.

42
”ఈ పాపనిఁ జదివింతుము
నీ పాదము లాన యింక నిపుణతతోడం
గోపింతుము దండింతుము
కోపింపకు మయ్య దనుజకుంజర! వింటే."
టీక:- ఈ = ఈ; పాపని = పిల్లవానిని; చదివింతుము = చదివించెదము; నీ = నీ యొక్క; పాదములు = పాదములు; ఆన = ఒట్టు; ఇంకన్ = ఇంకను; నిపుణత = నేర్పు; తోడన్ = తోటి; కోపింతుము = దెబ్బలాడెదము; దండింతుము = కొట్టెదము; కోపింపకము = కోపించకుము; అయ్య = తండ్రి; దనుజకుంజర = హిరణ్యకశిపుడు {దనుజకుంజరుడు - దనుజ (రాక్షసులలో) కుంజరుడ (ఏనుగువలె గొప్పవాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివే.
భావము:- ఓ రాక్షసేంద్రా! వినవయ్యా! కోప్పడ కయ్యా! మీ పాదాలమీద ఒట్టు. ఇకపై ఈ బాలుణ్ణి గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం. మా నైపుణ్యం చూపిస్తాం”

43
అని మఱియు నారాచపాపనికి వివిధోపాయంబులం బురోహితుండు వెఱపుఁజూపుచు రాజసన్నిధిం బాపి తోడికొనిపోయి యేకాంతంబున.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాచ = రాజవంశపు; పాపని = పిల్లవాని; కిన్ = కి; వివిధ = రకరకముల; ఉపాయంబులన్ = ఉపయములతో; పురోహితుండు = గురువు; వెఱపు = భయము; చూపుచున్ = పెట్టుచూ; రాజ = రాజు యొక్క; సన్నిధిన్ = సాన్నిధ్యమునుండి; పాపి = దూరముచేసి; తోడికొనిపోయి = కూడా తీసుకు వెళ్లి; ఏకాంతంబునన్ = రహస్య మందు;
భావము:- అని పలికి ఆ రాకుమారుడు ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్తూ, గురువు అతనిని రాక్షస రాజు దగ్గర నుండి బయటకు తీసుకు వెళ్లారు. ఒంటరిగా కూర్చోబెట్టి ఏకాంతంగా

44
భార్గవనందనుఁ డతనికి
మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు నిచ్చల్
ర్గత్రితయము చెప్పె న
ర్గళ మగు మతివిశేష మర నరేంద్రా!
టీక:- భార్గవనందనుండు = శుక్రుని కొడుకు; అతని = అతని; కిన్ = కి; మార్గము = దారి; చెడకుండగ = తప్పిపోకుండగ; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; నిచ్చల్ = ప్రతి దినము; వర్గత్రితయమున్ = ధర్మార్థకామములను; చెప్పెన్ = చెప్పెను; అనర్గళము = అడ్డులేనిది; అగు = అయిన; మతి = బుద్ధి; విశేష = విశిష్టత; అమరన్ = ఒప్పునట్లు; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నర( మానవులకు) ఇంద్రుడు (ప్రభువు), రాజు}.
భావము:- ధర్మరాజా! అలా శుక్రాచార్యుడి కొడుకు ఆ గురువు తన చాతుర్యం అంతా చూపి, ప్రహ్లాదుడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామ శాస్త్రం అనే త్రితయాలను ఎడ తెగకుండా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేక సార్లు వల్లింప జేశాడు.

45
మఱియు గురుండు శిష్యునకు సామ దాన భేద దండోపాయంబు లన్నియు నెఱింగించి నీతికోవిదుండయ్యె నని నమ్మి నిశ్చయించి తల్లికి నెఱింగించి తల్లిచేత నలంకృతుం డయిన కులదీపకు నవలోకించి.
టీక:- మఱియున్ = ఇంకను; గురుండు = గురువు; శిష్యున్ = శిష్యుని; కున్ = కి; సామ = సామము; దాన = దానము; భేద = భేదము; దండ = దండము యనెడి; ఉపాయంబులన్ = ఉపాయములను; అన్నియున్ = సమస్తమును; ఎఱింగించి = తెలిపి; నీతి = రాజనీతిశాస్త్రము నందు; కోవిదుండు = ప్రవీణుడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; నమ్మి = నమ్మి; నిశ్చయించి = నిర్ణయించి; తల్లి = తల్లి; కిన్ = కి; ఎఱింగించి = తెలిపి; తల్లి = తల్లి; చేతన్ = వలన; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; అయిన = ఐన; కులదీపకున్ = ప్రహ్లాదుని {కులదీపకుడు - కుల (వంశమును) దీపకుండు (ప్రకాశింప జేయువాడు), ప్రహ్లాదుడు}; అవలోకించి = చూసి.
భావము:- అంతే కాకుండా, చండామార్కులు శిష్యుడు ప్రహ్లాదుడికి ఉపాయాలు నాలుగు రకాలు అంటే మంచిమాటలతో మచ్చిక చేసుకోడమనే "సామము", కొన్ని వస్తువులు ఇచ్చి మంచి చేసుకోడం "దానము", కలహాలు పెట్టి బెదిరించి సానుకూలం చేసుకోడం అనే "భేదము". దండించి దారిలో పెట్టడం అనే "దండము". అలా చతురోపాయులు అన్నీ చెప్పారు. ఈ సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించే సమయాలూ విధానాలు బాగా వివరించి చెప్పారు. “మంచి నీతిమంతుడు అయ్యాడు” అనుకున్నారు. అదే అతని తల్లికి చెప్పారు. ఆమె చాలా సంతోషించి వంశవర్ధనుడు అయిన కొడుకును చక్కగా అలంకరించి తండ్రి వద్దకు వెళ్ళమంది. అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నారు.

46
"త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్
ప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్
చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్,
విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్."
టీక:- త్రిప్పకుము = మార్చేయకుము; అన్న = నాయనా; మా = మా యొక్క; మతమున్ = విధానమును; దీర్ఘములు = పెద్దవి; ఐన = అయినట్టి; త్రివర్గ = ధర్మార్థ కామముల గురించిన; పాఠముల్ = చదువులను; తప్పకుము = వదలివేయకుము; అన్న = నాయనా; నేడు = ఈ దినమున; మన = మన యొక్క; దైత్యవరేణ్యుని = హిరణ్యకశిపుని {దైత్యవరేణ్యుడు - దైత్య (రాక్షసులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), హిరణ్యకశిపుడు}; మ్రోలన్ = ముందట; నేము = మేము; మున్ = ఇంతకుముందు; చెప్పిన = నేర్పిన; రీతిన్ = విధముగ; కాని = తప్పించి; మఱి = మరి యితరమైనవి; చెప్పకుము = చెప్పకుము; అన్న = నాయనా; విరోధి = శత్రువుల యొక్క; శాస్త్రముల్ = శాస్త్రములను; విప్పకుము = తెఱువకుము, చెప్పకుము; దుష్టము = చెడ్డది; అగు = అయిన; విష్ణు = నారాయణుని; చరిత్ర = వర్తనలు; కథ = గాథలు; అర్థ = విషయముల; జాలమున్ = సమూహములను.
భావము:- “నాయనా! ప్రహ్లాదా! ఇవాళ మీ తండ్రిగారి దగ్గర మేం చెప్పిన చదువులకు వ్యతిరేకంగా చెప్పకు. గొప్పవైన ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం కామశాస్త్రం అనే త్రితయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మరచిపోకుండా చెప్పు. మేం చెప్పిన నీతిపాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు. మన విరోధి విష్ణుమూర్తి మాటమాత్రం ఎత్తకు. దుష్టమైన ఆ విష్ణుని నడవడికలు, కథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడ వద్దు. మరచిపోకు నాయనా!”

47
అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికిం దోడితెచ్చిన.
టీక:- అని = అని; బుజ్జగించి = నచ్చచెప్పి; దానవేశ్వరుని = హిరణ్యకశిపుని; సన్నిధి = దగ్గర; కున్ = కు; తోడి = కూడా; తెచ్చి = తీసుకు వచ్చి.
భావము:- అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి, హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకు వచ్చారు.

48
డుగడ్గునకు మాధవానుచింతన సుధా;
మాధుర్యమున మేను ఱచువాని;
నంభోజగర్భాదు భ్యసింపఁగ లేని;
రిభక్తిపుంభావ మైనవాని;
మాతృగర్భము జొచ్చి న్నది మొదలుగాఁ;
జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని;
నంకించి తనలోన ఖిల ప్రపంచంబు;
శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని;

వినయ కారుణ్య బుద్ధి వివేక లక్ష
ణాదిగుణముల కాటపట్టయిన వాని;
శిష్యు బుధలోక సంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.
టీక:- అడగడ్గున = ప్రతిక్షణము; కున్ = నందును; మాధవ = నారాయణుని; అనుచింతనా = ధ్యానించుట యనెడి; సుధా = అమృతము యొక్క; మాధుర్యమున్ = తీయదనముచే; మేను = శరీరమును; మఱచు = మరిచిపోవు; వానిన్ = వానిని; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదుల్ = మొదలగువారుకూడ; అభ్యసింపగలేని = నేర్చుకొనలేని; హరి = నారాయణుని; భక్తి = భక్తి; పుంభావము = మిక్కిలి నేర్పు గల; వానిన్ = వానిని; మాతృ = తల్లి యొక్క; గర్భమున్ = గర్భములో; చొచ్చి = ప్రవేశించి; మన్నది = జీవంపోసుకున్ననాటి; మొదలుగాన్ = నుండి మొదలు పెట్టి; చిత్తమున్ = మనసును; అచ్యుతు = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; మీదన్ = పైన; చేర్చు = లగ్నము చేయు; వానిన్ = వానిని; అంకించి = భావించి; తన = తన; లోనన్ = అందే; అఖిల = సమస్తమైన; ప్రపంచంబున్ = విశ్వమును; శ్రీ = సంపత్కర మైన; విష్ణు = నారాయణునితో; మయము = నిండినది; అని = అని; చెలగు = చెలరేగెడి; వానిన్ = వానిని.
వినయ = అణకువ; కారుణ్య = దయ; బుద్ధి = మంచిబుద్ధులు; వివేకలక్షణ = వివేచనాశక్తి; ఆది = మొదలగు; గుణముల్ = సుగుణముల; కున్ = కు; ఆటపట్టు = విహారస్థానము; అయిన = ఐన; వానిన్ = వానిని; శిష్యున్ = శిష్యుని (ప్రహ్లాదుని); బుధ = జ్ఞానులు; లోక = అందరిచేతను; సంభావ్యున్ = గౌరవింపదగినవానిని; చీరి = పిలిచి; గురుడు = గురువు; ముందఱి = ముందరి; కిన్ = కి; ద్రొబ్బి = తోసి, గెంటి; తండ్రి = తండ్రి; కిన్ = కి; మ్రొక్కుము = నమస్కరించుము; అనుచున్ = అనుచు.
భావము:- ప్రహ్లాదుడు ప్రతిక్షణమూ, అడుగడుక్కీ విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమఱుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మ వంటి వారికైనా కూడా అలవి కాని “హరి భక్తి రూపందాల్చిన బాలకుని”లా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించి నప్పటి నుంచీ కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి “ఈ లోకములు అన్నీ విష్ణుమయములే” అని తన మనస్సు లో ధృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్న వాడు. జ్ఞానులుచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు. అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి, తండ్రి ముందుకు నెట్టి, నమస్కారం చెయ్యమని చెప్తూ, హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు.

49
"శిక్షించితి మన్యము లగు
క్షంబులు మాని నీతిపారగుఁ డయ్యెన్
క్షోవంశాధీశ్వర!
వీక్షింపుము; నీ కుమారు విద్యాబలమున్."
టీక:- శిక్షింతిమి = చక్కగా బోధించితిమి; అన్యములు = శత్రువులవి; అగు = అయిన; పక్షంబులు = త్రోవలు; మాని = విడిచి; నీతి = నీతిశాస్త్రమును; పారగుడు = తుదిముట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; రక్షోవంశాధీశ్వర = హిరణ్యకశిపుడ {రక్షోవంశాధీశ్వరుడు - రక్షః (రాక్షస) వంశా (కులమునకు) అధీశ్వరుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; వీక్షింపుము = పరిశీలించుము; నీ = నీ యొక్క; కుమారు = పుత్రుని; విద్యా = చదువు లందలి; బలమున్ = శక్తిని.
భావము:- “ఓ రాక్షస రాజా! హిరణ్యకశిపా! నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము. శత్రుపక్షముల పైనుండి మనసు మళ్ళించాం. నీ కుమారుడిని నీతికోవిదుణ్ణి చేశాం. అన్ని విద్యలలో గొప్ప పండితు డయ్యాడు. మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు.”
అన్నారు చండామార్కులు

50
అని పలికిన శుక్రకుమారకు వచనంబు లాకర్ణించి, దానవేంద్రుండు దనకు దండప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి, బాహుదండంబులు చాచి దిగ్గనన్ డగ్గఱం దిగిచి గాఢాలింగనంబు చేసి, తన తొడలమీఁద నిడుకొని, చుంచు దువ్వి, చిబుకంబుఁ బుడికి, చెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని, ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిలబిందు సందోహంబుల నతని వదనారవిందంబుఁ దడుపుచు, మంద మధురాలాపంబుల నిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = పలుకగా; శుక్రకుమారకు = శుక్రుని పుత్రుని, చండామార్కుల; వచనంబులు = మాటలు; ఆకర్ణించి = విని; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడ; తన = తన; కున్ = కు; దండప్రణామంబు = సాష్టాంగనమస్కారములు {దండప్రణామము - కఱ్ఱవలె సాగి నమస్కరించుట, సాష్టాంగనమస్కారము}; చేసి = చేసి; నిలుచున్న = నిలబడినట్టి; కొడుకునున్ = పుత్రుని; దీవించి = దీవించి; బాహుదండంబులున్ = చేతులను; చాచి = చాపి; దిగ్గనన్ = శ్రీఘ్రమే; డగ్గఱన్ = దగ్గరకు; దిగిచి = తీసుకొని; గాఢ = బిగి; ఆలింగనంబు = కౌగలింత; చేసి = చేసి; తన = తన యొక్క; తొడలమీదన్ = ఒడిలో; ఇడుకొని = ఉంచుకొని; చుంచున్ = ముంగురులు; దువ్వి = దువ్వి; చిబుకంబున్ = గడ్డమును; పుడికి = పుణికిపుచ్చుకొని; చెక్కిలిన్ = చెంపను; ముద్దుగొని = ముద్దుపెట్టి; శిరంబున్ = తలను; మూర్కొని = వాసనచూసి; ప్రేమ = ప్రేమ యొక్క; అతిరేక = అతిశయముచే; సంజనిత = పుట్టిన; బాష్పసలిల = కన్నీటి; బిందు = బొట్ల; సందోహంబులన్ = ధారలచే; అతని = అతని; వదన = మోము యనెడి; అరవిందంబున్ = పద్మమును; తడుపుచున్ = తడుపుతూ; మంద = మెల్లని; మధుర = తీయని; ఆలాపంబులన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పిన శుక్రుని కుమారుని మాటలు హిరణ్యకశిపుడు విన్నాడు. ఆ రాక్షస రాజు దనకు వినయంగా తనకు నమస్కరిస్తున్న కొడుకుని చూసి చాలా ఆనందించాడు. తనయుడిని దీవించి చటుక్కున చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతనిని కౌగలించుకుని, ముద్దుచేస్తూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమతో ముంగురులు సవరించాడు. గడ్డం పుణికి పట్టుకుని, బుగ్గలు ముద్దాడాడు. తల మూర్కొని దగ్గరకు తీసుకున్నాడు. అమితమైన పుత్ర ప్రేమ వలన కన్నతండ్రి ఆనందభాష్పాలు కార్చాడు. వాటితో బాలకుడు ప్రహ్లాదుని మోము తడిసింది. అపుడు కొడుకుతో మెల్లగా, తియ్యగా ఇలా పలికాడు.

51
"చోద్యం బయ్యెడి నింతకాల మరిగెన్ శోధించి యేమేమి సం
వేద్యాంశంబులు చెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో?
విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ
ద్యం బొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా.
టీక:- చోద్యము = ఆశ్చర్యము; అయ్యెడిన్ = అగుతున్నది; ఇంతకాలము = ఇన్నిదినములు; అరిగెన్ = గడచిపోయినవి; శోధించి = పరిశీలించి; ఏమేమి = ఎటువంటి; సంవేద్య = తెలిసికొనదగిన; అంశంబులు = సంగతులు; చెప్పిరో = నేర్పినారో; గురువులు = గురువులు; ఏ = ఏ; వెంటన్ = విధముగ; పఠింపించిరో = చదివించినారో; విద్యా = విద్యల యొక్క; సారమున్ = సారాంశమును; ఎఱుంగన్ = తెలిసికొన; కోరెదన్ = కోరుచున్నాను; భవత్ = నీకు; విజ్ఞాత = తెలుసుకొన్న; శాస్త్రంబు = చదువుల; లోన్ = లోని; పద్యంబున్ = పద్యమును; ఒక్కటి = ఒక దానిని; చెప్పి = చెప్పి; సార్థముగాన్ = అర్థముతో కూడ; తాత్పర్యంబున్ = తాత్పర్యమును; భాషింపుమా = చదువుము.
భావము:- “నాయనా! ఎంతకాలం అయిందో నువ్వు చదువులకు వెళ్ళి? వచ్చావు కదా. చాలా చిత్రంగా ఉంది. మీ గురువులు ఏమేం క్రొత్త క్రొత్త విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోది అయినా సరే ఒక పద్యం చెప్పి, దానికి అర్థం తాత్పర్యం వివరించు వింటాను.

52
నిన్నున్ మెచ్చరు నీతిపాఠ మహిమన్ నీతోటి దైత్యార్భకుల్
న్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై
న్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌ దంచున్ మహావాంఛతో
నున్నాడన్ ననుఁ గన్నతండ్రి భవదీయోత్కర్షముం జూపవే."
టీక:- నిన్నున్ = నిన్ను; మెచ్చరు = మెచ్చుకొనరు; నీతి = నీతిశాస్త్రమును; పాఠ = చదివిన; మహిమన్ = గొప్పదనమును; నీ = నీ; తోటి = సహపాఠకులైన; దైత్య = రాక్షస; అర్భకుల్ = బాలకులు; కన్నారు = నేర్చుకొన్నారు; అన్నియున్ = అన్నిటిని; చెప్పన్ = చెప్పుట; నేర్తురు = నేర్చుకొంటిరి; కదా = కదా; గ్రంథ = గ్రంథముల; అర్థముల్ = అర్థములను; దక్షులు = నేర్పరులు; ఐ = అయ్యి; అన్నా = నాయనా; ఎన్నడున్ = ఎప్పుడు; నీవు = నీవు; నీతి = నీతిశాస్త్రమున; కోవిదుడవు = విద్వాంసుడవు; ఔదు = అయ్యెదవు; అంచున్ = అనుచు; మహా = మిక్కిలి; వాంఛ = కోరిక; తోన్ = తో; ఉన్నాడను = ఉన్నాను; నను = నను; కన్నతండ్రి = కన్నతండ్రి; భవదీయ = నీ యొక్క; ఉత్కర్షమున్ = గొప్పదనమును; చూపవే = చూపించుము.
భావము:- కుమారా! నా కన్న తండ్రీ! నీ తోడి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా! అందుచేత నిన్ను లెక్కచేయటం లేదట కదా! మరి నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు? నేను ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభాపాటవాలు నా కొకసారి చూపించు.”

53
అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; కన్న = తనకు జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియ = ఇష్ట; నందనుండు = సుతుడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; అనియె = పలికెను.
భావము:- అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

54
"చదివించిరి నను గురువులు
దివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
దివినవి గలవు పెక్కులు
దువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!
టీక:- చదివించిరి = చదివించిరి; ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్రీ =నాన్నగారూ.
భావము:- “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.

55
నుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
ను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ త్యంబు దైత్యోత్తమా!
టీక:- తనుహృద్భాషల = మనోవాక్కాయముల; సఖ్యమున్ = చెలిమి; శ్రవణమున్ = వినుటలు; దాసత్వమున్ = సేవించుటలు; వందన = నమస్కరించుటలు; అర్చనముల్ = పూజించుటలు; సేవయున్ = పరిచర్యలు చేయుట; ఆత్మ = మనసు; లోన్ = అందు; ఎఱుకయున్ = తెలివిడి; సంకీర్తనల్ = కీర్తనలు పాడుట; చింతనంబున్ = ధ్యానము; అను = అనెడి; ఈ = ఈ; తొమ్మిది = తొమ్మిది(9) {నవవిధభక్తి - 1సఖ్యము 2శ్రవణము 3దాసత్వము 4వందనము 5అర్చనము 6సేవ 7ఆత్మలోననెరుక 8సంకీర్తనము 9చింతనము}; భక్తి = భక్తి యొక్క; మార్గములన్ = విధానములతో; సర్వాత్మున్ = నారాయణుని {సర్వాత్ముడు - సర్వస్వరూపి, విష్ణువు}; హరిన్ = నారాయణుని; నమ్మి = నమ్మి; సజ్జనుడు = సాధుస్వభావి; ఐ = అయ్యి; ఉండుట = ఉండుట; భద్రము = శ్రేయము; అంచున్ = అనుచు; తలతున్ = తలచెదను; సత్యంబు = నిజముగ; దైత్యోత్తమా = రాక్షసులలో ఉత్తముడా.
భావము:- రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.

56
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.
టీక:- అంధ = గుడ్డివాని పాలిటి; ఇందు = చంద్రుని; ఉదయముల్ = ఉదయించుటలు; మహా = మిక్కిలి; బధిర = చెవిటివాని చెంత; శంఖ = శంఖము యొక్క; ఆరావముల్ = శబ్దములు; మూక = మూగవానిచేత; సత్ = మంచి; గ్రంథ = గ్రంథములను; ఆఖ్యాపనముల్ = చెప్పించుటలు; నపుంసక = మగతనములేనివాని; వధూకాంక్షల్ = మగువల పొందు కోరుటలు; కృతఘ్నా = మేలుమరచెడి; ఆవళీ = సమూహముతోటి; బంధుత్వంబులు = చుట్టరికములు; భస్మ = బూడిదలో పోసిన; హవ్యములు = హోమములు; లుబ్ధ = లోభి యొక్క; ద్రవ్యముల్ = సంపదలు; క్రోడ = పందికైన; సద్గంధంబుల్ = సువాసనలు; హరి = నారాయణుని; భక్తి = భక్తిని; వర్జితుల = వదలినవారి; రిక్త = శూన్యములైన; వ్యర్థ = ప్రయోజన హీనము లైన; సంసారముల్ = సంసారములు.
భావము:- లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు; కృతఘ్నులతో బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి; పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి. అని భావిస్తాను.

57
మలాక్షు నర్చించు రములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
ధువైరిఁ దవిలిన నము మనము;
గవంతు వలగొను దములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

దేవదేవుని చింతించు దినము దినము;
క్రహస్తునిఁ బ్రకటించు దువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
టీక:- కమలాక్షున్ = నారాయణుని {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అర్చించు = పూజించెడి; కరములు = చేతులే; కరములు = చేతులు; శ్రీనాథున్ = నారాయణుని {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవికి) నాథుడు (భర్త), విష్ణువు}; వర్ణించు = స్తోత్రముచేసెడి; జిహ్వ = నాలుకే; జిహ్వ = నాలుక; సురరక్షకునిన్ = నారాయణుని {సురరక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు}; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = చూపులు; శేషశాయి = నారాయణుని {శేషశాయి - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు}; కిన్ = కి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = తల; విష్ణున్ = నారాయణుని {విష్ణువు - సర్వము నందు వ్యాపించువాడు, హరి}; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = చెవులు; మధువైరిన్ = నారాయణుని {మధువైరి - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు}; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = చిత్తము; భగవంతున్ = నారాయణుని; వలగొను = ప్రదక్షిణలు చేసెడి; పదములు = అడుగులే; పదములు = అడుగులు; పురుషోత్తముని = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులందరిలోను ఉత్తముడు, విష్ణువు}; మీది = మీద గల; బుద్ధి = తలపే; బుద్ధి = తలపు.
దేవదేవుని = నారాయణుని {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = రోజు; చక్రహస్తుని = నారాయణుని {చక్రహస్తుడు - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు}; చదువు = చదువే; చదువు = చదువు; కుంభినీధవున్ = నారాయణుని {కుంభునీధనువు - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు}; చెప్పెడి = చెప్పెడి; గురుడు = గురువే; గురుడు = గురువు; తండ్రి = తండ్రి; హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = తండ్రి.
భావము:- నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించ మని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు!
దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.

58
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
వన గుంఫిత చర్మస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని క్త్రంబు వక్త్రమే? ;
మఢమ ధ్వనితోడి క్క గాక;
రిపూజనము లేని స్తంబు హస్తమే? ;
రుశాఖ నిర్మిత ర్వి గాక?
మలేశుఁ జూడని న్నులు కన్నులే? ;
నుకుడ్యజాల రంధ్రములు గాక;

క్రిచింత లేని న్మంబు జన్మమే?
రళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి శువు గాక.
టీక:- కంజాక్షున్ = నారాయణుని {కంజాక్షుడు - కంజము (కమలము)ల బోలు అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; కున్ = కి; కాని = ఉపయోగించని; కాయంబు = దేహము; కాయమే = దేహమా ఏమి; పవన = గాలిచే; గుంఫిత = కూర్చ బడి నట్టి; చర్మభస్త్రి = తోలుతిత్తి; కాక = కాకుండగ; వైకుంఠున్ = నారాయణుని {వైకుంఠుడు - వైకుంఠమున నుండు వాడు, విష్ణువు}; పొగడని = కీర్తించని; వక్త్రంబున్ = నోరు; వక్త్రమే = నోరా ఏమి; ఢమఢమ = ఢమఢమ యనెడి; ధ్వని = శబ్దముల; తోడి = తోకూడిన; ఢక్క = ఢంకా; కాక = కాకుండగ; హరి = నారాయణుని; పూజనమున్ = పూజలను చేయుట; లేని = లేని; హస్తంబు = చేయి; హస్తమే = చేయేనా ఏమి; తరు = చెట్టు; శాఖ = కొమ్మచే; నిర్మిత = చేయబడిన; దర్వి = తెడ్డు, గరిటె; కాక = కాకుండగ; కమలేశున్ = నారాయణుని {కమలేశుడు - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు}; చూడని = చూడనట్టి; కన్నులు = కళ్లు; కన్నులే = కళ్లేనా ఏమి; తను = దేహము యనెడి; కుడ్య = గోడ యందలి; జాలరంధ్రములు = కిటికీలు; కాక = కాకుండగ.
చక్రి = నారాయణుని {చక్రి - చక్రాయుధము గలవాడు, విష్ణువు}; చింత = తలపు, ధ్యానము; లేని = లేనట్టి; జన్మంబు = పుట్టుక కూడ; జన్మమే = పుట్టుకయేనా ఏమి; తరళ = కదలుచున్న; సలిల = నీటి; బుద్భుదంబు = బుడగ; కాక = కాకుండగ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; లేని = లేనట్టి; విబుధుండు = విద్వాంసుడు; విబుధుండే = విద్వాంసుడా ఏమి; పాద = కాళ్ళు; యుగము = రెంటి; తోడి = తోటి; పశువు = పశువు; కాక = కాకుండగ.
భావము:- పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు. అది గాలితో నిండిన, కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు, ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన ఆ హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు ఢమ ఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు అది ఒక కొయ్య తెడ్డు (చెక్క గరిటె). శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానేకాదు.
(ఈ పద్య రత్నాలు అమూలకం పోతన స్వకీయం. “మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అమూలకం; పోతన స్వంత కృతి కనుక స్వకీయం; అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు, సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా” అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని, ఇక్కడ “అంధేదూదయముల్”, “కమలాక్షు నర్చించు”, “కంజాక్షునకు గాని”, “సంసార జీమూత” అనే నాలుగు పద్యాలలో వరసగా ప్రహ్లాదుని నోట పలికించా రనుకుంటాను.)

59
సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
క్రిదాస్యప్రభంనము లేక;
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక;
ర్వంకషాఘౌఘ లరాసు లింకునే? ;
రిమనీషా బడబాగ్ని లేక;
నవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
ద్మాక్షునుతి రవిప్రభలు లేక;

నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!"
టీక:- సంసార = సంసారము యనెడి; జీమూత = మబ్బుల; సంఘంబు = సమూహము; విచ్చునే = విడిపోవునా ఏమి; చక్రి = నారాయణుని; దాస్య = కైంకర్యము యనెడి; ప్రభంజనము = పెనుగాలి; లేక = లేకుండగ; తాపత్రయ = తాపత్రయములు యనెడి {తాపత్రయము - 1ఆధ్యాత్మికము 2ఆదిభౌతికము 3అధిదైవికము అనెడి బాధలు}; ఆభీల = భయంకరమైన; దావాగ్నులు = కారుచిచ్చులు; ఆఱునే = ఆరిపోవునా ఏమి; విష్ణు = నారాయణుని; సేవా = సేవ యనెడి; అమృత = అమృతపు; వృష్టి = వర్షము; లేక = లేకుండగ; సర్వంకష = మిక్కిలి శక్తివంతమైనట్టి; అఘ = పాపముల; ఓఘ = సమూహయము లనెడి; జలరాసులు = సముద్రములు; ఇంకునే = ఇంకిపోవునా ఏమి; హరి = నారాయణుని; మనీషా = ప్రజ్ఞ యనెడి; బడబాగ్ని = బడబాగ్ని; లేక = లేకుండగ; ఘన = గొప్ప; విపత్ = ఆపద లనెడి; గాఢ = చిమ్మ; అంధకారంబుల్ = చీకటులు; అడగునే = నశించునా ఏమి; పద్మాక్షున్ = నారాయణుని {పద్మాక్షుడు - పద్మములను పోలెడి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నుతి = స్తోత్రము యనెడి; రవి = సూర్యుని; ప్రభలు = కాంతులు; లేక = లేకుండగ.
నిరుపమ = సాటిలేని; అపునరావృత్తిన్ = తిరిగిరాని విధమైన; నిష్కళంక = నిర్మలమైన; ముక్తినిధిన్ = మోక్షపదవిని; కానన్ = చూచుటకు; వచ్చునే = అలవియా ఏమి; ముఖ్యము = ముఖ్యము; ఐన = అయిన; సార్ఙ్గకోదండ = నారాయణుని {సార్ఙ్గకోదండడు - సార్ఙ్గ్యము యనెడి ఖడ్గము కోదండము యనెడి విల్లు మొదలగు ఆయుధములు గలవాడు, విష్ణువు}; చింతన = ధ్యానము యనెడి; అంజనము = కాటుక; లేక = లేకుండగ; తామరసగర్భున = బ్రహ్మదేవుని {తామరసగర్భుడు - పద్మము నందు పుట్టినవాడు, బ్రహ్మ}; కున్ = కు; ఐనన్ = అయినను; దానవేంద్ర = రాక్షసరాజా.
భావము:- రాక్షసేశ్వరా! పెద్ద గాలి ప్రభంజనంలా విసరక పోతే, గుంపులు కట్టిన కారు మబ్బులు విడిపోవు కదా. అలాగే చక్రధారి అయిన విష్ణుమూర్తి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు. శ్రీహరి కైంకర్యం అనే అమృతపు వాన జల్లు కురవక పోతే, సంసారాటవిలో చెలరేగే తాపత్రయాలు అనే భయంకరమైన దావాగ్ని చల్లారదు. బడబాగ్ని ప్రజ్వల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే శ్రీపతి చింతన ఉత్తేజమైతే ఎంత శక్తిమంతమైన పాపాలైనా పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి. అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి. మహా నిధులు గుప్తంగా ఉంటాయి. విష్ణుధ్యానము అనే అంజనం ఉంటే వాటిని కనుగొనగలం. (శార్ఙ్గం అనే ఖడ్గం కోదండం అనే విల్లు ధరిస్తాడు విష్ణువు.) విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కాని నిర్మలమైన, నిరుపమానమైన, పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నాన్నగారూ! ఆఖరుకి ఆ బహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు.”

60
అని యివ్విధంబున వెఱపు మఱపు నెఱుంగక యులుకుచెడి పలికెడు కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నొదవినఁ గటము లదరఁ బెదవులం గఱచుచు నదిరిపడి గురుసుతునిం గనుంగొని "విమత కథనంబులు గఱపినాఁడ" వని దానవేంద్రుం డిట్లనియె.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; వెఱపు = భయము; మఱపు = మరచిపోవుటలు; ఎఱుంగక = తెలియక; ఉలుకుచెడి = లెక్కజేయక; పలికెడు = మాట్లాడెడి; కొడుకు = పుత్రుని; నుడువులు = మాటలు; చెవుల్ = చెవుల; కున్ = కు; ములుకుల = ముళ్లు; క్రియన్ = వంటివి; ఒదవినన్ = కాగా; కటములు = కణతలు; అదరన్ = అదురుతుండగ; పెదవులన్ = పెదవులను; కఱచుచున్ = కొరుకుచు; అదిరిపడి = ఉలికిపడి; గురుసుతునిన్ = శుక్రుని పుత్రుని; కనుంగొని = చూసి; విమత = పగవారి; కథనంబులున్ = కథలను; కఱపినాడవు = నేర్చినావు; అని = అని; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా విష్ణుభక్తి ఒకటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు నదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడికి వాడి ములుగులు లాగ నాటుకున్నాయి. అతను కోపంతో ఉలిక్కిపడ్డాడు. కణతలు అదిరాయి. పళ్ళతో పెదవులు కొరుకుతూ, ప్రహ్లాదుడికి చదువు చెప్తున్న శుక్రాచార్యుని కొడుకుతో “శత్రు పక్షం విషయాలు నేర్పావన్న మాట” అని ఇంకా ఇలా హుంకరించాడు.

61
"టుతర నీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ
టు గొనిపోయి వానికి నర్హము లైన విరోధిశాస్త్రముల్
కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్
కట! బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే?
టీక:- పటుతర = మిక్కిలి దృఢమైన {పటు - పటుతరము - పటుతమము}; నీతి = నీతి; శాస్త్ర = శాస్త్రముల; చయ = సమూహము నందు; పారగున్ = నేర్పరునిగా, చివరదాక చదివిన వానినిగా; చేసెదన్ = చేసెదను; అంచున్ = అనుచు; బాలున్ = పిల్లవానిని; నీవు = నీవు; అటు = అలా; కొనిపోయి = తీసుకు వెళ్ళి; వాని = వాని; కిన్ = కి; అనర్హములు = తగనట్టివి; ఐన = అయిన; విరోధి = పగవాని; శాస్త్రముల్ = చదువులు; కుటిలతన్ = కపటత్వముతో; చెప్పినాడవు = చెప్పితివి; భృగు = భృగువు వంశపు; ప్రవరుండవు = శ్రేష్ఠుడవు; అటంచున్ = అనుచు; నమ్మితిని = నమ్మితిని; కటకట = అయ్యో; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; ఆకృతివి = రూపు ధరించిన వాడవు; కాక = అంతేకాని; యథార్థపు = నిజమైన; బ్రాహ్మణుండవే = బ్రాహ్మణుడవేనా.
భావము:- “నా కొడుకుని తీసుకు వెళ్లి నీతి పాఠాలు బాగా నేర్పుతాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరిపోశావా. అయ్యయ్యో! పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్ప వాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను కదయ్యా. బ్రాహ్మణ ఆకారంలో ఉన్నావు కాని నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే సరైన చదువు చెప్తానని ఇలా మోసం చేస్తావా?

62
ర్మేతరవర్తనులును
దుర్మంత్రులు నైన జనుల దురితము లొందున్
ర్మములు గలఁచి కల్మష
ర్ముల రోగములు పొందు కైవడి విప్రా!"
టీక:- ధర్మ = ధర్మమార్గమునకు; ఇతర = అన్యమైన; వర్తనులును = నడత కలవారు; దుర్మంత్రులును = చెడు తలపులు గలవారును; ఐన = అయిన; జనులన్ = ప్రజలను; దురితములు = పాపములు; ఒందున్ = పొందును; మర్మములు = ఆయువు పట్టులను; కలచి = పీడించి; కల్మష = చెడు; కర్ములన్ = పనులు చేయు వానిని; రోగములు = రోగములు; పొందు = పొందెడి; కైవడిన్ = వలె; విప్రా = బ్రాహ్మణుడా.
భావము:- ఓయీ బ్రాహ్మణుడా! చెడు నడతలు తిరిగే వారిని రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే ధర్మ మార్గం తప్పిన వాళ్ళకూ, కుటిలమైన ఆలోచనలు చేసే వాళ్ళకూ పాపాలు చుట్టుకుంటాయి. ఆ పాపాలు వాళ్లను నానా బాధలు పెడతాయి తెలుసా!”

63
అనిన రాజునకుఁ బురోహితుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; రాజున్ = రాజున; కున్ = కు; పురోహితుండు = గురువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా మండిపడుతున్న హిరణ్యకశిప మహారాజుతో ప్రహ్లాదుని గురువు అయిన ఆ పురోహితుడు వినయంగా ఇలా చెప్పాడు.

64
"ప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్
చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సు
మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష యెవ్వరుం
జెప్పెడిపాటి గాదు ప్రతిచింతఁ దలంపుము నేర్పుకైవడిన్.
టీక:- తప్పులు = తప్పులు; లేవు = చేయబడలేదు; మా = మా; వలన = చేత; దానవనాథ = రాక్షసరాజా; విరోధి = శత్రువుల; శాస్త్రముల్ = చదువులు; చెప్పము = చెప్పలేదు; క్రూరులు = క్రూరమైనవారు; ఐ = అయ్యి; పరులు = ఇతరులు ఎవరును; చెప్పరు = చెప్పలేదు; మీ = మీ యొక్క; చరణంబులు = పాదముల; ఆన = మీద ఒట్టు; సుమ్ము = సుమా; ఎప్పుడున్ = ఎప్పుడును; మీ = మీ; కుమారున్ = పుత్రుని; కున్ = కి; నైజ = సహజసిద్ధమైన; మనీష = ప్రజ్ఞ, బుద్ధి; ఎవ్వరున్ = ఎవరు కూడ; చెప్పెడిపాటి = చెప్పగలంతవారు; కాదు = కాదు; ప్రతి = విరుగుడు; చింతన్ = ఆలోచన; తలంపుము = విచారింపుము; నేర్పు = మంచి నేర్పైన; కై = కోసము; వడిన్ = శ్రీఘ్రమే.
భావము:- “ఓ రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు. నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పము, చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు.

65
మిత్రులము పురోహితులము
పాత్రుల మే మదియుఁ గాక భార్గవులము నీ
పుత్రుని నిటువలెఁ జేయఁగ
త్రులమే? దైత్యజలధిచంద్రమ! వింటే."
టీక:- మిత్రులము = స్నేహితులము; పురోహితులము = ఆచార్యులము; పాత్రులము = తగినవారము; అదియుగాక = అంతేకాకుండగ; భార్గవులము = భృగువు వంశపు వారము; నీ = నీ యొక్క; పుత్రుని = కుమారుని; ఇటు = ఈ; వలెన్ = విధముగ; చేయగన్ = చేయుటకు; శత్రువులమే = విరోధులమా ఏమి; దైత్యజలనిధిచంద్రమ = హిరణ్యకశిపుడ {దైత్యజలనిధిచంద్రమ - దైత్య (రాక్షస) కుల మనెడి జలనిధి (సముద్రమునకు) చంద్రమ (చంద్రుని వంటివాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివా.
భావము:- ఓ రాక్షసరాజా! నువ్వు రాక్షస కులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. వినవయ్యా! మేము నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము, మంచి యోగ్యులము. అంతే కాదు భృగువంశంలో పుట్టినవాళ్ళం. మేము నీకు మేలు కోరే వాళ్ళము తప్ప, నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులము కాదయ్యా!”

66
అనిన గురునందనుం గోపింపక దైత్యవల్లభుండు గొడుకు నవలోకించి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; గురునందనున్ = ఆచార్యుని పుత్రులను; కోపింపకన్ = కోప్పడక; దైత్యవల్లభుండు = హిరణ్యకశిపుడు {దైత్యవల్లభుడు - దైత్యులకు వల్లభుడు (భర్త), హిరణ్యకశిపుడు}; కొడుకున్ = పుత్రుని; అవలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు అనేటప్పటికి, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు వారిపై కోపం విడిచి పెట్టాడు. తన కొడుకుతో ఇలా అన్నాడు.

67
"ఒజ్జలు చెప్పని యీ మతి
జ్జాతుఁడ వైన నీకు ఱి యెవ్వరిచే
నుజ్జాత మయ్యె బాలక!
జ్జనులం బేరుకొనుము గ నా మ్రోలన్."
టీక:- ఒజ్జలు = గురువులు; చెప్పని = చెప్పనట్టి; ఈ = ఇట్టి; మతి = బుద్ధి; మత్ = నాకు; జాతుడవు = పుట్టినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; మఱి = ఇంక; ఎవ్వరి = ఎవరి; చేన్ = వలన; ఉజ్జాతము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; బాలక = పిల్లవాడ; తత్ = అట్టి; జనులన్ = వారిని; పేరుకొనుము = చెప్పుము; తగన్ = సరిగా; నా = నా; మ్రోలన్ = ఎదుట.
భావము:- “ప్రహ్లాదా! నువ్వేమో చిన్న పిల్లాడివి. ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్ప లేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్లెవరో నాకు చెప్పు.”

68
అనినఁ దండ్రికిఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

69
"చ్చపుఁ జీకటింబడి గృవ్రతులై విషయప్రవిష్టులై
చ్చుచుఁ బుట్టుచున్ మరలఁ ర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.
టీక:- అచ్చపుజీకటిన్ = గాఢాంధకారము నందు; పడి = పడిపోయి; గృహవ్రతులు = గృహస్థులు; ఐన = అయినట్టి; విషయ = ఇంద్రియార్థములలో; ప్రవిష్టులు = లోలురు; ఐ = అయ్యి; చచ్చుచున్ = చనిపోతూ; పుట్టుచున్ = పుడుతూ; మరల = మరల; చర్వితచర్వణులు = తిరిగిచేయువారు {చర్వితచర్వణము - తిన్నదే మరల తినుట}; ఐన = అయిన; వారి = వారి; కిన్ = కి; చెచ్చెఱన్ = శ్రీఘ్రమే; పుట్టునే = కలుగునా ఏమి, కలుగదు; పరులు = ఇతరులు; చెప్పినన్ = చెప్పిన; ఐనన్ = ఐనప్పటికి; నిజేచ్ఛన్ = తనంతట తను; ఐనన్ = అయినను; ఏమి = ఏది; ఇచ్చినన్ = ఇచ్చిన; ఐనన్ = అయినను; కానల = అడవుల; కున్ = కి; ఏగినన్ = వెళ్ళిన; ఐనన్ = అప్పటికిని; హరి = నారాయణుని; ప్రభోదముల్ = జ్ఞానములు.
భావము:- “అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి, దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు, కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ, పుడుతూ, మరల చస్తూ, పుడుతూ ఇలా ఈ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలగదు; ఏమి ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు; ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు; అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి.

70
కానివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గాని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కారు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థా రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!
టీక:- కానని = చూడలేని; వానిన్ = వానిని; ఊతన్ = ఊతముగ; కొని = తీసుకొని; కానని = గుడ్డి; వాడు = వాడు; విశిష్ట = శ్రేష్ఠమైన; వస్తువుల్ = వస్తువులను; కానని = చూడలేని; భంగిన్ = వలె; కర్మములున్ = కర్మలను; కైకొని = చేపట్టి; కొందఱు = కొంతమంది; కర్మ = కర్మలకు; బద్ధులు = లోబడినవారు; ఐ = అయ్యి; కానరు = చూడజాలరు; విష్ణున్ = నారాయణుని; కొందఱు = కొంతమంది; అటన్ = అక్కడ; కందురు = పొందెదరు; అకించన = కేవలమైన; వైష్ణవ = విష్ణుభక్తుల; అంఘ్రి = పాదము లందు; సంస్థాన = ఉండెడి; రజః = ధూళిచేత; అభిషిక్తులు = అభిషేకింపబడినవారు; అగు = అయిన; సంహృత = విడిచిపెట్టిన; కర్ములు = కర్మములు గలవారు; దానవేశ్వరా = హిరణ్యకశిపుడ.
భావము:- తండ్రీ! రాక్షసేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా! అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాద ధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూత చిత్తులు అవుతారు; అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు.

71
శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణి సాంత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్."
టీక:- శోధింపంబడె = పరిశోధింపబడినవి; సర్వ = సమస్తమైన; శాస్త్రములున్ = చదువులును; రక్షోనాథ = రాక్షసరాజా; వేయి = అనేక మాటలు; ఏటికిన్ = ఎందులకు; గాథల్ = కథలు; మాధవ = నారాయణుని; శేముషి = చింత యనెడి; తరణి = నావ; సాంగత్యంబునన్ = సంబంధమువలన; కాక = కాకుండగ; దుర్మేధన్ = దుష్టబుద్ధితో; దాటగన్ = తరించుటకు; వచ్చునే = అలవి యగునా యేమి; సుత = పిల్లలు; వధూ = పెండ్లాము యనెడి; మీన = జలజంతువులు; ఉగ్ర = తీవ్రమైన; వాంఛ = కోరికలు; మద = గర్వము; క్రోధ = కోపము యనెడి; ఉల్లోల = పెద్ద తరంగములు గల; విశాల = విస్తారమైన ; సంసృతి = సంసారము యనెడి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; అమిత = కడలేని; అంభోనిధిన్ = సముద్రమును;
భావము:- ఓ తండ్రీ! దానవేంద్రా! శాస్త్రాలు, కథలూ, గాథలూ అన్ని చదివి మధించాను. ఈ సంసారం ఒక భయంకరమైన మహా సముద్రం వంటిది; ఈ సంసార సాగరంలో భార్యా పుత్రులు తిమింగలాలు; కామం, క్రోధం మొదలైనవి ఉగ్రమైన కెరటాలు. ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి, అనవసరమైన వాదప్రతివాదాలు తోటి సాధ్యం కాదు; ఈ చదువు సంధ్యలు ఏవీ, ఎందుకూ పనికి రావు; ఒక్క హరిభక్తి అనే నౌక మాత్రమే తరింపజేయగలదు.”

72
అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువచేయక రక్కసుల ఱేఁడు దన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేఁడిచూపుల మింట మంట లెగయ మంత్రులం జూచి యిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = అనుచున్న; కొడుకును = పుత్రుని; ధిక్కరించి = తిరస్కరించి; మక్కువ = గారాబము; చేయక = చేయకుండగ; రక్కసులఱేడు = రాక్షసరాజు; తన = తన యొక్క; తొడల = తొడల; పైన్ = మీద; ఉండనీక = ఉండనీయక; గొబ్బునన్ = వేగముగా; దిగన్ = దిగిపోవునట్లు; ద్రొబ్బి = పడదోసి; నిబ్బరంబు = మిక్కుటము; అగు = అయిన; కోపంబు = కోపము; దీపింపన్ = జ్వలించుచుండగ; వేడి = వేడి; చూపులన్ = చూపు లమ్మట; మింటన్ = ఆకాశమున; మంటలు = మంటలు; ఎగయన్ = చెలరేగ; మంత్రులన్ = మంత్రులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుండగా, మంత్రులతో ఇలా అన్నాడు.

73
"క్రోడంబై పినతండ్రిఁ జంపె నని తాఁ గ్రోధించి చిత్తంబులో
వీడం జేయఁడు బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుఁడై
యోడం డక్కట! ప్రాణవాయువులు వీఁ డొప్పించుచున్నాఁడు నా
తోడన్ వైరముపట్టె నిట్టి జనకద్రోహిన్ మహిం గంటిరే."
టీక:- క్రోడంబు = వరహావతారుడు; ఐ = అయ్యి; పినతండ్రిన్ = చిన్నాన్నను; చంపెను = చంపి వేసెను; అని = అని; తాన్ = తను; క్రోధించి = కోపము పెంచుకొని; చిత్తంబు = మనసు; లోన్ = లోనుండి; వీడన్ = దూరము; చేయడు = చేయడు; బంటు = సేవకుని; భంగిన్ = వలె; హరి = నారాయణుని; కిన్ = కి; విద్వేషి = విరోధి; కిన్ = కి; భక్తుడు = భక్తుడు; ఐ = అయ్యి; ఓడండు = సిగ్గుపడడు; అక్కట = అయ్యో; ప్రాణవాయువులు = ప్రాణవాయువులకు; వీడు = ఇతడు; ఒప్పించుచున్నాడు = అధీనము చేయుచున్నాడు; నా = నా; తోడన్ = తోటి; వైరము = పగ; పట్టెన్ = పట్టెను; ఇట్టి = ఇలాంటి; జనక = తండ్రికి; ద్రోహిన్ = ద్రోహము చేయువానిని; మహిన్ = నేలపైన; కంటిరే = ఎక్కడైనా చూసేరా.
భావము:- “విష్ణువు మాయా వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపేశాడని బాధ లేకుండా, సిగ్గు లేని వీడు మన వంశ విరోధికి బంటు లాగ భజన చేస్తాడా! పైగా నా తోటే విరోధానికి సిద్ధపడతాడా! అమ్మో! వీడు తన ప్రాణాలను సైతం అప్పజెప్పేస్తున్నాడు! ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టే కొడుకును లోకంలో ఎక్కడైనా చూసారా?”

ప్రహ్లాదుని హింసించుట

74
అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె.
టీక:- అని = అని; రాక్షసవీరులన్ = వీరులైన రాక్షసులను; ఈక్షించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా పలికి హిరణ్యకశిపుడు వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు.

75
"పంచాబ్దంబులవాఁడు తండ్రి నగు నా క్షంబు నిందించి య
త్కించిద్భీతియు లేక విష్ణు నహితుం గీర్తించుచున్నాఁడు వ
ల్దంచుం జెప్పిన మానఁ డంగమునఁ బుత్రాకారతన్ వ్యాధి జ
న్మించెన్ వీని వధించి రండు దనుజుల్ మీమీ పటుత్వంబులన్.
టీక:- పంచ = ఐదు (5); అబ్దంబుల = సంవత్సరముల వయసు; వాడు = వాడు; తండ్రి = తండ్రి; అగు = అయిన; నా = నా; పక్షంబున్ = మతమును; నిందించి = నిందించి; యత్ = ఏ; కించిత్ = కొంచెము యైన; భీతిన్ = భయము; లేక = లేకుండగ; విష్ణున్ = నారాయణుని; అహితున్ = విరోధిని; కీర్తించుచున్నాడు = స్తుతించుచున్నాడు; వల్దు = వద్దు; అంచున్ = అనుచు; చెప్పినన్ = చెప్పినప్పటికి; మానండు = మానివేయడు; అంగమునన్ = దేహములో; పుత్ర = కుమారుని; ఆకారతన = రూపుతో; వ్యాధి = రోగము; జన్మించెన్ = పుట్టెను; వీని = ఇతని; వధించి = చంపి; రండు = రండి; దనుజుల్ = రాక్షసులారా; మీమీ = మీ యొక్క; పటుత్వంబులన్ = బలముకొలది.
భావము:- “రాక్షసులారా! వీడేమో ఇంతా చేసి అయిదేండ్ల వాడు. చూడండి, కన్న తండ్రిని నన్నే ఎదిరిస్తున్నాడు. నన్ను లెక్క చేయకుండా, నదురు బెదురు లేకుండా, నా ఎదుటే శత్రువైన హరిని పొగడుతున్నాడు. “వద్దురా కన్నా!” అని నచ్చజెప్పినా వినటం లేదు. నా శరీరంలో పుట్టిన వ్యాధిలా పుత్రరూపంలో పుట్టుకొని వచ్చాడు. అందుచేత, మీరు ఈ ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి వధించి రండి. మీమీ పరాక్రమాలు ప్రదర్శించండి,” అని ఆదేశించి ఇంకా ఇలా అన్నాడు.

76
అంవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంశ్రేణికి రక్ష చేయు క్రియ నీ జ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.
టీక:- అంగ = అవయవముల; వ్రాతము = సముదాయము; లోన్ = అందు; చికిత్సకుడు = వైద్యుడు; దుష్ట = పాడైన; అంగంబున్ = అవయమును; ఖండించి = కత్తిరించివేసి; శేష = మిగిలిన; అంగ = అవయవముల; శ్రేణి = సముదాయమున; కిన్ = కు; రక్ష = శుభమును; చేయు = చేసెడి; క్రియన్ = విధముగ; ఈ = ఈ; అజ్ఞున్ = తెలివితక్కువ వానిని; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయు వానిని; దుస్సంగున్ = చెడుసావాసము చేయువానిని; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశి యను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; పక్షపాతిన్ = పక్షము వహించు వాని; అధమున్ = నీచుని; చంపించి = సంహరింపజేసి; వీర = శౌర్యవంతమైన; వ్రత = కార్యములను చేసెడి నిష్ఠచే; ఉత్తుంగ = అత్యధికమైన; ఖ్యాతిన్ = కీర్తితో; చరించెదన్ = తిరిగెదను; కులము = వంశము; నిర్దోషము = కళంకము లేనిదిగా; కావించెదన్ = చేసెదను.
భావము:- “ఈ చెడు త్రోవ పట్టిన కుల ద్రోహీ, శత్రు పక్షపాతీ, మూర్ఖుడూ అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన దుష్టాంగం. వ్యాధి బారిన పడిన దుష్ట అవయవాన్ని ఖండించి, శస్త్రవైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు ఆరోగ్యం కలిగించి రక్షిస్తాడు. అలాగే, ఇతనిని చంపించి కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసిన గొప్ప మహా వీరుడు అనే కీర్తిని పొందుతాను.

77
హంవ్యుఁడు రక్షింపను
మంవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంవ్యుఁడు వధమున కుప
రంవ్యుం డనక చంపి రం డీ పడుచున్."
టీక:- హంతవ్యుడు = చంపదగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింప దగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మానదగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడుచున్ = పిల్లవానిని.
భావము:- ఇతడు చంపదగినవాడు. ఏ మాత్రం క్షమించదగినవాడు కాడు. ప్రహ్లాదుడు తక్షణం యమపురికి పంపదగినవాడు. తప్పులు మన్నించకండి. జాలి పడి విడిచిపెట్టకుండా వధించి రండి.”

78
అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడి కోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుం బోలెఁ దామ్ర సంకాశంబు లయిన కేశంబులు మెఱయ ఖేదన చ్ఛేదన వాదంబులుఁ జేయుచు.
టీక:- అని = అని; దానవేంద్రుండు = రాక్షసరాజు; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; వాడి = పదునైన; కోఱలు = కోరలు; కల = కలిగిన; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకులు; శూల = శూలమును; హస్తులు = చేతులో ధరించినవారు; ఐ = అయ్యి; వక్త్రంబులు = నోళ్ళు; తెఱచికొని = తెరుచుకొని; ఉబ్బి = పొంగిపోతూ; బొబ్బలు = అరుపులు; ఇడుచున్ = పెడుతూ; ధూమ = పొగతో; సహిత = కూడిన; దావదహనంబునన్ = కారుచిచ్చును; పోలెన్ = వలె; తామ్ర = రాగితో; సంకాశంబులు = పొల్చదగినట్టి; కేశంబులున్ = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగా; ఖేదన = కొట్టండి అనెడి; ఛేదన = నరకండి అనెడి; వాదంబులున్ = అరుపులు; చేయుచున్ = పెడుతూ.
భావము:- ఇలా ప్రహ్లాదుడిని చంపమని దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు. పదునైన కోరలు కలిగిన చాలామంది రాక్షసులు చేతులలో శూలాలు పట్టుకుని, భయంకరంగా నోళ్లు తెరచి అరుస్తూ ఉద్రేకంగా గంతులు వేయసాగారు. విరబోసుకున్న ఎఱ్ఱటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటలు లాగా ఉన్నారు. అలాంటి భీకర ఆకారాలు గల ఆ రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిట్టండి, కొట్టండి అని కేకలు పెడుతూ…...

79
"బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య సం
శీలుఁడు వీఁ డవధ్యుఁ" డని చిక్కక స్రుక్కక క్రూరచిత్తులై
శూములం దదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్ర వా
చాత నందఱున్ దివిజత్రుఁడు వల్దనఁ డయ్యె భూవరా!
టీక:- బాలుడు = చిన్నపిల్లవాడు; రాచబిడ్డడు = రాకుమారుడు; కృపాళుడు = దయ గలవాడు; సాధుడు = మెత్తని స్వభావము గలవాడు; లోక = లోకులచే; మాన్య = మన్నింపదగిన; శీలుడు = వర్తన గలవాడు; వీడు = ఇతడు; అవధ్యుడు = చందగినవాడు కాడు; అని = అని; చిక్కక = వెరవక; స్రుక్కక = భయపడక; క్రూర = భయంకరమైన; చిత్తులు = మనసు గలవారు; ఐ = అయ్యి; శూలములన్ = శూలములతో; తత్ = అతని; అంగములన్ = అవయవములను; సుస్థిరులు = బాగా నిలకడ గలవారు; ఐ = అయ్యి; ప్రహరించిరి = కొట్టిరి; ఉగ్ర = భీకరమైన; వాచాలతన్ = వాగుడుతో; అందఱున్ = అందరును; దివిజశత్రుడు = రాక్షసుడు; వల్దు = వద్దు; అనడు = అనకుండెడివాడు; అయ్యెన్ = అయ్యెను; భూవరా = రాజా.
భావము:- ఓ ధర్మరాజా! అంతట ఆ దానవులు “అయ్యో! ఇతగాడు బాగా చిన్న పిల్లాడు, బహు సుకుమారుడు, మీదుమిక్కిలి తమ రాకుమారుడు” అని కాని; “దయ గల వాడు, మంచి వాడు, అందరూ మెచ్చుకునే గుణం శీలం కలవాడు” అని కాని ఏమాత్రం జాలికూడా లేకుండా ప్రహ్లాదుడిని బాగా కొట్టారు. శూలాలతో క్రూరంగా పొడిచారు. గట్టిగా నానా మాటలు అన్నారు, తిట్టారు. నానా బాధలూ పెట్టారు ఇంత ఎదురుగా జరుగుతుంటే కన్నతండ్రి, కొడుకును కొట్టవద్దు అనటం లేదు, పైగా వినోదంగా చూస్తున్నాడు. సొంత కొడుకుమీద మరీ అంత పగ ఏమిటో.

80
లువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రము
న్నొలియదు లోపలన్ రుధిర ముబ్బదు కందదు శల్య సంఘమున్
లియదు దృష్టివైభవము ష్టము గాదు ముఖేందు కాంతియుం
బొలియదు నూతనశ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్.
టీక:- పలువురు = అనేకులు; దానవుల్ = రాక్షసులు; పొడువన్ = పొడవగా; బాలుని = పిల్లవాని; దేహము = శరీరము; లేశ = కొంచపు; మాత్రమున్ = మాత్రము అయినను; ఒలియదు = ఒరసికొనిపోదు, చిట్లదు; లోపలన్ = లోపలనుంచి; రుధిరము = రక్తము; ఉబ్బదు = పొంగదు; కందదు = కందిపోదు; శల్య = ఎముకల; సంఘమున్ = గూడు; నలియదు = నలిగిపోదు; దృష్టి = చూపులలోని; వైభవము = మెరుపు; నష్టముగాదు = తగ్గిపోదు; ముఖ = మోము యనెడి; ఇందు = చంద్రుని; కాంతియున్ = ప్రకాశము; పొలియదు = నశింపదు; నూతన = కొత్తగ; శ్రమము = అలసట; పుట్టదు = కలగదు; పట్టదు = చెందదు; దీనభావమున్ = భీరుత్వమును.
భావము:- అదేం విచిత్రమూ కాని, అంతమంది పెద్ద పెద్ద రాక్షసులు ఇలా ఆ ఒక్క బాలుడిమీద పడి శక్తి మీర పొడుస్తుంటే, ప్రహ్లాదుడి శరీరం అసలు ఏమాత్రం కందనే కంద లేదు. రక్తం చిందలేదు, లోపలి ఎముకలు విరగలేదు, కళ్ళ లోని కళ మాయ లేదు, ముఖం వాడలేదు, కనీసం అతనిలో ఎక్కడా అలసట కూడా కనిపించ లేదు.

81
న్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి "కో!
న్నగశాయి! యో! దనుజభంజన! యో! జగదీశ! యో! మహా
న్నశరణ్య! యో! నిఖిలపావన!" యంచు నుతించుఁ గాని తాఁ
న్నుల నీరుఁ దేఁడు భయకంపసమేతుఁడుఁ గాఁడు భూవరా!
టీక:- తన్నున్ = తనను; నిశాచరుల్ = రాక్షసులు {నిశాచరులు - నిశ (రాత్రి) యందు చరులు (తిరుగువారు), రాక్షసులు}; పొడువన్ = పొడవగా; దైత్య = రాక్షస; కుమారుడు = బాలుడు; మాటిమాటికిన్ = అస్తమాను {మాటిమాటికి - ప్రతిమాటకు, అస్తమాను}; ఓ = ఓ; పన్నగశాయి = హరి {పన్నగ శాయి - పన్నగ (శేషసర్పము) పైన శాయి(శయనించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; దనుజభంజన = హరి {దనుజ భంజనుడు - దనుజ (రాక్షసులను) భంజనుండు (సంహరించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; జగదీశ = హరి {జగదీశుడు - జగత్ (విశ్వ మంతటకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; ఓ = ఓ ; మహాపన్నశరణ్య = హరి {మహాపన్న శరణ్యుడు - మహా (గొప్ప) ఆపన్న (ఆపదలను పొందినవారికి) శరణ్యుడు (శరణము నిచ్చువాడు), విష్ణువు}; ఓ = ఓ ; నిఖిలపావన = హరి {నిఖిల పావనుడు - నిఖిల (సమస్తమును) పావనుడు (పవిత్రము జేయువాడు), విష్ణువు}; అంచున్ = అనుచు; నుతించున్ = కీర్తించును; కాని = అంతే కాని; తాన్ = తను; కన్నులన్ = కళ్ళమ్మట; నీరు = కన్నీరు; తేడు = తీసుకురాడు; భయ = భయముచే; కంప = వణుకు; సమేతుడు = తోకూడినవాడు; కాడు = కాడు; భూవరా = రాజా {భూవర - భూమికి వరుడు(భర్త), రాజు}.
భావము:- ఓ ధర్మరాజా! ఇలా రాక్షసులు తనను ఎంత క్రుమ్మినా, ప్రహ్లాదుడు మాటిమాటికీ “ఓ శేషశయనా! ఓ రాక్షసాంతకా! ఓ లోకనాయకా! ఓ దీనరక్షాకరా! ఓ సర్వపవిత్రా!” అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు తప్పించి; కన్నీళ్ళు పెట్టటం లేదు; ఏ మాత్రం భయపడటం లేదు; కనీసం జంకటం లేదు.

82
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు;"ఘోరకృత్య" మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు;"కావరే" యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.
టీక:- పాఱడు = పారిపోడు; లేచి = లేచిపోయి; దిక్కుల్ = దూరప్రదేశముల; కున్ = కు; బాహువులు = చేతులు; ఒడ్డడు = అడ్డము పెట్టడు; బంధు = చుట్టముల; రాజి = సంఘము; లోన్ = లోకి; దూఱడు = ప్రవేశింపడు; ఘోర = ఘోరమైన; కృత్యము = కార్యము, పని; అని = అనుచు; దూఱడు = తిట్టడు; తండ్రిని = తండ్రిని; మిత్ర = స్నేహితుల; వర్గమున్ = సమూహమును; చీరడు = పిలువడు; మాతృ = తల్లుల; సంఘము = సమూహము; వసించు = ఉండెడి; సువర్ణ = బంగారు; గృహంబు = ఇంటి; లోని = లోపలి; కిన్ = కి; తాఱడు = దాగుకొనడు; కావరే = కాపాడండి; అనడు = అనడు; తాపమున్ = సంతాపమును; ఒందడు = పొందడు; కంటగింపడున్ = ద్వేషము చూపడు.
భావము:- ఆ రాక్షసులు ఎంత హింసిస్తున్నా ప్రహ్లాదుడు దూరంగా పారిపోడు; కొడుతుంటే చేతులు అయినా అడ్డం పెట్టుకోడు; చుట్టాల గుంపులోకి దూరి దాక్కోడు; ఇది “ఘోరం, అన్యాయం” అని తండ్రిని నిందించడు; స్నేహితులను సాయం రమ్మనడు; తన తల్లి, సవితి తల్లి మున్నగు తల్లులు నివాసం ఉండే బంగారు మేడల లోనికి పరుగెట్టి, “కాపాడండి” అని గోలపెట్టడు; అసలు బాధపడనే పడడు; వేదన చెందడు. తండ్రిని గానీ, బాధిస్తున్న రాక్షసులను కాని అసహాయంగా చూస్తున్న వారిని కానీ ఎవరినీ ద్వేషించడు; ఎంతటి విచిత్రం, ఇలాంటి పిల్లవాడు ఎక్కడైనా ఉంటాడా?

83
ఇట్లు సర్వాత్మకంబై యిట్టిదట్టి దని నిర్దేశింప రాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణుని యందుఁ జిత్తంబుజేర్చి తన్మయుం డయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు దన కింకరులచేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబు లైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సర్వాత్మకంబు = అఖిలము తానే యైనది; ఐ = అయ్యి; ఇట్టిదట్టిది = ఇలాంటిది అలాంటిది; అని = అని; నిర్దేశింపరాని = చెప్పలేనట్టి; పరబ్రహ్మంబు = పరబ్రహ్మము; తాన = తానే; ఐ = అయ్యి; ఆ = ఆ; మహా = గొప్ప; విష్ణుని = నారాయణుని {విష్ణువు - (విశ్వమంతట) వ్యాపించినవాడు, హరి}; అందున్ = అందు; చిత్తంబు = మనస్సును; చేర్చి = లగ్నముచేసి; తన్మయుండు = మైమరచినవాడు; అయి = అయ్యి; పరమ = అత్యధికమైన, సర్వాతీతమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; అందున్ = ఎడల; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన; కింకరుల = సేవకుల; చేతన్ = చేత; చేయించుచున్న = చేయిస్తున్నట్టి; మారణ = చంపెడి; కర్మంబులు = కార్యములు, పనులు; పాప = పాపపు; కర్ముని = పనులు చేయువారి; అందున్ = ఎడల; ప్రయుక్తంబులు = ప్రయోగింపబడినవి; ఐన = అయిన; సత్కారంబులున్ = సన్మానములు; పోలెన్ = వలె; విఫలంబులు = వ్యర్థములు; అగుటన్ = అగుట; చూచి = చూసి.
భావము:- ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణించలేని ఆ సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మము తానే అయ్యాడు. తన మనస్సును మహావిష్ణువు మీద నిలిపి తనను తానే మరచి తాదాత్మ్యం చెంది ఆనందంతో పరవశించి పోతున్నాడు. పాపాత్ముడి పట్ల చేసిన సన్మానాలు ఎలా వ్యర్థం అవుతాయో, అలా హిరణ్యకశిపుడు తన భటులచేత పెట్టిస్తున్న బాధలు అన్నీ విఫలం అయిపోతున్నాయి. ఇది చూసి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు.

84
"శూములన్ నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా
బాలుఁడు నేలపైఁ బడఁడు పాఱఁడు చావఁడు తండ్రినైన నా
పాలికి వచ్చి చక్రధరు క్షము మానితి నంచుఁ బాదముల్
ఫాము సోఁక మ్రొక్కఁ డనపాయత నొందుట కేమి హేతువో?"
టీక:- శూలములన్ = శూలములతో; నిశాచరులు = రాక్షసులు; స్రుక్కక = వెనుదీయక; దేహమున్ = శరీరమును; నిగ్రహింపగాన్ = దండింపగా, పొడవగా; బాలుడు = పిల్లవాడు; నేల = భూమి; పైన్ = మీద; పడడు = పడిపోడు; పాఱడు = పరిగెట్టడు; చావడు = మరణించడు; తండ్రిన్ = తండ్రిని; ఐన = అయిన; నా = నా; పాలి = వద్ద; కిన్ = కు; వచ్చి = వచ్చి; చక్రధరు = నారాయణుని; పక్షమున్ = పక్షమును; మానితిన్ = విడిచితిని; అంచున్ = అనుచు; పాదముల్ = కాళ్ళను; ఫాలము = నుదురు; సోకన్ = తగులునట్లు; మ్రొక్కడు = నమస్కరింపడు; అనపాయతన్ = ఆపదలు లేకపోవుట; ఒందుట = పొందుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువో = కారణమో.
భావము:- “ఇంత వీడు ఇంతమంది రాక్షసులు పగతో, పట్టుదలతో బరిసెలతో పొడుస్తుంటే, బాధలు భరించలేక క్రింద పడి దొర్లడు, పోనీ పారిపోడు, “చచ్చిపోతున్నా బాబోయ్” అనడు. కనీసం స్వంత తండ్రిని ఇక్కడే ఉన్నా కదా నా దగ్గరకి వచ్చి నేను ఇంక విష్ణువును ఆరాధించను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలపడడు. ఇలా ఏమాత్రం బాధ పొందకుండా, ప్రమాదం కలగకుండా ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటో తెలియటం లేదు.”

85
అని శంకించుచు.
టీక:- అని = అని; శంకించుచు = సందేహిస్తూ.
భావము:- ఇలా ఆలోచిస్తూ హిరణ్యకశిపుడు సందేహంలో పడ్డాడు.

86
కమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించి;
కెరలి డింభకునిఁ ద్రొక్కింపఁ బంపు;
నొకమాటు విషభీకరోరగ శ్రేణుల;
డువడి నర్భకుఁ ఱవఁ బంపు;
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన;
విసరి కుమారుని వ్రేయఁ బంపు;
నొకమాటు కూలంకషోల్లోల జలధిలో;
మొత్తించి శాబకు ముంపఁ బంపు;

విషముఁ బెట్టఁ బంపు; విదళింపఁగాఁ బంపు;
దొడ్డ కొండచఱులఁ ద్రోయఁ బంపుఁ;
ట్టి కట్టఁ బంపు; బాధింపఁగాఁ బంపు;
బాలుఁ గినిసి దనుజపాలుఁ డధిప!
టీక:- ఒకమాటు = ఒకమారు; దిక్కుంభి = దిగ్గజముల {అష్టదిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము అనెడి అష్టదిక్కు లందలి దివ్యమైన ఏనుగులు}; యూధంబున్ = గుంపును; తెప్పించి = తెప్పించి; కెరలి = చెలరేగి; డింభకుని = బాలుని; త్రొక్కింపన్ = తొక్కించుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; విష = విషము గలిగిన; భీకర = భయప్రదమైన; ఉరగ = పాముల; శ్రేణులన్ = వరుసలను; కడు = మిక్కిలి; వడిన్ = తీవ్రముగా; అర్భకున్ = బాలుని; కఱవన్ = కాటువేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; హేతి = మంటల; సంఘ = సమూహముతో; ఉగ్ర = భయంకరమైన; అనలము = అగ్ని; లోనన్ = లోనికి; విసిరి = విసిరేసి; కుమారునిన్ = పుత్రుని; వ్రేయన్ = పడవేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; కూలన్ = గట్టులను, చెలియలికట్టలను; కష = ఒరుసుకొనెడి; ఉల్లోల = పెద్ద అలలు గల; జలధి = సముద్రము; లోన్ = అందు; మొత్తించి = కొట్టించి; శాబకున్ = బాలుని; ముంపన్ = ముంచివేయుటకు; పంపున్ = పంపించును.
విషమున్ = విషమును; పెట్టన్ = పెట్టుటకు; పంపున్ = పంపించును; విదళింపగాన్ = చీల్చివేయుటకు; పంపున్ = పంపించును; దొడ్డ = పెద్ద; కొండచఱులన్ = కొండ చరియలనుండి; త్రోయన్ = తోసివేయుటకు; పంపున్ = పంపించును; పట్టి = పట్టుకొని; కట్టన్ = కట్టివేయుటకు; పంపున్ = పంపించును; బాధింపగాన్ = పీడించుటకు; పంపున్ = పంపించును; బాలున్ = పిల్లవానిని; కినిసి = కినుక వహించి; దనుజపాలుడు = రాక్షసరాజు; అధిప = రాజా.
భావము:- ధర్మరాజా! ఆ రాక్షసరాజుకి అనుమానంతో పాటు మరింత కోపం పెరిగిపోయింది. ఒకసారి, దిగ్గజాల లాంటి మదించిన ఏనుగులను తెప్పించి తన కొడుకును క్రింద పడేసి తొక్కించమని పంపాడు; ఇంకోసారి, అతి భీకరమైన అనేక పెద్ద విషసర్పాల చేత గట్టిగా కరిపించమని పంపించాడు; మరోసారి, ఆ పిల్లవాడిని భగభగ ఉగ్రంగా మంటలతో మండుతున్న అగ్నిగుండాలలో పడేయండి అన్నాడు; ఇంకోమాటు, ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని బాగా చితగ్గొట్టి, నడిసముద్రంలో ముంచేసి రండని చెప్పాడు; విషం పెట్టి చంపేయమన్నాడు; కత్తితో నరికేయమన్నాడు; ఎత్తైన కొండ శిఖరాల మీద నుంచి క్రింద లోయలలోకి తోసేయమన్నాడు; కదలకుండా కట్టిపడేయమన్నాడు;. అలా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి రకరకాల చిత్రహింసలు పెట్టించాడు

87
కవేళ నభిచార హోమంబు చేయించు;
నొకవేళ నెండల నుండఁ బంచు;
నొకవేళ వానల నుపహతి నొందించు;
నొకవేళ రంధ్రంబు లుక్కఁ బట్టు;
నొకవేళఁ దన మాయ నొదవించి బెగడించు;
నొకవేళ మంచున నొంటి నిలుపు;
నొకవేళఁ బెనుగాలి కున్ముఖుఁ గావించు;
నొకవేళఁ బాఁతించు నుర్వి యందు;

నీరు నన్నంబు నిడనీక నిగ్రహించు;
శల నడిపించు; ఱువ్వించు గండశిలల;
దల వ్రేయించు; వేయించు నశరములఁ;
గొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు.
టీక:- ఒకవేళ = ఒక సమయమున; అభిచార = మారణ, చిల్లంగి, శ్యేనయా గాది, హింసార్థమైన; హోమంబు = హోమములను; చేయించున్ = చేయించును; ఒకవేళ = ఒక సమయమున; ఎండలన్ = ఎండలలో; ఉండన్ = ఉండుటకు; పంచున్ = పంపించును; ఒకవేళ = ఒక సమయమున; వానలన్ = వానలలో; ఉపహతిన్ = ఉంచబడుటను; ఒందించున్ = పొందించును; ఒకవేళ = ఒక సమయమున; రంధ్రంబుల్ = నవరంధ్రములు; ఉక్కన్ = ఊపిరిసలపకుండగ; పట్టున్ = పట్టుకొనును; ఒకవేళ = ఒక సమయమున; తన = తన యొక్క; మాయన్ = మాయను; ఒదవించి = కలిగించి; బెగడించున్ = భయపెట్టును; ఒకవేళ = ఒక సమయమున; మంచునన్ = మంచు నందు; ఒంటిన్ = ఒంటరిగా; నిలుపున్ = నిలబెట్టును; ఒకవేళ = ఒక సమయమున; పెనుగాలి = పెనుగాలి; కిన్ = కి; ఉన్ముఖున్ = ఎదురుగానుండువాని; కావించున్ = చేయును; ఒకవేళ = ఒక సమయమున; పాతించున్ = పాతిపెట్టించును; ఉర్విన్ = మట్టి; అందున్ = లో.
నీరున్ = నీళ్ళు; అన్నంబున్ = ఆహారము; ఇడనీక = ఇవ్వనీయకుండగ; నిగ్రహించున్ = ఆపించును; కశలన్ = కొరడాలతో; అడిపించున్ = కొట్టించును; ఱువ్వించున్ = మీదకు విసిరించును; గండశిలలన్ = గండరాళ్ళతో; గదలన్ = గదలతో; వ్రేయించున్ = బాదించును; వేయించున్ = వేయించును; ఘన = పెద్ద; శరములన్ = బాణములతో; కొడుకున్ = కొడుకును; ఒకవేళ = ఒక సమయమున; అమరారి = రాక్షసుడు {అమరారి - అమరుల (దేవతల యొక్క) అరి (శత్రువు), రాక్షసుడు}; క్రోధి = కోపము గలవాడు; అగుచు = అగుచు.
భావము:- దేవతల పాలిటి శత్రువు అయిన ఆ హిరణ్యకశిపుడు అంతులేని కోపంతో కొడుకును సంహరించడం కోసం చేయరానివి అన్నీ చేసాడు. ఒకరోజు, మారణహోమం చేయించాడు, ఇంకో నాడు, మండుటెండలలో నిలువునా నిలబెట్టాడు, మరొక రోజు ఉపద్రవంగా కురుస్తున్న జడివానలోకి గెంటాడు. కుఱ్ఱ వాడి నవ రంధ్రాలు మూసి ఉక్కిరిబిక్కిరి చేయించాడు. మరొక నాడు, అంత చిన్న పసివాడికి తన మాయలు అన్నీ చూపించి భయపెట్టాడు. ఇంకోసారి, గడ్డ కట్టించే చలిగా ఉండే మంచులో ఒంటరిగా ఉంచేసాడు. మరొక రోజు, గాలిదుమారంలో ఎదురుగా నిలబెట్టేశాడు. మరొక సారి భూమిలో పాతి పెట్టేశాడు. ఆఖరుకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా కడుపు మాడిపించాడు. కొరడాలతో కొట్టించాడు. గదలతో మోదించాడు. చివరికి చిన్న పిల్లాడు అని చూడకుండా అతని మీదికి రాళ్లు రువ్వించాడు. బాణాలు వేయించాడు. అలా ఒళ్లు తెలియని క్రోధంతో కన్న కొడుకును ఆ క్రూర దానవుడు చేయరాని ఘోరాతి ఘోరాలు అన్నీ చేయించాడు.

88
మఱియు ననేక మారణోపాయంబులఁ బాపరహితుం డైన పాపని రూపుమాపలేక యేకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండయి రాక్షసేంద్రుండు దన మనంబున.
టీక:- మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; మారణ = చంపెడి; ఉపాయంబులన్ = ఉపాయములతో; పాప = పాపము; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; పాపని = బాలుని; రూపుమాపన్ = చంపివేయ; లేకన్ = అలవికాక; ఏకాంతంబునన్ = ఒంటరిగా; దురంత = దాటరాని; చింతా = వగపుచేత; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయ్యి; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో.
భావము:- అంతేకాక, ఏ పాపం ఎరుగని ఆ పసివాడైన ఆ ప్రహ్లాదుడిని, ఎలాగైనా చంపాలని ఎన్నో విధాల ప్రయత్నించాడు. కాని సాధ్యంకాలేదు. ఆ దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడు మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఇలా ఆలోచించసాగాడు.

89
ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ
బ్బించితి, శస్త్రరాజిఁ బొడిపించితి, మీఁద నిభేంద్రపంక్తి ఱొ
ప్పించితి; ధిక్కరించితి; శపించితి; ఘోరదవాగ్నులందుఁ ద్రో
యించితిఁ; బెక్కుపాట్ల నలయించితిఁ; జావఁ డి దేమి చిత్రమో
టీక:- ముంచితిని = ముంచివేసితిని; వార్ధులన్ = సముద్రములలో; గదలన్ = గదలతో; మొత్తితిన్ = మొత్తాను; శైల = పర్వత; తటంబుల్ = చరియల; అందున్ = అందునుండి; ద్రొబ్బించితిన్ = తోయింపించేను; శస్త్ర = కత్తుల; రాజిన్ = అనేకముచే; పొడిపించితిన్ = పొడిపించేను; మీదన్ = శరీరము పైకి; ఇభ = ఏనుగులలో; ఇంద్ర = గొప్పవాని; పంక్తిన్ = గుంపుచేత; ఱొప్పించితిన్ = తొక్కించితిని; ధిక్కరించితిన్ = బెదిరించితిని; శపించితిని = తిట్టితిని; ఘోర = భయంకరమైన; దవాగ్నులు = కార్చిచ్చులు; అందున్ = లో; త్రోయించితిన్ = తోయించితిని; పెక్కు = అనేకమైన; పాట్లన్ = బాధలచే; అలయించితిన్ = కష్టపెట్టితిని; చావడు = చనిపోడు; ఇది = ఇది; ఏమి = ఏమి; చిత్రమో = వింతయోకదా.
భావము:- “సముద్రాలలో ముంచింపించాను; గదలతో చావ మోదించాను; కొండలమీద నుంచి తోయించాను; కత్తులతో పొడిపించాను; క్రింద పడేసి ఏనుగులతో తొక్కింపించాను; కొట్టించాను; తిట్టించాను; ఎన్నో రకాలుగా బాధింపించాను; నిప్పుల్లోకి పడేయించాను; అయినా ఈ కుఱ్ఱాడు ప్రహ్లాదుడు చచ్చిపోడు. ఇదెంతో వింతగా ఉందే.

90
ఱుఁగఁడు జీవనౌషధము; లెవ్వరు భర్తలు లేరు; బాధలం
లఁడు నైజ తేజమునఁ; థ్యము జాడ్యము లేదు; మిక్కిలిన్
మెయుచు నున్నవాఁ; డొక నిమేషము దైన్యము నొందఁ డింక నే
తెఱఁగునఁ ద్రుంతు? వేసరితి; దివ్యము వీని ప్రభావ మెట్టిదో?
టీక:- ఎఱుగడు = తెలిసినవాడు కాడు; జీవన = మరణించకుండెడి; ఔషధములు = మందులను; ఎవ్వరున్ = ఎవరుకూడ; భర్తలు = రక్షించువారు; లేరు = లేరు; బాధలన్ = కష్టములకు; తఱలడు = చలించడు; నైజ = స్వాభావిక; తేజమునన్ = తేజస్సుతో; తథ్యము = నిశ్చయముగా; జాడ్యము = జడ్డుదనము; లేదు = లేదు; మిక్కిలిన్ = పెద్దగ; మెఱయుచున్ = ప్రకాశించుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఒక = ఒక; నిమేషమున్ = కొద్ది సమయ మైనా; దైన్యమున్ = దీనతను; ఒందడు = పొందడు; ఇంకన్ = ఇంకా; ఏ = ఎలాంటి; తెఱగునన్ = విధానములను; త్రుంతున్ = చంపగలను; వేసరితిన్ = విసిగిపోతిని; దివ్యము = చాలా గొప్పది; వీని = ఇతని; ప్రభావము = మహిమ; ఎట్టిదో = ఎలాంటిదో కదా.
భావము:- మరణంలేని మందులు (అమృతం) ఏమైనా తాగాడు అనుకుందా మంటే, అలాంటివి వీడికి తెలియదు కదా. పోనీ ఎవరైనా కాపాడుతున్నారా, అంటే అలాంటి వారు ఎవరూ లేరు. నిశ్చయంగా స్వభావసిద్ధంగానే వీనికి జాడ్యాలు అంటవేమో? బాధలు ఎన్ని పెట్టినా దేహ కాంతి తగ్గటం లేదు. ఏ నిమిషం దీనత్వం పొందడు. ఇంక ఈ ప్రహ్లాదుడిని ఎలా చంపాలి. ఎలాగో తెలియక విసుగొస్తోంది. ఇంతటి వీడి శక్తి చూస్తే, ఇదేదో దివ్యమైన ప్రభావంలా అనిపిస్తోంది.

91
అదియునుం గాక తొల్లి శునశ్శేఫుం డను మునికుమారుండు దండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుం డయి తండ్రి తనకు నపకారి యని తలంపక బ్రదికిన చందంబున.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; తొల్లి = పూర్వము; శునశ్శేపుండు = శునశ్శేపుడు; అను = అనెడి; ముని = మునుల; కుమారుండు = పుత్రుడు; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; యాగ = యజ్ఞమునకైన; పశుత్వంబున్ = బలిపశువు అగుట; కున్ = కు; దత్తుండు = ఇయ్యబడినవాడు; అయి = అయ్యి; తండ్రిన్ = తండ్రిని; తన = తన; కున్ = కు; అపకారి = హాని చేసినవాడు; అని = అని; తలపకన్ = భావించకుండగ; బ్రదికిన = ఆపదనుండి బయటపడిన; చందంబునన్ = విధముగ.
భావము:- పూర్వకాలంలో ఒక ముని అజీగర్తుడు అని ఉండేవాడు. శునశ్శేపుడు అతని నడిమి కొడుకు. ఆ తండ్రి ధనం కోసం తన నడిమి కొడుకును యాగ పశువుగా ఇచ్చేసేడట. అయినా కూడ ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి జీవించి ఉన్నాడట. అలాగే నా కొడుకు ప్రహ్లాదుడు కూడ ఉన్నాడే!

92
గ్రహమునఁ నేఁ జేసిన
నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్
విగ్రహము లనుచుఁ బలుకఁ డ
నుగ్రహములుగా స్మరించు నొవ్వఁడు మదిలోన్.
టీక:- ఆగ్రహమునన్ = కోపముతో; నేన్ = నేను; చేసిన = చేసినట్టి; నిగ్రహములు = దండనములు; పరుల = ఇతరుల; తోడన్ = తోటి; నెఱిన్ = వక్రతతో; ఒక = ఒక; నాడున్ = రోజున కూడ; విగ్రహములు = విరోధములుగా; పలుకడు = చెప్పడు; అనుగ్రహములు = సత్కారములు; కాన్ = అయినట్లు; స్మరించున్ = తలచును; నొవ్వడు = బాధపడడు; మది = మనసు; లోన = లోపల.
భావము:- అంతే కాకుండా, నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎక్కడా ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడు అంటూ చెప్పుకోడు. పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు. మనసులో కూడా బాధ పడడు. వీడి తత్వం ఏమిటో అర్థం కావటంలేదు.

93
కావున వీఁడు మహాప్రభావసంపన్నుండు వీనికెందును భయంబు లేదు; వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు" నని నిర్ణయించి చిన్నఁబోయి ఖిన్నుండై ప్రసన్నుండు గాక క్రిందు జూచుచు విషణ్ణుండై చింతనంబు జేయుచున్న రాజునకు మంతనంబునఁ జండామార్కు లిట్లనిరి.
టీక:- కావున = అందుచేత; వీడు = ఇతడు; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; సంపన్నుడు = సమృద్ధిగా గలవాడు; వీని = ఇతని; కిన్ = కి; ఎందున్ = ఎక్కడను; భయంబు = భయము; లేదు = లేదు; వీని = ఇతని; తోడి = తోటి; విరోధంబునన్ = శత్రుత్వముతో; తన = తన; కున్ = కు; మృత్యవు = మరణము; సిద్ధించును = కలుగును; అని = అని; నిర్ణయించి = నిశ్చయించుకొని; చిన్నబోయి = చిన్నతనముపడి; ఖిన్నుండు = దుఃఖించువాడు; ఐ = అయ్యి; ప్రసన్నుండు = సంతోషము గలవాడు; కాక = కాకుండగ; క్రిందు = కిందకు, నేలచూపులు; చూచుచున్ = చూచుచు; విషణ్ణుండు = విచారపడువాడు; ఐ = అయ్యి; చింతనంబు జేయుచున్న = ఆలోచించుతున్న; రాజున్ = రాజున; కున్ = కు; మంతనంబునన్ = ఏకాంతముగా, సంప్రదింపులలో; చండామార్కులు = చండామార్కులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి;
భావము:- ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, గొప్ప శక్తిమంతుడు. దేనికి భయపడడు.” అని ఆలోచించుకుని, “కనుక ఈ పిల్లాడితో విరోధం పెట్టుకుంటే తనకు మృత్యువు తప్ప” దని నిశ్చయించుకున్నాడు. అనవసరంగా ఈ పసివాడిని పెట్టిన బాధలు తలచుకుని చిన్నబుచ్చుకుంటూ, నేల చూపులు చూస్తూ బాధపడుతున్నాడు దానవేంద్రుడు. అప్పుడు హిరణ్యకశిపుడితో చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు.

94
"శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో
భ్రూయుగ్మ విజృంభణంబున దిగీవ్రాతముం బోరులన్
విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా విశ్వంబు వీఁ డెంత? యీ
భ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతం బొంద నీ కేటికిన్?
టీక:- శుభ్ర = పరిశుద్ధమైన; ఖ్యాతివి = కీర్తి కలవాడవు; నీ = నీ యొక్క; ప్రతాపము = పరాక్రమము; మహా = గొప్ప; చోద్యము = చిత్రము; దైత్యేంద్ర = రాక్షసరాజ; రోష = క్రోధముతో కూడిన; భ్రూ = కనుబొమల; యుగ్మ = జంట యొక్క; విజృంభణంబునన్ = విప్పారుటవలన; దిగీశ = దిక్పాలకుల {దిక్పాలురు - 1ఇంద్రుడు 2అగ్ని 3యముడు 4నిరృతి 5వరుణుడు 6వాయువు 7కుబేరుడు 8ఈశానుడు}; వ్రాతము = సమూహమునుకూడ; పోరులన్ = యుద్ధములలో; విభ్రాజితంబుగన్ = కలతపడినదిగ; చేసి = చేసి; ఏలితి = పాలించితివి; కదా = కదా; విశ్వంబున్ = జగత్తును; వీడు = ఇతడు; ఎంత = ఏపాటివాడు; ఈ = ఇట్టి; దభ్ర = అల్పపు; ఉక్తులు = పలుకులు; గుణ = మంచి; దోష = చెడులు కలుగుటకు; హేతువులు = కారణములు; చింతన్ = విచారమున; పొందన్ = పడుట; నీ = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.
భావము:- “ఓ రాక్షసేంద్రా! నీవు నిర్మలమైన కీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు యుద్ధంలో ఒక మాటు కనుబొమ్మలు కోపంతో చిట్లిస్తే చాలు దిక్పాలకులు సైతం భయపడిపోతారు. ఇలా ప్రపంచం అంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలావు. అంతటి నీకు పసివాడు అనగా ఎంత? ఈ మాత్రానికే ఎందుకు విచారపడతావు? ఇంతకు ఇతడు పలికే తెలిసీ తెలియని మాటలకు నువ్వు దిగులు పడటం దేనికి?”

95
క్రుండైన జనుండు వృద్ధ గురు సేవంజేసి మేధానయో
క్రాంతిన్ విలసిల్లు మీఁదట వయఃపాకంబుతో బాలకున్
క్రద్వేషణబుద్ధుఁ జేయుము మదిం జాలింపు మీ రోషమున్
శుక్రాచార్యులు వచ్చునంత కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్."
టీక:- వక్రుండు = వంకరబుద్ధి గలవాడు; ఐన = అయిన; జనుండు = వాడు; వృద్ధ = పెద్దలను; గురు = గురువులను; సేవన్ = సేవించుట; చేసి = చేసి; మేధః = బుద్ధి; నయః = నీతి; ఉపక్రాంతిన్ = ప్రారంభ మగుటచేత; విలసిల్లు = ప్రకాశించును; మీదటన్ = ఆ పైన; వయః = వయస్సు; పాకంబు = పరిపక్వమగుట; తోన్ = తో; బాలకున్ = పిల్లవానిని; శక్ర = ఇంద్రుని; ద్వేషణ = ద్వేషించెడి; బుద్ధున్ = బుద్ధి గలవానిని; చేయుము = చేయుము; మదిన్ = మనసున; చాలింపుము = ఆపుము; ఈ = ఈ; రోషమున్ = క్రోధమును; శుక్రాచార్యులు = శుక్రాచార్యులు; వచ్చున్ = వచ్చెడి; అంత = సమయమున; కున్ = కు; ఇతడున్ = ఇతడు కూడ; సు = మంచితనము యనెడి; శ్రీ = సంపద; యుతుండు = కలవాడు; అయ్యెడున్ = కాగలడు.
భావము:- “రాక్షసరాజా! ఎంతటి వంకర బుద్ధితో అల్లరిచిల్లరగా తిరిగేవాడు అయినా, పెద్దలు గురువులు దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా. ఆ తరువాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. ఇప్పుడు కోప్పడ వద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే లోపల మంచి గుణవంతుడు అవుతాడు. ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతారు.”

96
అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు "గృహస్థులైన రాజులకు నుపదేశింపఁ దగిన ధర్మార్థకామంబులు ప్రహ్లాదునకు నుపదేశింపుఁ" డని యనుజ్ఞ జేసిన, వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబు లైన ధర్మార్థకామంబులుఁ దనకు నగ్రాహ్యంబు లనియును వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబు గాని యాత్మభేదంబు లేదనియును ననర్థంబుల యందర్థకల్పన చేయుట దిగ్భ్రమం బనియు నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్ఠానంబులకుం బోయిన సమయంబున.
టీక:- అని = అని; గురుపుత్రులు = చండామార్కులు {గురుపుత్రులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పలికినన్ = చెప్పగా; రాక్షసేశ్వరుండు = రాక్షసరాజ; గృహస్థులు = వివాహమైనవారు; ఐన = అయినట్టి; రాజుల్ = రాజుల; కున్ = కు; ఉపదేశింపన్ = తెలుపుటకు; తగిన = అర్హమైన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములను; ప్రహ్లాదున్ = ప్రహ్లాదున; కున్ = కు; ఉపదేశింపుడు = తెలియజెప్పండి; అని = అని; అనుజ్ఞ = ఆనుమతి; చేసినన్ = ఇవ్వగా; వారున్ = వారు కూడ; అతని = అతని; కిన్ = కి; త్రివర్గంబున్ = ధర్మార్థకామములను; ఉపదేశించిన = చెప్పగా; అతండు = అతడు; రాగ = అనురాగము; ద్వేషంబుల = విరోధముల; చేతన్ = వలన; విషయ = ఇంద్రియార్థము లందు; ఆసక్తులు = ఆసక్తి గలవారు; ఐన = అయిన; వారల = వారి; కున్ = కి; గ్రాహ్యంబులు = గ్రహింపదగినవి; ఐన = అయిన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; తన = తన; కున్ = కు; అగ్రాహ్యంబులు = గ్రహింపదగినవి కాదు; అనియున్ = అని; వ్యవహార = వ్యవహారముల; ప్రసిద్ధి = మిక్కిలి సిధ్ధించుట; కొఱకు = కోసము; ఐన = అయిన; భేదంబు = భేదములే; కాని = తప్పించి; ఆత్మన్ = వానిలో; భేదంబు = భేదము; లేదు = లేదు; అనియున్ = అని; అనర్థంబులు = ప్రయోజనములుకాని వాని; అందున్ = లో; అర్థ = ప్రయోజనములను; కల్పన = ఊహించుకొనుట; చేయుట = చేయుట; దిగ్భ్రమంబు = భ్రాంతి; అనియున్ = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని; గురు = గురువులచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; శాస్త్రంబులు = చదువులు; మంచివి = మంచివి; అని = అని; తలంపక = భావింపక; గురువులు = గురువులు; తమ = తమ యొక్క; గృహస్థ = ఇంటి యందున్న; కర్మ = కార్యములను; అనుష్ఠానంబుల్ = చేయుట; కున్ = కు; పోయిన = వెళ్ళిన; సమయంబున = సమయము నందు.
భావము:- ఇలా శుక్రుని కొడుకులు బోధించి చెప్పటంతో, ఆ దానవ చక్రవర్తి శాంతించాడు. “వివాహమైన క్షత్రియులు నేర్వదగిన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి” అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు ఆవిధంగానే చెప్పసాగారు. కాని “నానా విధాలైన కోరికలు కలవారికి ఈ ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం కావాలి. కనుక ఈ గురువులు చెప్పే పాఠాలు మంచివి కావు. లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప, ఆత్మకు మాత్రం ఏ మార్పులు లేవు. ప్రయోజనం లేని వీటి గురించి ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే.” అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపాలు, తపాలు మున్నగు నిత్యకృత్యాలు కోసం వెళ్ళే సమయం గమనించాడు.

97
లకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాకులేంద్రకుమారుఁడు
పావమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై.
టీక:- ఆటల = క్రీడల; కున్ = కు; తన్ను = తనను; రమ్ము = రావలసినది; అని = అని; పాటించి = పట్టుపట్టి, బతిమాలి; నిశాట = రాక్షస; సుతులు = బాలురు; భాషించినన్ = అడుగగా; దోషాట = (దోషవర్తన గల) రాక్షస; కుల = వంశ; ఇంద్ర = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; పాటవమున = నేర్పుతో; వారిన్ = వారిని; చీరి = పిలిచి; ప్రజ్ఞ = తెలివి; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అతనితో చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోడానికి రమ్మని పిలిచారు. అప్పుడు దోషాచారులు దానవుల చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా ఇలా చెప్పసాగాడు.

98
"చెప్పఁ డొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్."
టీక:- చెప్పడు = తెలుపడు; ఒక = ఒక; చదువు = శాస్త్రము; మంచిది = మంచిది; చెప్పెడిన్ = చెప్పును; తగులములు = సాంసారిక బంధనములను; చెవులు = చెవులు; చిందఱగొనగాన్ = చెదిరిపోవునట్లు; చెప్పెడు = చెప్పును; మన = మన; ఎడన్ = అందు; ఒజ్జలు = గురువులు; చెప్పెదన్ = తెలిపెదను; ఒక = ఒకటి; చదువు = విద్యని; వినుడు = వినండి; చిత్తముల్ = మనసులు; అలరన్ = సంతోషించునట్లుగ.
భావము:- “ఓ స్నేహితులారా! మన గురువులు మన కెప్పుడు ఒక్క మంచి చదువు కూడ చెప్పటం లేదు కదా! ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను. వినండి.”

99
అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె.
టీక:- అని = అని; రాజ = రాజు యొక్క; కుమారుండు = పుత్రుడు; కావునన్ = కనుక; కరుణించి = దయచూపి; సంగటికాండ్ర = తోటివారి; తోడన్ = తోటి; నగియెడి = పరిహాసముల; చందంబునన్ = వలె; క్రీడలు = ఆటలు; ఆడుచున్ = ఆడుతూ; సమానవయస్కులు = ఒకే వయసు వారు; ఐన = అయిన; దైత్య = రాక్షస; కుమారుల్ = బాలకుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ఏకాంతమున = రహస్యముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- రాజకుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు తన దానవ సహాధ్యాయులతో చనువుగా ఇలా వారికి నచ్చచెప్పాడు. ఆడుతూ పాడుతూ వారితో కలిసిమెలిసి మెలగుతూ, వారందరికీ రహస్యంగా ఇలా బోధించాడు.

100
"బాకులార రండు మన ప్రాయపు బాలురు కొంద ఱుర్విపైఁ
గూలుట గంటిరే? గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రమున్
మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడిన్.
టీక:- బాలకులారా = పిల్లలూ; రండు = రండి; మన = మన; ప్రాయపు = వయసు కలిగిన, ఈడు; బాలురు = పిల్లలు; కొందఱు = కొంతమంది; ఉర్వి = భూమి; పైన్ = మీద; కూలుటన్ = మరణించుటను; కంటిరే = చూసితిరా; గురుడు = గురువు; క్రూరుడు = క్రూరమైనవాడు; అనర్థ = నివృత్తిశూన్యముల; చయంబున్ = సముదాయము; అందు = లో; దుశ్శీలతన్ = దుర్బుద్ధితో; అర్థ = ప్రయోజనముల; కల్పనమున్ = భ్రాంతిని; చేసెడిన్ = కలిగించుచున్నాడు; గ్రాహ్యములు = గ్రహింపదగినవి; కాదు = కాదు; శాస్త్రమున్ = విద్యను; మేలు = క్షేమమైనదానిని; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినిన = విన్నచో; మీ = మీ; కున్ = కు; నిరంతర = ఎడతెగని; భద్రము = శ్రేయము; అయ్యెడిన్ = కలుగును.
భావము:- “ఓ పిల్లలూ! ఇలా రండి. పనికిమాలిన విషయాలన్నీ దుర్భుద్ధితో దయమాలిన మన గురువులు వాటికి ప్రయోజనాలు ఉన్నట్లు కల్పించి శాస్త్రాలు అంటూ గొప్పగా మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగ్గవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించటం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి మీకు ఎడతెగని క్షేమ స్థైర్యాలు కలుగుతాయి.

101
వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు.
టీక:- వినుండు = వినండి; సకల = సమస్తమైన; జన్మంబులు = పుట్టువులు; అందును = లోను; ధర్మ = ధర్మము; అర్థ = సంపదల కైనవానిని; ఆచరణ = చేయుటకు; కారణంబు = వీలగునది; మానుష = మానవ; జన్మంబు = పుట్టుక; దుర్లభంబు = పొందరానిది; అందున్ = వానిలో; పురుషత్వంబు = మగవాడౌట; దుర్గమంబు = అందుకొనరానిది; అదియున్ = అదికూడ; శత = వంద (100); వర్ష = సంవత్సరములకు; పరిమితంబు = మించనిది; ఐన = అయిన; జీవిత = జీవించెడి; కాలంబునన్ = సమయములో; నియతంబు = కేటాయింపబడినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; సగము = సగము (1/2 వంతు); అంధకార = చీకటిచే; బంధురంబు = నిండినది; అయి = అయ్యి; రాత్రి = రాత్రి; రూపంబునన్ = రూపములో; నిద్ర = నిద్ర; ఆది = మొదలగు; వ్యవహారంబులన్ = పనులలో; నిరర్థకంబు = పనికిమాలినది; అయి = అయ్యి; చనున్ = జరిగిపోవును; చిక్కిన = మిగిలిన; పంచాశత్ = ఏభై (50); వత్సరంబులు = ఏళ్ళ; అందును = లోను; బాల = బాల్యము; కైశోర = కైశోరము; కౌమార = కౌమారము; ఆది = మొదలగు; వయః = వయస్సు యొక్క {అవస్థాష్టకము - 1కౌమారము (5సం.) 2పౌగండము(10సం.) 3కైశోరము(15సం.) 4బాల్యము (16సం), 5కారుణ్యము (25సం.) 6యౌవనము (50) 7వృద్ధము (70) 8వర్షీయస్త్వము (90), పాఠ్యంతరములు కలవు}; విశేషంబుల = భేదములచేత; వింశతి = ఇరవై (20); హాయనంబులు = సంవత్సరములు; గడచున్ = జరిగిపోవును; కడమన్ = చివరగా; ముప్పది = ముప్పై; అబ్దంబులు = సంవత్సరములు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = చేత; పట్టుబడు = నష్టపోవును; దురవగాహంబులు = తెలియరానిది; అయిన = ఐన; కామ = కామము; క్రోధ = క్రోధము; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; మాత్సర్యంబులు = మాత్సర్యములు; అను = అనెడి; పాశంబులన్ = బంధనములచే; కట్టుపడి = కట్టుపడి; విడివడన్ = బయటబడుటకు; సమర్థుండుగాక = చేతనైనవాడు; కాక = కాకుండి; ప్రాణంబుల్ = ప్రాణముల; కంటెన్ = కంటెను; మధురాయమాన = తీయనిదాని వలె నుండునది; ఐన = అయిన; తృష్ణ = అలవికాని ఆశ; కున్ = కు; లోను = వశము; ఐ = అయ్యి; భృత్య = సేవించుట; తస్కర = దొంగతనము చేయుట; వణిక్ = వర్తకపు; కర్మంబులన్ = పను లందు; ప్రాణహానిన్ = చావుని {ప్రాణహాని - ప్రాణములు హాని (నష్టమగుట), చావు}; ఐనన్ = అయినను; అంగీకరించి = ఒప్పుకొని; పర = ఇతరుల; అర్థంబులన్ = సొమ్మును, ధనములను; అర్థించుచు = కోరుతూ; రహస్య = రహస్యముగా చేసెడి; సంభోగ = సురత; చాతుర్య = నేరుపు; సౌందర్య = అందము యొక్క; విశేషంబుల = అతిశయములతో; ధైర్య = ధైర్యము యనెడి; వల్లికా = తీగలకు; లవిత్రంబులు = కొడవళ్ళు; అయిన = ఐన; కళత్రంబులను = భార్యలను; మహనీయ = గొప్పగా; మంజుల = సొగసైన; మధుర = తీయనైన; ఆలాపంబులున్ = పలుకులు; కలిగి = ఉండి; వశులు = స్వాధీనమున నుండువారు; అయిన = ఐన; శిశువులను = పిల్లలను; శీల = మంచి నడవడిక; వయః = ప్రాయము; రూప = అందమైన రూపములచే; ధన్యలు = కృతార్థులు; అగు = అయిన; కన్యలను = కూతుర్లను; వినయ = అణకువ; వివేక = తెలివి; విద్యా = చదువులతో; అలంకారులు = అలంకరింపబడినవారు; అయిన = ఐన; కుమారులనున్ = పుత్రులను; కామిత = కోరబడిన; ఫల = ప్రయోజనములను; ప్రదాతలు = ఒనగూర్చెడివారు; అగు = ఐన; భ్రాతలను = సోదరులను; మమత్వ = మమకారము; ప్రేమ = ప్రీతి; దైన్య = దీనత్వములను; జనకులు = కలిగించువారు; అయిన = ఐన; జననీజనకులను = తల్లిదండ్రులను; సకల = అఖిలమైన; సౌజన్య = మంచితనములకు; సింధువు = సముద్రము వంటివారు; అయిన = ఐన; బంధువులను = చుట్టములను; ధన = సంపదలు; కనక = బంగారము; వస్తు = వస్తువులు; సుందరంబులు = అందమైనవి; అయిన = ఐన; మందిరంబులను = ఇండ్లను; సుకరంబులు = సుఖములను కలిగించెడివి; ఐన = అయిన; పశు = పశువులు; భృత్య = సేవక; నికరంబులను = సమూహములను; వంశపరంపరాయత్త = వంశానుక్రమముగ; ఆయత్తంబులు = సంక్రమించినవి; అయిన = ఐన; విత్తంబులను = ధనములను; వర్జింపలేక = విడువజాలక; సంసారంబు = సంసారమును; నిర్జించు = జయించెడి, దాటు; ఉపాయంబున్ = ఉపాయమును; కానక = కనుగొనలేక; తంతు = దారముల; వర్గంబునన్ = గుంపులో; నిర్గమ = బయటపడెడి; ద్వార = ద్వారము; శూన్యంబు = లేనిది; అయిన = ఐన; మందిరంబున్ = నివాసమును; చేరి = ప్రవేశించి; చుట్టుపడి = చుట్టబెట్టుకొని; వెడలెడి = బయల్పడెడి; పాటవంబు = నేర్పు; చాలక = లేక; తగులుపడు = చిక్కుకొనిన; కీటకంబు = పురుగు; చందంబునన్ = వలె; గృహస్థుండు = గృహస్థుడు; స్వయం = తాను; కృత = చేసిన; కర్మ = కర్మములచే; బద్ధుండు = బంధనముల జిక్కినవాడు; ఐ = అయ్యి; శిశ్న = మైథున; ఉదర = భోజన; సుఖంబులన్ = సుఖము లందు; ప్రమత్తుండు = మిక్కిలి మత్తుగొన్నవాడు; అయి = అయ్యి; నిజ = తన; కుటుంబ = కుటుంబమును; పోషణ = పోషించుట యందు; పారవశ్యంబునన్ = ఒడలు మరచిపోవుటచే; విరక్తి = వైరాగ్య; మార్గంబున్ = మార్గమును; తెలియనేరక = తెలిసికొనలేక; స్వకీయ = తనది; పరకీయ = ఇతరులది యను; భిన్న = భేద; భావంబునన్ = బుద్ధితో; అంధకారంబునన్ = చీకటిలో; ప్రవేశించున్ = చేరును; కావున = కనుక; కౌమార = చిన్నతనపు; సమయంబునన్ = వయసులోనే; మనీషా = బుద్ధిబలమున; గరిష్ఠుండు = శ్రేష్ఠుండు; ఐ = అయ్యి; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవత; ధర్మంబులన్ = ధర్మములను; అనుష్ఠింపవలయును = ఆచరించవలెను; దుఃఖంబులు = దుఃఖములు; వాంఛితంబులు = కోరినవి; కాక = కాకుండగనే; చేకుఱ = కలిగెడి; భంగిన్ = విధముగనే; సుఖంబులును = సుఖములుకూడ; కాల = కాలమునకు; అనుసారంబులు = అనుసరించునవి; ఐ = అయ్యి; లబ్ధంబులు = దొరకునవి; అగున్ = అగును; కావున = కనుక; వృథా = వ్యర్థమైన; ప్రయాసంబునన్ = శ్రమతో; ఆయుః = జీవితకాలమును; వ్యయంబున్ = ఖర్చుపెట్టుట; చేయన్ = చేయుట; జనదు = తగదు; హరి = నారాయణుని; భజనంబునన్ = భక్తివలన; మోక్షంబు = ముక్తిపదము; సిద్ధించున్ = లభించును; విష్ణుండు = నారాయణుడు; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మ = తమలోనుండెడి; ఈశ్వరుండు = భగవంతుండు; ప్రియుండు = ఇష్ఠుడు; ముముక్షువు = మోక్షమును కోరెడివాడు; ఐన = అయిన; దేహికి = శరీరధారికి; దేహ = దేహము; అవసాన = తీరెడికాలము, మరణకాల; పర్యంతంబున్ = వరకు; నారాయణ = విష్ణుమూర్తి; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మముల; సేవనంబు = కైంకర్యము, సేవించుట; కర్తవ్యంబు = చేయవలసినది.
భావము:- ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు ఆయుర్దాయం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే ఏభై సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్ర మున్నగు వాటితో గడచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా ఇరవై సంవత్సరాలు వ్యయమౌతాయి. మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇంద్రియసుఖాలకు మానవుడు వశమై పోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే, జీవుల పాలిటి భయంకర శత్రువులు ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు; జీవుడు తన ప్రాణం కంటె తియ్యగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు; ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం ఆశిస్తూ ఉంటాడు; ఆ ధనం కోసం ఉద్యోగం, దొంగతనం, వ్యాపారం మున్నగు వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోడానికి అయినా సిద్ధపడతాడు; అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు; కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలూ, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులూ, మంచి నడతలు యౌవనం అందచందాలు కల కుమార్తెలూ, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులూ, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులూ, ప్రేమానురాగలతో జాలిగోలిపే తల్లిదండ్రులూ, అన్నివిధాలా మంచిగా మెలిగే బంధువులూ, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను; డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను; పశువులు, సేవకులు మున్నగు సంపదలను; ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయట పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు; కామం సౌఖ్యాదుల మత్తులో పడి, తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు; తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైత భావంతో చీకట్లో పడతాడు; అందుకనే, చిన్నప్పుడే కౌమార వయసునుండే బుద్ధిబలంతో పూర్తి భగవద్భక్తి, ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడ ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక, మానవుడు వాటికోసం ఎంతో విలువైన తన జీవితకాలాన్ని వృథా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునే వాడికి జీవితాతం వరకు, ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని.

102
కంటిరే మనవారు నులు గృహస్థులై;
విఫలులై కైకొన్న వెఱ్ఱితనము;
ద్రార్థులై యుండి పాయరు సంసార;
ద్ధతి నూరక ట్టుబడిరి;
లయోనులం దెల్ల ర్భాద్యవస్థలఁ;
బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ
న్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట;
ముట్టఁడు భవశతములకు నయిన

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
గతిఁ బుట్టి పుట్టి చ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.
టీక:- కంటిరే = చూసారా; మన = మన; వారు = వాళ్ళు; ఘనులు = గొప్పవారు; గృహస్థులు = కాపురస్థులు; ఐ = అయ్యి; విఫలులు = నిరర్థకులు; ఐ = అయ్యి; కైకొన్న = చేపట్టిన; వెఱ్ఱితనము = పూనిన మూఢత్వము; భద్రార్థులు = క్షేమము(ముక్తి) గోరినవారు; ఐ = అయ్యి; ఉండి = ఉన్నప్పటికిని; పాయరు = విడువరు; సంసార = సాంసారిక; పద్ధతిన్ = మార్గమును; ఊరక = అనవసరముగ; పట్టుబడిరి = చిక్కుకొనిరి; కలయోనులు = లోకమున ఉన్న గర్భములు; అందున్ = లోని; ఎల్ల = అన్నిటను; గర్భా = గర్భవాసము {గర్భాది - 1పుట్టుట 2ఉండుట 3పెరుగుట 4మారుట 5క్షీణించుట 6నశించుట}; ఆది = మొదలగు; అవస్థలన్ = అవస్థలను; పురుషుండు = మానవుడు; దేహి = శరీరధారి; ఐ = అయ్యి; పుట్టుచుండున్ = జన్మించుచుండును; తన్ను = తననుతాను, ఆత్మను; ఎఱుంగడు = తెలిసికొనలేడు; కర్మ = కర్మములకు; తంత్రుడు = వశమైనవాడు; ఐ = అయ్యి; కడపటన్ = అంతు; ముట్టడు = చేరలేడు; భవ = జన్మములు; శతముల = వందలకొలది; కున్ = గా; అయిన = జరిగినను.
దీనన్ = దీనివలన; శుభము = శ్రేయస్సు; లేదు = లేదు; దివ్య = దివ్యమైన; కీర్తియున్ = కీర్తికూడ; లేదు = లేదు; జగతిన్ = ప్రంపంచము నందు; పుట్టిపుట్టి = మరలమరల పుట్టి; చచ్చిచచ్చి = మరలమరల మరణించి; పొరలన్ = పొర్లుట; ఏల = ఎందులకు; మన = మన బాలకు లందరం; కున్ = కు; పుట్టని = పుట్టుటన్నది లేని; చావని = చావు అన్నది లేని; త్రోవన్ = మార్గమును; వెదకికొనుట = వెతుకుకొనుట; దొడ్డబుద్ధి = ఉత్తమమైన ఆలోచన.
భావము:- మీరు చూస్తూనే ఉన్నారు కదా! మన వారు అందరు బలదర్పసంపన్నులు అయిన గొప్ప వారే. కాని పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులై వెఱ్ఱితనం విడిచిపెట్టరు. ఆనందం కోరుకుంటారు కాని సంసారం అనే ఊబిలో ఊరకే కూరుకుపోతారు. పునర్జన్మలు అనేకం పొందుతూ రకరకాల స్త్రీల గర్భాలలో పడి నానా అవస్థలు పడుతూ, పుడుతూ, చస్తుంటారు. వందల కొద్దీ జన్మలెత్తినా ఈ కర్మబంధాలలో నుండి విముక్తి పొందలేడు. ఈ బాధలు అన్నీ మనకెందుకు? అసలు పుట్టుక అనేదీ, చావు అనేదీ లేని మంచి దారి వెతుక్కోవటం తెలివైన పని కదా!

103
హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే.
టీక:- హాలా = కల్లు, సారాయి; పాన = తాగుటచే; విజృంభమాణ = చెలరేగిన; మద = మదము; గర్వ = గర్వము; అతీత = మితిమీరిన; దేహ = శరీర మందు; ఉల్లసత్ = ఎగసిన; బాలా = జవ్వనుల; ఆలోకన = చూపు లనెడి; శృంఖలా = సంకెలల; నిచయ = సమూహములచే; సంబద్ధాత్ముడు = బాగా బంధింపబడినవాడు; ఐ = అయ్యి; లేశమున్ = కొంచెము కూడ; వేలా = గట్టునకు; నిస్సరణంబు = తరించుటను; కానక = కనుగొనలేక; మహా = గొప్ప; విద్వాంసుండున్ = పండితుడు కూడ; కామినీ = స్త్రీ యొక్క; హేలా = విలాసముచే; ఆకృష్ట = ఆకర్షించబడిన; కురంగ = లేడి; శాబకము = పిల్ల; అగున్ = అయిపోవును; హీన = నీచమైన; స్థితిన్ = గతిని; వింటిరే = విన్నారా.
భావము:- ఈ విషయం వినే ఉంటారు. ఎంత గొప్పపండితుడు అయినా మధువు త్రాగి, ఆ మత్తులో ఒళ్ళు మరచి కన్నులు తెరవ లేకుండా అయిపోతాడు; ఆడువారి వాలుచూపులు అనే సంకెళ్ళలో చిక్కి పోతాడు; ఆడుకొనే పెంపుడు లేడిపిల్లల లాగ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు; అతి విలువైన తన జీవితకాలం వృథా అయిపోతున్నది కూడ గమనించలేడు. అలా ఉచ్ఛస్థితి నుండి హీనస్థితి లోకి దిగజారిపోతాడు. వ్యసనాల వలన ఎంత దుర్గతి కలుగుతుందో చూసారు కదా.

104
విషయసక్తులైన విబుధాహితుల తోడి
నికి వలదు ముక్తిమార్గవాంఛ
నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త
సంగజనులఁ గూడి శైశవమున.
టీక:- విషయ = ఇంద్రియార్థము లందు; సక్తులు = తగులములు గలవారు; ఐన = అయిన; విబుధాహితుల = రాక్షసుల {విబుధాహితులు - విబుధ (దేవతలకు) అహితులు (శత్రువులు), రాక్షసులు}; తోడి = తోటి; మనికి = జీవితము; వలదు = వద్దు; ముక్తి = మోక్షమును చేరెడి; మార్గ = పద్ధతి; వాంఛన్ = కోరికతో; ఆదిదేవున్ = మూలకారణమైన దేవుని; విష్ణున్ = నారాయణుని; ఆశ్రయింపుడు = ఆశ్రయించండి; ముక్త = వదలబడిన; సంగ = తగులములు కలిగిన; జనులన్ = వారని; కూడి = చేరి; శైశవమునన్ = చిన్నతనముననే.
భావము:- కోరికలలో కూరుకు పోయే వారూ, జ్ఞానులకు నచ్చని వారూ అయిన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరే వారు కాదు. వారితో స్నేహం మనకి వద్దు. ఈ చిన్న వయసులోనే మోక్షమార్గం కోరుకోండి. దానికోసం ముక్తి మార్గంలో పయనించే మంచి వారితో స్నేహం చేస్తూ, ఆది దేవుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించండి.

105
కావున విషయంబులఁ జిక్కుపడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబుగాదు; రమ్యమయ్యును బహుతరప్రయాసగమ్య మని తలంచితిరేనిఁ జెప్పెద; సర్వభూతాత్మకుండై సర్వదిక్కాలసిద్ధుండై బ్రహ్మ కడపలగాఁగల చరాచరస్థూల సూక్ష్మజీవసంఘంబు లందును నభోవాయు కుంభినీ సలిలతేజంబు లనియెడు మహాభూతంబుల యందును భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును గుణసామ్యం బయిన ప్రధానమందును గుణవ్యతికరంబైన మహత్తత్త్వాది యందును రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవికల్పితుండు ననిర్దేశ్యుండు నయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయచేత నంతర్హితైశ్వరుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు, భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపందగి వికల్పితుండై యుండు; తత్కారణంబున నాసురభావంబు విడిచి సర్వభూతంబు లందును దయాసుహృద్భావంబులు గర్తవ్యంబులు; దయాసుహృద్భావంబులు గల్గిన నధోక్షజుండు సంతసించు; అనంతుం డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు; జనార్దన చరణసరసీరుహయుగళ స్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులుఁ గాంక్షితంబై సిద్ధించు మోక్షంబు నేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్క దండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబులైన వేదంబువలనం బ్రతిపాద్యంబులు; నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమపురుషుండైన హరికి నాత్మసమర్పణంబు జేయుట మేలు; పరమాత్మతత్త్వ జ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి జేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మవికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబులభంగిం దథ్యం బనక మిథ్య యని తలంచు" నని మఱియు ప్రహ్లాదుం డిట్లనియె.
టీక:- కావునన్ = కనుక; విషయంబులన్ = ఇంద్రియార్థము లందు; చిక్కుపడిన = తగులకొన్న; రక్కసుల = రాక్షసుల; కున్ = కు; హరి = నారాయణుని; భజనంబున్ = సేవించుట; శక్యంబు = అలవియైనది; కాదు = కాదు; రమ్యము = చక్కటిది; అయ్యును = అయినప్పటికిని; బహుతర = చాలా ఎక్కువ {బహు - బహుతరము - బహుతమము}; ప్రయాస = కష్టముపడుటచే; గమ్యము = చేరగలది; అని = అని; తలంచితిరి = భావించితిరి; ఏనిన్ = అయినచో; చెప్పెదన్ = తెలిపెదను; సర్వ = సమస్తమైన; భూత = జీవులు; ఆత్మకుండు = తానే; ఐ = అయ్యి; సర్వ = ఎల్ల; దిక్ = ప్రదేశములందు; కాల = కాలములందు; సిద్ధుండు = ఉండువాడు; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; కడపలన్ = వరకు; కల = ఉన్నట్టి; చర = చరములు; అచర = స్థిరములు; స్థూల = పెద్దవి; సూక్ష్మ = చిన్నవి యైన; జీవ = ప్రాణుల; సంఘంబుల్ = సమూహముల; అందును = లోను; నభః = ఆకాశము; వాయుః = గాలి; కుంభినీ = పృథివి; సలిల = నీరు; తేజంబులు = అగ్నులు; అనియెడు = అనెడి; మహాభూతంబులన్ = పంచమహాభూతముల {పంచమహాభూతములు - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని)}; అందును = లోను; భూత = పంచభూతముల; వికారంబులు = వికారములచే నేర్పడినవి; అయిన = ఐనట్టి; ఘటపటాదులు = కుండ గుడ్డ మొదలైనవాని; అందును = లోను; గుణ = గుణములకు; సామ్యంబు = తుల్యమైనది; అయిన = ఐన; ప్రధానము = ప్రకృతి; అందును = లోను; గుణ = గుణముల; వ్యతికరంబు = మేళనములుగలవి; ఐన = అయిన; మహతత్త్వాది = మహతత్త్వము మున్నగు వాని; అందును = లోను; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమోగుణంబుల = తమోగుణముల; అందును = లోను; భగవంతుండు = నారాయణుడు {భగవంతుడు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము అనెడి గుణషట్కములచే పూజ్యుడు, విష్ణువు}; అవ్యయుండు = నారాయణుడు {అవ్యయుడు - నాశములేనివాడు, విష్ణువు}; ఈశ్వరుండు = నారాయణుడు {ఈశ్వరుడు - స్వభావముచేతనే ఐశ్వర్యముగలవాడు, విష్ణువు}; పరమాత్మ = పరమాత్మ; పరబ్రహ్మము = పరబ్రహ్మము; అనియెడు = అని; వాచక = పలకబడెడి; శబ్దంబులు = పేర్లు; కల్గి = ఉండి; కేవల = కేవలమైన; అనుభవ = అనుభవగోచరమైన; ఆనంద = ఆనందమే; స్వరూపకుండున్ = రూపముగాగలవాడు; అవికల్పితుండు = హరి {అవికల్పితుడు - వికల్పము (భ్రాంతి, మారుదల) లేనివాడు, విష్ణువు}; అనిర్దేశ్యుండున్ = హరి {అనిర్దేశ్యుడు - ఇట్టివాడు యని నిశ్చయించ చెప్ప నలవిగానివాడు, విష్ణువు}; అయిన = అయిన; పరమేశ్వరుండు = హరి {పరమేశ్వరుడు - పరమ (అత్యధికమైన) ఈశ్వరుడు, విష్ణువు}; త్రిగుణ = త్రిగుణములే {త్రిగుణములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = స్వరూపము; ఐన = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; మాయ = మాయ; చేతన్ = వలన; అంతర్హిత = మరుగుపడిన; ఐశ్వర్యుండు = వైభవముగలవాడు; ఐ = అయ్యి; వ్యాప్య = వ్యాపించదగినది; వ్యాపక = వ్యాపంచెడిది; రూపంబులన్ = స్వరూపముల; చేసి = వలన; దృశ్యుండు = చూడదగినవాడు; ద్రష్ట = చూచువాడు; భోగ్యుండు = అనుభవింప దగినవాడు; భోక్త = అనుభవించువాడు; అయి = అయి; నిర్దేశింపన్ = నిర్ణయించుటకు; తగి = యుక్తమై; వికల్పితుండు = రూపకల్పన చేయబడినవాడు; ఐ = అయ్యి; ఉండు = ఉండును; తత్ = ఆ; కారణంబునన్ = కారణముచేత; అసుర = రాక్షస; భావంబున్ = స్వభావమును; విడిచి = వదలివేసి; సర్వ = ఎల్ల; భూతంబుల = జీవుల; అందును = ఎడల; దయా = కరుణ; సుహృత్ = స్నేహ; భావంబులు = దృష్టి; కర్తవ్యంబులు = చేయదగినవి; దయా = కరుణ; సుహృత్ = స్నేహ; భావంబులు = దృష్టి; కల్గినన్ = కలిగినట్లైన; అధోక్షజుండు = నారాయణుడు {అధోక్షజుడు - వ్యు.అధోక్షజం – ఇంద్రియ జ్ఞానమ్, అధి – అధరమ్, అధి + అక్షజం యస్య – అధోక్షజం. బ.వ్రీ., వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞనము అసమర్థమైనదో అతడు. (వాచస్పతము), ఇంద్రియజన్య జ్ఞానమును క్రిందుపరచువాడు, సమస్త ఇంద్రియాలకు ఆగోచరుడు, విష్ణువు}; సంతసించున్ = సంతోషించును; అనంతుండు = నారాయణుడు {అనంతుడు - అంతము (తుది) లేనివాడు, విష్ణువు}; ఆద్యుండు = నారాయణుడు {ఆద్యుడు - (సృష్టికి) ఆది (మొదటినుండి) ఉన్నవాడు, విష్ణువు}; హరి = నారాయణుడు {హరి - పాపములను హరించు వాడు, విష్ణువు}; సంతసించినన్ = సంతోషించినచో; అలభ్యంబు = పొందరానిది; ఎయ్యదియున్ = ఏదికూడ; లేదు = లేదు; జనార్దన = నారాయణుని {జనార్దనుడు - వ్యు. జనన మరణాద్యర్థియతీ - నాశయతీతి, జనన మరణములను పోగొట్టు వాడు, (వాచస్పతము) జనులను రక్షించువాడు, విష్ణువు}; చరణ = పాదములనెడి; సరసీరుహ = పద్మముల; యుగళ = జంటను; స్మరణ = ధ్యానము యనెడి; సుధారస = అమృతపు; పాన = తాగుటచే; పరవశులము = మైమరచినవారము; ఐతిమేని = అయినచో; మన = మన; కున్ = కు; దైవ = దైవ; వశంబునన్ = నిర్ణయము ప్రకారము; అకాంక్షితంబులు = కోరబడనివి, అయాచితములు; ఐ = అయ్యి; సిద్ధించున్ = లభించును; ధర్మార్థకామంబులున్ = ధర్మార్థకామములు; కాంక్షితంబు = కోరబడినది; ఐ = అయ్యి; సిద్ధించున్ = లభించును; మోక్షంబున్ = ముక్తిపదము; అనన్ = అనగా; ఏల = ఎందులకు; త్రివర్గంబును = ధర్మార్థకామములు; ఆత్మవిద్యయున్ = బ్రహ్మజ్ఞానము; తర్క = తర్కశాస్త్రము; దండనీతి = శిక్షాస్మృతి; జీవిక = బ్రతుకుతెరువులు; ఆదులు = మొదలైనవి; అన్నియున్ = సర్వమును; త్రైగుణ్య = త్రిగుణముల యొక్క {త్రిగుణములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; విషయంబులు = స్వరూపములను చెప్పెడివి; ఐన = అయిన; వేదంబు = వేదముల; వలనన్ = వలన; ప్రతిపాద్యంబులు = చెప్పబడినవి; నిస్త్రైగుణ్య = త్రిగుణాతీతమైన; లక్షణంబునన్ = నైజములచే; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - పరమ (అత్యుత్తమమైన) పురుషుడు, విష్ణువు}; ఐన = అయిన; హరి = నారాయణుని; కిన్ = కి; ఆత్మ = తననుతాను; సమర్పణంబు = పూర్తిగా అర్పించుకొనుట; చేయుట = చేయుట; మేలు = ఉత్తమము; పరమాత్మ = పరమాత్మ యొక్క; తత్త్వజ్ఞానము = తత్త్వజ్ఞానము; ఉదయంబునన్ = కలుగుట; చేసి = వలన; స్వ = నేను; పర = ఇతరుడు; భ్రాంతి = అను పొరపాటుభావము; చేయక = పడక; పురుషుండు = మానవుడు; యోగవధూ = యోగముతోకూడిన; అవధూత = అవధూత యొక్క {అవధూత - కదిలింపబడినవాడు, కేవల బ్రహ్మజ్ఞానపరుడై వర్ణాశ్ర మాదులను పరిహరించిన సన్యాసి}; తత్త్వంబునన్ = జ్ఞానముచేత; ఆత్మ = ఆత్మ యందలి; వికల్ప = ఉపాధికముల; భేదంబునన్ = భేదముచేత; కల = స్వప్నము; లోన్ = లోను; కన్న = చూసిన; విశేషంబుల్ = సంగతుల; భంగిన్ = వలె; తథ్యంబు = నిజమైనవి; అనక = అనకుండ; మిథ్య = బూటకము; అని = అని; తలంచున్ = భావించును; అని = అని; మఱియున్ = ఇంకను; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- స్నేహితులారా! అందుకే ఇంద్రియాలకు చెందిన విషయాలు అయిన కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు విష్ణుభక్తి అలవడదు. ఈ భక్తిమార్గం చాలా బావుంది కాని, చాలా ప్రయాస పడాలి అనుకోకండి. అలా కాదు, చెప్తాను వినండి ప్రాణులు అందరిలోనూ, దిక్కులు అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. పరబ్రహ్మ పరాకాష్ఠగా ఉన్న ఈ లోకంలో చరాచర జీవాలు, కంటికి కనిపించ నంత చిన్న వాటి నుండి పెద్ద జంతువులు వరకు సమస్తం; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలు; వీటిలో నుంచి పుట్టిన కుండ, గుడ్డ వంటి సమస్తమైన వస్తువులు అన్నిటిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. గుణాలతో నిండి ఉన్న మూల ప్రకృతిలోనూ: త్రిగుణాలకు అతీతమైన మహత్తత్వం లోనూ; రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనే త్రిగుణాలు లోనూ దేవుడు ఉన్నాడు. ఆయననే భగవంతుడు అనీ, అవ్యయుడు అనీ, ఈశ్వరుడు అనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా చెప్తారు. ఆనంద స్వరూపుడు అయిన ఆ ప్రభువు కేవలం అనుభవంచేత మాత్రమే తెలుసుకోగలం. ఆయనకు ఎట్టి మార్పు ఉండదు; ఇలాంటిది అని నిరూపించ గల రూపం ఉండదు; పరమ పురుషుడు సత్త్వ రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింప జేసేటువంటి రూపాలతో చూడబడేవాడు, చూసేవాడూ, అనుభవించబడు వాడు, అనుభవించే వాడు తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు. అందుకే జీవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా అయితే భగవంతుడు మెచ్చుకుంటాడు. అధోక్షజుడు, శాశ్వతమైన వాడు, పురాణ పురుషుడు శ్రీహరి అయిన ఆ విష్ణుమూర్తి తృప్తి చెందితే లభించనది ఏదీ ఉండదు. జనార్దనుడు అయిన హరి పాదకమల స్మరణ అనే అమృతం త్రాగి పరవశులం అయితే మనకు ఆ జనార్దనుని దయ వలన కోరకుండానే ధర్మం, అర్థం, కామం సమస్తం లభిస్తాయి. కాంక్షిస్తే మోక్షం కూడ లభిస్తుంది అని వేరే చెప్పనక్కరలేదు. ధర్మం, అర్థం, కామం, తర్కం, దండనీతి లాంటి జీవితావసర విషయాలు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. నిస్వార్థంతో, ఎలాంటి కోరికలు లేకుండా త్రిగుణాతీతుడైన విష్ణువునకు హృదయమును సమర్పించటం మంచిది. పరమాత్మ తత్వం తెలుసుకున్న పురుషుడు తను వేరని, మరొకరు వేరని భ్రాంతి చెందడు. భేద భావం పాటించడు. అటువంటి వ్యక్తి మహా యోగి ఆత్మతత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో, అలాగే ఈ లోకం కూడ నిజం కాదని తెలుసుకుంటాడు.” అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.

106
"రుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డింతయున్
రుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం జేసె మున్;
రిభక్తాంఘ్రిపరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్
తత్త్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ జ్ఞానమున్.
టీక:- నరుడు = నరుడుయనెడి ఋషి; తానునున్ = తను; మైత్రి = స్నేహము; తోన్ = తోటి; మెలగుచున్ = తిరుగుచు; నారాయణుండు = నారాయణుడనెడి ఋషి; ఇంతయున్ = ఇదంతా; వరుసన్ = క్రమముగా; నారద = నారదుడు యనెడి; సంయమి = మునులలో; ఈశ్వరున్ = గొప్పవాని; కున్ = కి; వ్యాఖ్యానమున్ = వివరించి చెప్పుట; చేసెన్ = చేసెను; మున్ = ఇంతకు పూర్వము; హరి = నారాయణ; భక్త = భక్తులయొక్క; అంఘ్రి = పాదముల; పరాగ = ధూళిచేత; శుద్ధ = పరిశుద్ధమైన; తనులు = దేహములు గలవారు; ఏకాంతుల్ = గహనమైన భక్తి గలవారు; మహాకించనుల్ = సర్వసంగవర్జితులు; పరతత్త్వజ్ఞులు = పరతత్త్వము తెలిసినవారు; కాని = తప్పించి ఇతరులు; నేరరు = సమర్థులు కారు; మదిన్ = మనసున; భావింపన్ = ఊహించుటకైనను; ఈ = ఈ; జ్ఞానమున్ = జ్ఞానమును.
భావము:- “పురాతన కాలంలో నరనారాయణులు అవతరించి మైత్రితో భూలోకంలో మెలగుతూ ఉన్నప్పుడు, నారాయణ మహర్షి ఈ జ్ఞానాన్ని నారద మహర్షికి బోధించాడు. హరి భక్తుల పాదధూళితో పవిత్రులు అయిన మహాత్ములూ, ఏకాగ్రచిత్తులూ, నిరాడంబరులూ, పరతత్వం తెలిసిన వాళ్లూ తప్పించి ఈ విషయాన్ని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు.

107
తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహామునివలన సవిశేషం బయిన యీ జ్ఞానంబును బరమభాగవతధర్మంబును వింటి" ననిన వెఱఁగు పడి దైత్యబాలకు ల ద్దనుజ రాజకుమారున కిట్లనిరి.
టీక:- తొల్లి = పూర్వము; నేను = నేను; దివ్యదృష్టి = దివ్యదృష్టి {దివ్యదృష్టి - భూతభవిష్యద్వర్తమానములు చూడగల దృష్టి, అతీంద్రియ విషయములను తెలుసుకొనగల జ్ఞానము}; కల = కలిగిన; నారద = నారదుడు యనెడి; మహా = గొప్ప; ముని = మహర్షి; వలనన్ = వలన; సవిశేషంబు = ఎల్లరహస్యములతోకూడినట్టిది; అయిన = ఐన; ఈ = ఈ; జ్ఞానంబున్ = విద్యను; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవత; ధర్మంబును = ధర్మమును; వింటిని = విన్నాను; అనిన = అనగా; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైత్య = రాక్షసుల; బాలకుల్ = పిల్లలు; ఆ = ఆ; దనుజరాజకుమారుని = ప్రహ్లాదుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇంతకు పూర్వం నేను దివ్యదృష్టి సంపన్నుడైన నారద మహర్షి వలన ఈ విశిష్టమైన జ్ఞానమునూ, పరమ భాగవతుల ధర్మములనూ తెలుసుకున్నాను.” అని అనగానే, వింటున్న తోటి రాక్షస బాలకులు ఆ దానవ రాకుమారుడు అయిన ప్రహ్లాదుడిని ఇలా అడిగారు.

108
"మంటిమి కూడి, భార్గవకుమారకు లొద్ద ననేక శాస్త్రముల్
వింటిమి. లేఁడు సద్గురుఁడు వేఱొకఁ డెన్నఁడు, రాజశాల ము
క్కంటికి నైన రాదు చొరఁగా, వెలికిం జన రాదు, నీకు ని
ష్కంకవృత్తి నెవ్వఁడు ప్రల్భుఁడు చెప్పె? గుణాఢ్య! చెప్పుమా.
టీక:- మంటిమి = బ్రతికితిమి; కూడి = కలిసి; భార్గవకుమారకుల = చండామార్కుల {భార్గవకుమారకులు - భార్గవ (శుక్రుని) కుమారకులు (పుత్రులు), చండామార్కులు}; ఒద్దన్ = దగ్గర; అనేక = అనేకమైన; శాస్త్రముల్ = శాస్త్రములను; వింటిమి = తెలుసుకొంటిమి; లేడు = లేడు; సత్ = మంచి; గురుడు = గురువు; వేఱొకడున్ = ఇంకొకడు; ఎన్నడున్ = ఎప్పుడును కూడ; రాజశాల = అంతఃపురము; ముక్కంటి = మూడుకన్నులుగల శివుని; కిన్ = కి; ఐనన్ = అయినను; రాదు = సాధ్యముకాదు; చొరగాన్ = ప్రవేశించుటకు; వెలి = వెలుపలి; కిన్ = కి; చనన్ = వెళ్ళుటకు; రాదు = వీలులేదు; నీ = నీ; కున్ = కును; నిష్కంటక = అడ్డులేని {నిష్కంటకము - కంటకము (ముల్లు)లు లేనిది, అడ్డులేనిదారి}; వృత్తిన్ = విధముగ; ఎవ్వడు = ఎవడు; ప్రగల్భుడు = ప్రతిభగలవాడు, ధీరుడు; చెప్పెన్ = చెప్పెను; గుణాఢ్య = సుగుణములుచే శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
భావము:- “ఓ సుగుణశీలా! ప్రహ్లాదా! మనం అందరం ఇక్కడే పుట్టి ఇక్కడే కలిసి పెరిగాం. భర్గుని వంశస్థులు శుక్రాచార్యుని కుమారులు చండామార్కులు వద్ద కలిసి అనేక శాస్త్రాలు చదువుకున్నాం. మరొక గొప్ప గురువు ఎవరిని మనం ఎరగం. పైగా నువ్వు రాకుమారుడువు, చండశాసనుడు అయిన మన మహారాజ అనుమతి లేకుండా రాజాంతఃపురము లోనికి ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేడు. బయటకు పోనూ పోలేడు. అలాంటప్పుడు ఏ అడ్డూ ఆపూ లేకుండా, నీకు ఈ విషయాలు అన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు. అన్నీ వివరంగా చెప్పు.

109
సేవింతుము నిన్నెప్పుడు
భావింతుము రాజ వనుచు హుమానములం
గావింతుము తెలియము నీ
కీ వింతమతిప్రకాశ మే క్రియఁ గలిగెన్."
టీక:- సేవింతుము = సేవించెదము; నిన్నున్ = నిన్నే; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; భావింతుము = అనుకొనెదము; రాజవు = (నీవే) రాజువు; అనుచున్ = అనుచు; బహు = అనేకమైన; మానములన్ = గౌరవములను; కావింతుము = చేసెదము; తెలియుము = తెలియచెప్పుము; నీ = నీ; కున్ = కును; ఈ = ఈ; వింత = అద్భుతమైన; మతిన్ = జ్ఞానము; ప్రకాశము = తెలియుట; ఏ = ఏ; క్రియన్ = విధముగ; కలిగెన్ = కలిగెను.
భావము:- ప్రహ్లాదా! మేము ఎప్పుడు నీతోటే ఉంటాము. నువ్వే మా రాజు వని రకరకాలుగా గౌరవిస్తూనే ఉంటాము. కానీ నీ వింతటి మహనీయుడవు అని ఇప్పటిదాకా మాకు తెలియదు. ఈ విచిత్రమైన జ్ఞానం నీకు ఎలా లభించింది. వివరంగా చెప్పు.”

110
అని యిట్లు దైత్యనందనులు దన్నడిగినఁ బరమభాగవత కులాలంకారుం డైన ప్రహ్లాదుండు నగి తనకుఁ బూర్వంబునందు వినంబడిన నారదు మాటలు దలంచి యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; దైత్య = రాక్షస; నందనులు = బాలురు; తన్నున్ = తనను; అడిగిన = అడుగుగా; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవతుల; కుల = సమూహమునకు; అలంకారుండు = అలంకారము వంటివాడు; ఐన = అయిన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; నగి = నవ్వి; తన = తన; కున్ = కును; పూర్వమున్ = ఇంతకు పూర్వము; అందు = అందు; వినంబడిన = చెప్పబడిన; నారదు = నారదుని యొక్క; మాటలు = ఉపదేశములను; తలంచి = గుర్తుచేసుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా తన సహాధ్యాయులైన దానవ బాలకులు అడుగగా, పరమ భాగవతుడు, మహా భక్తుడు అయిన ప్రహ్లాదుడు నవ్వి, ఇంతకు పూర్వం నారదుని ద్వారా తాను విన్న తత్వం గుర్తుకు తెచ్చుకుని ఇలా చెప్పాడు.

ప్రహ్లాదుని జన్మంబు

111
"క్షీణోగ్ర తపంబు మందరముపై ర్థించి మా తండ్రి శు
ద్ధక్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగి చందంబునన్
క్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు మున్
క్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.
టీక:- అక్షీణ = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; తపంబున్ = తపస్సును; మందరము = మందర పర్వతము; పై = మీద; అర్థించి = కోరి; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; శుద్ధ = పరమ; క్షాంతిని = శాంతితో; చని = వెళ్ళి; ఉండన్ = ఉండగా; చీమ = చీమల; గమి = బారు; చేతన్ = వలన; భోగి = పాము; చందంబునన్ = వలె; భక్షింపన్ = తినబడెను, నశించెను; పూర్వ = పూర్వజన్మలలో సంపాదించుకొన్న; పాపముల = పాపముల; చేన్ = వలన; పాపాత్మకుండు = పాప స్వరూపి; అంచున్ = అనుచు; మున్ = ఇంతకు పూర్వము; రక్షస్ = రాక్షసుల; సంఘమున్ = సమూహము; మీదన్ = పైన; నిర్జరుల్ = దేవతలు; సంరంభించి = ఉత్సాహించి; యుద్ధ = యుద్ధమును; అర్థులు = చేయగోరువారు; ఐ = అయ్యి.
భావము:- “పూర్వం మా తండ్రి ఘోరమైన తపస్సు చేయటానికి మందరపర్వతము మీదికి ప్రశాంత చిత్తంతో వెళ్ళాడు. చాలాకాలం రాకుండా అక్కడే ఉన్నాడు. దేవత లందఱు “ఇక హిరణ్యకశిపుడు చీమల బారిన పడిన పాము లాగ తన పాపాలచే తానే నాశన మయ్యాడు.” అని అందరు కలిసి రాక్షసుల పైకి యుద్ధానికి సంసిద్ధులు అయి బయలుదేరారు.

112
ప్రస్థానోచిత భేరిభాంకృతులతోఁ బాకారియుం దారు శౌ
ర్యస్థైర్యంబుల నేగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతులై
స్వస్థేమల్ దిగనాడి పుత్ర ధన యోషా మిత్ర సంపత్కళా
ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై.
టీక:- ప్రస్థాన = ప్రయాణ; ఉచిత = యోగ్యమైన; భేరీ = భేరీల; భాంకృతుల = భాం యనెడి శబ్దములు చేసెడివి; తోన్ = తోటి; పాకారి = ఇంద్రుడు {పాకారి - పాకాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు}; తారున్ = తాము (దేవతలు); శౌర్య = పరాక్రమముతోను; స్థైర్యంబులన్ = ధైర్యములతోను; ఏగుదెంచినన్ = రాగా; తదీయ = వారి; ఆటోప = సంరంభమునకు; విభ్రాంతులు = వెరచినవారు; ఐ = అయ్యి; స్వ = తమ; స్థేమల్ = స్థితులను; దిగనాడి = వదలి; పుత్ర = కుమారులు; ధన = ధనము; యోషా = స్త్రీలు; మిత్ర = స్నేహితులు; సంపత్ = సంపదలు; కళా = తేజస్సులు; ప్రస్థానంబులు = కదలికలు; డించి = దిగవిడిచి; పాఱిరి = పారిపోయిరి; అసురుల్ = రాక్షసులు; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడుకొనుటకు; ఉద్యుక్తులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి.
భావము:- జైత్రయాత్రకు తగిన సన్నాహంతో యుద్ధభేరీలు మ్రోగాయి. ఇంద్రుడు దేవతలూ యుద్ధోత్సాహంతో ఆవేశంతో దండు వెడలి వచ్చి పడ్డారు. రాక్షసులు అందరూ ఆ ధాటికి తట్టుకోలేక తమ భార్యాబిడ్డలను, బంధుమిత్రులనూ, ధనధాన్యాలనూ విడిచి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని పారిపోయారు.

113
ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం
గొల్ల బెట్టి సమస్త విత్తముఁ గ్రూరతం గొని పోవఁగా
నిల్లు చొచ్చి విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా
ల్లిఁ దాఁ జెఱఁబట్టె సిగ్గునఁ ప్తయై విలపింపఁగాన్.
టీక:- ప్రల్లదనంబునన్ = పౌరుషముతో; వేల్పులు = దేవతలు; ఉద్ధతిన్ = అతిశయించి; పాఱి = పరుగెట్టుకు వెళ్ళి; రాజనివాసమున్ = రాచనగరిని; కొల్లబెట్టి = కొల్లగొట్టి; సమస్త = అఖిలమైన; విత్తమున్ = ధనమును; క్రూరతన్ = క్రూరముగా; కొనిపోవగాన్ = తీసుకొనిపోవుచుండగా; ఇల్లున్ = ఇంటి యందు; చొచ్చి = దూరి; విశంకుడు = జంకులేనివాడు; ఐ = అయ్యి; అమరేశ్వరుండు = ఇంద్రుడు; అదలించి = భయపెట్టి; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; తాన్ = తను; చెఱబట్టె = బంధించెను; సిగ్గున = సిగ్గుతో; తప్త = కాగిపోయినది; ఐ = అయ్యి; విలపింపగాన్ = ఏడుస్తుండగా.
భావము:- దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే ఆక్రమించారు. సర్వ సంపదలూ, ధనాగారం సమస్తం దోచేశారు. దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరబట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు.

114
ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సురేంద్రుండు = దేవేంద్రుడు; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; చెఱన్ = బందీగా; కొనిపోవుచుండన్ = తీసుకొనిపోవుచుండగా; ఆ = ఆ; ముగుద = ముగ్ధ; కురరి = ఆడులకుముకి; అను = అనెడి; పులుగు = పిట్ట; క్రియన్ = వలె; మొఱలిడినన్ = ఆర్తధ్వానములు చేయుచుండ; తెరువునన్ = దారిలో; దైవ = దేవుని; యోగంబున = వశముచేత; నారదుండు = నారదుడు; పొడగని = కనుగొని, చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా మా తల్లిని చెరబట్టి ఇంద్రుడు తీసుకుపోతుంటే ఆమె ఆడు లకుముకిపిట్ట లాగ రోదించింది. అదృష్టవశాత్తు దైవయోగం కలిసి వచ్చి దారిలో నారదమహర్షి ఇదంతా చూశాడు. అప్పుడు నారదమహర్షి ఇంద్రుడితో ఇలా అన్నాడు.

115
"స్వర్భువనాధినాథ! సురత్తమ! వేల్పులలోన మిక్కిలిన్
నిర్భరపుణ్యమూర్తివి సునీతివి మానినిఁ బట్ట నేల? యీ
ర్భిణి నాతురన్ విడువు ల్మషమానసురాలు గాదు నీ
దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరి పై."
టీక:- స్వర్భువనాధినాథ = ఇంద్ర {స్వర్భువనాధినాథుడు - స్వర్భువన (స్వర్గలోకపు) అధినాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; సురసత్తమ = ఇంద్ర {సురసత్తముడు - సుర (దేవలలో) సత్తముడు (సామర్థ్యము గలవాడు), ఇంద్రుడు}; వేల్పులు = దేవతల; లోనన్ = అందు; మిక్కిలి = అధికమైన; నిర్భర = గాఢమైన; పుణ్య = పుణ్యము గల; మూర్తివి = స్వరూపము గలవాడవు; సునీతివి = మంచి నీతిమంతుడవు; మానినిన్ = స్త్రీని; పట్టన్ = బంధిచుట; ఏల = ఎందుకు; ఈ = ఈ; గర్భిణిన్ = గర్భవతిని; ఆతురన్ = శోకము చెంది నామెను; విడువు = వదలిపెట్టు; కల్మష = చెడు; మానసురాలు = మనసు గలామె; కాదు = కాదు; నీ = నీ యొక్క; దుర్భర = భరింపరాని; రోషమున్ = క్రోధమును; నిలుపు = ఆపుకొనుము; దుర్జయుడు = జయింపరానివాడు; ఐన = అయిన; నిలింపవైరి = రాక్షసుని {నిలింవైరి - నిలింప (దేవతా) వైరి (శత్రువు), రాక్షసుడు}; పై = మీద.
భావము:- “ఓ దేవేంద్రా! నువ్వేమో దేవతలలో శ్రేష్ఠుడివి; పుణ్యమూర్తివి; నీతిమంతుడవు; స్వర్గ లోకానికే అధిపతివి; ఇలా నువ్వు పరస్త్రీని పట్టుకుని రావటం తప్పు కదా; ఈమె పాపాత్మురాలు కాదు; పైగా ఈమె గర్భవతి; నీ కోపం ఏం ఉన్నా హిరణ్యకశిపుడి మీద చూపించు. అంతేకాని ఈమె పై కాదు. వెంటనే భయార్తురాలు అయిన ఈమెను విడిచిపెట్టు.”

116
అనిన వేల్పుఁదపసికి వేయిగన్నులు గల గఱువ యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వేల్పుదపసి = దేనఋషి; కిన్ = కి; వేయిగన్నులుగలగఱువ = ఇంద్రుడు {వేయిగన్నులుగలగఱువ - వేయి (వెయ్యి, 1000) కన్నులు గల గఱువ (ఘనుడు), ఇంద్రుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- దేవర్షి నారదులవారు ఇలా చెప్పగా వేయి కన్నులున్న దేవర ఇలా అన్నాడు.

117
"అంనిధాన మైన దితిజాధిపువీర్యము దీని కుక్షి న
త్యం సమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁ దత్ప్రసూతి ప
ర్యంము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రము ధారఁ ద్రుంచి ని
శ్చింతుఁడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్."
టీక:- అంత = నాశనమునకు; నిధానము = కారణమైనవాడు; ఐన = అయిన; దితిజాధిపు = రాక్షసరాజు యొక్క; వీర్యము = రేతస్సు; దీని = ఈమె యొక్క; కుక్షిన్ = కడుపులో; సమృద్ధిన్ = మిగులవృద్ధిని; ఒందెడిన్ = పొందుచున్నది; మహాత్మక = గొప్పఆత్మకలవాడ; కావునన్ = అందుచేత; తత్ = ఆ; ప్రసూతి = పురుటి; పర్యంతమున్ = వరకు; బద్ధన్ = బంధీని; చేసి = చేసి; జనిత = పుట్టిన; అర్భకున్ = పిల్లవానిని; వజ్రము = వజ్రాయుధము; ధారన్ = పదునుతో; త్రుంచి = నరికి; నిశ్చింతుడను = దిగులులేనివాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; విడుతున్ = విడిచిపెట్టెదను; సిద్ధము = నిశ్చయముగ; దానవ = రాక్షస; రాజ = రాజు యొక్క; వల్లభన్ = భార్యను.
భావము:- “ఓ మహాత్ముడా! లోకాలకు దుస్సహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి, పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది. ఈ రాక్షసరాజు పత్నిని చివరికి విడిచిపెట్టేస్తాను.”

118
అని పలికిన వేల్పులఱేనికిం దపసి యిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = పలుకగా; వేల్పులఱేని = ఇంద్రున {వేల్పులఱేడు - వేల్పుల(దేవతల) ఱేడు (ప్రభువు), ఇంద్రుడు}; కిన్ = కు; తపసి = ముని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన ఆ దేవతల రాజు దేవేంద్రుడితో మహా తపశ్శాలి అయిన నారదుడు ఇలా అన్నాడు.

119
"నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా
ర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై."
టీక:- నిర్భీతుండు = భయములేనివాడు; ప్రశస్త = శ్రేష్ఠుడైన; భాగవతుడున్ = భాగవతుడు; నిర్వైరి = శత్రుత్వములేనివాడు; జన్మాంతర = పూర్వజన్మలనుండి; ఆవిర్భూత = పుట్టిన; అచ్యుత = నారయణుని; పాద = పాదములందలి; భక్తి = భక్తి యొక్క; ప్రభావ = ప్రభావముతో; ఆవిష్టుండు = కూడినవాడు; దైత్య = రాక్షసుని; అంగన = భార్య యొక్క; గర్భస్థుడు = కడుపునగలవాడు; అగు = అయిన; బాలకుండు = పిల్లవాడు; బహు = అనేక విధములైన; సంగ్రామ = యుద్ధము; ఆది = మొదలగు; ఉపాయంబులన్ = ఉపాయములచేత; దుర్భావంబున్ = నికృష్టత్వమును; పొంది = పొంది; చావడు = మరణించడు; భవత్ = నీ యొక్క; దోర్దండ = బాహుబలమునకు; విభ్రాంతుడు = తికమకనొందినవాడు; ఐ = అయ్యి.
భావము:- “దానవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య కడుపులో పెరుగుతున్న వాడు భయం అన్నది లేని వాడు. మహా భక్తుడు. పరమ భాగవతోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మజన్మల నుంచీ హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహా మహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు, అతనిని చంపలేవు కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు.”

120
అని దేవముని నిర్దేశించిన నతని వచనంబు మన్నించి తానును హరిభక్తుండు గావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుం జనియె; మునీంద్రుండును మజ్జనని యందుఁ బుత్రికాభావంబు జేసి యూఱడించి; నిజాశ్రమంబునకుం గొనిపోయి "నీవు పతివ్రతవు, నీ యుదరంబునఁ బరమభాగవతుండయిన ప్రాణి యున్నవాఁడు తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి రాఁగలం; డందాక నీ విక్కడ నుండు" మనిన సమ్మతించి.
టీక:- అని = అని; దేవముని = దేవర్షి; నిర్దేశించినన్ = చెప్పగా; అతని = అతని; వచనంబులు = మాటలు; మన్నించి = గౌరవించి; తానును = తను కూడ; హరి = నారాయణుని; భక్తుండు = భక్తుడు; కావునన్ = కనుక; దేవేంద్రుండు = ఇంద్రుడు; భక్తి = భక్తిమూలకమైన; బాంధవంబునన్ = బంధుత్వముతో; మా = మా యొక్క; అవ్వను = తల్లిని; విడిచి = వదలి; వలగొని = ప్రదక్షిణముచేసి; సురలోకంబున్ = స్వర్గలోకమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; ముని = మునులలో; ఇంద్రుండును = శ్రేష్ఠుడు; మత్ = నా యొక్క; జనని = తల్లి; అందు = ఎడల; పుత్రికా = కుమార్తె యనెడి; భావంబున్ = తలంపు; చేసి = చేసి; ఊఱడించి = ఊరుకోబెట్టి; నిజ = తన; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; కొనిపోయి = తీసుకు వెళ్ళి; నీవు = నీవు; పతివ్రతవు = పతిభక్తిగల యిల్లాలువి; నీ = నీ యొక్క; ఉదరంబునన్ = కడుపులో; పరమ = అతిపవిత్రమైన; భాగవతుండు = భాగవతుడు; అయిన = ఐనట్టి; ప్రాణి = జీవుడు; ఉన్నవాడు = ఉన్నాడు; తపస్ = తపస్సుయొక్క; మహత్వంబునన్ = గొప్పదనముచేత; కృతార్థుండు = నెరవేరినపనిగలవాడు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; పెనిమిటి = భర్త; రాగలండు = వచ్చును; అందాక = అప్పటివరకు; నీవు = నీవు; ఇక్కడ = ఇక్కడ; ఉండుము = ఉండుము; అనినన్ = అనగా; సమ్మతించి = అంగీకరించి.
భావము:- ఇంద్రుడు నారదమహర్షి చెప్పిన ఆ మాటలను ఆమోదించాడు. మా అమ్మకు నమస్కారం చేసి, విడిచిపెట్టాడు. తాను కూడ విష్ణుభక్తుడే కాబట్టి ఆ భక్తి బంధుత్వంతో మా అమ్మకు ప్రదక్షిణ చేసి తన దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారదమహర్షి మా తల్లిని కూతురుగా భావించి, ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. “అమ్మా! నువ్వు పరమ పతివ్రతవు. నీ కడుపులో మహాభక్తుడు అయిన జీవుడు ఒకడు పెరుగుతున్నాడు. నీ భర్త తపస్సు చేసి తప్పక వరాలు పొంది తిరిగి వస్తాడు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు” అని నారదుడు ధైర్యం చెప్పాడు. మా అమ్మ అంగీకరించింది.

121
యోషారత్నము నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై
యీద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ చేయుచు నుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్.
టీక:- యొషా = స్త్రీలలో; రత్నము = రత్నమువంటి యామె; నాథదైవత = పతివ్రత {నాథ దైవత - నాథ (భర్తయే) దైవత (భగవంతునిగ గలది), పతివ్రత}; విశాల = విరివి యైన; ఉద్యోగ = సంకల్పము గలామె; మా = మా యొక్క; తల్లి = తల్లి; నిర్వైషమ్యంబునన్ = విషమ భావములు లేకుండగ; నాథు = భర్త యొక్క; రాకన్ = ఆగమనమును; మది = మనసు; లోన్ = అందు; వాంఛించి = కోరి; నిర్దోష = ఏపాపములులేనిది; ఐ = అయ్యి; ఈషత్ = కొంచెము కూడ; భీతియున్ = భయమేమి; లేక = లేకుండ; గర్భ = గర్భమును; పరిరక్ష = కాపాడుకొనెడి; ఇచ్ఛన్ = తలపుతో; విచారించి = ఆలోచించుకొని; శుశ్రూషల్ = సేవలను; చేయుచునుండెన్ = చేయుచుండెను; నారదున్ = నారదుని; కున్ = కి; సువ్యక్త = చక్కగావ్యక్తమగు; శీలంబునన్ = మంచినడవడికతో.
భావము:- మహిళారత్నము, మహా పతివ్రతా, సుసంకల్ప అయిన మా అమ్మ లీలావతి, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకుండా, భర్తనే దైవంగా భావిస్తూ, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని క్షేమం కోరుకుంటూ, నారదమహర్షికి సేవలు చేస్తూ, ఏ బెదురు లేకుండా, మేలైన నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది.

122
ఇట్లు దనకుఁ బరిచర్య జేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షావిశారదుం డైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండ నైన నన్ను నుద్దేశించి ధర్మతత్త్వంబును నిర్మలజ్ఞానంబును నుపదేశించిన, నమ్ముద్ధియ దద్ధయుం బెద్దకాలంబునాఁటి వినికి గావున నాడుది యగుటం జేసి పరిపాటి దప్పి సూటి లేక మఱచె; నారదుఁడు నా యెడఁ గృప గల నిమిత్తంబున.
టీక:- ఇట్లు = ఇలా; తన = తన; కున్ = కు; పరిచర్య = సేవ; చేయుచున్న = చేస్తున్న; దైత్య = రాక్షస; రాజ = రాజు యొక్క; కుటుంబిని = భార్య; కిన్ = కి; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షా = కాపాడుట యందు; విశారదుండు = మిక్కిలి నేర్పు గలవాడు; ఐన = అయిన; నారదుండు = నారదుడు; నిజ = స్వంత; సామర్థ్యంబునన్ = శక్తిచేత; అభయంబున్ = అభయమును; ఇచ్చి = ఇచ్చి; గర్భస్థుండన్ = కడుపులో నున్నవాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; ఉద్దేశించి = గురించి; ధర్మ = ధర్మము యొక్క; తత్త్వంబును = స్వరూపమును; నిర్మల = రాగాది కలుషితము గాని; జ్ఞానంబును = జ్ఞానమును; ఉపదేశించినన్ = బోధింపగా; ఆ = ఆ; ముద్దియ = స్త్రీ; దద్దయున్ = మిక్కిలి; పెద్ద = ఎక్కువ; కాలంబున్ = కాలము; నాటి = పూర్వపు; వినికి = విన్నసంగతి; కావునన్ = కనుక; ఆడుది = ఆడమనిషి; అగుటన్ = అగుట; చేసి = వలన; పరిపాటిన్ = అభ్యాసము; తప్పి = తప్పి; సూటి = గుఱి; లేక = లేకపోవుటచే; మఱచెన్ = మరచిపోయెను; నారదుడు = నారదుడు; నా = నా; ఎడన్ = అందు; కృప = దయ; కల = ఉండుట; నిమిత్తంబునన్ = వలన.
భావము:- ఆశ్రిత జన రక్షకుడు అయిన నారదుడు, మా అమ్మ చేస్తున్న సేవను ఎంతో మెచ్చుకున్నాడు. తన శక్తికొలది కడుపులో పెట్టుకొని కాపాడాడు. నా యందు మిక్కిలి దయగలవాడు కనుక నాకు చెప్పవలెను అనే తలపుతో, మా తల్లికి స్వచ్ఛమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు. కానీ స్త్రీ కావటం వలన, చాలా కాలం గడిచిపోవడం వలన, అభ్యాసం లేకపోవడం వలన మా అమ్మ ఇప్పుడు అవన్నీ మరచిపోయింది.

123
వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్.
టీక:- వెల్లిగొని = బయటకి వచ్చిన; నాటి = దినము; నుండియున్ = నుండి; ఉల్లసితంబు = వికసించినది; ఐన = అయిన; దైవ = అదృష్ట; యోగంబునన్ = సంయోగమువలన; శోభిల్లెడున్ = ప్రకాశించుచున్నది; ముని = ఋషి యొక్క; మతము = తత్త్వార్థము; అంతయున్ = సమస్తమును; ఉల్లంబునన్ = మనసులో; మఱపు = మరచిపోవుట; పుట్టదు = కలుగదు; ఒకనాడు = ఒకమాటు; ఐనన్ = అయినను.
భావము:- నారదమహర్షికి నా మీద ఉన్న దయవలన, దైవయోగం కలిసిరావటంవలన, నాకు మాత్రం వారి యొక్క ఆ ఉపదేశాలు అన్నీ పుట్టిననాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడ ఒక్కటి కూడ నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయి.”

124
వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని
తుల కయిన బాల నుల కయినఁ
దెలియ వచ్చు మేలు దేహాద్యహంకార
ళననిపుణ మైన పసిమతము."
టీక:- వినుడు = వినండి; నాదు = నా యొక్క; పలుకు = మాట; విశ్వసించితిరేని = నమ్మినచో; సతుల్ = స్త్రీల; కున్ = కు; అయిన = ఐన; బాల = పిల్ల; జనుల్ = వారి; కిన్ = కి; అయిన = ఐన; తెలియన్ = తెలియను; వచ్చున్ = అగును; మేలు = మంచిది, శ్రేయము; దేహ = దేహము; ఆది = మొదలగు; అహంకార = మమత్వమును; దళన = పోగొట్టునది; ఐన = అయిన; తపసి = ఋషిచే తెలుపబడిన; మతము = తత్వము.
భావము:- శ్రద్దగా వినండి చెప్తాను. నా మాట నమ్మండి. నారద మహర్షి తత్వం తెలుసుకోడానికి స్త్రీలు, బాలలు కూడ అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి. ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది.”

125
అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డిట్లనియె; “ఈశ్వరమూర్తి యైన కాలంబునం జేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబు లయిన తెఱంగున దేహంబులకుం గాని షడ్భావవికారంబు లాత్మకు లేవు; ఆత్మ నిత్యుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకు నాశ్రయుండుఁ గ్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టిహేతువు వ్యాపకుండు నిస్సంగుండుఁ బరిపూర్ణుండు నొక్కండు నని వివేకసమర్థంబు లగు "నాత్మలక్షణంబులు పండ్రెండు" నెఱుంగుచు, దేహాదులందు మోహజనకంబు లగు నహంకార మమకారంబులు విడిచి పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన కనక లేశంబులైన పాషాణాదులందుఁ బుటంబుపెట్టి వహ్నియోగంబున గరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయు భంగి నాత్మకృత కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన యుపాయంబునం జేసి బ్రహ్మభావంబుఁ బడయు; మూలప్రకృతియు మహదహంకారంబులును బంచతన్మాత్రంబులు నివి యెనిమిదియుం "బ్రకృతు" లనియును, రజ స్సత్త్వ తమంబులు మూఁడును "బ్రకృతిగుణంబు" లనియుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబు లైన శ్రవణ నయన రసనా త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీ సలిల తేజో వాయు గగనంబులును నివి "పదాఱును వికారంబు" లనియును, గపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పబడియె; సాక్షిత్వంబున నీ యిరువదే డింటిని నాత్మగూడి యుండు; పెక్కింటి కూటువ దేహ; మదియు జంగమస్థావరరూపంబుల రెండువిధంబు లయ్యె; మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై మణిగణంబులఁ జొచ్చి యున్న సూత్రంబు చందంబున నాత్మ యన్నింటి యందునుం జొచ్చి దీపించు; ఆత్మకు జన్మ స్థితి లయంబులు గల వంచు మిథ్యాతత్పరులు గాక వివేకశుద్ధమైన మనంబునం జేసి దేహంబునం దాత్మ వెదకవలయు; ఆత్మకు "నవస్థలు" గలయట్లుండుఁ గాని యవస్థలు లేవు జాగరణ స్వప్న సుషుప్తు లను "వృత్తు" లెవ్వనిచేత నెఱుంగంబడు నతం డాత్మ యండ్రు; కుసుమ ధర్మంబు లయిన గంధంబుల చేత గంధాశ్రయు డయిన వాయువు నెఱింగెడు భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మ జన్యంబు లయిన బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగం దగు" నని చెప్పి.
^[షోడశ వికారములు] - - - ^[షడ్వికారములు] - - - ^[ఆత్మ ద్వాదశ లక్షణములు] - - - ^[సప్తవింశతి తత్వములు] టీక:- అని = అని; నారద = నారదునిచే; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబునన్ = విధముగ; బాలకుల్ = పిల్లవాండ్ర; కున్ = కు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఈశ్వరుని = భగవంతుని యొక్క; మూర్తి = స్వరూపము; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; వృక్షంబులు = చెట్లు; కలుగుచుండన్ = ఉండగా; ఫలంబున్ = పండున; కున్ = కు; జన్మ = పుట్టుట, పిందెకాయుట; సంస్థాన = కాయగుట; వర్ధన = పెరుగుట; అపచయ = ముదురుట; క్షీణత = ఎండిపోవుట; పరిపాక = పండుట; నాశంబులు = నశించిపోవుటలు; ప్రాప్తంబులు = కలిగినవి; అయిన = ఐన; తెఱంగునన్ = విధముగ; దేహంబుల్ = శరీరములకే; కాని = కాని; షడ్వికారంబులు = పరివర్తనలారును {షడ్వికారములు - 1జన్మ(పుట్టుట) 2సంస్థాన (నిలబడుట) 3వర్ధన (పెరుగుట) 4అపక్షయ (బలియుట) 5పరిపాక (పరిక్వమగుట) 6నాశము (నశించుట) అనెడి ఆరు మార్పులు}; ఆత్మ = ఆత్మ; కున్ = కు; లేవు = లేవు; ఆత్మ = ఆత్మ; నిత్యుండు = శాశ్వతమైనవాడు; క్షయ = నాశము; రహితుండు = లేనివాడు; శుద్ధుండు = నిర్మలుడు; క్షేత్రజ్ఞుండు = మాయనెరిగినవాడు, జీవుడు; గగనాదుల్ = పంచభూతముల {పంచభూతములు - 1ఆకాశము 2భూమి 3నీరు 4వాయువు 5తేజము}; కున్ = కు; ఆశ్రయుండు = ఆధారమైనవాడు; క్రియా = కర్మములు; శూన్యుండు = లేనివాడు; స్వప్రకాశుండు = స్వయముగా ప్రకాశించువాడు; సృష్టి = సృష్టికి; హేతువు = కారణమైనవాడు; వ్యాపకుండు = అంతట వ్యాపించువాడు; నిస్సంగుడున్ = తగులములు లేనివాడు; పరిపూర్ణుండున్ = అంతటను నిండినవాడు; ఒక్కండును = ఏకలుడు; అని = అని; వివేక = జ్ఞానమును; సమర్థంబులు = ఈయగలిగినవి; అగు = అయిన; ఆత్మ = ఆత్మ యొక్క; లక్షణంబులు = లక్షణములు {ఆత్మ ద్వాదశ లక్షణములు - 1. శాశ్వతమైనది, 2. నాశనం లేనిది, 3. శుద్ధుడు, 4. క్షేత్రజ్ఞుడు, 5. గగనాదులకు ఆశ్రయుడు, 6. క్రియాశూన్యుడు, 7. స్వయంప్రకాశం, 8. సృష్టికి కారణం, 9. వ్యాపించు స్వభావం కలది, 10. సంగం లేనిది, 11. పరిపూర్ణమైనది, 12. ఏకలుడు}; పండ్రెండును = పన్నిండింటిని; ఎఱుంగుచున్ = తెలిసుండి; దేహాదులు = దేహ గేహ పుత్ర కళత్రాదులు; అందున్ = ఎడల; మోహ = తగులములను; జనకంబులు = పుట్టించునవి; అగు = అయిన; అహంకార = నేను యనెడి భావము; మమకారంబులు = నాది యనెడి భావములను; విడిచి = వదలిపెట్టి; పసిడి = బంగారు; గనులు = గనులు, పుట్టుచోటులు; కల = కలిగిన; నెలవునన్ = స్థానములను; విభ్రాజమాన = మెరుస్తున్న; కనక = బంగారము; లేశంబులు = కొద్దిపాటిది; ఐన = కలిగిన; పాషాణ = రాళ్ళు; ఆదులు = మొదలగువాని; అందున్ = అందు; పుటంబున్ = పుటములో; పెట్టి = పెట్టి; వహ్ని = అగ్నితో; యోగంబునన్ = కూడించుటద్వారా; కరంగన్ = కరిగిపోవునట్లు; ఊది = ఊది; హేమకారకుండు = స్వర్ణకారుడు; పాటవంబునన్ = నేరుపుతో; హాటకంబున్ = బంగారమును; పడయు = పొందెడి; భంగిన్ = వలె; ఆత్మ = ఆత్మ; కృత = కలిగిన; కార్య = కార్యములు; కారణంబులన్ = హేతువులు; ఎఱింగెడి = తెలియగల; నేర్పరి = ఉపాయశాలి; దేహంబున్ = శరీరము; అందున్ = లోని; ఆత్మ = ఆత్మయొక్క; సిద్ధి = తాదాత్మ్యము పొందుట; కొఱకున్ = కోసము; అయిన = ఐన; ఉపాయంబునన్ = ఉపాయములచేత; చేసి = వలన; బ్రహ్మభావంబున్ = బ్రహ్మత్వమును; పడయున్ = పొందును; మూలప్రకృతియున్ = మాయ; మహత్ = బుద్ధి; అహంకారంబులు = అహంకారములు; తన్మాత్రంబులున్ = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధములు}; ఇవి = ఇవి; ఎనిమిదియున్ = ఎనిమిది (8); ప్రకృతులు = ప్రకృతులు {ప్రకృతులు - 1మాయ 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు ఐదు (5)}; అనియునున్ = అని; రజః = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమంబులు = తమోగుణము లు; మూడును = మూడింటిని (3); ప్రకృతిగుణంబులు = ప్రకృతిగుణములు; అనియున్ = అని; కర్మేంద్రియంబులు = పనిచేయుట కైన సాధనములు {కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు}; అయిన = ఐన; వాక్ = నోరు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయుః = గుదము; ఉపస్థంబులు = జననేంద్రియములు; జ్ఞానేంద్రియంబులు = తెలిసికొనెడి సాధనములు {జ్ఞానేంద్రియములు - 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు}; ఐన = అయిన; శ్రవణ = చేవులు; నయన = కళ్ళు; రసన = నాలుక; త్వక్ = చర్మము; ఘ్రాణంబులును = ముక్కు లు; మనంబును = మనస్సు; మహి = భూమి {భూతపంచకము - 1భూమి 2నీరు 3నిప్పు 4గాలి 5ఆకాశము}; సలిల = నీరు; తేజస్ = నిప్పు; వాయు = గాలి; గగనంబులు = ఆకాశములు; ఇవి = ఇవి; పదాఱును = పదహారు (16); వికారంబులు = వికారములు {వికారములు - కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16 వికారములు}; అనియునున్ = అని; కపిల = కపిలుడు; ఆది = మొదలగు; పూర్వ = పూర్వకాలపు; ఆచార్యుల్ = సిద్ధాంతకర్తల, గురువుల; చేత = చేత; చెప్పబడియెన్ = చెప్పబడినది; సాక్షిత్వంబునన్ = తటస్థలక్షణముచేత; ఈ = ఈ; యిరువదేడింటిని = యిరవైయేడింటిని (27); ఆత్మ = ఆత్మ; కూడి = కలిసి; ఉండున్ = ఉండును; పెక్కింటి = అనేకమైనవాని; కూటువ = కూడినదియైన; దేహము = శరీరము; అదియున్ = అదికూడ; జంగమ = చలనముకలవి, చరములు; స్థావరములు = స్థిరముగనుండునవి; రూపంబులన్ = అనెడ రూపములతో; రెండు = రెండు (2); విధంబులు = రకములు; అయ్యె = అయ్యెను; మూలప్రకృతి = అవిద్య, మాయ; మొదలయిన = మొదలైనవాని; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; వేఱై = విలక్షణమై, భిన్నమై; మణి = మణుల; గణంబులన్ = వరుసలలో; చొచ్చి = దూరి; ఉన్న = ఉన్నట్టి; సూత్రంబు = దారము; చందంబునన్ = వలె; ఆత్మ = ఆత్మ; అన్నిటన్ = అన్నిటి; అందున్ = లోను; చొచ్చి = అంతర్లీనమై యుండి; దీపించు = ప్రకాశించును; ఆత్మ = ఆత్మ; కున్ = కు; జన్మ = పుట్టుక; స్థితి = ఉండుట; లయంబులు = నాశనములు; కలవు = ఉన్నవి; అంచున్ = అనుచు; మిథ్యా = అసత్యమున; తత్పరులు = కూడినవారు; కాక = కాకుండ; వివేక = జ్ఞానముచేత; శుద్ధులు = నిర్మలమైనవారు; ఐన = అయిన; మనంబునన్ = మనసు; చేసి = వలన; దేహంబున్ = దేహము; అందున్ = లో; ఆత్మన్ = ఆత్మను; వెదుకవలయున్ = వెతకవలెను; ఆత్మ = ఆత్మ; కున్ = కు; అవస్థలు = అవస్థాత్రయము {అవస్థాత్రయము - స్థితి అభాసములు మూడు, 1జాగరణ(మెలకువ) 2స్వప్న(కల) 3సుషుప్తి (నిద్ర)}; కల = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = ఉండును; కాని = కాని; అవస్థలు = అవస్థలు; లేవు = లేవు; జాగరణ = మెలకువ; స్వప్న = కల; సుషుప్తులు = నిద్రలు; అను = అనెడి; వృత్తులు = అవస్థలు, వ్యాపారములు; ఎవ్వని = ఎవని; చేతన్ = చేతను; ఎఱుంగబడున్ = తెలిసికొనబడునో; అతండు = అతడు; ఆత్మ = ఆత్మ; అండ్రు = అంటారు; కుసుమ = పూవుల యొక్క; ధర్మంబులు = లక్షణములు; అయిన = ఐన; గంధంబుల్ = వాసనల; చేతన్ = వలన; గంధా = వాసనను; ఆశ్రయుండు = వహించువాడు; అయిన = ఐన; వాయువున్ = గాలిని; ఎఱింగెడు = తెలిసికొను; భంగిన్ = విధముగనే; గుణా = గుణత్రయము {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబులు = స్వరూపములుగాగలవి; అయి = అయ్యి; కర్మ = కర్మములచేత; జన్యంబులు = పుట్టునవి; అయిన = ఐన; బుద్ధిబేదంబులన్ = చిత్తవృత్తులచేత; ఆత్మన్ = ఆత్మను; ఎఱుంగన్ = తెలిసికొన; తగును = వచ్చును; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- అని నారదమహర్షి బోధించినది అంతా అదే ప్రకారంగా తన సహాధ్యాయులైన దానవ బాలురకు ఇలా తెలియజెప్పాడు. “కాలం భగవంతుని స్వరూపం. కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలమిస్తుంది. ఆ ఫలానికి పుట్టటం, వృద్ధి పొందటం, పండటం, ఎండటం, కృశించటం, నశించటం అనే క్రమం తప్పదు. అలాగా షడ్వికారాలు అనబడు ఈ ఆరు (6) విధాలైన భావవికారాలు దేహానికి కూడా ఉంటాయి. అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఏమాత్రం ఉండవు. ఆత్మ శాశ్వతమైనది; నాశనం లేనిది; వికారాలు లేనిది; శుద్ధమైనది; జీవుల ఆత్మ యందుండునది; ఆకాశం మున్నగువానికి ఆశ్రయమైనది; క్రియాశూన్యత్వము; స్వయం ప్రకాశం; సృష్టికి కారణం; వ్యాపించు స్వభావం కలది; సంగం లేనిది; పరిపూర్ణమైనది. ఈ విధంగా ఈ పన్నెండు (12) ఆత్మ లక్షణాలు అని పెద్దలు చెప్తారు.
బంగారం గనులలో బంగారం రేణువులు రాయి రప్పలతో కలిసి ఉంటాయి. ఆ రాళ్ళను స్వర్ణకారులు అగ్నిలో పుటం పెట్టి, కరగబెట్టి, నేర్పుగా వాటిలోంచి బంగారం వెలికి తీస్తారు. అదే విధంగా ఆత్మతత్వం తెలిసినవారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే అహంకారాలు, మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటె ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతారు.
(అ) మూలప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఎనిమిది (8) “ప్రకృతులు” (అష్టప్రకృతులు) అంటారు.
(ఇ) సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు (3) “ప్రకృతి గుణాలు”.
(ఉ) నోరు, చెయ్యి, కాలు, గుదం, మర్మావయవం అనే ఈ అయిదు (5) కర్మేంద్రియాలు
; కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ అయిదు (5) జ్ఞానేంద్రియాలు
; నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే ఈ అయిదు (5) పంచభూతాలు
; మనసు ఒకటి (1)
; మొత్తం ఈ పదహారు (16) వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు.
ఈ మొత్తం ఇరవైఏడింటిలోను (27) ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది.
ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైనది ఈ దేహం. ఈ దేహాన్ని స్థిరం అని, చరం అని రెండు విధాలుగా భావించవచ్చు. మూలప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ, పూసలలో దారం లాగ, ఇన్నింటిలోనూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన స్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి. కాని నిజానికి ఆత్మకు ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. పూలకు ఉండే సువాసనల ద్వారా వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు, కర్మజన్యములు అయిన బుద్ధిభేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు.” అని తెలిపి ఇంకా ఇలా అన్నాడు.

126
సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ;
ణబద్ధ మజ్ఞానకారణంబుఁ
లవంటి దింతియ కాని నిక్కము గాదు;
ర్వార్థములు మనస్సంభవములు
స్వప్న జాగరములు మములు గుణశూన్యుఁ;
గు పరమునికి, గుణాశ్రయమున
వవినాశంబులు వాటిల్లి నట్లుండుఁ;
ట్టి చూచిన లేవు బాలులార!

డఁగి త్రిగుణాత్మకము లైన ర్మములకు
నకమై వచ్చు నజ్ఞాన ముదయమును
నతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి
ర్మవిరహితు లై హరిఁ నుట మేలు.
టీక:- సంసారము = సంసారము; ఇది = ఇది; బుద్ధి = బుద్ధిచేత; సాధ్యము = సాధింప దగినది; గుణ = త్రిగుణమూలములైన; కర్మ = కర్మముల; గణ = సముదాయముల చేత; బద్ధము = కల్పింపబడినది; అజ్ఞాన = అవిద్యకి; కారణంబున్ = హేతువైనది; కల = స్వప్నము; వంటిది = వంటిది; అంతియె = అంతే; కాని = కాని; నిక్కము = నిజమైనది; కాదు = కాదు; సర్వ = సమస్తమైన; అర్థములున్ = విషయములు; మనస్ = మనస్సులో; సంభవములు = పుట్టినవి; స్వప్న = కల; జాగరములు = మెలకువలు; సమములు = సమానమైనవి; గుణ = గుణములు; శూన్యుడు = లేనివాడు; అగు = అయిన; పరమున్ = సర్వాతీతుని; కిన్ = కి; గుణాశ్రయమునన్ = సత్వాదుల సంగముచేత; భవ = పుట్టుట; నాశంబులు = మరణములు; వాటిల్లిన = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = అనిపించును; పట్టి = విచారించి; చూచినన్ = చూసిన; లేవు = లేవు; బాలులార = బాలలూ, అజ్ఞానులారా.
కడగి = ప్రయత్నించి, పూనికతో; త్రిగుణ = సత్వరజస్తమోగుణముల; అత్మకములు = స్వరూపములు; ఐన = అయిన; కర్మముల్ = కర్మల; కున్ = కు; జనకము = జన్మకారణము; ఐ = అయ్యి; వచ్చున్ = కలిగెడి; అజ్ఞాన = అవిద్య యొక్క; సముదయమునున్ = సమూహమును; ఘనతర = అతిగొప్ప {ఘనము - ఘనతరము - ఘనతమము}; జ్ఞాన = జ్ఞానము యనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత; కాల్చిపుచ్చి = కాల్చేసి; కర్మవిరహితులు = కర్మబంధములు లేనివారు; ఐ = అయ్యి; హరిన్ = నారాయణుని; కనుట = తెలియుట, చూచుట; మేలు = ఉత్తమము.
భావము:- “పిల్లలు! ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది. ఇది సత్త్వ రజస్తమో గుణాత్మకాలు అయిన కర్మలలో బందీ అయి ఉంటుంది; ఈ సంసారం అన్నది కేవలం స్వప్నం లాంటిది. ఎంతమాత్రం యదార్థం కాదు. సకల కాంక్షలు మనస్సులోనే పుడతాయి. స్వప్నం, మెలకువ ఈ రెండింటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా, గుణాలను ఆశ్రయించి ఆయన కూడ జననం, మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాలు వలన ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. అలా కర్మ బంధాల నుండి విముక్తులై విష్ణుమూర్తిని కనుగొనటం మంచిది.

127
అది గావున, గురుశుశ్రూషయు సర్వలాభసమర్పణంబును సాధుజన సంగమంబును నీశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని యందలి ప్రేమయు నారాయణ గుణ కర్మ కథా నామకీర్తనంబును వైకుంఠ చరణకమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబును మొదలయిన విజ్ఞానవైరాగ్య లాభసాధనంబు లైన భాగవతధర్మంబులపై రతి గలిగి సర్వభూతంబుల యందు నీశ్వరుండు భగవంతుం డాత్మఁ గలండని సమ్మానంబు జేయుచుఁ గామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులం గెలిచి యింద్రియవర్గంబును బంధించి భక్తి చేయుచుండ నీశ్వరుం డయిన విష్ణుదేవుని యందలి రతి సిద్ధించు.
టీక:- అదిగావున = అందుచేత; గురు = గురువును; శుశ్రూషయున్ = సేవించుట; సర్వ = సమస్తమైన; లాభ = ప్రయోజనములను; సమర్పణంబును = ఈశ్వరార్పణ చేయుట; సాధు = సాదువులైన; జన = వారి; సంగమంబునున్ = చేరిక, చెలిమి; ఈశ్వర = భగవంతుని, విష్ణుమూర్తి; ప్రతిమ = విగ్రహమును; సమారాధనంబును = చక్కగా కొలచుట; హరి = విష్ణు; కథా = కథల యందు; తత్పరత్వంబును = తదేక నిష్ఠ గలిగి యుండుట; వాసుదేవుని = విష్ణుని {వాసుదేవుడు - వ్యు. వాసుదేవః – సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, విష్ణువు}; అందలి = ఎడల; ప్రేమయున్ = ప్రేమ; నారాయణ = విష్ణుని {నారాయణుడు - వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసము గలవాడు, హరి}; గుణ = గుణములను; కర్మ = వర్తనములను; కథా = కథలను; నామ = నాములను; సంకీర్తనంబును = స్తోత్రము, పాడుట; వైకుంఠ = విష్ణుని {వైకుంఠుడు - వైకుంఠ వాసి, వికుంఠ యను నామె పుత్రుడు, హరి}; చరణ = పాదము లనెడి; కమల = పద్మముల; ధ్యానంబును = ధ్యానించుట; విశ్వంభర = విష్ణుని {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; మూర్తి = స్వరూపమును; విలోకన = చక్కగా గాంచుట; పూజనంబును = భజించుట; మొదలయిన = మున్నగునవి; విజ్ఞాన = ఉత్తమ జ్ఞానము; వైరాగ్య = విషయవైముఖ్యము; లాభ = లభింపజేసెడి; సాధనంబులు = సాధనములు; ఐన = అయిన; భాగవత = భాగవత తత్త్వము యొక్క; ధర్మంబుల్ = ధర్మముల; పైన్ = మీద; రతి = మిక్కిలి మక్కువ; కలిగి = ఉండి; సర్వ = సమస్తమైన; భూతంబుల = జీవుల; అందున్ = లోను; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుడు - సర్వ లోక నియామకుడు, విష్ణువు}; భగవంతుండు = హరి {భగవంతుడు - గుణషట్కములైన 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు కలిగి పూజనీయమైనవాడు, విష్ణువు}; ఆత్మన్ = తన ఆత్మలో; కలండు = ఉన్నాడు; అని = అని; సమ్మానంబు = గౌరవించుట; చేయుచున్ = చేయుచు; కామ = కోరిక; క్రోధ = కోపము; లోభ = పిసినారితనము; మోహ = అజ్ఞానము; మద = గర్వము; మత్సరంబులన్ = మాత్యర్యములను; గెలిచి = జయించి, స్వాధీనముచేసికొని; ఇంద్రియవర్గంబును = అంతరింద్రియ బాహ్యేంద్రియములను; బంధించి = వాని యిచ్చచొప్పున పోనీయక; భక్తి = భక్తి; చేయుచుండన్ = చేయుచుండగా; ఈశ్వరుండు = నారాయణుని; విష్ణుదేవుని = నారాయణుని; అందలి = అందు; రతి = ప్రీతి; సిద్ధించు = కలుగును.
భావము:- కాబట్టి, 1) గురువులకు సేవ, 2) సమస్తమైన ఫలితాన్ని భగవంతునికి సమర్పణ, 3) సజ్జనులతో స్నేహం, 4) విష్ణుదేవుని విగ్రహారాధన, 5) శ్రీహరి కథల శ్రవణం, 6) వాసుదేవ మనన, 7) నారాయణ సంకీర్తన, 8) విష్ణు పాద ధ్యానం, 9) హరి దర్శనం మరియు 10) పూజ మున్నగునవి భాగవత ధర్మాలు. ఇవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. ఈ భాగవత ధర్మాలు మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మ స్వరూపంతో సర్వ ప్రాణికోటిలోను ఉన్నాడని తెలుసుకుని మనం వాటిని ఆచరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం (అరిషడ్వర్గాలు) అను వాటిని జయించి, ఇంద్రియ చాపల్యం అరికట్టాలి. ఆ విధంగా భక్తితో పూజిస్తే భగవంతుడైన విష్ణుభక్తి సిద్ధిస్స్తుంది.

128
నుజారి లీలావతారంబు లందలి;
శౌర్యకర్మంబులు ద్గుణములు
విని భక్తుఁ డగువాఁడు వేడ్కతోఁ బులకించి;
న్నుల హర్షాశ్రుణము లొలుక
ద్గదస్వరముతోఁ మలాక్ష! వైకుంఠ! ;
రద! నారాయణ! వాసుదేవ!
నుచు నొత్తిలిపాడు; నాడు; నాక్రోశించు;
గుఁ; జింతనము జేయు; తి యొనర్చు;

రులు కొని యుండుఁ; దనలోన మాటలాడు;
వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞానటలిఁ గాల్చి
విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు.
టీక:- దనుజారి = నారాయణుని; లీలా = వేడకకొఱకైన; అవతారంబులు = అవతారముల; అందలి = లోని; శౌర్య = పరాక్రమపు; కర్మంబులు = చేతలు; సద్గుణములు = మంచిగుణములు; విని = విని; భక్తుడు = ప్రపన్నుడు; అగువాడు = అయ్యెడివాడు; వేడ్కన్ = కౌతుకము; తోన్ = తోటి; పులకించి = గగుర్పాటుచెంది; కన్నులన్ = కళ్ళనుండి; హర్ష = ఆనందపు; అశ్రు = కన్నీటి; కణములు = బిందువులు; ఒలుకన్ = జాలువారగా; గద్గద = డగ్గుతిక; స్వరము = గొంతు; తోన్ = తోటి; కమలాక్ష = హరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; వైకుంఠ = హరి {వైకుంఠుడు - కుంఠము(ఓటమి) లేనివాడు, హరి}; వరద = హరి {వరద - వరములను యిచ్చువాడు, విష్ణువు}; నారాయణ = హరి {నారాయణ - శబ్దములకు ఆధారభూతుడైన వాడు, విష్ణువు (విద్యార్థి కల్పతరువు)}; వాసుదేవ = హరి {వాసుదేవ – ఆత్మలందు వసించు దేవుడు, విష్ణువు}; అనుచున్ = అనుచు; ఒత్తిలి = గట్టిగా; పాడున్ = పాడును; ఆడున్ = నాట్యము చేయును; ఆక్రోశించున్ = వాపోవును; నగున్ = నవ్వును; చింతనము = ధ్యానము; చేయును = చేయును; నతిన్ = మ్రొక్కుట; ఒనర్చున్ = చేయును.
మరులుకొని = మోహము చెంది; ఉండున్ = ఉండును; తనలోన = తనలోతనే; మాటలాడున్ = మాట్లాడుకొనును; వేల్పు = దయ్యము, పూనకము; సోకిన = పట్టిన, వచ్చిన; పురుషుని = మానవుని; వృత్తిన్ = విధముగ; తిరుగున్ = వర్తించును; బంధములన్ = సాంసారిక బంధనములను; పాసి = తొలగించుకొని; అజ్ఞాన = అవిద్యా; పటలిన్ = సమూహమును; కాల్చి = మసిచేసి; విష్ణున్ = విష్ణుమూర్తిని; ప్రాపించున్ = చెందును, లీనమగును; తుదిన్ = చివరకు; భక్తి = భక్తివలన; వివశుడు = మైమరచినవాడు; అగుచు = అయిపోతూ.
భావము:- భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనందభాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.

129
కావున, రాగాదియుక్త మనస్కుం డయిన శరీరికి సంసారచక్రనివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణసుఖం బెట్టిదట్టి దని బుధులు దెలియుదురు; హరిభజనంబు దుర్గమంబుగాదు; హరి సకల ప్రాణిహృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు; విషయార్జనంబుల నయ్యెడిది లేదు; నిమిషభంగుర ప్రాణు లయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాంతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు; యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబు లైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవక్షీణంబులు గాని నిత్యంబులు గావు; నరుండు విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీత ఫలంబుల నొందు; కర్మంబులు గోరక చేయవలయు; కోరి చేసిన దుఃఖంబులు ప్రాపించు; పురుషుండు దేహంబుకొఱకు భోగంబుల నపేక్షించు; దేహంబు నిత్యంబు కాదు తోడ రాదు; మృతం బైన దేహంబును శునకాదులు భక్షించు; దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబుఁ దాల్చు; అజ్ఞానంబునం జేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు; అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు; జ్ఞాన లభ్యంబు మోక్షంబు; మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; తన చేత నయిన మహాభూతంబులతోడ జీవసంజ్ఞితుండై యుండు; నిష్కాములై హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు.
టీక:- కావునన్ = కనుక; రాగాది = రాగద్వేషాదులతో {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; యుక్త = కూడిన; మనస్కుండు = మనసు గలవాడు; అయిన = ఐన; శరీరి = జీవుని, దేహి; కిన్ = కి; సంసార = సంసారమనెడి; చక్ర = చక్రమునుండి; నివర్తకంబు = మరల జేయునది; అయిన = ఐన; హరి = నారాయణుని; చింతనంబు = ధ్యానము; బ్రహ్మము = పరబ్రహ్మము; అందలి = లోని; నిర్వాణ = మోక్షము యొక్క; సుఖంబున్ = సుఖము; ఎట్టిద = ఎలాంటిదో; అట్టిది = అలాంటిది; అని = అని; బుధులు = జ్ఞానులు; తెలియుదురు = తెలిసి యుందురు; హరి = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; భజనంబు = సేవ; దుర్గమంబు = పొందరానిది; కాదు = కాదు; హరి = విష్ణువు; సకల = అఖిలమైన; ప్రాణి = జీవుల; హృదయంబులు = హృదయముల; అందున్ = లోను; అంతర్యామి = లోన వ్యాపించినవాడు; ఐ = అయ్యి; ఆకాశంబు = ఆకాశము; భంగిన్ = వలె; ఉండున్ = ఉండును; విషయ = ఇంద్రియార్థముల, భోగముల; ఆర్జనంబులన్ = సంపాదించుటవలన; అయ్యెడిది = కలిగెడి లాభము; లేదు = లేదు; నిమిష = రెప్పపాటులో; భంగుర = చెడిపోవు; ప్రాణులు = ప్రాణములు గలవారు; అయిన = ఐన; మర్త్యుల్ = మానవుల {మర్త్యులు - మరణించెడి నైజము గలవారు, మనుషులు}; కున్ = కు; మమతా = నాది యనెడి మోహమునకు; ఆస్పదంబులు = స్థానములైనవి; చంచలంబులు = అస్థిరములు {చంచలములు - మిక్కిలి చలించెడివి, అస్థిరములు}; ఐన = అయిన; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; పశు = గొడ్లు; భృత్య = సేవకులు; బల = సైన్యము; బంధు = చుట్టములు; రాజ్య = రాజ్యాధికారము; కోశ = కోశాగారము; మణి = రత్నాదులు; మందిర = భవనములు; మంత్రి = సచివులు; మాతంగ = ఏనుగులు {మాతంగము - మతంగజము, మతంగుడను ఋషివలన పుట్టినది, ఏనుగు}; మహీ = రాజ్యము, భూములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; విభవంబులు = వైభవములు; నిరర్థకంబులు = ప్రయోజనములేనివి; యాగ = యజ్ఞములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; పుణ్య = పుణ్యములవలన; లబ్ధంబులు = దొరకునవి; ఐన = అయిన; స్వర్గ = స్వర్గవాసము; ఆది = మొదలగు; భోగంబులు = భోగములు; పుణ్య = పుణ్యములకు; అనుభవ = అనుభవించుటచే; క్షీణంబులు = తగ్గించెడివి; కాని = తప్పించి; నిత్యంబులు = శాశ్వతములు; కావు = కావు; నరుండు = మానవుడు; విద్వాంసుడను = తెలిసినవాడను; అని = అని; అభిమానించి = అహంకరించి; కర్మంబుల్ = కర్మములను; ఆచరించి = చేసి; అమోఘంబులు = వ్యర్థముగానివి; అయిన = ఐన; విపరీత = ప్రతికూలమైన; ఫలంబులన్ = ఫలితములను; ఒందు = పొందును; కర్మంబులున్ = కర్మలను; కోరక = ఫలాపేక్షలేక; చేయవలయున్ = చేయవలయును; కోరి = ఫలమపేక్షించి; చేసినన్ = చేసినట్లయినచో; దుఃఖంబులు = దుఃఖములు; ప్రాపించున్ = పొందును; పురుషుండు = మానవుడు; దేహంబున్ = శరీరము; కొఱకున్ = కోసము; భోగంబులన్ = స్రక్చందనాదులు {భోగాష్టకములు - 1పుష్పమాలిక 2గంధము 3వస్త్రము 4అన్నము 5శయ్య 6తాంబూలము 7స్త్రీ 8గానములు, స్రక్చందనాదులు}; అపేక్షించి = కోరి; అపేక్షించును = కావాలని కోరును; దేహంబున్ = శరీరము; నిత్యంబు = శాశ్వతమైనది; కాదు = కాదు; తోడన్ = మరణించిన జీవుని వెంబడి; రాదు = రాదు; మృతంబు = ప్రాణములుబాసినది; ఐన = అయిన; దేహంబును = దేహమును; శునక = కుక్కలు; ఆదులు = మొదలగునవి; భక్షించున్ = తినును; దేహి = జీవుడు; కర్మంబులు = కర్మలను; ఆచరించి = చేసి, కూడిచరించి; కర్మ = కర్మములకు; బద్ధుండు = కట్టబడినవాడు; అయి = అయ్యి; క్రమ్మఱన్ = మరల; కర్మా = కర్మములు చేయుటకు; అనుకూలంబు = తగినవి; అయిన = ఐన; దేహంబున్ = శరీరమును; తాల్చున్ = ధరించును; అజ్ఞానంబునన్ = తెలియకపోవుట; చేసి = వలన; పురుషుండు = మానవుడు; కర్మ = కర్మములను; దేహంబులన్ = శరీరములను; విస్తరించున్ = పెంచుకొనును; అజ్ఞాన = అజ్ఞానముచేత; తంత్రంబులు = నడపబడునవి; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; జ్ఞాన = జ్ఞానముచేత; లభ్యంబు = దొరకునది; మోక్షంబు = ముక్తిపదము; మోక్ష = పరమపదమును; ప్రదాత = ఇచ్చువాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సకల = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మేశ్వరుండు = ఆత్మరూపుడైన ప్రభువు; ప్రియుండు = మిక్కిలి ఇష్టమైనవాడు; తన = తన; చేతన్ = వలన; అయిన = కల్పితములైన; మహాభూతంబుల్ = భూతపంచకంబు {మహాభూతములు - 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5 ఆకాశము అనెడి ఐదు భూతములు}; తోడన్ = తోటి; జీవ = జీవుడు యనెడి; సంజ్ఞితుండు = పేరు గలవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నిష్కాములు = కోరికలు లేనివారు; ఐ = అయ్యి; హృదయ = హృదయము నందు; గతుండు = ఉన్నవాడు; అయిన = ఐన; హరిని = విష్ణుని; నిజ = అచ్చపు; భక్తిని = భక్తితో; భజింపవలయున్ = సేవింపవలయును.
భావము:- కాబట్టి, రాగాదులతో బద్ధుడై కోరికల వలలో పడిన మానవుడికి ఈ సంసార చక్రాన్ని ఛేదించాలి అంటే విష్ణు సంకీర్తన ఒక్కటే ఉపాయం. “పరబ్రహ్మంతో ఐక్యం అయితే అనుభవించే ఆనందం ఎంతటిదో, అంతటి ఆనందాన్ని శ్రీహరి ఆరాధన అందిస్తుంది” అని పండితులు చెప్తారు. మాధవుడిని సేవించటం కష్టమైన పని కాదు. విష్ణువు సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వలె వ్యాపించి ఉంటాడు. సిరి సంపదలు సంపాదించటం వలన ఏమాత్రం సుఖం లేదు. మానవుల జీవితాలు క్షణభంగురాలు. ఇలాంటి మానవులకు మమత, అనుబంధాలు, పెంచే భార్యాపిల్లలు, బంధుమిత్రులు, మడిమాన్యాలు, పాడిపంటలు, రాజ్య కోశాలు, మణిమందిరాలు, మంత్రులు, మత్తేభాలు మొదలైనవి అన్ని అనవసరమైనవి, అస్థిరమైనవి. యజ్ఞ యాగాదుల వలన లభించే స్వర్గ సుఖాలు శాశ్వతాలు కావు, అవి పుణ్యం క్షీణించగానే నశించేవే. తాను ఘనుడను అనుకుని, మానవుడు తనపై తాను అభిమానం పెంచుకుని, వివిధ కర్మలు ఆచరించి విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు. కోరికలతో చేసే కర్మలన్నీ దుఃఖాలనే కలిగిస్తాయి. కనుక, ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు ఆచరించాలి. దేహం ధరించినవాడు దేహి, దేహి తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు. కానీ, దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేదీ కాదు. ప్రాణం పోగానే ఈ శరీరం కుక్కలు, నక్కలు పాలవటానికి పనికి వస్తుంది అంతే. దేహం ధరించిన వ్యక్తి కర్మలను చేసి, ఆ కర్మలకు బద్ధుడు అయిపోతాడు. మరల ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వలన కర్మలు అధికంగా చేయటం, మరల మరల దేహాలు ధరిస్తూ ఉండటం. ఇలా కర్మ దేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థకామాలను మాత్రమే అందిస్తాయి. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అందించేవాడు విష్ణువు మాత్రమే. సర్వ ప్రాణికోటికి ఆ మోక్షప్రదాత అయిన శ్రీహరే ఆత్మేశ్వరుడు, ప్రియుడు. తన చేత సృష్టించబడిన పంచభూతాలతో కూడిన వాడై ఆ పరమాత్మే “జీవుడు” అనబడతాడు. కాబట్టి, ప్రతి వ్యక్తీ తమ హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా సేవించాలి.

130
దావ దైత్య భుజంగమ
మావ గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు చరణకమల
ధ్యానంబున నెవ్వఁడయిన న్యత నొందున్.
టీక:- దానవ = దానవులు; దైత్య = దితిజులు; భుజంగమ = నాగులు; మానవ = మానవులు; గంధర్వ = గంధర్వులు; సుర = దేవతల యొక్క; సమాజము = సమూహముల; లోన్ = అందు; లక్ష్మీనాథు = నారాయణుని {లక్ష్మీనాథడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; చరణ = పాదము లనెడి; కమల = పద్మముల; ధ్యానంబునన్ = చింతనముచేత; ఎవ్వడు = ఎవడు; అయినన్ = అయినను; ధన్యతన్ = కృతార్థత్వంబును; ఒందున్ = పొందును.
భావము:- శ్రీహరి పాదపద్మాలను సేవిస్తే చాలు, దానవులు, దైత్యులు, నాగులు, మానవులు, గంధర్వులు, దేవతలు ఎవరైనా సరే, కృతార్థులు అవుతారు.

131
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
టీక:- చిక్కడు = దొరకడు; వ్రతములన్ = వ్రతములచేత; క్రతువులన్ = యజ్ఞములుచేత; చిక్కడు = దొరకడు; దానములన్ = దానములుచేయుటచేత; శౌచ = శుచి శుభ్రముల; శీల = మంచినడవడికల; తపములన్ = తపస్సులచేత; చిక్కడు = దొరకడు; యుక్తిని = తెలివిచేత; భక్తిని = భక్తివలన; చిక్కిన = దొరకిన; క్రియన్ = వలె; అచ్యుతుండు = హరి {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; సిద్ధము = సత్యము; సుండీ = సుమా.
భావము:- భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు.
దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.
ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షసబాలురకు తన ప్రపత్తిమార్గ మైన నారదోపదిష్ట భాగవతతత్వాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరించాడు.

132
చాదు భూదేవత్వము
చాదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాదు హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.
టీక:- చాలదు = సరిపడదు; భూదేవత్వమున్ = బ్రాహ్మణత్వము; చాలదు = సరిపడదు; దేవత్వము = దేవత్వము; అధిక = మిక్కిలి; శాంతత్వంబున్ = సాధుస్వభావము; చాలదు = సరిపోదు; హరిన్ = నారాయణుని; మెప్పింపన్ = మెచ్చునట్లు చేయుటకు; విశాల = గొప్ప; ఉద్యములారా = యత్నము కలవారలారా; భక్తి = భక్తి; చాలిన = సరిపడిన; భంగిని = విధముగ.
భావము:- మంచి శ్రద్ధ గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు, దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం,

133
నుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
ఖిల జగము విష్ణుఁ నుచుఁ దలఁచి.
టీక:- దనుజ = రాక్షసులు; భుజగ = సర్పములు; యక్ష = యక్షులు; దైత్య = రాక్షసులు; మృగ = జంతువులు; ఆభీర = గొల్లలు; సుందరీ = స్త్రీలు; విహంగ = పక్షులు; శూద్ర = శూద్రులు; శబర = శబరులు, ఎఱుకలు; ఐన = అయిన; పాప = పాపములు చేసినవా రైన; జీవులు = ప్రాణులు; ఐన = అయినను; ముక్తి = పరమపదమున; కిన్ = కి; పోదురు = వెళ్ళెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వము; విష్ణుడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; తలచి = భావించి.
భావము:- దనుజులు, రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే “సర్వం విష్ణుమయం జగత్” అని మనసారా తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.

134
గురువులు దమకును లోఁబడు
తెరువులు చెప్పెదరు విష్ణు దివ్యపదవికిం
దెరువులు చెప్పరు; చీఁకటిఁ
రువులు పెట్టంగ నేల? బాలకులారా!
టీక:- గురువులు = గురువులు; తమ = తమ; కును = కు; లోబడు = తెలిసిన; తెరువులు = జాడలను; చెప్పెదరు = చెప్పెదరు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క {విష్ణువు - (విశ్వమున) వ్యాపించి యుండువాడు, హరి}; దివ్య = దివ్యమైన; పదవికిన్ = స్థానమున; కిన్ = కు; తెరువున్ = దారి; చెప్పరు = తెలుపరు; చీకటిన్ = చీకటిలో; పరువులు = పరుగులు; పెట్టంగన్ = దీయుట; ఏలన్ = దేనికి; బాలకులారా = బాలలూ.
భావము:- బాలలూ! మీ అమాయకత్వం వదలండి. మన ఉపాధ్యాయులు వారికి తెలిసిన చదువులే చెప్పగలరు; చెప్తున్నారు. అంతే కాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందటానికి అవసరమైన మార్గాలు చెప్పరు. మనం ఈ గుడ్డి చదువులు చదివి వారి వెంట అజ్ఞానం అనే చీకటిలో పరుగెత్తటం దేనికి? చెప్పండి.

135
తెం డెల్ల పుస్తకంబులు
నిం డాచార్యులకు మరల నేకతమునకున్
రండు విశేషము చెప్పెదఁ
బొం డొల్లనివారు కర్మపుంజము పాలై.
టీక:- తెండు = తీసుకురండి; ఎల్ల = అన్ని; పుస్తకంబులున్ = పుస్తకములను; ఇండు = ఇవ్వండి; ఆచార్యున్ = గురువు; కున్ = కు; మరల = మళ్ళీ; ఏకతమున్ = ఏకాంతమున కూడుటకు; కున్ = కు; రండు = రండి; విశేషమున్ = ప్రత్యేకతగలదానిని; చెప్పెదన్ = తెలిపెదను; పొండు = వెళ్ళిపోండి; ఒల్లని = అంగీకరించని; వారు = వారు; కర్మ = కర్మముల; పుంజము = సమూహమునకు; పాలు = లోబడి; ఐ = పోయి.
భావము:- ఆ పుస్తకాలు అన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేసి రండి. మళ్ళీ మనం ఏకాంతంగా కూర్చుందాం. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళండి. మీ కర్మలు మీరు అనుభవించండి.

136
డుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్.
టీక:- ఆడుదము = ఆడుకొనెదము; మనము = మనము; హరి = విష్ణుని యందలి {హరి - భక్తుల హృదయమును ఆకర్షించువాడు, విష్ణువు}; రతిన్ = ప్రీతిచేత; పాడుదము = పాడుదము; ఏ = అన్ని; ప్రొద్దున్ = వేళ నైనను; విష్ణు = హరి; భద్ర = మంగళకరములైన; యశంబుల్ = కీర్తులు; వీడుదము = వదలివేసెదము; దనుజ = రాక్షసులతోడి; సంగతిన్ = చెలిమిని, సాంగత్యమును; కూడుదము = కలిసెదము ; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ముక్తిని యిచ్చువాడు, విష్ణువు}; భక్త = భక్తుల; కోటిన్ = సమూహమును; సూటిన్ = సూటిగా.
భావము:- మనం శ్రీహరి మీది చిత్తముతో ఆడుకుందాం రండి. మాధవుడిని మనసు నిండా నింపుకుని హరిసంకీర్తనలు పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణుభక్తులతో చేరిపోదాం రండి..

137
విత్తము సంసృతిపటలము
వ్రత్తము కామాదివైరిర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్."
టీక:- విత్తము = విదళించెదము; సంసృతి = సంసార; పటలమున్ = కూటమిని; వ్రత్తము = చీల్చెదము; కామాదివైరివర్గంబులన్ = అరిషడ్వర్గములను {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు యనెడి ఆరుశత్రువులకూటములు}; నేడు = ఇప్పుడు; ఇత్తము = అప్పజెప్పెదము; చిత్తము = మనస్సును; హరి = విష్ణుని; కిని = కి; చొత్తము = చేరుదము; నిర్వాణపదమును = పరమపదమును; శుభము = క్షేమము; అగున్ = కలుగును; మన = మన; కున్ = కు.
భావము:- ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పక శుభం కలుగుతుంది."

138
అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యైవేళల రాక్షస కుమారులకు నపవర్గమార్గం బెఱింగించిన; వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణభక్తి చిత్తంబులం గీలించి యుండుటం జూచి వారల యేకాంతభావంబు దెలిసి వెఱచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరి కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు - మిక్కిలి హ్లాదము (సంతోషము)గలవాడు, హిరణ్యకశిపుని పుత్రుడు}; రహస్యంబునన్ = ఏకాంతములో; అయ్యై = ఆయా; వేళలన్ = సమయములందు; రాక్షస = రాక్షస; కుమారుల్ = పిల్లల; కున్ = కు; అపవర్గ = మోక్షపు; మార్గంబున్ = మార్గమును; ఎఱింగిచినన్ = తెలుపగా; వారును = వారుకూడ; గురు = గురువుచే; శిక్షితంబులు = నేర్పబడినవి; ఐన = అయిన; చదువులున్ = శాస్త్రాధ్యయనములను; చాలించి = ఆపివేసి; నారాయణ = విష్ణుని; భక్తిన్ = భక్తిని; చిత్తంబులన్ = మనసులలో; కీలించి = నాటుకొనజేసి; ఉండుటన్ = ఉండుటను; చూచి = తెలిసికొని; వారల = వారియొక్క; ఏకాంత = అంతరంగిక; భావంబున్ = ఆలోచనలు; తెలిసి = తెలిసికొని; వెఱచి = బెదిరిపోయి; వచ్చి = దగ్గరకు వచ్చి; శుక్రనందనుండు = శుక్రాచార్యుని కొడుకు; శక్రవైరి = హిరణ్యకశిపున {శక్రవైరి - శక్రుడు (ఇంద్రుడు) యొక్క వైరి (శత్రువు), హిరణ్యకశిపుడు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఇలా రహస్యంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా, అనేక అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరు గురువులు దగ్గర చెప్పే తమ చదువులను ఆపేశారు. తమ హృదయాలను శ్రీమన్నారాయణుని వైపు మళ్లించారు. భక్తి మార్గం పట్టారు. ఇది వాళ్ళ గురువులు గమనించారు, శిష్యుల భావాలు తెలుసుకుని భయపడ్డారు. శుక్రాచార్యుని కొడుకులు చండామార్కులు తమ మహారాజు, ఇంద్రుడి శత్రువు అయిన హిరణ్యకశిపుడి వద్దకు చేరి ఇలా అన్నారు.

139
"క్షో బాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా
శిక్షామార్గము లెల్ల గల్ల లని యాక్షేపించి తా నందఱన్
మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్ మోసంబు వాటిల్లె; నీ
క్షత్వంబునఁ జక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ!
టీక:- రక్షస్ = రాక్షస; బాలురన్ = బాలలను; ఎల్లన్ = అందరను; నీ = నీ; కొడుకు = పుత్రుడు; చేరన్ = దగ్గరకు; చీరి = పిలిచి; లోలోనన్ = రహస్యముగా; నా = నా యొక్క; శిక్షా = ఉపదేశ; మార్గములు = విధానములు; ఎల్లన్ = అన్నియు; కల్లలు = అసత్యములు; అని = అని; ఆక్షేపించి = దూరి; తాన్ = తను; అందఱన్ = అందరిని; మోక్ష = ముక్తిమార్గమునకు; ఆయత్తులను = ఆసక్తులుగా; చేసినాడు = చేసెను; మన = మన; కున్ = కు; మోసంబు = కీడు; వాటిల్లెన్ = కలిగినది; నీ = నీ యొక్క; దక్షత్వంబునన్ = సామర్థ్యమున; చక్కజేయవలయును = సరిదిద్దవలెను; దైతేయవంశాగ్రణీ = హిరణ్యకశిపుడా {దైతేయవంశాగ్రణి - దైతేయ (దితిజులైన రాక్షస) వంశమునకు అగ్రణి (గొప్పవాడు), హిరణ్యకశిపుడు}.
భావము:- “ఓ దైత్య కుల శిరోమణి! హిరణ్యకశిప మహారాజా! నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకు వెళ్లి, నేను చెప్పే చదువులు అన్నీ బూటకములు అని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికి మోక్షమార్గం బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తావో! చూడు. నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాడిని చక్కబెట్టటానికి నీ సామర్థ్యం వాడాల్సిందే.

140
“ఉల్లసిత విష్ణుకథనము
లెల్లప్పుడు మాఁకు జెప్పఁ” డీ గురుఁ డని న
న్నుల్లంఘించి కుమారకు
లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే.
టీక:- ఉల్లసిత = ఉల్లాసవంతమైన; విష్ణు = విష్ణుని; కథనములు = గాథలు; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; మా = మా; కున్ = కు; చెప్పడు = చెప్పడు; ఈ = ఈ; గురుడు = గురువు; అని = అని; నన్నున్ = నన్ను; ఉల్లంఘించి = అతిక్రమించి; కుమారకులు = పిల్లలు; ఒల్లరు = ఇష్టపడరు; చదువంగన్ = చదువుటకు; దానవోత్తమ = రాక్షసులలో ఉత్తముడా; వింటే = విన్నావా.
భావము:- ఓ దానవశ్రేష్ఠుడా! వింటున్నావు కదా! శిష్యులు “ఈ గురువు మనకు మనోహరమైన మాధవుని కథలు చెప్పడు” అని అనుకుంటూ, నన్నూ నా మాటలు లెక్కచేయటం మానేశారు. నేను చెప్పే చదువులు చదవటం మానేశారు. ఇదీ పరిస్థితి.

141
డుగఁడు మధురిపుకథనము
విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే
నొడివిన నొడువులు నొడువఁడు
దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా!
టీక:- ఉడుగడు = మానడు; మధురిపు = హరి {మధురిపుడు - మధువనెడి రాక్షసునికి రిపుడు (శత్రువు), విష్ణువు}; కథనము = కీర్తనమును; విడివడి = కట్టుబాటునుండి తొలగి; జడున్ = మందుని; పగిదిన్ = వలె; తిరుగు = తిరుగుచుండును; వికసనమున = వికాసముతో; నేన్ = నేను; నొడవిన = చెప్పిన; నొడువులు = చదువులు; నొడువడు = చదవడు; దుడుకనిన్ = దుష్టుని; చదివింపన్ = చదివించుట; మా = మా; కున్ = కు; దుర్లభము = శక్యముకానిది; అధిపా = రాజా.
భావము:- ఓ మహారాజా! నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా మధు దానవుని పాలిటి శత్రువు అయిన ఆ విష్ణువు గురించి చెప్పటం మానడు. ఎప్పుడూ మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకు వాడిని చదివించటం మా వల్ల కాదు.

142
చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."
టీక:- చొక్కపు = స్వచ్ఛమైన; రక్కసి = రాక్షస; కులమున = వంశమున; వెక్కురు = వికారము పుట్టిన వాడు; జన్మించినాడు = పుట్టినాడు; విష్ణుని = హరి; అందున్ = ఎడల; నిక్కపు = సత్యమైన; మక్కువ = ప్రీతి; విడువండు = వదలడు; ఎక్కడి = ఎలాంటి; సుతున్ = పుత్రుని; కంటి = పుట్టింటిచితివి; రాక్షసేశ్వరా = రాక్షసరాజా; వెఱ్ఱిన్ = వెఱ్ఱివాడిని.
భావము:- స్వచ్ఛమైన రాక్షస వంశంలో వికృతమైనవాడు పుట్టాడు. ఎంత చెప్పిన విష్ణువుమీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!

143
అని యిట్లు గురుసుతుండు చెప్పినఁ గొడుకువలని విరోధవ్యవహారంబులు గర్ణరంధ్రంబుల ఖడ్గప్రహారంబు లయి సోఁకిన; బిట్టు మిట్టిపడి పాదాహతంబైన భుజంగంబు భంగిఁ బవనప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితం బయిన కంఠీరవంబుకైవడి భీషణ రోషరసావేశ జాజ్వల్యమాన చిత్తుండును బుత్రసంహారోద్యోగాయత్తుండును గంపమాన గాత్రుండును నరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మానకృత్యంబులు దప్పించి నిర్దయుండై యశనిసంకాశ భాషణంబుల నదల్చుచు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; గురుసుతుండు = గురువగు శుక్రుని కొడుకు; చెప్పినన్ = చెప్పగా; కొడుకు = కొడుకు; వలని = మూలమునైన; విరోధ = అయిష్ట; వ్యవహారంబులున్ = వర్తనలు; కర్ణ = చెవుల; రంధ్రంబులన్ = కన్నములను; ఖడ్గ = కత్తి; ప్రహారంబుల్ = వ్రేటులు; అయి = అయ్యి; సోకినన్ = తగులగా; బిట్టు = మిగుల; మిట్టిపడి = అదిరిపడి; పాదా = కాలిచే; ఆహతంబున్ = తన్నబడినది; ఐన = అయిన; భుజంగంబు = పాము; భంగిన్ = వలె; పవన = గాలిచే; ప్రేరితంబు = రగుల్కొల్పబడినది; ఐన = అయిన; దవానలంబు = కార్చిచ్చు; చందంబునన్ = వలె; దండ = కఱ్ఱతో; తాడితంబు = కొట్టబడినది; అయిన = ఐన; కంఠీరవంబు = సింహము; కైవడి = వలె; భీషణ = భయంకరమైన; రోషరస = కోపము; ఆవేశ = ఆవేశించుటచే; జాజ్వల్యమాన = మండుతున్న; చిత్తుండును = మనసు గలవాడును; పుత్ర = కొడుకును; సంహార = చంపెడి; ఉద్యోగ = ప్రయత్నము నందు; ఆయత్తుండును = లగ్నమైనవాడును; కంపమాన = వణకుచున్న; గాత్రుండును = మేను గలవాడును; అరుణీకృత = ఎఱ్ఱగా చేయబడిన; నేత్రుండును = కన్నులు గలవాడును; ఐ = అయ్యి; కొడుకును = పుత్రుని; రప్పించి = రప్పించి; సమ్మాన = గౌరవింపు; కృత్యంబులున్ = చేతలు; తప్పించి = తప్పించి; నిర్దయుండు = కరుణమాలినవాడు; ఐ = అయ్యి; అశని = పిడుగుల; సంకాశ = పోలిన; భాషణంబులన్ = మాటలతో; అదల్చుచు = బెదరించుచు.
భావము:- అని శుక్రాచార్యుని కొడుకు, ప్రహ్లాదుడి గురువు అన్నాడు. తన విరోధి విష్ణుమూర్తి మీద భక్తితో కూడిన స్వంత కొడుకు వ్యవహారాల గురించి వింటుంటే హిరణ్యకశిపుడికి చెవులలో కత్తులు గ్రుచ్చినట్లు అనిపించింది; రాక్షసేంద్రుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు; తోకత్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపంతో భగభగమండిపడిపోతూ, కన్నకొడుకును సంహరించాడానికి సిద్ధమయ్యాడు; కోపావేశంతో శరీరం ఊగిపోతోంది; కళ్ళు చింతనిప్పుల్లా ఎఱ్ఱబడుతున్నాయి; వెంటనే కొడుకును రప్పించాడు; వచ్చిన రాజకుమారుడిపై ఆదర ఆప్యాయతలు చూపలేదు; పైగా కఠినాత్ముడైన ఆ హిరణ్యకశిపుడు పలుకులలో పిడుగు కురిపిస్తూ, బెదిరించసాగాడు.

144
సూనున్ శాంతగుణప్రధాను నతి సంశుద్ధాంచితజ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.
టీక:- సూనున్ = పుత్రుని; శాంతగుణ = శాంతగుణములు; ప్రధానున్ = ముఖ్యముగా గలవానిని; అతి = మిక్కిలి; సంశుద్ధ = పరిశుద్ధమైన; అంచిత = పూజనీయమైన; జ్ఞానున్ = జ్ఞానము గలవానిని; అజ్ఞాన = అజ్ఞానము యనెడి; అరణ్య = అరణ్యమునకు; కృశానున్ = చిచ్చువంటివానిని; అంజలిపుటీ = ప్రణామాంజలిచే; సంభ్రాజమానున్ = ప్రకాశించువానిని; సదా = ఎల్లప్పుడును; శ్రీనారాయణ = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంట యెడల; చింతా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన = స్వీకరించుట యందు; అధీనున్ = లోనైనవానిని; ధిక్కరణంబు = తిరస్కారము; చేసి = చేసి; పలికెన్ = పలికెను; దేవాహితుండు = హిరణ్యకశిపుడు {దేవాహితుడు - దేవతలకు అహితుడు (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఉగ్రతన్ = క్రూరత్వముతో.
భావము:- ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అజ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.

145
"స్మదీయం బగు నాదేశమునఁ గాని;
మిక్కిలి రవి మింట మెఱయ వెఱచు;
న్ని కాలములందు నుకూలుఁడై కాని;
విద్వేషి యై గాలి వీవ వెఱచు;
త్ప్రతాపానల మందీకృతార్చి యై;
విచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు;
తిశాత యైన నా యాజ్ఞ నుల్లంఘించి;
మనుండు ప్రాణులఁ జంప వెఱచు;

నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచు;
మర కిన్నర గంధర్వ క్ష విహగ
నాగ విద్యాధరావళి నాకు వెఱచు;
నేల వెఱువవు పలువ! నీ కేది దిక్కు.
టీక:- అస్మదీయంబు = నాది; అగు = అయిన; ఆదేశమునన్ = ఆజ్ఞచేత; కాని = తప్పించి; మిక్కిలి = అధికముగా; రవి = సూర్యుడు; మింటన్ = ఆకాశమున; మెఱయన్ = ప్రకాశించుటకు; వెఱచున్ = బెదురును; అన్ని = అన్ని; కాలములు = ఋతువుల; అందున్ = లోను; అనుకూలుండు = అనుకూలముగా నుండువాడు; ఐ = అయ్యి; కాని = తప్పించి; విద్వేషి = అహితుడు; ఐ = అయ్యి; గాలి = వాయువు; వీవన్ = వీచుటకు; వెఱచున్ = బెదురును; మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమము యనెడి; అనల = అగ్నిచే; మందీకృత = మందగింపబడినవాడు; ఐ = అయ్యి; విచ్చలవిడిన్ = తన యిచ్చానుసారము; అగ్ని = అగ్ని; వెలుగన్ = మండుటకు; వెఱచున్ = బెదరును; అతి = మిక్కిలి; శాత = తీవ్రమైనది; ఐన = అయిన; నా = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘించి = అతిక్రమించి; శమనుండు = యముడు {శమనుండు - పాపములను శమింప చేయువాడు, యముడు}; ప్రాణులన్ = జీవులను; చంపన్ = సంహరించుటకు; వెఱచున్ = బెదరును; ఇంద్రుడు = ఇంద్రుడు; ఔదల = తలను.
నా = నా యొక్క; మ్రోలన్ = ఎదుట; ఎత్తన్ = ఎత్తుటకు; వెఱచున్ = బెదరును; అమర = దేవతల; కిన్నర = కిన్నరల; గంధర్వ = గంధర్వుల; యక్ష = యక్షుల; విహగ = పక్షుల; నాగ = సర్పముల; విద్యాధరా = విద్యాధరుల; ఆవళి = సమూహములు; వెఱచున్ = బెదరును; ఏల = ఎందుకు; వేఱవవు = బెదరవు; పలువ = దుర్జనుడా; నీ = నీ; కున్ = కు; ఏది = ఎక్కడ ఉన్నది; దిక్కు = రక్షించెడి ప్రాపు.
భావము:- “ఓ దుష్టుడా! నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా గట్టిగా ప్రకాశించడానికి బెదురుతాడు; వాయువు కూడా అన్ని కాలాలలోనూ అనుకూలంగానే వీస్తాడు తప్పించి అహితుడుగా వీచటానికి భయపడతాడు; అగ్నిహోత్రుడు కూడా దేదీప్యమానమైన నా ప్రతాపం ముందు మందంగా వెలుగుతాడు తప్పించి, ఇష్టానుసారం చెలరేగి మండటానికి భయపడతాడు; పాపులను శిక్షించే యముడు కూడా బహు తీక్షణమైన నా ఆజ్ఞను కాదని ప్రాణుల ప్రాణాలు తీయటానికి వెరుస్తాడు; ఇంద్రుడికి కూడా నా ముందు తల యెత్తే ధైర్యం లేదు; దేవతలైనా, కిన్నరులైనా, యక్షులైనా, పక్షులైనా, నాగులైనా, గంధర్వులైనా, విద్యాధరులైనా, నేనంటే భయపడి పారిపోవలసిందే; అలాంటిది నువ్వు ఇంత కూడా లేవు. నేనంటే నీకు భయం ఎందుకు లేదు? ఇక్కడ నీకు దిక్కు ఎవరు? ఎవరి అండ చూసుకుని ఇంత మిడిసిపడి పోతున్నావు?

146
ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంద్ధ్వేషు లయ్యున్ మదీ
యాజ్ఞాభంగము చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్ వివే
జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి? సాహంకారతన్ దుర్మతీ!
టీక:- ప్రజ్ఞావంతులు = శక్తియుక్తులు గలిగిన; లోకపాలకులు = ఇంద్రుడు మొదలగువారు; శుంభత్ = వృద్ధి నొందుతున్న; ద్వేషులు = పగ గలవారు; అయ్యున్ = అయినప్పటికిని; మదీయ = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; భంగము = దాటుట; చేయన్ = చేయుటకు; ఓడుదురు = బెదరెదరు; రోష = రోషముతో; అపాంగ = కడకంటి; దృష్టిన్ = చూపువలన; వివేక = మంచి చెడ్డల నెరిగెడి; జ్ఞాన = తెలివి; చ్యుతము = జారినది; ఐ = అయ్యి; జగత్త్రితయమున్ = ముల్లోకములు {ముల్లోకములు - భూలోకము స్వర్గలోకము పాతాళలోకము}; కంపించున్ = వణకిపోవును; నీవు = నీవు; ఇట్టిచోన్ = ఇలాంటి పరిస్థితిలో; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనమున్ = దాటుట; ఎట్లు = ఎలా; చేసితివి = చేసితివి; సాహంకారతన్ = పొగరుబోతుతనముతో; దుర్మతీ = చెడ్డబుద్ధి గలవాడా.
భావము:- దుర్బుద్ధీ! మహా ప్రతాపవంతులు అయిన దిక్పాలకులు, నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటున్నా కూడా, నా మాట జవదాటటానికి బెదురుతారు; నేను కోపంతో కడకంట చూసానంటే చాలు, ముల్లోకాలూ వివేక, విజ్ఞానాలు కోల్పోయి అల్లకల్లోలం అవుతాయి; అలాంటిది, అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు?

147
కంక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్.
టీక:- కంఠ = గొంతు; క్షోభము = నొప్పిపెట్టినది; కాగన్ = అయ్యేలా; ఒత్తిలి = గట్టిగా; మహా = మిక్కిలి; గాఢంబుగా = తీవ్రముగా; డింభ = కుఱ్ఱవాడా; వైకుంఠున్ = విష్ణుని; చెప్పెదు = చెప్పెదవు; దుర్జయుండు = జయింపరానివాడు; అనుచున్ = అనుచు; వైకుంఠుండు = విష్ణువు {వైకుంఠుడు - కుంఠము (ఓటమి) లేనివాడు, విష్ణువు}; వీరవ్రత = యుద్ధము నందలి; ఉత్కంఠా = వేడుక; ఆబంధురుడు = దట్టముగా గలవాడు; ఏని = అయినచో; నేన్ = నేను; అమరులన్ = దేవతలను {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; ఖండింపన్ = నరకుచుండగా; దండింపగాన్ = శిక్షించుచుండగా; కుంఠీభూతుడు = వెనకకి తగ్గువాడు; కాక = కాకుండగ; రా = రా; వలదె = వద్దా; మత్ = నా యొక్క; ఘోర = భయంకరమైన; ఆహవ = యుద్ధ; క్షోణికిన్ = రంగమునకు.
భావము:- అర్భకా! వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలుకాదు అంటూ గొంతు చించుకుని గట్టిగా తెగ అరుస్తున్నావు కానీ, అతనికే పౌరుషం వీరత్వం ఉంటే, నేను యుద్ధరంగంలో దేవతలను ఖండించేటప్పుడూ, దండించేటప్పుడూ భయపడకుండా వాళ్ళను రక్షించడానికి, నా ముందుకు రావాలి కదా?

148
చార్యోక్తము గాక బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ
వాచాలత్వముఁ జూపి విష్ణు నహితున్ ర్ణించి మ ద్దైత్య వం
శాచారంబులు నీఱు చేసితివి మూఢాత్ముం గులద్రోహి నిన్
నీచుం జంపుట మేలు చంపి కులమున్ నిర్దోషముం జేసెదన్.
టీక:- ఆచార్య = గురువుచేత; ఉక్తము = చెప్పబడినది; కాక = కాకుండగ; బాలుర = పిల్లల; కున్ = కు; మోక్ష = ముక్తిపదమందు; ఆసక్తిన్ = ఆసక్తిని; పుట్టించి = కలిగించి; నీ = నీ యొక్క; వాచాలత్వమున్ = వాగుడును; చూపి = చూపించి; విష్ణున్ = హరిని; అహితున్ = శత్రువును; వర్ణించి = పొగడి; మత్ = నా; దైత్య = రాక్షస; వంశ = కులపు; ఆచారంబులున్ = ఆచారములను; నీఱు = బూడిద; చేసితివి = చేసితివి; మూఢాత్మున్ = మూర్ఖుడను; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయువాడను; నిన్ = నిన్ను; నీచున్ = నీచుడను; చంపుట = సంహరించుట; మేలు = మంచిది, ఉత్తమము; చంపి = సంహరించి; కులమున్ = వంశమును; నిర్దోషమున్ = దోషములేనిదిగా; చేసెదన్ = చేసెదను.
భావము:- ఆచార్యులు చెప్పింది నువ్వు వినటంలేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు; నీ వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చిమాటలతో పొగడుతున్నావు; మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ బూడిదపాలు చేశావు; నువ్వు కులద్రోహివి; మూఢుడివి; నీచుడివి; నీవంటి వాడిని చంపడమే మంచిపని. నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను.

149
దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేఱొక
దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్."
టీక:- దిక్కులు = దిక్కుల చివర వరకు; గెలిచితిన్ = జయించితి; అన్నియున్ = సర్వమును; దిక్కు = శరణు; ఎవ్వడు = ఎవడు; ఓరి = ఓరి; నీ = నీ; కున్ = కు; దేవేంద్ర = ఇంద్రుడు; ఆదుల్ = మొదలగువారు; దిక్కులరాజులు = దిక్పాలకులు {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పు) 2అగ్నిదేవుడు (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరుతి) 5పడమర (వరుణుడు) 6వాయువు (వాయవ్యము) 7ఉత్తరము (కుబేరుడు) 8ఈశాన్యము (ఈశానుడు)}; వేఱొక = మరింకొక; దిక్కు = ప్రాపు, శరణు; ఎఱుగక = తెలియక; కొలుతురు = సేవింతురు; ఇతడె = ఇతడు మాత్రమే; దిక్కు = శరణు; అని = అని; నన్నున్ = నన్ను.
భావము:- ఓరీ!అన్ని దిక్కుల చివర్ల వరకూ ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలుకులు అందరూ ఏ దిక్కూలేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మ్రొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో.

150
వంతుఁడ నే జగముల
ములతోఁ జనక వీరభావమున మహా
లుల జయించితి నెవ్వని
మున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."
టీక:- బలవంతుడ = శక్తిశాలిని; నేన్ = నేను; జగములన్ = లోకములను; బలముల = సైన్యముల; తోన్ = తోటి; చనక = వెళ్ళక; వీరభావమునన్ = శూరత్వముతో; మహా = మిగుల; బలులన్ = బలవంతులను; జయించితిన్ = నెగ్గితిని; ఎవ్వని = ఎవని; బలమునన్ = దన్నుతో; ఆడెదవు = పలికెదవు; నా = నా; కున్ = కు; ప్రతివీరుడవు = ఎదిరించెడి శూరుడవు; ఐ = అయ్యి.
భావము:- బాలకా! ప్రహ్లాద! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి; సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి; అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు.”

151
అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; మెల్లన = మెల్లిగా; వినయంబునన్ = అణకువతో; కొడుకు = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

152
"బయుతులకు దుర్భలులకు
మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
మెవ్వఁడు ప్రాణులకును
మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!
టీక:- బలయుతుల్ = బలముగలవారల; కున్ = కు; దుర్బలుల్ = బలములేనివారల; కున్ = కు; బలము = అండ; ఎవ్వడు = ఎవరో; నీ = నీ; కున్ = కు; నా = నా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; కున్ = కు; బలము = ప్రాపు, శరణు; ఎవ్వడు = ఎవరో; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; బలము = అండ; ఎవ్వండు = ఎవరో; అట్టి = అటువంటి; విభుడు = ప్రభువు; బలము = అండ; అసురేంద్రా = రాక్షసరాజా.
భావము:- హిరణ్యకశిప రాక్షసరాజ! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు వారికి, సృష్ణిలోని సర్వ ప్రాణులకు అందరికి శరణు అయిన వాడు ఎవరో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు.
అందానికి పెట్టిందిపేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోటంలేదని హిరణ్యకశిపుడు దండిస్తుంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కెవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనులవారు.

153
దిక్కులు కాలముతో నే
దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!
టీక:- దిక్కులు = దిక్కులన్నియు; కాలము = కాలము; తోన్ = తోపాటు; ఏ = ఎట్టి; దిక్కునన్ = ఎక్కడాకూడ; లేకుండున్ = లేకుండపోవునో; కలుగు = ఉన్నట్టి; దిక్కుల = గతులన్నిటికిని; మొదలు = మూలము; ఐ = అయ్యి; దిక్కు = ప్రాపు, అండ; కల = కలిగిన; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; దిక్కు = అండ; అయ్యెడు = అగునట్టి; వాడు = అతడు; నా = నా; కున్ = కు; దిక్కు = రక్షకుడు; మహాత్మా = గొప్పవాడ.
భావము:- ఓ మహనీయుడైన తండ్రి గారు! ఈ దేశకాలాదుల ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.
అన్ని దిక్కులలోను తిరుగులేని నన్ను కాదని నీకు దిక్కు అయ్యేవాడు ఎవడురా అని తర్జిస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు సమాధానం చెప్తూ సృష్టితత్వాన్ని సూచిస్తున్నాడు. ప్రాస, ప్రాసపూర్వస్థానం నాలుగు పాదాలకు, యతి దాని తరువాతి స్థానాలు రెంటికి అక్షరసామ్యం వాడిన పద్యం నడక సందర్భోచితంగా ఉంది. నాలుగు దిక్కుల ఆధారం స్థిరత్వం సూచిస్తోంది. దిక్కును ఆరు సార్లు వాడుట నల్దిద్దులు పైన కింద సూచిస్తు అంతటా ధ్వనిపం జేస్తోంది. దిక్కుకి ఎల్ల లేదా అవధి, చోటు, తూర్పాది దిక్కులు, ఆధారం, అండ రక్షణ అనే అర్థాలు ధ్వనింపజేసిన తీరు అద్భుతం. ఒక్క దిక్కుకి, ఆరు దిక్కులతో వినయంగా సమాధానం చెప్పటంలో ప్రహ్లాదుని వ్యక్తిత్వ విశిష్ఠత వ్యక్తం అవుతోంది.

154
కాలరూపంబులఁ గ్రమ విశేషంబుల;
లఘు గుణాశ్రయుం యిన విభుఁడు
త్త్వబలేంద్రియ హజ ప్రభావాత్ముఁ;
డై వినోదంబున ఖిలజగముఁ
ల్పించు రక్షించు ఖండించు నవ్యయుం;
న్ని రూపము లందు తఁడు గలఁడు
చిత్తంబు సమముగాఁ జేయుము మార్గంబుఁ;
ప్పి వర్తించు చిత్తంబుకంటె

వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక?
చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
దయుతాసురభావంబు మానవయ్య!
య్య! నీ మ్రోల మేలాడయ్య! జనులు.
టీక:- కాల = కాలము నందు; రూపంబులన్ = రూపము లందు; క్రమ = పద్ధతు లందు; విశేషంబులన్ = ప్రత్యేకత లందు; అలఘు = గొప్ప; గుణ = గుణములకు; ఆశ్రయుండు = కారణము; అయిన = ఐన; విభుడు = ప్రభువు; సత్త్వ = పృథివ్యాది ద్రవ్యము {పృథివ్యాది - సత్త్వములు, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; బల = శక్తి; ఇంద్రియ = సాధనసంపత్తి; సహజ = నైజమైన; ప్రభావము = మహిమ; ఆత్ముడు = కలిగినవాడు; ఐ = అయ్యి; వినోదంబునన్ = క్రీడవలె; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వమును; కల్పించున్ = సృష్టించును; రక్షించును = కాపాడును; ఖండించున్ = నాశనము చేయును; అవ్యయుండు = నాశము లేనివాడు; అన్ని = సర్వ; రూపముల్ = రూపముల, బింబముల; అందున్ = లోను; అతడు = అతడు; కలడు = ఉన్నాడు; చిత్తంబున్ = మనసును; సమము = సమానముగా నున్నది; కాన్ = అగునట్లు; చేయుము = చేయుము; మార్గంబున్ = మంచిత్రోవను; తప్పి = తొలగి; వర్తించు = తిరిగెడు; చిత్తంబున్ = మనసు; కంటెన్ = కంటె.
వైరులు = శత్రువులు; ఎవ్వరు = ఎవరుంటారు; చిత్తంబున్ = మనసు; వైరి = శత్రువు; కాక = కాకుండగ; చిత్తమును = మనసును; నీ = నీ; కున్ = కు; వశము = లొంగియుండునది; కాన్ = అగునట్లు; చేయవు = చేయుము; అయ్య = తండ్రి; మద = గర్వముతో; యుత = కూడిన; అసుర = రాక్షస; భావంబున్ = తలపులను; మానవు = మునివేయుము; అయ్య = తండ్రి; అయ్య = తండ్రి; నీ = నీ; మ్రోలన్ = ఎదుట; మేలు = మంచి; ఆడరు = చెప్పరు; అయ్య = తండ్రి; జనులు = ప్రజలు.
భావము:- నాన్నగారూ! ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ ప్రభువు విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు నిధి. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్నిసృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికి “చిత్తం, చిత్తం” అంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పటం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటం లేదు.

155
లోము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!
టీక:- లోకముల్ = లోములను; అన్నియున్ = అన్నిటిని; గడియ = కొద్దికాలము; లోనన్ = లోనే; జయించినవాడవు = నెగ్గినాడవు; ఇంద్రియ = ఇంద్రియముల; అనీకము = సమూహము; చిత్తమున్ = మనసు; గెలువన్ = నెగ్గుట; నేరవు = చేయలేవు; నిన్నున్ = నిన్ను; నిబద్ధున్ = బంధనముల జిక్కుకొనిన వానిగ; చేయున్ = చేయును; నీ = నీ యొక్క; భీకర = భయంకరమైన; శత్రులార్వులన్ = అరిషడ్వర్గములను; ప్రభిన్నులన్ = ఓడినవారినిగా; చేయుము = చేయుము; ప్రాణి = జీవ; కోటి = జాలము; లోన్ = అందు; నీ = నీ; కున్ = కు; విరోధి = శత్రువు; లేడు = లేడు; ఒకడు = మరియొకడు; నేర్పునన్ = వివేకముతో; చూడుము = ఆలోచించుము; దానవేశ్వరా = రాక్షసరాజా.
భావము:- నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.

156
పాలింపుము శేముషి ను
న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్."
టీక:- పాలింపుము = నియమించుము; శేముషిన్ = బుద్ధిని; ఉన్మూలింపుము = తెంచివేయుము; కర్మ = కర్మములనెడి; బంధములన్ = కట్టుతాళ్ళను; సమదృష్టిన్ = సమత్వభావముతో; చాలింపుము = చాలింపుము; సంసారమున్ = సంసారమును; కీలింపుము = నాటుకొనజేయుము; హృదయము = హృదయము; అందున్ = లో; కేశవ = విష్ణు {కేశవుడు - బ్రహ్మరుద్రాదులును తన స్వరూపముగాగలవాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తిని.
భావము:- మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి.”

157
అనినఁ బరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; పరమ = అత్యుత్తములైన; భాగవత = భాగవతులలో; శేఖరున్ = శిఖరమువలె మేలైనవాని; కున్ = కి; దోషాచర = రాక్షసులలో {దోషాచరుడు - దోష (రాత్రులందు) చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; శేఖరుండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని పలికాడు పరమ భక్తశిఖామణి ప్రహ్లాదుడు. విన్న దోషమార్గానువర్తి అయిన ఆ రాక్షస శిఖామణి హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు.

158
"చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! ఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!
టీక:- చంపినన్ = చంపితే; చచ్చెదను = చచ్చిపోతాను; అనుచునున్ = అని తలచుకొని; కంపింపకన్ = బెదరక; ఓరి = ఓరి; పలువ = తులువా; కఠిన = గడుసు; ఉక్తులన్ = మాటలతో; నన్ = నన్ను; కుంపించెదు = బాధించెదవు, అతిక్రమించెదవు; చావు = మరణమున; కున్ = కు; తెంపరి = తెగించినవాడవు; ఐ = అయ్యి; వదరు = ప్రేలెడి; వానిన్ = వాని; తెఱగునన్ = విధముగ; కుమతి = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:- “దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.

159
నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ
భూశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం ల్మాఱు నారాయణుం
డే ద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ!
టీక:- నా = నా; తోడన్ = తోటే; ప్రతిభాషలు = ఎదురు తిరిగి వాదనలు; ఆడెదవు = చేసెదవు; జగత్ = లోకములకే; నాథుండన్ = ప్రభువును; నా = నా; కంటెన్ = కంటె; ఈ = ఈ; భూత = జీవముల; శ్రేణి = సమూహముల; కిన్ = కు; రాజు = ప్రభువు; లేడు = లేడు; ఒకడు = ఇంకొకడు; సంపూర్ణ = పూర్తి, మిక్కిలి; ప్రభావుండు = మహిమ గలవాడు; మత్ = నా యొక్క; భ్రాతన్ = సోదరుని; చంపినన్ = చంపగా; మున్ను = ఇంతకు పూర్వము; నేన్ = నేను; వెదకితిన్ = అన్వేషించితిని; పలు = అనేక; మాఱు = మార్లు, పర్యాయములు; నారాయణుండు = విష్ణువు {నారాయణుడు - నరసంబంధ దేహముతో యవతారములను పొందువాడు, విష్ణువు}; ఏతత్ = ఈ; విశ్వము = జగత్తు; లోనన్ = అందు; లేడు = లేడు; మఱి = ఇంక; వాడు = అతడు; ఎందు = ఎక్కడ; ఉండురా = ఉంటాడురా; దుర్మతీ = చెడ్డబుద్ధి గలవాడా.
భావము:- ఓ దుర్భుద్ధీ! నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.”

160
క్కడఁ గలఁ డే క్రియ నే
క్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం
క్కడఁతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్."
టీక:- ఎక్కడ = ఎక్కడ; కలడు = ఉన్నాడు; ఏ = ఎట్టి; క్రియన్ = విధముగ; ఏ = ఏ; చక్కటిన్ = స్థలము నందు; వర్తించున్ = తిరుగుచుండును; ఎట్టి = ఎలాంటి; జాడనున్ = దారిలో; వచ్చున్ = వచ్చును; చక్కడతున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్నును; విష్ణునిన్ = విష్ణువును; పెక్కులున్ = అధికముగా; ప్రేలెదవు = వదరెదవు; వాని = అతని; భృత్యుని = సేవకుని, బంటు; పగిదిన్ = వలె.
భావము:- విష్ణువును సేవకుడిలా తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతు ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు”

161
అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; హరి = విష్ణు; కింకరుండు = దాసుడు; శంకింపక = జంకక; హర్ష = సంతోషమువలన; పులకాంకుర = గగుర్పాటు; సంకలిత = కలిగిన; విగ్రహుండు = రూపము గలవాడు; ఐ = అయ్యి; ఆగ్రహంబు = కోపము; లేక = లేకుండగ; హృదయమున = హృదయ మందు; హరిన్ = విష్ణుని; తలంచి = స్మరించి; నమస్కరించి = నమస్కారము చేసి; బాల = చిన్నపిల్లవాని; వర్తనంబునన్ = నడవడికతో; నర్తనంబు = నాట్యము; చేయుచున్ = చేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేసాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.

162
"లఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
లఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ద్యోత చంద్రాత్మలం
లఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింవ్యక్తులం దంతటం
లఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
టీక:- కలడు = ఉన్నాడు; అంభోధిన్ = సముద్రములలోను; కలండు = ఉన్నాడు; గాలిన్ = గాలిలోను; కలడు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశములోను; కుంభినిన్ = భూమి యందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పులోను; దిశలన్ = దిక్కు లన్నిటి యందును; పగళ్ళన్ = దినము లందును; నిశలన్ = రాత్రుల యందును; ఖద్యోత = సూర్యుని {ఖద్యోతము - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు}; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మ లందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారము నందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తు లందును {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2 విష్ణు 3మహేశ్వరులు}; త్రిలింగ = స్త్రీ పురుష నపుంసక {త్రిలింగములు - 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము}; వ్యక్తులన్ = జాతులవారి; అందున్ = అందు; అంతటన్ = అంతటను; కలడు = ఉన్నాడు; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములు గలవాడు, విష్ణువు}; కలండు = ఉన్నాడు; తండ్రి = తండ్రీ; వెదుకంగన్ = అన్వేషించుట; ఏల = ఎందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా.
భావము:- నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంత మందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!

163
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి ర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."
టీక:- ఇందు = దీనిలో, ఇక్కడ; కలడు = ఉన్నాడు; అందు = దానిలో, అక్కడ; లేడు = లేడు; అని = అని; సందేహము = అనుమానము; వలదు = వద్దు; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ఆయుధముగా గలవాడు, విష్ణువు}; సర్వ = అన్నిటి యందు; ఉపగతుండు = ఉండువాడు; ఎందెందు = ఎక్కడెక్కడ; వెదకి = వెదకి; చూచినన్ = చూసినచో; అందందే = అక్కడెల్లను; కలడు = ఉన్నాడు; దానవాగ్రణి = రాక్షసరాజా; వింటే = వింటివా.
భావము:- ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!”
ఇది అతిమధురమైన పద్యం. పోతనగారిది ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నాముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా (పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి). ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఈ రెంటిన చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తున్నట్లు చెప్తారు కదా. అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బావుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత ‘హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ‘ఎందెందు’, ‘అందందు’ చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట.

164
అని యి వ్విధంబున.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- అలా ఈ విధంగా

165
"రి సర్వాకృతులం గలం" డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ" డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
సింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్క గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.
టీక:- హరి = నారాయణుడు; సర్వ = ఎల్ల; ఆకృతులన్ = రూపము లందును; కలండు = ఉన్నాడు; అనుచున్ = అనుచు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; భాషింపన్ = పలుకగా; సత్వరుడు = తొందర గలవాడు; ఐ = అయ్యి; ఎందును = ఎక్కడను; లేడు = లేడు; లేడు = లేడు; అని = అని; సుతున్ = పుత్రుని; దైత్యుండు = రాక్షసుడు; తర్జింపన్ = బెదిరించగా; శ్రీ = శోభన యుక్తమైన; నరసింహ = నరసింహ; ఆకృతిన్ = రూపముతో; ఉండెన్ = ఉండెను; అచ్యుతుడు = నారాయణుడు; నానా = పలురకముల; జంగమస్థావర = చరాచర; ఉత్కర = సమూహముల; గర్భంబులన్ = అంతర్భాగములలో; అన్ని = సమస్తమైన; దేశములన్ = చోటు లందును; ఉద్దండ = గొప్ప; ప్రభావంబునన్ = మహిమతో.
భావము:- ఈ విధంగా ప్రహ్లాదుడు "భగవంతుడు సర్వ నామ రూపధారు లందు అంతట ఉన్నాడు." అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు "ఎక్కడా లేడు" అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.
భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధుర మైన పంటలలో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతను ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బలమైంది, కవిత్వం మిక్కిలి ఉన్నత మైంది, సాహిత్యం ఉత్కృష్ట మైంది, విలువలు అపార మైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు} పరమ భక్తుడు సాత్వికుడు ఓర్పు శ్రద్ధలకు మారు పేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు {హిరణ్యకశిపుడు – హిరణ్యము (బంగారము, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి) కశిపుడు (పరపు, విరివి కల వాడు), దానవుడు} పరమ బలాఢ్యు డైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ఠ. మరి కథలో బలానికి లోటే ముంటుంది. చదివించిరి, దిక్కులు గెలిచితి, కల డంభోధి, ఇందు గల డందు లాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జనసామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టా లెదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు. నారసింహ తత్వపు భక్తుని ఎడ భగవంతుడు చూపే అత్యద్భుత మైన వాత్యల్య విలువలు తిరుగు లేనివి. ఎంతటి భయంకర మైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తు ఉంటే ఎట్టి పరిస్థితులలో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్వితమే.
ఓం నరసింహ వషట్కారాయః నమః

166
అయ్యవసరంబున నద్దానవేంద్రుండు.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆ = ఆ; దానవేంద్రుండు = రాక్షసరాజు.
భావము:- ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని కొడుకు ప్రహ్లాదుడు చెప్పగా, తండ్రి హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.

167
"డింక సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు నుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె క్రిన్ గిక్రిన్.
టీక:- డింభక = కుఱ్ఱవాడా; సర్వ = ఎల్ల; స్థలములన్ = ప్రదేశము లందును; అంభోరుహనేత్రుఁడు = హరి {అంభోరుహనేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; ఉండున్ = ఉంటాడు; అనుచున్ = అనుచు; మిగులన్ = మిక్కిలి; సంరంభంబునన్ = ఆటోపముతో; పలికెదవు = చెప్పెదవు; ఈ = ఈ; స్తంభంబునన్ = స్తంభము నందు; చూపగలవె = చూపించగలవా; చక్రిన్ = విష్ణుని; గిక్రిన్ = గిక్రిని (చక్రికి ఎగతాళిరూపము).
భావము:- “ఓరి డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.

168
స్తంమునఁ జూపవేనిం
గుంభిని నీ శిరముఁ ద్రుంచి కూల్పఁగ రక్షా
రంమున వచ్చి హరి వి
స్రంభంబున నడ్డపడఁగ క్తుం డగునే."
టీక:- స్తంభమునన్ = స్తంభము నందు; చూపవేనిన్ = చూపకున్నచో; కుంభినిన్ = నేలపైన; నీ = నీ యొక్క; శిరమున్ = తలను; త్రుంచి = నరకి; కూల్పగన్ = పడవేయుచుండగ; రక్షా = కాపాడెడి; ఆరంభమునన్ = ప్రయత్నములో; వచ్చి = వచ్చి; హరి = విష్ణువు; విస్రంభంబునన్ = నమ్మకముగా; అడ్డపడగన్ = అడ్డుపడుటకు; శక్తుండు = చాలినవాడు; అగునా = కాగలడా.
భావము:- నువ్వు చెప్పినట్లు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే, ఎలాగూ నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను కదా. అప్పుడు నిన్ను కాపాడటానికి విష్ణువు రాగలడా? అడ్డు పడగలడా?”

169
అనిన భక్తవత్సలుని భటుం డి ట్లనియె.
టీక:- అనినన్ = అనగా; భక్తవత్సలుని = విష్ణుని {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్యల్యము గలవాడు, విష్ణువు}; భటుండు = దాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా తండ్రి పెద్దగా గద్దించాడు. భక్తవత్సలుని పరమ భక్తుడైన ఆ ప్రహ్లాదుడు ఇలా పలికాడు.

170
"అంభోజాసనుఁ డాదిగాఁగ దృణపర్యంతంబు విశ్వాత్ముఁడై
సంభావంబున నుండు ప్రోడ విపులస్తంభంబునం దుండడే?
స్తంభాంతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు ని
ర్దంత్వంబున నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్."
టీక:- అంభోజాసనుడు = బ్రహ్మదేవుడు {అంభోజసనుడు - అంభోజ (పద్మము) ఆసనుడు (ఆసనముగ గలవాడు), బ్రహ్మదేవుడు}; ఆదిగా = మొదలుపెట్టి; తృణ = గడ్డిపరక; పర్యంతంబున్ = వరకు; విశ్వాత్ముడు = విశ్వమం దంతటను గలవాడు; ఐ = అయ్యి; సంభావంబునన్ = ఆదరముతో; ఉండు = ఉండెడి; ప్రోడ = నేరుపుకాడు; విపుల = పెద్ద; స్తంభంబున్ = స్తంభము; అందున్ = లో; ఉండడే = ఉండడా ఏమి, తప్పక ఉండును; స్తంభ = స్తంభము; అంతర్గతుండు = లోనుండువాడు; అయ్యున్ = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏ = ఏమాత్రము; సందేహము = అనుమానము; లేదు = లేదు; నిర్దంభత్వంబునన్ = నిష్కపటముగ; నేడున్ = ఇప్పుడు; కానబడున్ = కనబడును; ప్రత్యక్ష = కన్నుల కగుపడు; స్వరూపంబునన్ = నిజరూపముతో.
భావము:- “ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డిపరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా”

171
అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి యొఱఁబెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరించుచు.
టీక:- అనినన్ = అనగా; విని = విని; కరాళించి = బొబ్బరిల్లి; గ్రద్దనన్ = చటుక్కున; లేచి = లేచి; గద్దియన్ = సింహాసనమును; డిగ్గనుఱికి = దిగదుమికి; ఒఱన్ = ఒరలో; పెట్టిన = పెట్టిన; ఖడ్గంబున్ = కత్తిని; పెఱికి = బయటకుతీసి, దూసి; కేలన్ = చేతిలో; అమర్చి = పట్టుకొని; జళిపించుచు = ఆడించుచు; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో; శిఖామణి = ఉత్తముడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; ధిక్కరించుచు = తిరస్కరించుచు.
భావము:- అలా అనే సరికి హిరణ్యాక్షుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసాడు. చివాలున లేచి సింహాసనం మీంచి క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు.

172
విరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం
ని భాషించెద; వైన నిందుఁ గలఁడే” యంచున్ మదోద్రేకియై
నుజేంద్రుం డరచేత వ్రేసెను మహోగ్ర ప్రభా శుంభమున్
దృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.
టీక:- వినరా = వినుము; డింభక = పిల్లవాడా; మూఢ = మూర్ఖపు; చిత్త = బుద్ధి గలవాడ; గరిమన్ = గొప్పగ, గట్టిగ; విష్ణుండు = హరి; విశ్వాత్మకుండు = విశ్వ మందంతటను గలవాడు; అని = అని; భాషించెదవు = అనుచున్నావు కదా; ఐనన్ = అయినచో; ఇందున్ = దీనిలో; కలడే = ఉన్నాడా; అంచున్ = అనుచు; మద = మదముచేత; ఉద్రేకి = అతిశయము చెందినవాడు; ఐ = అయ్యి; దనుజ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; అరచేతన్ = అరచేతితో; వ్రేసెను = దెబ్బకొట్టెను; మహ = గొప్ప; ఉదగ్ర = పొడవైన, భయంకరమైన; ప్రభా = కాంతులచే; శుంభమున్ = ప్రకాశించుచున్నదానిని; జన = ప్రజల; దృక్ = చూపులకు; భీషణ = భయముగొలుపు; దంభమున్ = డంబము గలదానిని; హరి = విష్ణుని (నరసింహుని); జనుః = ఆవిర్భావము యొక్క; సంరంభమున్ = ఆటోపము గలదానిని; స్తంభమున్ = స్తంభమును.
భావము:- “ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి, భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.

నృసింహరూప ఆవిర్భావము

173
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; దానవ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; పరిగృహ్యమాణ = చేపట్టినట్టి; వైరుండును = విరోధము గలవాడును; వైర = విరోధము యొక్క; అనుబంధ = సంబంధముచేత; జాజ్వల్యమాన = మండుచున్న; రోషా = కోపము యనెడి; అనలుండును = అగ్ని గలవాడు; రోషా = కోపము యనెడి; అనల = అగ్నిచే; జంఘన్యమాన = నశింపజేయబడుతున్న; విజ్ఞాన = వివేకము; వినయుండును = అణకువ గలవాడును; వినయ = అణకువ; గాంభీర్య = గాంభీర్యము; ధైర్య = ధైర్యములచే; జేగీయమాన = పొగడబడుచున్న; హృదయుండును = హృదయము గలవాడు; హృదయ = హృదయము యొక్క; చాంచల్యమాన = రేగుచున్న; తామసుండును = తమోగుణము గలవాడును; తామసగుణ = తమోగుణములచేత; చంక్రమ్యమాణ = క్రమ్ముకొనబడిన; స్థైర్యుండున్ = దిట్టదనము గలవాడు; ఐ = అయ్యి; విస్రంభంబునన్ = నమ్మకముతో; హుంకరించి = హుమ్మని యరచి; బాలుని = ప్రహ్లాదుని; ధిక్కరించి = తిరస్కరించి; హరిన్ = విష్ణుని; ఇందున్ = దీనిలో; చూపుము = చూపించుము; అని = అని; కనత్ = మెరుస్తున్న; కనక = బంగారపు; మణి = మణుల; మయ = ఖచితమైన; కంకణ = కంకణముల; క్రేంకార = క్రేంయనెడి; శబ్ద = శబ్దముతో; పూర్వకంబుగా = నిండినదిగా; దిగ్దంతి = దిగ్గజముల; దంత = దంతములను; భేదన = బద్దలుచేయ; పాటవ = సమర్థత గల; ప్రశస్తంబు = ప్రసిద్ధికెక్కినది; అగు = అయిన; హస్తంబునన్ = చేతితో; సభామండప = కొలువుకూటము యొక్క; స్తంభంబున్ = స్తంభమును; వ్రేసినన్ = కొట్టగా; వ్రేటు = దెబ్బ; తోడనన్ = తోటే; దశదిశలనున్ = పది దిక్కు లందును {దశదిశలు - (4) దిక్కులు (4) విదిక్కులు (2) ఊర్ధ్వధోదిక్కులు}; మిడుంగురులు = నిప్పుకణములు; చెదరన్ = చెదురుచు; చిటిలి = చిట్లిపోయి; పెటిలిపడి = పగిలిపోయి; బంభజ్యమానంబు = బ్రద్ధలుకొట్టబడినది; అగు = అయిన; ఆ = ఆ; మహా = పెద్ద; స్తంభంబు = స్తంభము; వలన = వలన; ప్రళయ = ప్రళయ; వేళా = కాలమున; సంభూత = సంభవించెడి; సప్త = ఏడు (7) విధములైన {సప్తస్కంధములు - 1ఆవహము 2ప్రవహము 3సంవహము 4ఉద్వహము 5నివహము 6పరివహము 7పరావహము యనెడి సప్తవిధవాయువులు}; స్కంధ = వాయువులు; బంధుర = నిబిడ, దట్టమైన; సమీరణ = వాయువులచే; సంఘటిత = కూర్చబడిన; ఘోర = భయంకరమైన; జోఘుష్యమాణ = గర్జిల్లుతున్న; మహా = గొప్ప; వలాహక = మేఘముల; వర్గ = సమూహములనుండి; నిర్గత = వెలువడెడి; నిబిడ = దట్టమైన; నిష్ఠుర = కఠినములై; దుస్సహ = సహింపరాని; నిర్ఘాత = పిడుగుల; సంఘ = సమూహములనుండి; నిర్ఘోష = మోతలతో; నికాశంబులు = సమానమైనవి; అయిన = ఐన; ఛటఛట = ఛటఛట మనియెడి; స్ఫటస్ఫట = ఫటఫట మనియెడి; ధ్వని = శబ్దములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; భయంకర = భయంకరమైన; ఆరావ = శబ్దముల; పుంజంబులు = సమూహములు; జంజన్యమానంబులు = ఒకటి వెంట నొకటి పుట్టెడివి; ఐ = అయ్యి; ఎగసి = చెలరేగి; ఆకాశ = ఆకాశము యొక్క; కుహర = గుహ; అంతరాళంబు = లోప లంతయును; నిరవకాశంబు = ఖాళీలే కుండగ; చేసి = చేసి; నిండినన్ = నిండిపోగా; పట్టు = ఊతము; చాలక = సరిపోక; దోధూయమాన = మిక్కిలి చెదరగొట్టబడిన; హృదయంబులు = హదయములు కలవారు; అయి = అయ్యి; పరవశంబులు = స్వాధీనము తప్పినవారు; ఐన = అయిన; పితామహ = బ్రహ్మదేవుడు; మహేంద్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; శిఖి = అగ్ని; ముఖర = ముఖ్యులతో మొదలైన; చరాచర = జంగమ స్థావరములైన; జంతు = జంతువుల; జాలంబుల్ = సమూహముల; తోడన్ = తోటి; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = డిప్ప; పగిలి = పగిలి; పరిస్పోటితంబు = బద్దలు; కాన్ = అగునట్లు; ప్రఫుల్ల = వికసించిన; పద్మ = పద్మముల; యుగళ = జంటకు; సంకాశ = సమానముగా; భాస్వర = ప్రకాశించుచున్నట్టి; చక్ర = చక్రము; చాప = విల్లు; హల = నాగలి; కులిశ = వజ్రము; కులిశ = వజ్రాయుధము; జలచర = చేప వంటి; రేఖ = రేఖల; అంకిత = గుర్తులు కలిగిన; చారు = అందమైన; చరణతలుండును = అరిపాదములు గలవాడు; చరణ = పాదములను; చంక్రమాణ = కదల్చుట మాత్రముననే; ఘన = మిక్కిలి; వినమిత = వంగెడి; విశంభర = విశ్వము యొక్క; భార = బరువు; ధౌరేయ = మోయుచున్న; దిక్కుంభి = దిగ్గజముల; కుంభీనస = ఆదిశేషుడు {కుంభీనసము - విషజ్వాలలు గ్రక్కెడి పాము, ఆదిశేషుడు}; కుంభినీధర = కులపర్వతములు {కుంభినీధరములు - కుంభిని (భూమిని) ధరములు (మోసెడివి), కులపర్వతములు}; కూర్మ = ఆదికూర్మము; కుల = సమూహముచే; శేఖరుండును = విలసిల్లెడివాడును; దుగ్ధజలధిజాతశుండాల = ఐరావతము యొక్క {దుగ్ధజలధిజాతశుండాలము - దుగ్ధజలధిన్ (పాలసముద్రము నందు) జాత (పుట్టిన) శుండాలము (ఏనుగు), ఐరావతము}; శుండాదండ = తొండమువలె; మండిత = మెరయుచున్న; ప్రకాండ = మధ్యభాగముల; ప్రచండ = ఉగ్రములైన; మహా = గొప్ప; ఊరు = తొడలు యనెడి; స్తంభ = స్తంభముల; యుగళుండును = జంట గలవాడును; ఘణఘణాయమాన = ఘణఘణ యనుచున్న; మణి = రత్నపు; కింకిణీ = గజ్జెల; గణ = సమూహములు; ముఖరిత = మొదలగువానితోను; మేఖలా = మొలతాళ్ళ, వడ్డాణముల; వలయ = చుట్టలతో; వలయిత = కట్టబడిన; పీతాంబర = పట్టుబట్టలతో; శోభిత = శోభిల్లుతున్న; కటిప్రదేశుండును = మొలభాగము గలవాడు; నిర్ఝర = ఆకాశగంగనది యందలి; నిమ్నక = లోతైన; ఆవర్త = సుడిగుండమువలె; వర్తుల = గుండ్రటి; కమలాకర = సరోవరమువలె; గంభీర = గంభీరమైనట్టి; నాభివివరుండును = బొడ్డురంధ్రము గలవాడును; ముష్టి = పిడికిట; పరిమేయ = ఇమడ్చదగిన దని; వినుత = పొగడదగిన; తనుతర = మిక్కిలి సన్నని {తను - తనుతర - తనుతమ}; స్నిగ్ద = నున్నని; మధ్యుండును = నడుము గలవాడును; కులాచల = కులగిరుల; సానుభాగ = చరియల ప్రదశములతో; సదృశ = సమానమైన; కర్కశ = కఠినమైన; విశాల = వెడల్పు గల; వక్షుండును = వక్షస్థలము గలవాడు; దుర్జన = చెడ్డవారైన; దనుజ = రాక్షస; భట = భటుల యొక్క; ధైర్య = ధైర్యములుపాలిటి; లవిత్రాయమాణ = కొడవళ్ళవంటివి; రక్షోరాజ = హిరణ్యకశిపుని; వక్షోభాగ = వక్షస్థలము యనెడి; విశంకట = విస్తారమైన; క్షేత్ర = భూమిని; విలేఖన = పగుల దున్నుట యందు; చాంగ = మిక్కిలి నేర్పు గల; లాంగలాయమాన = నాగళ్ళవంటివి; ప్రతాప = శౌర్యము యనెడి; జ్వల = అగ్ని; జ్వాలాయమాన = మంటలవలె నున్నవి; శరణు = శరణముకోరి; ఆగత = వచ్చిన; నయన = చూపు లనెడి; చకోర = చకోరపక్షులకు; చంద్ర = చంద్రుని; రేఖాయమాణ = వెన్నెలవంటివి; వజ్రాయుధ = వజ్రాయుధమునకు; ప్రతిమాన = ఎదరించ గల; భాసమాన = ప్రకాశవంతమైన; నిశాతన = మిక్కిలి పదునైన; ఖరతర = మిక్కిల గట్టివి యైన {ఖరము - ఖరతరము - ఖరతమము}; ముఖ = కొనలు గల; నఖరుండును = గోళ్ళు గలవాడును; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; ఖడ్గ = కత్తి; కుంత = కుంతము, ఈటె; తోమర = తోమరము, చర్నాకోల; ప్రముఖ = మొదలైన; నానా = పలువిధములై; ఆయుధ = ఆయుధములచేత; మహిత = ఒప్పుచున్న; మహా = గొప్ప; ఉత్తుంగ = ఎత్తైన; మహీధర = కొండ; శృంగ = శిఖరముల; సన్నిభ = సరిపోలెడివి; వీర = వీరరసపు; సాగర = సముద్రము; వేలాయమాన = చెలియలికట్టలవంటి వైన; మాలికా = పూదండలతో; విరాజమాన = విలసిల్లుతున్నవి; నిరర్గళ = అడ్డులేని; అనేకశత = వందలకొలది; భుజార్గళుండును = బాహుదండములు గలవాడును; మంజు = సొగసైన; మంజీర = అందెలు; మణి = మణుల; పుంజ = సమూహముచే; రంజిత = అలంకరింపబడిన; మంజుల = చక్కనైన; హార = హారములు; కేయూర = భుజకీర్తులు; కంకణ = కంకణములు; కిరీట = కిరీటములు; మకరకుండలు = చెవికుండలములు {మకరకుండలములు - మొసలినోరు వలె జేయబడిన చెవి యాభరణములు}; ఆది = మొదలగు; భూషణ = ఆభరణములచే; భూషితుండును = అలంకరింపబడినవాడు; త్రివళీ = మూడురేఖలతో; యుత = కూడి; శిఖరి = కొండ; శిఖర = శిఖరముల; అభ = వంటి; పరిణద్ధ = కట్టుబడితో; బంధుర = చక్కటి; కంధరుండును = మెడ కలవాడు; ప్రకంపన = హోరు గాలికి; కంపిత = కదలెడి; పారిజాత = పారిజాత; పాదప = వృక్షము యొక్క; పల్లవ = చిగురుటాకుల; ప్రతీకాశ = పోలిన; కోప = క్రోధము యొక్క; ఆవేశ = ఆవేశమువలన; సంచలిత = వణకుచున్న; అధరుండును = క్రిందిపెదవి గలవాడును; శరత్కాల = శరదృతువు నందలి; మేఘ = మబ్బుల; జాల = గుంపు; మధ్య = నడుమ; ధగధగాయమాన = ధగధగలాడుతున్న; తటిల్లతా = మెరపులతో; సమాన = సమానముగా; దేదీప్యమాన = ప్రకాశించుతున్న; దంష్ట్రా = దంతముల; అంకురుండును = మొలకలు గలవాడును; కల్పాంతకాల = ప్రళయసమయపు; సకల = సమస్తమైన; భువన = లోకములను; గ్రసన = మింగెడు; విజృంభమాణ = వేడుకతో రేగుతున్న; సప్తజిహ్వ = ఏడు (7)నాలుకల కాలాగ్ని {అగ్ని యొక్క సప్తజిహ్వలు - 1కాళి 2కరాళి 3విస్ఫులింగిని 4ధూమ్రవర్ణ 5విశ్వరుచి 6లోహిత 7మనోజవ}; జిహ్వా = నాలుకలతో; తులిత = తులతూగెడి; తరళతరాయమాణ = మిక్కిలి తెల్లనైన {తరళము - తరళతరము - తరళతమము}; విభ్రాజమాన = మెరయుచున్న; జిహ్వుండును = నాలుక గలవాడు; మేరుమందర = మేరుపర్వతము యొక్క; మహా = గొప్ప; గుహా = గుహల; అంతరాళ = లోనుండెడి; విస్తార = విశాలమైన; విపుల = పెద్ద; వక్త్ర = నోరు; నాసికా = ముక్కు; రంధ్రుండును = రంధ్రములు గలవాడు; నాసికా = ముక్కు; రంధ్ర = రంధ్రములనుండి; నిస్సరన్ = వెడలుచున్న; నిబిడ = దట్టమైన; నిశ్వాస = ప్రాణవాయువుల; నికర = సమూహముల; సంఘట్టన = తాకుడుచే; సంక్షోభిత = కలచబడి; సంతప్యమాన = కాచబడుతున్న; సప్తసాగరుండును = సప్తసాగరములు గలవాడు; పూర్వ = తూరపు; పర్వత = కొండమీద; విద్యోతమాన = వెలుగుచున్న; ఖద్యోత = సూర్య; మండల = మండల; సదృక్ష = సమానమైన; సమంచిత = అందమైన; లోచనుండును = కన్నులు గలవాడును; లోచనా = కన్నుల; అంచల = కొనలనుండి; సముత్కీర్యమాణ = మిక్కిలి రాల్చబడుతున్న; విలోల = చలించుచున్న; కీలా = మంటలచే; ఆభీల = భయంకరమైన; విస్ఫులింగ = అగ్నికణముల; వితాన = సమూహములచేత; రుధ్యమాన = అడ్డుపెట్టబడిన; తారకా = నక్షత్రములు; గ్రహమండలుండును = గ్రహమండలములు గలవాడును; శక్రచాప = ఇంద్రధనుస్సు వలె; రుచిర = ప్రకాశించుచున్న; అదభ్ర = విస్తారమైన; మహా = పెద్ద; భ్రూ = భ్రుకుటి యనెడి; లతా = తీగలు; బంధబంధుర = ముడిపడిన; భయంకర = భయంకరమైన; వదనుండును = మోము గలవాడును; ఘనతర = మిక్కిలి పెద్ద; గండశైల = కొండరాళ్ళ; తుల్య = సమానమైన; కమనీయ = అందమైన; గండభాగుండును = చెక్కిళ్ళు గలవాడును; సంధ్యా = సంధ్యకాల మందలి; రాగ = రంగు గల; రక్త = రక్తపు; ధారా = ధారలను; ధర = కలిగిన; మాలికా = మాలల; ప్రతిమ = సాటియైన; మహా = గొప్ప; అభ్రంకష = మేఘముల నొరుయుచున్న; తంతన్యమాన = వెల్లివిరుస్తున్న; పటుతర = స్ఫుటమైన; సటా = జటల, జూలు; జాలుండును = సమూహములు గలవాడు; సటాజాల = జూలు; సంచాల = జాడించుటచే; సంజాత = పుట్టిన; వాత = గాడ్పులచే; డోలాయమాన = ఊగిపోతున్న; వైమానిక = విమానములలో తిరిగెడివారి; విమానుండును = విమానములు గలవాడు; నిష్కంపిత = చలించని; శంఖ = శంఖముల; వర్ణ = వంటి; మహా = పెద్ద; ఊర్ధ్వ = పొడుగుగానున్న; కర్ణుండును = చెవులు గలవాడును; మంథదండాయమాన = కవ్వపుకఱ్ఱగానైన; మందర = మందర యనెడి; వసుంధరాధర = పర్వతము {వసుంధరాదరము - వసుంధర (భూ మిని) ధర (ధరించెడిది),పర్వతము}; పరిభ్రమణ = తిరిగెడి; వేగ = వేగమువలన, వడివలన; సముత్పద్యమాన = ఎక్కువగా పుట్టుచున్న; వియన్మండల = ఆకాశమున; మండిత = అలంకరింపబడిన; సుధారాశి = పాలసముద్రపు; కల్లోల = తరంగముల యొక్క; శీకార = తుంపురుల; ఆకార = వలె; భాసుర = ప్రకాశించుచున్న; కేసరుండును = వెంట్రుకలు గలవాడు; పర్వా = పున్నమినాటి; అఖర్వ = విస్తారమైన; శిశిరకిరణ = చంద్రుని {శిశిరకిరణుడు - శిశిర(చల్లని) కిరణుడు (కిరణములు గలవాడు), చంద్రుడు}; మయూఖ = కిరణములవలె; గౌర = తెల్లని; తనూరుహుండును = జూలు గలవాడును; నిజ = తన; గర్జా = గర్జన; నినద = ధ్వనులచే; నిర్దళిత = చీల్చివేయబడిన; కుముద = కుముద; సుప్రతీక = సుప్రతీక; వామన = వామన; ఐరావణ = ఐరావణ; సార్వభౌమ = సార్వభౌమ; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; దిగిభ = దిగ్గజ {దిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము}; రాజ = శ్రేష్ఠముల; కర్ణ = చెవి; కోటరుండును = రంధ్రములు గలవాడు; ధవళధరాధర = కైలాసపర్వతమంత {ధవళధరాధరము - ధవళ (తెల్లని) ధరాధరము (పర్వతము), కైలాసపర్వతము}; దీర్ఘ = పొడవైన; దురవలోకనీయ = చూడనలవిగాని; దేహుండును = దేహము గలవాడు; దేహ = శరీరము యొక్క; ప్రభా = కాంతులచేత; నిర్మధ్యమాన = కలచబడిన; పరిపంథి = శత్రువులైన; యాతుధాన = రాక్షసుల; నికురంబ = సమూహముల; గర్వ = గర్వ మనెడి; అంధకారుండును = చీకటి గలవాడు; ప్రహ్లాద = ప్రహ్లాదుని; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; రంజన = సంతోషింపజేయుట; భంజన = సంహరించుట; నిమిత్త = కొరకైన; అంతరంగ = లోపల; బహిరంగ = వెలుపల; జేగీయమాన = మిక్కిలి స్తుతింపబడు; కరుణా = కరుణారసము; వీరరస = వీరరసములతో; సంయుతుండును = కూడినవాడును; మహా = గొప్ప; ప్రభావుండును = మహిమాన్వితుండు; అయిన = ఐన; శ్రీ = శుభకరుడైన; నృసింహ = నరసింహ; దేవుండు = దేవుడు; ఆవిర్భవించినన్ = అవతరించగా, పుట్టగా; కనుంగొని = చూసి;
భావము:- హిరణ్యకశిపుడు అలా శ్రీమహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగభగమండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము, అణుకువలను కాల్చివేశాయి. ధైర్యగాంభీర్యాల వలన అతని హృదయం ధగ ధగ మెరిసింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతట పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి “దీనిలో హరిని చూపించరా” అనంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పది దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడివలన ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ ఛటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. ఇంద్రధనుస్సులా వంగి ఉన్న ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలి మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి. శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీరకాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నాయి. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ, హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.

174
"నమూర్తిగాదు కేవల
రిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
రియాకారము నున్నది
రిమాయారచిత మగు యథార్థము చూడన్.
టీక:- నర = మానవ; మూర్తి = స్వరూపము; కాదు = కాదు; కేవల = వట్టి; హరి = సింహపు; మూర్తియున్ = స్వరూపము; కాదు = కాదు; మానవ = మనిషి; ఆకారము = స్వరూపము; కేసరి = సింహపు; ఆకారము = స్వరూపము; ఉన్నది = కలిగినది; హరి = విష్ణుని; మాయా = మాయచేత; రచితము = నిర్మింపబడినది; అగు = ఐన; యథార్థము = సత్యమైనది; చూడన్ = తరచిచూసినచో.
భావము:- ఈ రూపము ఉత్తి మానవ రూపము కాదు, ఉత్తి సింహం రూపము కాదు. చూస్తే యథార్థంగా మానవాకారం, సింహాకారం రెండు కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా మూర్తిలా ఉంది.

175
తెంపున బాలుఁ డాడిన, సుధీరత సర్వగతత్వముం బ్రతి
ష్ఠింపఁ దలంచి యిందు నరసింహశరీరముఁ దాల్చి చక్రి శి
క్షింపఁగ వచ్చినాఁడు; హరిచే మృతి యంచుఁ దలంతు నైన నా
సొంపును బెంపు నందఱును జూడఁ జరింతు హరింతు శత్రువున్."
టీక:- తెంపున = సాహసముతో; బాలుడు = చిన్నపిల్లవాడు; ఆడిన = పలికిన; సుధీరతన్ = గట్టినమ్మకముతో; సర్వగత = సమస్తమైన భూతాంతర్యామి; తత్వమున్ = అగుటను; ప్రతిష్టింపన్ = స్థాపింపవలె నని; తలంచి = భావించి; ఇందు = దీనిలో; నరసింహ = నరసింహుని; శరీరము = దేహమును; తాల్చి = ధరించి; చక్రి = విష్ణువు {చక్రి – చక్రాయుధము గలవాడు,విష్ణువు}; శిక్షింపగన్ = దండించుటకు; వచ్చినాడు = వచ్చెను; హరి = విష్ణువు; చేన్ = వలన; మృతి = చావు; అంచున్ = అని; తలంతున్ = భావించెదను; ఐనన్ = అయినప్పటికిని; నా = నా యొక్క; సొంపును = అతిశయమును; పెంపును = బలమును; అందఱున్ = అందరును; చూడన్ = చూచునట్లు; చరింతున్ = నడచెదను; హరింతున్ = సంహరించెదను; శత్రువునున్ = శత్రువును.
భావము:- చిన్న పిల్లాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్ముకుడ నని నిరూపించడానికి, విష్ణువు ఇలా నరసింహరూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. శత్రుసంహారం చేస్తాను. విజయం సాధిస్తాను.”

176
అని మెత్తంబడని చిత్తంబున గద యెత్తికొని తత్తఱంబున నార్చుచు నకుంఠిత కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచరకుంజరుండు నరసింహదేవున కెదురునడచి తదీయదివ్యతేజోజాలసన్నికర్షంబునం జేసి దవానలంబు డగ్గఱిన ఖద్యోతంబునుం బోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గతప్రభుండయి యుండె; అప్పుడు.
టీక:- అని = అని; మెత్తంబడని = సడలని; చిత్తంబునన్ = మనసుతో; గద = గదను; ఎత్తికొని = ఎత్తపట్టుకొని; తత్తఱంబునన్ = వేగిరపాటుతో; ఆర్చుచున్ = అరుచుచు; అకుంఠిత = మొక్కవోని పరాక్రమము గల; కంఠీరవంబున్ = సింహమును; డగ్గఱు = చేరెడి; గంధసింధూరను = మదించిన ఏనుగు; చందంబునన్ = వలె; నక్తంచర = రాక్షస; కుంజరుండు = శ్రేష్ఠుడు; నరసింహదేవున్ = నరసింహదేవుని; కున్ = కి; ఎదురు = ఎదురు; నడచి = వెళ్ళి; తదీయ = ఆమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; తేజః = తేజస్సు; జాల = పుంజము; సత్ = అధికముగ; నికర్షంబునన్ = తగులుట; చేసి = వలన; దవానలంబు = కార్చిచ్చు; డగ్గఱిన = దగ్గరకు చేరిన; ఖద్యోతంబునున్ = మిణుగురుపురుగు; పోలెన్ = వలె; కర్తవ్య = చేయదగ్గవి; అకర్తవ్య = చేయదగనివి; తెలియక = వివేకముపోయి; నిర్గత = పోయిన, వెలవెలబోయిన; ప్రభుండు = ప్రభావము గలవాడు; అయి = అయ్యి; ఉండెన్ = ఉండెను; అప్పుడు = అప్పుడు.
భావము:- అని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా దృఢ స్థైర్యంతో గద ఎత్తి పట్టుకొని, తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. మృగరాజుకు ఎదురువెళ్ళే మదగజం లాగ ఆ రాక్షసేశ్వరుడు నరసింహమూర్తికి ఎదురు నడిచాడు. ఆ దేవాధిదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మిణుగురు పురుగులాగ ముందుకు పోతున్నాడు. కర్తాకర్తవ్యాలను మరచిపోయాడు. తన తేజస్సును కోల్పోయాడు.

177
ప్రటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండభాండావరో
మై యున్న తమిస్రమున్ జగము నుత్పాదించుచోఁ ద్రావి సా
త్త్వి తేజోనిధి యైన విష్ణు నెడ నుద్దీపించునే? నష్టమై
విలంబై చెడుఁగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా!
టీక:- ప్రకటంబు = బయల్పడినది; ఐ = అయ్యి; ప్రళయావసానమునన్ = ప్రళయాంతము నందు; మున్ = పూర్వము; బ్రహ్మాండ = బ్రహ్మాండముల; భాండ = భండాగారమునకు; అవరోధకము = క్రమ్ముకొన్నది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తమిశ్రమున్ = చీకటిని; జగమున్ = భువనము; ఉత్పాదించు = సృష్టించు; చోన్ = సమయమున; త్రావి = తాగి; సాత్త్విక = సత్త్వగుణసంబంధమైన; తేజః = తేజస్సునకు; నిధి = నిధివంటివాడు; ఐన = అయిన; విష్ణున్ = హరి; ఎడన్ = అందు; ఉద్దీపించునే = ప్రకాశించునా ఏమి; నష్టము = నశించినది; ఐ = అయిపోయి; వికలంబు = చెదిరిపోయినది; ఐ = అయ్యి; చెడుగాక = చెడిపోవును; తామసుల = తామసగుణము గలవారి; ప్రావీణ్యంబు = నేర్పులు; రాజ = రాజుయైన; ఉత్తమా = ఉత్తముడా.
భావము:- ఓ ధర్మరాజా! పూర్వం ప్రళయకాలం అగుచున్నప్పుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని క్రమ్మిన గాఢమైన చీకట్లను, పునఃసృష్టి చేయు సమయం రాగానే ఆ అంధకారాన్ని ఆపోశన పట్టిన సాత్విక తేజోమూర్తి విష్ణువు. అటువంటి శ్రీమహా విష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు అయిపోతుంది తప్ప ఏమాత్రం ప్రకాశించ లేదు కదా.

178
అంత నద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరం ద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన; నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పున దితిపట్టిం బట్టికొనిన, మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక న య్యసురవరుండు దృఢబలంబున నిట్టట్టు జడిసి పట్టు దప్పించుకొని, విడివడి దిటవు దప్పక కుప్పించి యుప్పరం బెగసి విహంగకులరాజ చరణ నిర్గళిత భుజంగంబు తెఱంగునం దలంగ నుఱికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుం; డయ్యెడి నని తలంచి, కలంగక చెలంగుచుఁ దన్ను నిబిడనీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గొని డాఁగి మూఁగి క్రమ్మఱ నాత్మీయ జీవన శంకా కళంకితు లై మంతనంబులఁ జింతనంబులు చేయుచు నిరీక్షింప నక్షీణ సమరదక్షతా విశేషం బుపలక్షించి ఖడ్గ వర్మంబులు ధరియించి, భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులం బరిభ్రమణ భేదంబులం గరాళవదనుం డయి, యంతరాళంబునఁ దిరుగు సాళువపు డేగ చందంబున సంచరించిన; సహింపక.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; దానవ = దానవుల; ఇంద్రుడు = ప్రభువు; మహా = గొప్ప; ఉద్దండంబు = పెద్దదైనది; అగు = అయిన; గదాదండంబున్ = గదను; గిరగిరన్ = గిరగిరా; త్రిప్పి = తిప్పి; నరమృగేంద్రుని = నరసింహుని; వ్రేసినన్ = కొట్టగా; అతండు = అతడు; దర్పంబునన్ = గర్వముతో; సర్పంబున్ = పామును; ఒడిసి = ఒడుపుతో; పట్టు = పట్టుకొనెడి; సర్పపరిపంథి = గరుత్మంతుని {సర్పపరిపంథి - సర్ప (పాములకు) పరిపంథి (శత్రువు), గరుత్మంతుడు}; నేర్పునన్ = ప్రావీణ్యముతో; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; పట్టికొనినన్ = పట్టుకొనగా; మిట్టిపడి = ఎగిసిపడి; దట్టించి = అదలించి; బిట్టు = మించిన; కట్టలుకన్ = రోషాతిశయముచేత; ఆ = ఆ; అసుర = రాక్షస; వరుండు = శ్రేష్ఠుడు; దృఢ = గట్టి; బలంబునన్ = బలముతో; ఇట్టట్టు = ఇటు అటు; జడిసి = విదలించుకొని; పట్టు = పట్టునుండి; తప్పించుకొని = తప్పించుకొని; విడివడి = విడిపించుకొని; దిటవున్ = ధైర్యమును; తప్పక = వీడక; కుప్పించి = దుమికి; ఉప్పరంబు = పైకి; ఎగసి = ఎగిరి; విహంగకులరాజ = గరుత్మంతుని {విహంగకులరాజు - విహంగ (పక్షుల) కులమునకు రాజు, గరుత్మంతుడు}; చరణ = కాళ్ళనుండి; నిర్గళిత = తప్పించుకొన్న; భుజంగంబు = పాము; తెఱంగునన్ = వలె; తలంగన్ = తొలగి; ఉఱికి = పారి; తన = తన యొక్క; భుజ = బాహు; ఆటోపంబునన్ = బలముచేత; నరకంఠీరవుండు = నరసింహుడు; కుంఠితుండు = ఓడిపోయినవాడు; అయ్యెడిని = అగును; అని = అని; తలంచి = భావించి; కలంగక = బెదరక; చెలంగుచున్ = చెలరేగుచు; తన్నున్ = తనను; నిబిడ = దట్టములైన; నీరద = మేఘముల; నికరంబులు = సముదాయములు; మాటునన్ = చాటున; నిలింపులు = దేవతలు; గుంపులుకొని = గుంపులుగుంపులుగా; డాగి = దాక్కొనుచు; మూగి = పరచుకొని; క్రమ్మఱ = మరల; ఆత్మీయ = తమ యొక్క; జీవన = జీవితములమీద; శంక = అనుమానముచేత; కళంకితులు = కళంకితమైనవారు; ఐ = అయ్యి; మంతనంబునన్ = రహస్యముగా; చింతనంబులు = సంప్రదింపులు; చేయుచున్ = చేయుచు; నిరీక్షింపన్ = చూచుచుండగా; అక్షీణ = గొప్ప; సమర = యుద్ధ; దక్షతా = ప్రావీణ్యము యొక్క; విశేషంబున్ = అతిశయమును; ఉపలక్షించి = గుర్తు చేసుకొని; ఖడ్గ = కత్తి; వర్మంబులున్ =కవచములు; ధరియించి = ధరించి; భూ = నేల; నభో = ఆకాశ; భాగంబులన్ = ప్రదేశములలో; వివిధ = పలురకముల; విచిత్ర = ఆశ్చర్యకరమైన; లంఘన = మల్లయుద్ధ దూకుట లందలి; లాఘవంబులన్ = నేర్పులతో; పరిభ్రమణ = తిరుగుటలోని; భేదంబులన్ = విశేషములతో; కరాళ = భయంకరమైన; వదనుండు = ముఖము గలవాడు; అయి = అయ్యి; అంతరాళంబునన్ = ఆకాశమున; తిరుగు = తిరిగెడి; సాళువపు = కణుజు; డేగ = డేగ; చందంబునన్ = వలె; సంచరించినన్ = తిరుగాడుచుండగా; సహింపక = ఒర్వక.
భావము:- దానవ వీరుడైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండాన్ని గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే, గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. ఆ దానవుడు ఎగిరి పడి ఇటూనటూ గింజుకుని, రోషంతో, చాకచక్యంతో బలంపుంజుకుని, పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజు లాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడసాగాడు. “తన భుజబలానికి ఈ నరసింహుడు లొంగిపోతాడులే” అనుకుంటూ, నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని నైపుణ్యంగా ప్రదర్శిస్తున్నాడు. దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల చాటున నక్కి నక్కి చూస్తూ “మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, వీడేమో లొంగేలా లేడు” అనే సందేహాలతో దిగులుపడసాగారు. అయినా రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కవచధారి అయి యుద్ధ విద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశా లంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా విన్యాసాలైన ఉరుకుట, తిరుగుట మున్నగునవి లాఘవంగా చూపుతున్నాడు. రకరకాల పరిభ్రమణాలు చేస్తూ, భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఆగ్రహించాడు.

179
పంచాననోద్ధూత పావకజ్వాలలు;
భూనభోంతరమెల్లఁ బూరితముగ;
దంష్ట్రాంకురాభీల గధగాయితదీప్తి;
సురేంద్రు నేత్రము లంధములుగఁ;
గంటకసన్నిభోత్కట కేసరాహతి;
భ్రసంఘము భిన్నమై చలింపఁ;
బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై;
రనఖరోచులు గ్రమ్ముదేర;

టలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి
ట్టె నరసింహుఁ డా దితిట్టి నధిప!
టీక:- పంచ = విప్పారిన; ఆనన = ముఖమునుండి; ఉద్ధూత = పుట్టిన; పావక = అగ్ని; జ్వాలలు = మంటలు; భూ = భూమి; నభః = ఆకాశము; అంతరము = మధ్యభాగము; ఎల్లన్ = అంతటిని; పూరితంబు = నిండినది; కన్ = కాగా; దంష్ట్రా = కోఱల; అంకుర = మొలకల యొక్క; అభీల = భయంకరమైన; ధగధగాయిత = ధగధగలాడెడి; దీప్తిన్ = ప్రకాశముచేత; అసుర = రాక్షస; ఇంద్రు = ప్రభువు యొక్త; నేత్రములు = కన్నులు; అంధములు = గుడ్డివి; కన్ = కాగా; కంటక = ముండ్ల; సన్నిభ = వంటి; ఉత్కట = వాడియైన, నిక్కిన; కేసర = రోమముల, జూలు; ఆహతిన్ = తాకిడికి; అభ్ర = మేఘముల; సంఘము = సమూహము; భిన్నము = విరిసినది; ఐ = అయ్యి; చలింపన్ = తిరుగగా; ప్రళయ = ప్రళయకాలపు; అభ్ర = మేఘముల యందలి; చంచలా = మెరపులకు; ప్రతిమ = సాటిరాగల; భాస్వరములు = కాంతులుగలవి; ఐ = అయ్యి; ఖర = వాడి; నఖర = గోళ్ళ యొక్క; రోచులు = కాంతులు; కమ్ముదేరన్ = వ్యాపింపగా.
సటలు = జూలు; జళిపించి = జాడించి; గర్జించి = గర్జించి {గర్జన - సింహపు అరుపు}; సంభ్రమించి = చెలరేగి; దృష్టి = చూపు; సారించి = నిగిడించి; బొమలు = కనుబొమలు; బంధించి = ముడివేసి; కెరలి = విజృంభించి; జిహ్వ = నాలుక; ఆడించి = ఆడించి; లంఘించి = పైకురికి, దూకి; చేతన్ = చేతితో; ఒడిసిపట్టెన్ = ఒడుపుగాపట్టుకొనెను; నరసింహుండు = నరసింహుడు; ఆ = ఆ; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; అధిపా = రాజా.
భావము:- ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి. ఆ నారసింహుడు అదను చూసి జటలు ఝళిపించాడు, ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు, కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు, ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి, ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకున్నాడు.

180
కుగొనక లీలాగతి
నుగేంద్రుఁడు మూషికంబు నొడసిన పగిదిన్
కేసరి దను నొడిసిన
సువిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా!
టీక:- సరకుగొనక = లక్ష్యపెట్టక; లీలా = క్రీడ; గతిన్ = వలె; ఉరగ = సర్ప; ఇంద్రుడు = రాజు; మూషికంబున్ = ఎలుకను; ఒడసిన = ఒడుపుగాపట్టుకొను; పగిదిన్ = విధముగ; నరకేసరి = నరసింహుడు; తను = తనను; ఒడిసినన్ = ఒడిసిపట్టగా; సుర = దేవతలకు; విమతుడు = శత్రువు; ప్రాణ = ప్రాణములమీది; భీతిన్ = భయముచేత; సుడివడియెన్ = కలగిపోయెను; నృపా = రాజా.
భావము:- నాగేంద్రుడు ఎలుకను ఏమాత్రం లెక్కచేయకుండా ఒడిసిపట్టినట్లుగా, ఆ నరసింహ ప్రభువు పట్టుకోడంతో, ఆ దేవతా శత్రువు అయిన హిరణ్యకశిపుడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు.

181
సురాజవైరి లోఁబడెఁ
రిభావిత సాధుభక్త టలాంహునకున్
సింహునకు నుదంచ
త్ఖతరజిహ్వున కుదగ్ర న రంహునకున్.
టీక:- సుర = దేవతల; రాజ = ప్రభువుల; వైరి = శత్రువు; లోబడెన్ = లొంగిపోయెను; పరిభావిత = తిరస్కరింపబడిన; సాధు = సజ్జనులైన; భక్త = భక్తుల; పటల = సంఘముల యొక్క; అంహున = పాపములు గలవాని; కున్ = కి; నరసింహునకున = నరసింహుని; కును = కి; ఉదంచత్ = మెఱయుచున్న; ఖరతర = మిక్కిలి గరుకైన {ఖర - ఖరతర - ఖరతమ}; జిహ్వున్ = నాలుక గలవాని; కున్ = కి; ఉదగ్ర = ఘనమైన; ఘన = గొప్ప; రంహున్ = వేగము గలవాని; కున్ = కు.
భావము:- సాధుజనుల, భక్తుల అందరి పాపాలను పటాపంచలు చేసేవాడు, కడు భయంకరంగా కదులుచున్న నాలుక గలవాడు, మహోగ్రమైన వేగం గలవాడు అయిన నరసింహ దేవుడికి, ఇంద్రుని శత్రువైన హిరణ్యకశిపుడు లోబడిపోయాడు.

182
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అంతట

183
విగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్.
టీక:- విహంగేంద్రుండు = గరుత్మంతుడు; అహి = పామును; వ్రచ్చు = చీల్చెడి; కైవడి = లాగున; మహా = మిక్కిలి; ఉద్వృత్తిన్ = అతిశయముతో; నృసింహుండు = నరసింహుడు; సాగ్రహుడు = క్రోధముతో కూడినవాడు; ఐ = అయ్యి; ఊరువులు = తొడల; అందున్ = మీద; చేర్చి = చేర్చుకొని; నఖ = గోళ్ళ; సంఘాతంబులన్ = పోటులచేత; వ్రచ్చెన్ = చీల్చెను; దుస్సహున్ = (పరాక్రమముచే) ఓర్వరానివాని; దంభోళి = వజ్రాయుధములాంటి; కఠోర = కఠినమైన; దేహున్ = దేహము గలవానిని; అచల = చలించని; ఉత్సాహున్ = పూనిక గలవానిని; మహా = గొప్ప; బాహున్ = భుజబలుని; ఇంద్ర = ఇంద్రుడు; హుతాశ = అగ్ని {హుతాశనుడు - హుత (హోమద్రవ్యము) అశనుడు (తినువాడు), అగ్ని}; అంతక = యములకు {అంతకుడు - మరణము కలుగ జేయువాడు, యముడు}; భీరున్ = భయము పుట్టించువానిని; ఘన = బలిష్టమైన; కరున్ = చేతులు గలవానిని; దైత్య = రాక్షస; అన్వయ = వంశమునకు; శ్రీకరున్ = వన్నె కలిగించువానిని.
భావము:- అప్పుడు, గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చే విధంగా, నృసింహావతారుడు ఆగ్రహంతో వజ్రకఠోరకాయుడూ; అచంచల ఉత్సాహవంతుడూ; మహాబాహుడూ; ఇంద్ర అగ్ని యమాదులకు మిక్కిలి భయం పుట్టించేవాడూ; దానవవంశ శుభంకరుడూ; దుస్సహ పరాక్రమం గలవాడూ అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడేసుకొన్నాడు. వాడి రొమ్ము తన వాడి గోళ్ళతో చీల్చాడు.

184
చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం,
ద్రెంచుం గర్కశనాడికావళులు, భేదించున్ మహావక్షముం,
ద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్ వ్రచ్చి ద
ర్పించుం, బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై.
టీక:- చించున్ = చీల్చివేయును; హృత్ = హృదయ మనెడి; కమలంబున్ = పద్మమును; శోణితమున్ = రక్తమును; వర్షించున్ = ధారలు కట్టించును; ధరామండలిన్ = భూమండలముపైన; త్రెంచున్ = తెంపివేయును; కర్కశ = కఠినమైన; నాడిక = నరముల; ఆవళులు = సమూహమును; భేదించున్ = బద్దలు చేయును; మహా = పెద్ద; వక్షమున్ = వక్షస్థలమును; త్రుంచున్ = తునకలు చేయును; మాంసమున్ = మాంసమును; సూక్ష్మ = చిన్న; ఖండములు = ముక్కలు; కాన్ = అగునట్లు; దుష్ట = దుర్మార్గపు; అసురున్ = రాక్షసుని; వ్రచ్చి = చీల్చివేసి; దర్పించున్ = గర్వించును; ప్రేవులు = పేగులు; కంఠ = మెడలోని; మాలికలు = దండలువలె; కల్పించున్ = చేయును; నఖ = గోళ్ళచే; ఉత్ = మిక్కిలి; భాసి = మెరయువాడు; ఐ = అయ్యి.
భావము:- దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి గుండెలు చీల్చి నెత్తురు కురిపించాడు; కఠోరమైన రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేసాడు; కండరాలు ఖండించి ముక్కలు ముక్కలుగా చేసాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.

185
క్షకవాటంబు వ్రక్కలు చేయుచో, ;
న కుఠారంబుల రణి నొప్పు;
గంభీర హృదయ పంజము భేదించుచోఁ, ;
గుద్దాలముల భంగిఁ గొమరుమిగులు;
మనీ వితానంబు విలి ఖండించుచోఁ, ;
టు లవిత్రంబుల గిది మెఱయు;
ఠరవిశాలాంత్రజాలంబుఁ ద్రెంచుచోఁ, ;
గ్రకచ సంఘంబుల రిమఁ జూపు;

నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున
స్త్ర చయముల నొంపక సంహరించి
మరు నరసింహు నఖరంబు తి విచిత్ర
మర ముఖరంబులై యుండె నవరేణ్య!
టీక:- వక్ష = రొమ్ము యనెడి; కవాటంబున్ = కవాటమును; వ్రక్కలు = ముక్కలు; చేయు = చేసెడి; చోన్ = అప్పుడు; ఘన = పెద్ద; కుఠారంబులన్ = గొడ్ఢళ్ళు; కరణిన్ = వలె; ఒప్పున్ = చక్కగా నుండును; గంభీర = లోతైన; హృదయ = హృదయ మనెడి; పంకజమున్ = పద్మమును {పంకజము - పంకము (బురద) యందు జము (పుట్టునది), పద్మము}; భేదించు = బద్దలుచేసెడి; చోన్ = అప్పుడు; కుద్దాలముల = గునపముల; భంగిన్ = వలె; కొమరు = చక్కదనము; మిగులు = అతిశయించును; ధమనీ = నరముల; వితానంబున్ = సమూహములను; తవిలి = పూని; ఖండించు = కోసివేసెడి; చోన్ = అప్పుడు; లవిత్రంబుల = కొడవళ్ళ; పగిదిన్ = వలె; మెఱయున్ = ప్రకాశించును; జఠర = కడుపులోని; విశాల = పొడవైన; అంత్ర = పేగుల; జాలంబున్ = సమూహమును; త్రెంచు = తెంచివేసెడి; చోన్ = అప్పుడు; క్రకచ = రంపముల; సంఘంబుల = సమూహముల యొక్క; గరిమన్ = గొప్పదనమును; చూపున్ = ప్రదర్శించును; అంక = ఒడిలో.
గతుడు = ఉన్నవాడు; ఐన = అయిన; దైత్యుని = రాక్షసుని; ఆగ్రహమునన్ = కోపముతో; శస్త్ర = ఆయుధముల; చయమున్ = సమూహమును; ఒంపక = ప్రయోగించకుండగ; సంహరించి = చంపి; అమరు = ఒప్పుచున్న; నరసింహు = నరసింహుని; నఖరంబులు = గోళ్ళు; అతి = మిక్కిలి; విచిత్ర = అబ్బురమైన; సమర = యుద్ధ; ముఖరంబులు = సాధనములు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; జనవరేణ్య = రాజా {జనవరేణ్యుడు - జన (మానవులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), రాజు}.
భావము:- ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా వలె దీపించాయి. రక్తనాళాలు త్రెంపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి. ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.
అజరామరమైన కవిత్వం పండించిన హాలికుడు కదా, గొడ్డలి ఎప్పుడు వాడాలో, గునపం ఎక్కడ వాడాలో, కొడవలి ఎలా వాడాలో ఱంపం ఎక్కడ వాడాలో బాగా తెలిసిన వాడు. పైగా సకల శాస్త్రాల పరిచయం క్షుణ్ణంగా కలవాడు. మరి ఎముకల గూడు, గుండె కండరాలు, నరాలు లక్షణాలకు తగిన పరికరాలను ఎన్నుకున్నాడు. సహజ సిద్దంగా అలరారుతున్నది వీరి కవిత్వం. దానికి ఈ సీసం ఒక ఉదాహరణ.

186
స్ఫురితవిబుధజన ముఖములు
రివిదళిత దనుజనివహతి తనుముఖముల్
గురురుచి జిత శిఖిశిఖములు
హరిఖరనఖము లమరు తజనసఖముల్.
టీక:- స్ఫురిత = స్పారితమైన, వికసించినవైన; విబుధ = దేవతలైన; జన = వారి; ముఖములున్ = ముఖము గలవి; పరి = మిక్కిలి; విదళిత = చీల్చబడిన; దనుజ = రాక్షస; నివహ = సమూహమునకు; పతి = ప్రభువు యొక్క; తను = దేహము; ముఖముల్ = ముఖములు గలవి; గురు = గొప్ప; రుచి = కాంతిచే; జిత = జయింపబడిన; శిఖి = అగ్ని; శిఖములున్ = జ్వాలలు గలది; నరహరి = నరసింహుని; ఖర = వాడియైన; నఖముల్ = గోళ్ళు; అమరు = చక్కనుండిన; నత = మ్రొక్కెడి; జన = వారి యొక్క; సఖములు = హితములైనవి.
భావము:- నరసింహస్వామి గోళ్ళు శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి. ఆ దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. బహు అధికమైన కాంతులతో అగ్నిశిఖలను సైతం ఓడించాయి.

187
ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహరూపంబున, రేయునుం బవలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబును భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులునుం గాని నఖంబులం, ద్రైలోక్యజన హృదయ భల్లుం డయిన దైత్యమల్లుని వధియించి, మహాదహన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును, లేలిహానభీషణ జిహ్వుండును, శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కేవల = అచ్చమైన; పురుష = మానవ; రూపంబును = స్వరూపము; మృగ = సింహపు; రూపంబునున్ = స్వరూపము; కాని = కానట్టి; నరసింహ = నరసింహపు; రూపంబునన్ = స్వరూపముతో; రేయునున్ = రాత్రి; పవలునున్ = పగలు; కాని = కానట్టి; సంధ్యా = సంధ్య; సమయంబునన్ = సమయములో; అంతర్ = లోపలి; రంగంబునున్ = ప్రదేశము; బహిర్ = బయటి; రంగంబునున్ = ప్రదేశమును; కాని = కానట్టి; సభా = సభాభవనము యొక్క; ద్వారంబునన్ = ద్వారబంధముపైన; గగనంబునున్ = ఆకాశము; భూమియున్ = నేల; కాని = కానట్టి; ఊరు = తొడల; మధ్యంబునన్ = మధ్యభాగము నందు; ప్రాణ = ప్రాణము; సహితంబులునున్ = కలిగినవి; ప్రాణ = ప్రాణము; రహితంబులును = లేనివి; కాని = కానట్టి; నఖంబులన్ = గోరులతోటి; త్రైలోక్య = ముల్లోకము లందలి; జన = ప్రజల; హృదయ = హృదయములను; భల్లుండు = బల్లెములవంటివాడు; అయిన = ఐన; దైత్య = దానవ; మల్లుని = శూరుని; వధియించి = సంహరించి; మహా = పెద్ద; దహన = మండుచున్న; కీలా = మంటలవలె; ఆభీల = భయంకరమైన; దర్శనుండును = కనబడెడివాడు; కరాళ = భయంకరమైన; వదనుండును = మోము గలవాడు; లేలిహాన = పాము నాలికవంటి; భీషణ = భీకరమైన; జిహ్వుండును = నాలుక గలవాడు; శోణిత = రక్తపు; పంక = బురద; అంకిత = అంటుకొన్న; కేసరుండును = జూలు గలవాడు; ఐ = అయ్యి; ప్రేవులు = పేగులు; కంఠ = మెడలోని; మాలికలు = దండలు; కన్ = అగునట్లు; ధరించి = తాల్చి; కుంభి = ఏనుగు; కుంభ = కుంభస్థలమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; చనుదెంచు = వచ్చెడి; పంచాననంబునున్ = సింహమును; పోలెన్ = వలె; దనుజ = రాక్షసులలో; కుంజర = సింహమువంటివాని; హృదయ = హృదయము యనెడి; కమల = పద్మమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; తదీయ = అతని; రక్త = రక్తముచే; సిక్తంబులు = తడసినవి; ఐన = అయిన; నఖంబులున్ = గోళ్ళు; సంధ్యా = సంధ్యాకాలపు; రాగ = రంగుగల; రక్త = ఎఱ్ఱని; చంద్ర = చంద్ర; రేఖలన్ = కళల; చెలువున్ = అందమును; వహింపన్ = సంతరించుకొనగా; సహింపక = ఓర్వక; లేచి = పూని; తన = తన యొక్క; కట్టెదుర = కన్నుల ఎదురుగ; ఆయుధంబులన్ = ఆయుధములను; ఎత్తుకొని = ధరించి; తత్తఱంబునన్ = త్వరితముతో; రణంబున్ = యుద్ధమున; కున్ = కు; ఉరవడించు = ఉరుకుతున్న; రక్కసులన్ = రాక్షసులను; పెక్కు = అనెకమైన; సహస్రంబులన్ = వేలకొలది; చక్రాయుధ = చక్రాయుధములు; అధిక = మొదలగు; నిర్వక్ర = అకుంఠితములైన; సాధనంబులన్ = ఆయుధములతో; ఒక్కనిన్ = ఒకడినికూడ; చిక్కకుండగ = వదిలిపెట్టకుండా; చక్కడిచెన్ = సంహరించెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. అప్పుడు, ఆయన మిక్కిలి ఉగ్ర స్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అతిభయంకరంగా ఉన్న ముఖంతో; నాగేంద్రుని నాలుక లాగ మాటిమాటికి బయటకు వచ్చి చలిస్తున్న భీకరమైన నాలుకతో; నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు; రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.

188
క్షోవీరుల నెల్లఁ ద్రుంచి రణసంరంభంబు చాలించి దృ
ష్టిక్షేపంబు భయంకరంబుగ సభాసింహాసనారూఢుఁడై
క్షీణాగ్రహుఁడై నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్
వీక్షింపం బలికింప నోడి యితరుల్ విభ్రాంతులై డాఁగఁగన్.
టీక:- రక్షః = రాక్షస; వీరులన్ = వీరులను; ఎల్లన్ = అందరను; త్రుంచి = సంహరించి; రణ = యుద్ధ మందలి; సంరంభంబున్ = ఆటోపమును; చాలించి = ఆపేసి; దృష్టి = చూపుల; క్షేపంబు = నిగుడ్చుట, ప్రసారము; భయంకరంబుగ = బెదురు కలుగునట్లు; సభా = సభ యందలి; సింహాసన = సింహాసనమును; ఆరూఢుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; అక్షీణ = అధికమైన; ఆగ్రహుడు = కోపము గలవాడు; ఐ = అయ్యి; నృసింహుడు = నరసింహుడు; కరాళ = భయంకరమైన; ఆస్యంబు = ముఖము; తోన్ = తోటి; ఒప్పెన్ = చక్కగ నుండెను; తన్ = తనను; వీక్షింపన్ = చూచుటకు; పలికింపన్ = పలకరించుటకు; ఓడి = బెదరి; ఇతరుల్ = ఇతరులు; విభ్రాంతులు = భీతిచెందినవారు; ఐ = అయ్యి; డాగగన్ = దగ్గర చేరుటకు.
భావము:- ఈ విధంగా రాక్షస సంహారం కానిచ్చి, యుద్ధం పరిసమాప్తి చేసాడు. ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు భయం కలిగిస్తున్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు. చూడటానికి గానీ, పలకరించడానికి కానీ చాలక అక్కడున్న వాళ్లందరూ భయభ్రాంతులై తత్తర పడుతుండగా, ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీను డయ్యాడు.

189
సు చారణ విద్యాధర
రుడోరగ యక్ష సిద్ధణములలో నొ
క్కరుఁ డైన డాయ వెఱచును
హరి న య్యవసరమున రలోకేశా!
టీక:- సుర = దేవతల; చారణ = చారణుల; విద్యాధర = విద్యాధరుల; గరుడ = గరుడుల; ఉరగ = సర్పముల; యక్ష = యక్షుల; సిద్ధ = సిద్ధుల; గణముల = సమూహముల; లోన్ = అందు; ఒక్కరుడు = ఒకడు; ఐనన్ = అయినను; డాయన్ = దగ్గరచేరుటకు; వెఱచును = బెదురును; నరహరిన్ = నరసింహుని; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; నరలోకేశ = రాజా {నరలోకేశుడు - నరలోక (నరలోకుల) కు ఈశుడు (ప్రభువు), రాజు}.
భావము:- ధర్మరాజా! దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరు కూడ ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితు లౌతున్నారు.

190
ర్షంబుల నరసింహుని
ర్షంబులఁ జూచి నిర్జరాంగనలు మహో
త్కర్షంబులఁ గుసుమంబుల
ర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా!
టీక:- తర్షంబులన్ = ఆదరముతో; నరసింహుని = నరసింహుని; హర్షంబులన్ = ఆనందములతో; చూచి = చూసి; నిర్జర = దేవ {నిర్జరులు - జర (ముదిమి)లేనివారు, దేవతలు}; అంగనలు = స్త్రీలు; మహా = గొప్పగా; ఉత్కర్షంబులన్ = అతిశయములతో; కుసుమంబుల = పూల; వర్షంబులు = వానలను; కురిసిరి = కురిపించిరి; ఉత్సవంబులన్ = పండుగలు చేయుచు; అధిపా = రాజా.
భావము:- ఓ మహారాజా! నరసింహరూపుడి విజయోత్కర్షం చూసిన దేవకాంతలు ఆదర ఆనందాతిరేకాలతో పూలవానలు కురిపించారు. ఆనందంతో ఉత్సవాలు చేసుకున్నారు.

191
మఱియు నయ్యవసరంబున మింట ననేక దేవతావిమానంబులును గంధర్వగానంబులును, నప్సరోగణ నర్తన సంవిధానంబులును, దివ్యకాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులును బ్రకాశమానంబు లయ్యె; సునంద కుముదాదు లయిన హరిపార్శ్వచరులును, విరించి మహేశ్వర మహేంద్ర పురస్సరు లగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులును, ప్రజాపతులును, నరకంఠీరవ దర్శనోత్కంఠు లయి చనుదెంచి.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; మింటన్ = ఆకాశమున; అనేక = పలు; దేవతా = దేవతల; విమానంబులును = విమానములు; గంధర్వ = గంధర్వుల; గానంబులును = పాటలును; అప్సరస్ = అప్సరసల; గణ = సమూహము యొక్క; నర్తన = ఆటల; సంవిధానంబులును = తీరులును; దివ్య = దివ్యమైన; కాహళ = బాకాలు; భేరీ = భేరీలు; పటహ = తప్పెటలు; మురజ = మద్దెలలు; ఆది = మొదలగు; ధ్వానంబులునున్ = శబ్దములు; ప్రకాశమానంబులు = ప్రకాశించునవి; అయ్యెన్ = అయ్యెను; సునంద = సునందుడు; కుముద = కుముదుడు; ఆదులు = మొదలగువారు; అయిన = ఐన; హరి = విష్ణుని; పార్శ్వచరులును = పరిచారకులు; విరించి = బ్రహ్మదేవుడు {విరించి - భూతములను పుట్టించువాడు, బ్రహ్మ}; మహేశ్వర = పరమశివుడు; మహేంద్ర = ఇంద్రుడు; పురస్సరులు = ముందు నడచు వారు; అగు = అయిన; త్రిదశ = దేవతలు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; పన్నగ = సర్పములు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; చారణ = చారణులు; విద్యాధర = విద్యాధరులు; ఆదులును = మొదలగువారు; ప్రజాపతులును = ప్రజాపతులు; నరకంఠీరవ = నరసింహుని; దర్శన = చూడవలె నని; ఉత్కంఠులు = వేడుక గలవారు; అయి = అయ్యి; చనుదెంచి = వచ్చి.
భావము:- ఆ సమయంలో ఆకాశంలో అనేకమైన దేవతా విమానాలు తిరిగాయి; గంధర్వ గానాలు వీనుల విందు చేశాయి; అప్సరసల నాట్యాలు కన్నుల పండువు చేశాయి; దివ్యమైన కాహళ, భేరీ, మురజ మున్నగు మంగళవాద్యాలు అనేకం వినబడ్డాయి; సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరులు; పరమేశ్వరుడూ, బ్రహ్మదేవుడూ, మహేంద్రుడూ, మొదలైన దేవతలూ; కిన్నరులూ; కింపురుషులూ; నాగులూ; సిద్ధులూ; సాధ్యులూ; గరుడులూ; గంధర్వులూ; చారణులూ; విద్యాధరులూ; ప్రజాపతులూ అందరూ ఆ ఉగ్ర నరకేసరిని దర్శించాలనే కుతూహలంతో విచ్చేశారు.

దేవతల నరసింహ స్తుతి

192
కమలయుగళ కీలిత
శిరులై డగ్గఱక భక్తిఁ జేసిరి బహు సం
ణాబ్ధి తరికి నఖరికి
భోజనహస్తి హరికి రకేసరికిన్.
టీక:- కర = చేతులు యనెడి; కమల = పద్మముల; యుగళ = జంటలచే; కీలిత = తగల్చబడిన; శిరులు = తలలు కలవారు; ఐ = అయ్యి; డగ్గఱక = దగ్గరకు చేరక; భక్తిన్ = ప్రపత్తిని; చేసిరి = చూపిరి; బహు = విస్తారమైన; సంసరణ = సంసారము యనెడి; అబ్ధి = సముద్రమును; తరి = దాటించువాని; కిన్ = కి; నఖరి = గోళ్లు గలవాని; కిన్ = కి; నరభోజన = రాక్షసులు యనెడి {నరభోజనులు - నర (మానవులను) భోజనులు (తినెడివారు), రాక్షసులు}; హస్తి = ఏనుగుకి; హరి = సింహము యైనవాని; కిన్ = కి; నరకేసరి = నరసింహుని; కిన్ = కి.
భావము:- అసంఖ్యాత కష్టాల సాగరమైన సంసారాన్ని తరింపజేసేవాడూ; నరులను భక్షించే రాక్షసజాతిలో మదించిన ఏనుగు అంత బలిష్ఠుడైన ఆ హిరణ్యకశిపుడిని సింహ పరాక్రమంతో హరింప జేసిన వాడూ అయిన నరసింహావతారుడిని; తమ కమలాలవంటి చేతులు రెంటిని జోడించి శిరస్సున జేర్చి దూరం నుండే భక్తితో నమస్కరించారు.

193
ఆ సమయంబున దేవత లందఱు వేఱువేఱ వినుతించిరి; అందుఁ గమలాసనుం డిట్లనియె.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; దేవతలు = దేవతలు; అందఱున్ = అందరును; వేఱువేఱ = వేరవేరుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; కమలాసనుండు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము (పద్మము)ను ఆసనుడు (ఆసనముగా గలవాడు), బ్రహ్మ}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- ఆ సమయంలో అలా నమస్కరించిన దేవతలు అందరూ ఎవరికి వారు వివిధ రీతులలో స్తుతించారు. వారిలో పద్మం ఆసనంగా కలిగిన బ్రహ్మదేవుడు ఇలా సన్నుతించాడు.

194
లీలాగుణచాతురిన్ భువనముల్ ల్పించి రక్షించి భే
ముం జేయు దురంతశక్తికి ననంజ్యోతికిం జిత్ర వీ
ర్యునికిన్ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికిన్ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై.”
టీక:- ఘన = గొప్ప; లీలా = వేడుకగా ధరించెడి; గుణ = గుణత్రయమును {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; చాతురిన్ = నేర్పుచేత; భువనముల్ = లోకములను; కల్పించి = సృష్టించి; రక్షించి = కాపాడి; భేదనమున్ = నాశనము; చేయు = చేసెడి; దురంత = ఆపలేని; శక్తి = శక్తి గలవాని; కిన్ = కి; అనంత = అపరిమిత; జ్యోతి = తేజము గలవాని; కిన్ = కి; చిత్ర = అబ్బురమైన; వీర్యున్ = పరాక్రమము గలవాని; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; పవిత్ర = పావనములైన; కర్మున్ = కర్మములు చేయువాని; కిన్ = కి; నేను = నేను; ఉత్కంఠ = వేడుక; తోన్ = తోటి; అవ్యయ = నాశములేని; ఆత్మ = ఆత్మస్వరూపుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించెదన్ = చేసెదను; కృపా = దయ; ముఖ్య = మొదలైన; ప్రసాద = అనుగ్రమును; అర్థిన్ = కోరువాడను; ఐ = అయ్యి.
భావము:- “గొప్ప లీలావిలాసాలలా ఈ అఖిల ప్రపంచాన్ని సృష్టించటం, పోషించటం, హరించటం అనే మహాకార్యాలను అవలీలగా నిర్వహించే ఓ ఆపరాని మహా శక్తి స్వరూపా! అపరిమిత తేజో మూర్తీ! అబ్బురమైన పరాక్రమశాలీ! నిత్య పవిత్రకర్మానుసారిణీ! నాశరహితుడైన పరమాత్మా! నేను అత్యంత ఆసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రణామాలు ఆచరిస్తున్నాను. దేవా! స్వీకరించు.”

195
రుద్రుం డిట్లనియె.
టీక:- రుద్రుండు = పరమశివుడు {రుద్రుడు - (మిక్కిలి) రౌద్రము (కోపము) గలవాడు, శివుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- రుద్రుడు ఇలా పొగిడాడు.

196
రవరేణ్య! మీఁదట సస్ర యుగాంతము నాఁడు గాని కో
మునకు వేళ గాదు సురబాధకుఁ డైన తమస్వినీచరున్
రమునన్ వధించితివి చాలుఁ ద దాత్మజుఁడైన వీఁడు స
ద్విలుఁడు నీకు భక్తుఁడు పవిత్రుఁడు గావుము భక్తవత్సలా!”
టీక:- అమర = దేవతలలో; వరేణ్య = ఎన్నదగినవాడ; మీదట = రాబోవు కాలములో; సహస్ర = వేలకొలది; యుగాంతము = ప్రళయ; నాడు = సమయమున; కాని = తప్పించి; కోపమున్ = కోపమున; కున్ = కు; వేళ = ఇది సమయము; కాదు = కాదు; సుర = దేవతలను; బాధకుడు = బాధించువాడు; ఐన = అయిన; తమస్వినీచరున్ = రాక్షసుని {తమస్వినీచరుడు - తమస్ (చీకటి, రాత్రి) వేళ చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; సమరమునన్ = యుద్ధము నందు; వధించితివి = సంహరించితివి; చాలున్ = ఇంక చాలును; తత్ = అతని; ఆత్మజుడు = పుత్రుడు {ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), కొడుకు}; ఐన = అయిన; వీడు = ఇతడు; సత్ = చక్కటి; విమలుడు = నిర్మలుడు; నీ = నీ; కున్ = కు; భక్తుడు = భక్తుడు; పవిత్రుడు = పావనమైనవాడు; కావుము = కాపాడుము; భక్తవత్సలా = నరసింహుడా {భక్తవత్సలా - భక్తుల యెడ వాత్సల్యము గల వాడు. విష్ణువు}.
భావము:- “ఓ దేవతోత్తమా! భక్తుల యెడ మిక్కిలి వాత్సల్యము గల మహానుభావా! ఇంకా వెయ్యి యుగాలు గడచిన తరువాత కదా నీవు కోపం పూనాలి కానీ, (మహా ప్రళయం వేళ అప్పటికి కాని రాదు కదా) ఆగ్రహానికి ఇది సమయం కాదు. దేవతలను బాధించే దానవేశ్వరుడిని సంహరించావు. బాగుంది. ఇంక చాలు. అతని కుమారుడు ఈ పిల్లవాడు. కల్మషం లేనివాడు. నీకు భక్తుడు. పరమ పవిత్రుడు. ఇతనిని కరుణతో కాపాడు.”

197
ఇంద్రుం డిట్లనియె.
టీక:- ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంద్రుడు ఇలా సన్నుతించాడు

198
ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల;
నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు;
దింతకాలము దానవేశ్వరుచే బాధ;
డి చిక్కి యున్న యాన్నజనుల
క్షించితివి మమ్ము; రాక్షసుఁ జంపితి;
క్రతుహవ్యములు మాకుఁ లిగె మరల;
మంటిమి; నీ సేవ రిగిన వారలు;
కైవల్య విభవంబు కాంక్ష చేయ

రితరసుఖము లెల్ల నిచ్ఛగింపఁగ నేల?
స్థిరంబులివి, యనంతభక్తిఁ
గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక
చిత్తభయదరంహ! శ్రీనృసింహ!”
టీక:- ప్రాణి = జీవ; సంఘముల = కోటి యొక్క; హృత్ = హృదయము లనెడి; పద్మ = పద్మముల; మధ్యంబులన్ = నడిమి యందు; నివసించి = ఉండి; భాసిల్లు = ప్రకాశించెడి; నీవ = నీవే; ఎఱుంగుదు = తెలిసి యుందువు; ఇంత = ఇంత; కాలము = కాలము; దానవ = రాక్షసుల; ఈశ్వరు = రాజు; చేన్ = వలన; బాధ = బాధ లందు; పడి = పడి; చిక్కి = నీరసించి; ఉన్న = ఉన్నట్టి; ఆపన్న = అపాయముల పడిన; జనులన్ = వారలను; రక్షించితివి = కాపాడితివి; మమ్మున్ = మమ్ము; రాక్షసున్ = రాక్షసుని; చంపితి = చంపితివి; క్రతు = యజ్ఞము లందలి; హవ్యములున్ = హవిర్భాగములు; మా = మా; కున్ = కు; కలిగె = లభించినవి; మరలన్ = మరల; మంటిమి = బతికితిమి; నీ = నీ యొక్క; సేవన్ = భక్తిని; మరిగిన = మరలుగొనిన, మోహపడిన; వారలు = వారు; కైవల్య = ముక్తిపదము యొక్క; విభవంబున్ = వైభవమును కూడ; కాంక్షచేయరు = కోరరు; ఇతర = మిగిలిన.
సుఖముల్ = సుఖములను; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చగింపన్ = కోరుట; ఏల = ఎందులకు; అస్థిరంబులు = చపలములు; ఇవి = ఇవి; అనంత = తెంపులేని; భక్తిన్ = భక్తితో; కొలువనిమ్ము = సేవించనిమ్ము; నిన్నున్ = నిన్ను; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షస; అనీక = సేనల; చిత్త = మనసులందు; భయద = భయము పుట్టించెడి; రంహ = సంరంభము గలవాడ; శ్రీ = శుభకరమైన; నృసింహ = నరసింహుడా."
భావము:- “అరివీర భయంకర స్పూర్తీ! నరసింహమూర్తీ! నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసు లందరి మనసులలోనూ భయము రేకెత్తించే వాడవు. సమస్త ప్రాణుల హృదయ పద్మాలలోనూ ప్రకాశించు వాడవు. నీకు తెలియనిది ఏమున్నది. ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభువు అయిన హిరణ్యకశిపుని వలన కష్టాలు అనుభవించి ఆర్తులం అయ్యాము. నీవు ఆ రాక్షసుని సంహరించి మమ్ములను రక్షించావు. మాకు మరల మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. నీ సేవా భాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోటం ఎందుకూ, దండగ. అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరం ప్రసాదించు నరకేసరీ!”

199
ఋషు లిట్లనిరి.
టీక:- ఋషులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి.
భావము:- మునీశ్వరులు ఇలా స్తోత్రాలు చేశారు.

200
దీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ
వి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ
వినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే
విధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ర్మానుసంధాయివై.”
టీక:- భవదీయ = నీ యొక్క; ఆదర = ఆదరము యనెడి; లీలన్ = విలాసముచేత; లోకములన్ = లోకములను; ఉత్పాదించి = సృష్టించి; రక్షింపన్ = కాపాడగా; నేడు = ఇప్పుడు; అవి = అవి; దైత్య = రాక్షస; ఈశుని = రాజు; చేత = చేత; భేదితములు = చెరుపబడినవి; ఐ = అయ్యి; హ్రస్వంబులు = క్షీణించినవి, చిక్కిపోయినవి; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఈ = ఈ; అవినీతున్ = నీతిమాలినవాని; నరసింహ = నరసింహుని; రూపమునన్ = స్వరూపముతో; సంహారంబునొందించి = చంపి; వేద = వేదానుసార; విధిన్ = ధర్మమును; క్రమ్మఱన్ = మరల; ఉద్ధరించితి = నిలబెట్టితివి; కదా = కదా; ధర్మ = ధర్మమార్గమును; అనుసంధాయివి = కూర్చెడివాడవు; ఐ = అయ్యి.
భావము:- “ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి, రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా భిన్నం చేసాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”

201
పితృదేవత లిట్లనిరి.
టీక:- పితృదేవతలు = పితృదేవతలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- పితృదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు.

202
చంక్రోధముతోడ దైత్యుఁడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్
పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు
ద్దంత్వంబునఁ దాన కైకొను మహోగ్రుండు; వీఁ డిక్కడన్
ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్ గావింతు మాత్మేశ్వరా!”
టీక:- చండ = తీవ్రమైన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; దైత్యుడు = రాక్షసుడు; వడిన్ = వేగముగ; శ్రాద్ధంబులన్ = ఆబ్దికములాది పితృకర్మలలో; మత్ = మా యొక్క; సుతుల్ = సంతతివారు; పిండంబులన్ = పిండములను; సతిలోదకంబులుగన్ = నువ్వులు నీళ్ళతో కూడినవిగా; అర్పింపంగన్ = సమర్పించుతుండగా; మా = మా; కున్ = కు; ఈక = ఈయకుండ; ఉద్ధండత్వంబునన్ = దాష్టీకముతో; తాన = తనే; కైకొనున్ = స్వీకరించును; మహా = మిక్కిలి; ఉదగ్రుండు = క్రూరుడు; వీడు = ఇతడు; ఇక్కడన్ = ఇక్కడ; ఖండింపంబడె = చంపబడెను; నీ = నీ; నఖంబులన్ = గోళ్ళతోటి; నుతుల్ = స్తోత్రములను; కావింతుము = చేసెదము; ఆత్మేశ్వరా = నరసింహుడా {ఆత్మేశ్వరుడు - ఆత్మ (తమ యొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు}.
భావము:- “ఓ పరమాత్మా! నరసింహరూపా! మా సుతులు మా సుగతుల కోసం శ్రాద్ధాలు పెడుతున్నారు; పిండాలు, నువ్వులు నీళ్ళూ వదులుతున్నారు. కాని అవి మాకు అందనీయకుండా ఈ హిరణ్యాక్ష అసురుడు అమిత కోపంతో వేగంగా వచ్చి, హరించి, పట్టుకు పోయేవాడు. ఆ స్వార్థపర దుండగీడుని ఇక్కడ సంహరించావు. మా కష్టాలు తీర్చావు. నీకు నమస్కారములు”

203
సిద్ధు లిట్లనిరి.
టీక:- సిద్ధులు = సిద్ధులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- సిద్ధులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.

204”
క్రుద్ధుండై యణిమాదిక
సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా
యోద్ధవు నీ కృప మాకును
సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!”
టీక:- క్రుద్ధుండు = కోపము గలవాడు; ఐ = అయ్యి; అణిమాదిక = అణిమ మొదలైన; సిద్ధులున్ = అష్టసిద్ధులను {అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; కైకొనిన = తీసుకొన్న; దైత్యున్ = రాక్షసుని; చీరితివి = చంపితివి; మహా = గొప్ప; యోద్ధవున్ = యోధుడవు; నీ = నీ యొక్క; కృపన్ = దయవలన; మా = మా; కును = కు; సిద్ధులు = అష్టసిద్ధులు; మరలంగన్ = మళ్ళీ; కలిగెన్ = కలగినవి; శ్రీ = మహనీయమైన; నరసింహా = నరసింహుడా.
భావము:- “శ్రీ నరసింహావతారా! నీవు యోధానుయోధుడవు. ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ, మహిమ, గరిమ మున్నగు సిద్ధులు అన్నింటిని లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని చీల్చిచెండాడి సంహరించావు. మేలయ్యను. నీ దయ వలన మరల నా సిద్ధులు మాకు లభించాయి.”

205
విద్యాధరు లిట్లనిరి.
టీక:- విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- విద్యాధరులు ఇలా వినుతులు వినుతించారు.

206
”దావునిఁ జంపి యంత
ర్ధానాదికవిద్య లెల్ల యతో మరలం
గా నిచ్చితివి విచిత్రము
నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!”
టీక:- దానవునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; అంతర్థాన = మాయ మగుట; ఆది = మొదలగు; విద్యలు = విద్యలు; ఎల్లన్ = అన్నిటిని; దయ = కరుణ; తోన్ = తోటి; మరలంగన్ = పునరుద్దరింపజేసి; ఇచ్చితివి = ఇచ్చితివి; విచిత్రము = అద్భుతము; నీ = నీ యొక్క; నిరుపమ = సాటిలేని; వైభవంబు = ప్రభావము; నిజము = సత్యము; నృసింహా = నరసింహుడా.
భావము:- “ఓ నరకేసరీ! నీ వైభవం అతులితమూ, అసాధారణమూ. నీ చారిత్రము బహు విచిత్రము. హిరణ్యకశిప రాక్షసుడిని చంపి, అంతర్ధానం మున్నగు మా శక్తులు అన్నీ దయతో మాకు వెనక్కు ఇచ్చావు.”

207
భుజంగు లిట్లనిరి.
టీక:- భుజంగులు = సర్పముల; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- నాగేంద్రులు ఇలా నతులు పలికారు.

208
”రత్నములను మత్కాంతా
త్నంబుల బుచ్చికొన్న క్కసు నురమున్
త్నమున వ్రచ్చి వైచితి;
త్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!”
టీక:- రత్నములను = రత్నములను; మత్ = మా యొక్క; కాంతా = స్త్రీ, భార్యా; రత్నంబులన్ = రత్నములను; పుచ్చికొన్న = తీసుకొన్న; రక్కసున్ = రాక్షసుని; ఉరమున్ = వక్షస్థలమును; యత్నమునన్ = పూని; వ్రచ్చివైచితివి = చీల్చివేసితివి; పత్నులున్ = భార్యలను; రత్నములున్ = మణులు; కలిగి = పొంది; బ్రతికితిమి = బతికిపోతిమి; ఈశా = నరసింహా.
భావము:- “ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.”

209
మనువు లిట్లనిరి.
టీక:- మనువులు = మనువులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- మనువులు ఇలా మనవి చేసుకున్నారు.

210
”దుర్ణయుని దైత్యుఁ బొరిగొని
ర్ణాశ్రమ ధర్మసేతు ర్గము మరలం
బూర్ణము చేసితి వే మని
ర్ణింతుము? కొలిచి బ్రతుకువారము దేవా!”
టీక:- దుర్ణయుని = దుర్నీతి గలవానిని; దైత్యున్ = రాక్షసుని; పొరిగొని = చంపి; వర్ణ = వర్ణముల యొక్క ధర్మముల; ఆశ్రమధర్మ = ఆశ్రమధర్మముల; సేతు = కట్టుబాట్ల; వర్గమున్ = సమూహమును; మరలన్ = తిరిగి; పూర్ణము = పరిపూర్ణము; చేసితివి = చేసితివి; ఏమని = ఏమని; వర్ణింతుము = కీర్తింతుము; కొలిచి = సేవించి; బ్రతుకు = జీవించెడి; వారము = వారిమి; దేవా = నరసింహా.
భావము:- “ఓ దేవా! ఈ దుష్టుని వలన వర్ణాశ్రమ ధర్మాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి తిరిగి ధర్మం సంస్థాపన కావించావు. నిన్ను ఏమని కీర్తించ గలము? ఎలా స్తుతించ గలము? నీ సేవే మాకు జీవనాధారం ప్రభూ!”

211
ప్రజాపతు లిట్లనిరి.
టీక:- ప్రజాపతులు = ప్రజాపతులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ప్రజాపతులు ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.

212
ప్రలం జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ
బ్రలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి; మీ
కునున్ వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు లే కెల్ల చోఁ
బ్రలం జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!”
టీక:- ప్రజలన్ = లోకులను; చేయుట = పుట్టించుట; కై = కోసము; సృజించితి = పుట్టించితి; మమున్ = మమ్ములను; పాటించి = పూని; దైత్య = రాక్షసుని; ఆజ్ఞ = ఉత్తరువుల; చేత = వలన; ప్రజలన్ = లోకులను; చేయక = పుట్టించకుండగ; ఇంత = ఇన్ని; కాలమున్ = దినములు; మహా = గొప్ప; భారంబు = దుఃఖభారము; తోన్ = తోటి; ఉంటిమి = ఉన్నాము; ఈ = ఈ; కుజనున్ = దుర్జనుని; వక్షమున్ = రొమ్మును; చీరి = చీల్చివేసి; చంపితివి = సంహరించితివి; సంకోచంబుల్ = అనుమానములు; లేకన్ = లేకుండగ; ఎల్ల = అన్ని; చోన్ = చోటు లందు; ప్రజలన్ = లోకులను; చేయుచున్ = చేయుచు; ఉండువారము = ఉంటాము; జగత్ = లోకములను; భద్రాయమాణ = క్షేమకర మగుటకు; ఉదయా = అవతరించినవాడ.
భావము:- “ఓ నరకేసరీ! జగత్తులకు మేలు చేయుటకు అవతరించిన ప్రభువా! జగద్రక్షకా! మమ్మల్ని ప్రజాసృష్టి చేయటం కోసమే సృష్టించావు. కానీ ఈ రాక్షసుడి ఆజ్ఞ మూలాన ఆ ప్రజాసృష్టినే మానేయవలసి వచ్చింది. ప్రజా వ్యవస్థకు దురవస్థ దాపురించింది. ఆ దుర్మతి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి చంపావు. ఇంక ఏ సంకోచమూ లేకుండా ప్రజాసృష్టి చేస్తుంటాము.”

213
గంధర్వు లిట్లనిరి.
టీక:- గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.

214
”ఆడుదుము రేయుఁబగలుం
బాడుదుము నిశాటు నొద్ద, బాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే.”
టీక:- ఆడుదుము = నాట్యము చేసెదము; రేయున్ = రాత్రు లందు; పగలున్ = పగళ్ళ యందు; పాడుదుము = పాడెదము; నిశాటున్ = రాక్షసుని {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఒద్దన్ = దగ్గర; బాధించున్ = బాధపెట్టును; దయన్ = కరుణతో; చూడడు = చూడడు; నీ = నీ; చేన్ = చేత; జమునిగూడెన్ = చనిపోయెను {జమునిగూడు - జముని (యముని) కూడు (కలియు), మరణించు}; మహా = అతి; పాతకున్ = తీవ్రమైన పాపములు గలవాని; కున్ = కు; కుశలము = క్షేమము; కలదే = ఉండునా ఏమి.
భావము:- “ప్రభూ! రాత్రిం బవళ్ళు ఈ రాక్షసుడి సమక్షంలో గానం చేసేవాళ్ళం; నాట్యం చేసే వాళ్ళం; అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు; ఏనాడూ దయగా చూడలేదు. వీడిలాంటి మహాపాపిష్టి వానికి మంగళం ఎలా కలుగుతుందా? చివరికి నీ వల్ల యమపురికి పోయాడు”

215
చారణు లిట్లనిరి.
టీక:- చారణులు = చారణులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- చారణులు ఇలా అన్నారు.

216
”భునజన హృదయభల్లుఁడు
దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీ చేతన్
రోగ నివర్తక మగు
దంఘ్రి యుగంబుఁ జేరి బ్రదికెద మీశా!”
టీక:- భువన = జగత్తు నందలి; జన = జనుల యొక్క; హృదయ = హృదయములకు; భల్లుడు = బల్లెమువంటివాడు; దివిజేంద్ర = ఇంద్రుని {దివిజేంద్రుడు - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు}; విరోధి = శత్రువు; నేడు = ఈ దినమున; తెగెన్ = మరణించెను; నీ = నీ; చేతన్ = వలన; భవ = సంసారము యనెడి; రోగ = రోగమును; నివర్తకము = పోగొట్టునది; అగు = అయిన; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదముల; యుగంబున్ = జంటను; చేరి = చేరి; బ్రదికెదము = బతికెదము; ఈశా = నరసింహుడా.
భావము:- “ఓ నరకేసరీ! సర్వలోకేశ్వరా! హిరణ్యకశిపుడు ప్రజా హృదయ కంటకుడు. దేవేంద్రుని బద్దశత్రువూ. రాత్రించరులైన రాక్షస జాతికి చెందినవాడు నీ చేతిలో మరణించాడు, మా కష్టాలు గట్టెక్కాయి. ఇంక సంసార బంధాలనుండి విముక్తి నొసంగే నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము.”

217
యక్షు లిట్లనిరి.
టీక:- యక్షులు = యక్షులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- యక్షులు ఈ విధంగా అన్నారు.

218
భ్రంము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంయవృత్తి దిక్కులఁ బ్రచారము చేయుచు నుండు వీఁడు ని
స్త్రింముతోడ; వీనిఁ గడతేర్చితి వాపద మానె నో! చతు
ర్వింతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్యజగన్నివాసకా!”
టీక:- భ్రంశము = కలత; లేని = లేనట్టి; నీ = నీ యొక్క; భటులన్ = కింకరులము; భంగవిముక్తులము = పరాభవము లేనివారము; మమ్మున్ = మమ్ములను; ఎక్కి = అధిరోహించి; నిస్సంశయ = సంశయమేమి లేని; వృత్తిన్ = విధముగ; దిక్కులన్ = అన్ని వైపులకు; ప్రచారము = అధికముగ చరించుట; చేయుచునుండు = చేయుచుండు; వీడు = ఇతడు; నిస్త్రింశము = గోర్లు {నిస్త్రింశము - ముప్పది మానములకంటె పెద్దవి, నరహరి గోర్లు}; తోడన్ = తోటి; వీనిన్ = ఇతనిని; కడతేర్చితివి = చంపితివి {కడతేర్చు - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు}; ఆపద = కష్టము; మానెను = తప్పినది {త్రివిష్టపము - (ముల్లోకములు భూర్భువస్సువర్లోకములలోని) త్రి (మూడవ 3) విష్టపము (లోకము), స్వర్గము}; ఓ = ఓ {చతుర్వింశతితత్త్వములు -దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము}; చతుర్వింశతితత్త్వశాసక = నరసింహుడా {చతుర్వింశతితత్త్వశాసకుడు - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు}; త్రివిష్టపముఖ్యజగన్నివాసకా = నరసింహుడా {త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకా (వసించెడివాడు), విష్ణువు}.
భావము:- “ఓ నరసింహస్వామీ! నీవు ఇరవైనాలుగు తత్వాలను ప్రవర్తింపజేసే వాడవు. త్రివిష్టప వాసులైన దేవత లందరికి ఉన్నతుడవు. జగత్తంతా నిండి ఆత్మ రూపంలో వసించి ఉండే వాసుదేవుడవు. ఈ దానవేశ్వరుడు అయ్యో పాపం అనికూడా అనుకోకుండా, మా భుజాల మీద ఎక్కి నల్దిక్కులా తిరుగుతుండే వాడు. ఆ హిరణ్యకశిపుడుని వధించావు. మా కష్టాలు కడతేర్చావు.”

219
కింపురుషు లిట్లనిరి.
టీక:- కింపురుషులు = కిపురుషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- కింపురుషులు కీర్తిస్తూ ఇలా అన్నారు

220
”పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు
ష్పురుషున్ సకల సుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!”
టీక:- పురుషోత్తమ = నరసింహుడా; నేరము = సమర్థులము కాము; కింపురుషులము = కింపురుషజాతి వారము; అల్పులము = చిన్నవారము; నిన్నున్ = నిన్ను; భూషింపగన్ = స్తుతించుటకు; దుష్పురుషున్ = చెడ్డవానిని; సకల = అఖిలమైన; సుజన = మంచివారి; హృత్ = హృదయములకు; పరుషున్ = కఠినుని; చంపితివి = సంహరించితివి; జగము = భువనము; బ్రతికెన్ = కాపాడబడినది; అధీశా = నరసింహుడా {అధీశ - సర్వజగత్తులకు అధి (పై) ఈశ (ప్రభువు), విష్ణువు}.
భావము:- “ఓ పురుషోత్తమా! పరమేశ! మేము కింపురుషులు అనే దేవతాభేదం వారం. నరముఖమూ అశ్వశరీరమూ కలవారం. అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగినవారం కాదు. శిష్టులైన వారి హృదయాలు గాయపడేలా బాధించేవాడు హిరణ్యకశిపుడు. ఆ దుష్టుడిని సంహరించావు. లోకమంతా బ్రతికిపోయింది.”

221
వైతాళికు లిట్లనిరి.
టీక:- వైతాళికులు = మేలుకొలుపు పాడు వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- మేలుకొలుపులు పాడే వైతాళికులు ఇలా స్తుతించారు

222
”త్రిభువనశత్రుఁడు పడియెను
లందును మఖము లందు గదీశ్వర! నీ
శుగీతములు పఠించుచు
యులమై సంచరింతు మార్తశరణ్యా!”
టీక:- త్రిభువన = ముల్లోకములకు; శత్రుడు = శత్రువు; పడియెన్ = చనిపోయెను; సభలు = సభలు; అందును = లోను; మఖములు = యజ్ఞములు; అందున్ = లోను; జగదీశ్వర = నరసింహుడా {జగదీశ్వరుడు - జగత్ (భువనములకు) ఈశ్వరుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; శుభ = మంగళ; గీతములున్ = స్తోత్రములను; పఠించుచున్ = పాడుచు; అభయులము = భయములేని వారము; ఐ = అయ్యి; సంచరింతుము = తిరిగెదము; ఆర్తశరణ్య = నరసింహుడా {ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు}.
భావము:- “ఓ సకల భువన పాలకా! నరకేసరి! నీవు ఆర్తులకు శరణు ఇచ్చువాడవు. ముల్లోకాలకూ శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంక యజ్ఞశాలలలోనూ, సభావేదికలమీదా నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము.”

223
కిన్నర లిట్లనిరి.
టీక:- కిన్నరలు = కిన్నరలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అశ్వముఖమూ నరశరీరమూ కలవారు, దేవతాభేదమూ అయిన కిన్నరులు ఇలా విన్నవించుకున్నారు.

224
”ధర్మము దలఁపడు లఘుతర
ర్మము చేయించు మమ్ముఁ లుషాత్మకు దు
ష్కర్మునిఁ జంపితి; వున్నత
ర్ములమై నీదు భక్తి లిపెదము హరీ!”
టీక:- ధర్మమున్ = న్యాయమును; తలపడు = విచారింపడు; లఘుతర = మిక్కిలి నీచపు {లఘు - లఘుతర - లఘుతమ}; కర్మము = పనులను; చేయించున్ = చేయించును; మమ్మున్ = మమ్ములను; కలుషాత్మకున్ = పాపాత్ముని; దుష్కర్మునిన్ = క్రూరకర్ముని; చంపితి = సంహరించితివి; ఉన్నత = గొప్ప; శర్ములము = సుఖము గలవారము; ఐ = అయ్యి; నీదు = నీ యొక్క; భక్తిన్ = భక్తిని; సలిపెదము = చేసెదము; హరీ = నరసింహుడా.
భావము:- “ఓ విష్ణుదేవా! ఈ హిరణ్యకశిప రాక్షసుడు ధర్మం తెలియని వాడు. మా చేత హీనమైన కార్యాలు చేయించేవాడు. అలాంటి దుర్మార్గుడిని సంహరించావు. ఇక సుఖజీవనులమై నిన్ను భక్తితో కొలుస్తాము.”

225
విష్ణుసేవకు లిట్లనిరి.
టీక:- విష్ణు = విష్ణుని; సేవకులు = కింకరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- విష్ణుభక్తులు ఇలా వినుతులు చేసారు.

226
సంచిత విప్రశాపమునఁ జండనిశాచరుఁ డైన వీని శి
క్షించుట కీడు గాదు కృప జేసితి వీశ్వర! భక్తితోడ సే
వించుటకంటె వైరమున వేగమ చేరఁగ వచ్చు నిన్ను; నీ
యంచిత నారసింహ తను ద్భుత మాపదఁ బాసి రందఱున్.”
టీక:- సంచిత = పూర్వజన్మము నార్జింపబడిన; విప్ర = బ్రాహ్మణ; శాపమునన్ = శాపముచేత; చండ = క్రూరమైన; నిశాచరుడు = రాక్షసుడు; ఐన = అయిన; వీని = ఇతనిని; శిక్షించుట = దండించుట; కీడు = అపకారము; కాదు = కాదు; కృప = కరుణ; చేసితివి = చూపితివి; ఈశ్వర = నరసింహా; భక్తి = భక్తి; తోడన్ = తోటి; సేవించుట = సేవించుట; కంటెన్ = కంటె; వైరమునన్ = విరోధముతోటి; వేగమ = శ్రీఘ్రమే; చేరగవచ్చున్ = పొందవచ్చును; నిన్నున్ = నిన్ను; నీ = నీ యొక్క; అంచిత = చక్కనైన; నారసింహ = నరసింహుని; తనువు = దేహము; అద్భుతము = ఆశ్చర్యకరము; ఆపదన్ = అపాయమును; పాసితిరి = తొలగింపబడిరి; అందఱున్ = అందరును.
భావము:- “ప్రభూ! విష్ణుమూర్తీ! విప్రులు సనక సనందాదుల ఘోరమైన శాపం వల్ల, క్రూరులైన దానవులుగా జన్మించారు జయవిజయులు. అలా హిరణ్యకశిపునిగా జన్మించిన వాడిని నువ్వు ఇప్పుడు చంపి, కీడు కాదు మేలే చేశావు. ఘోరాతి ఘోరాలు చేసిన వాడు ఇవాళ నీచేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. భక్తితో కంటే శత్రుత్వంతోనే నిన్ను వేగంగా చేరవచ్చు కదా! నీ ఈ నరకేసరి స్వరూపం పరమ అద్భుతమైనది. అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది.”

227
ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యు లందఱు నెడగలిగి యనేక ప్రకారంబుల వినుతించి; రందు రోషవిజృంభమాణుం డయిన నరసింహదేవుని డగ్గఱఁ జేర వెఱచి లక్ష్మీదేవిం బిలిచి; యిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = పరమ శివుడు; ఇంద్ర = ఇంద్రుడు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; పురస్సరులు = మొదలగువారు; ఐన = అయిన; దేవ = దేవతలలో; ముఖ్యులు = ప్రముఖులు; అందఱున్ = అందరును; ఎడ = దూరముగా; కలిగి = ఉండి; అనేక = పలు; ప్రకారంబులన్ = విధములుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; రోష = కోపము; విజృంభమాణుండు = అతిశయించినవాడు; అయిన = ఐన; నరసింహుని = నరసింహుని; డగ్గఱన్ = దగ్గరకు; చేరన్ = చేరుటకు; వెఱచి = భయపడి; లక్ష్మీదేవిన్ = లక్ష్మీదేవిని; పిలిచి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా ఉగ్ర నరసింహుని ప్రసన్నం చేసుకోవటానికి, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు మున్నగు దేవతా ప్రముఖులు అందరూ పరిపరి విదాల ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్ర స్వరూపం శాంతించలేదు. అంతటి రోషభీషణాకారంతో ఒప్పుతున్న నరసింహస్వామిని సమీపించటానికి కూడా బెదిరిన దేవతలు అందరూ, లక్ష్మీ దేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు.

228
”హరికిం బట్టపుదేవివి
రిసేవానిపుణమతివి రిగతివి సదా
రిరతివి నీవు చని నర
రిరోషము డింపవమ్మ! రివరమధ్యా!”
టీక:- హరి = విష్ణుని; కిన్ = కి; పట్టపుదేవివి = ధర్మపత్నివి; హరి = విష్ణుని; సేవా = సేవించుట యందు; నిపుణమతివి = నేర్పు గలదానవు; హరి = విష్ణువే; గతివి = దిక్కుగా గలదానవు; సదా = ఎల్లప్పుడును; హరి = విష్ణుని యెడల; రతివి = ప్రీతి గలదానివి; నీవు = నీవు; చని = వెళ్ళి; నరహరి = నరసింహుని; రోషమున్ = కోపమును; డింపవు = తగ్గింపుము; అమ్మ = తల్లి; హరి = సింహమువలె; వర = చక్కటి; మధ్య = నడుము గలామె.
భావము:- “ఓ లక్ష్మీదేవీ! నువ్వు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పట్టపురాణివి. ఆ శేషసాయికి సేవచేయుటలో మిక్కిలి నేర్పరివి. నారాయణుడే అండగా పొందిన నీవు, నిత్యం శ్రీహరి యెడల ప్రీతితో మెలుగుతుంటావు. సింహం వలె చిక్కని సన్నని నడుము గల చక్కని తల్లీ! నీవల్లే అవుతుంది, నరసింహుని శాంతపరచు.”

229
అనిన నియ్యకొని మహోత్కంఠతోడ నా కలకంఠకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుం జని.
టీక:- అనినన్ = అనగా; ఇయ్యకొని = అంగీకరించి; మహా = గొప్ప; ఉత్కంఠ = కౌతుకము; తోడన్ = తోటి; ఆ = ఆ; కలకంఠ = అవ్యక్త మధుర ధ్వని గల; కంఠి = కంఠము గలామె; నరకంఠీరవుని = నరసింహుని; ఉపకంఠంబున్ = సమీపమున; కున్ = కు; చని = వెళ్ళి.
భావము:- దేవతలు ఇలా అభ్యర్థించగా సమ్మతించి, మధురంగా మాట్లాడే మాత ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో ఆ ఉగ్ర నరకేసరి సన్నిధికి వెళ్ళి చూసింది.

230
ప్రళయార్కబింబంబు గిది నున్నది గాని;
నెమ్మోము పూర్ణేందు నిభము గాదు;
శిఖిశిఖాసంఘంబు చెలువు చూపెడుఁ గాని;
చూడ్కిఁ ప్రసాద భాసురము గాదు;
వీరరౌద్రాద్భుతావేశ మొప్పెడుఁ గాని;
భూరి కృపారస స్ఫూర్తి గాదు;
యద దంష్ట్రాకుర ప్రభలు గప్పెడుఁ గాని;
రహసితాంబుజాతంబు గాదు;

ఠిన నఖర నృసింహ విగ్రహము గాని
కామినీజన సులభ విగ్రహము గాదు;
విన్నదియుఁ గాదు; తొల్లి నే విష్ణువలన
న్నదియుఁ గాదు; భీషణాకార” మనుచు.
టీక:- ప్రళయా = ప్రళయకాల మందలి; అర్క = సూర్య; బింబంబు = బింబము; పగిదిన్ = వలె; ఉన్నది = ఉంది; కాని = తప్ప; నెఱ = నిండు; మోము = ముఖము; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని; నిభము = పోలినది; కాదు = కాదు; శిఖి = అగ్ని; శిఖా = మంటల; సంఘంబు = సమూహము; చెలువు = పోలికను; చూపెడున్ = చూపించుచున్నది; కాని = తప్పించి; చూడ్కిన్ = చూపు; ప్రసాద = అనుగ్రహముచే; భాసురము = ప్రకాశించునది; కాదు = కాదు; వీర = శౌర్యము; రౌద్రము = రౌద్రము; అద్భుత = ఆశ్చర్యము; ఆవేశమున్ = ఆవేశము; ఒప్పెడున్ = కనబడునది; కాని = కాని; భూరి = అత్యధికమైన; కృపా = కరుణా; రస = రసమును; స్ఫూర్తిన్ = కనబడునది; కాదు = కాదు; భయద = భయంకరమైన; దంష్ట్ర = కోరల; అంకుర = మొలకల యొక్క; ప్రభలున్ = కాంతులను; కప్పెడున్ = ప్రసరించునది; కాని = తప్పించి; దరహసిత = చిరునవ్వుతో కూడిన; అంబుజాతంబు = పద్మము {అంబుజాతము - అంబువు (నీరు)నందు జాతంబు (పుట్టునది), పద్మము}; కాదు = కాదు.
కఠిన = గట్టి; నఖర = గోళ్ళు కలిగిన; నారసింహ = నరసింహుని; విగ్రహము = రూపము; కాని = తప్పించి; కామినీ = స్త్రీ {కామిని - కామము నందు ఆసక్తి గలామె,స్త్రీ}; జన = జనములకు; సులభ = సుళువుగా లభించెడి; విగ్రహము = స్వరూపము; కాదు = కాదు; విన్నదియు = విన్నట్టిది; కాదు = కాదు; తొల్లి = ఇంతకు పూర్వము; నేన్ = నేను; విష్ణున్ = విష్ణుమూర్తి; వలన = వలన; కన్నదియున్ = చూచినది; కాదు = కాదు; భీషణ = భయంకరమైన; ఆకారము = రూపము; అనుచు = అనుచు.
భావము:- “ఆ నరసింహావతారుని ముఖము ప్రళయకాలపు సూర్య బింబంలాగ ఉంది తప్పించి, ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలలు లాగా ఉన్నాయి తప్ప, అనుగ్రహంతో ప్రకాశిస్తూ లేవు. ఆ దేవుని రూపం వీర, రౌద్ర అద్భుత రసావేశాలతో నిండి ఉంది తప్ప, అపార దయారస స్ఫూర్తితో లేదు. ఆయన కోరలు దంతాలు భయంకరమైన ప్రకాశాలు వెలిగక్కుతున్నాయి తప్ప చిరునవ్వులు చిందించే పద్మకాంతులు ప్రసరించటం లేదు. గట్టి గోళ్ళతో కూడిన నరకేసరి విగ్రహం తప్పించి, సుందరీమణులను సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. శ్రీమహావిష్ణువు యొక్క ఈ భీకరతర ఆకారం ఎప్పుడూ నేను విన్నదీ కాదు, కన్నదీ కాదు.” అని ఆశ్చర్యపోయింది శ్రీ లక్ష్మీదేవి.

231
లికెద నని గమకముఁ గొను;
లికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం
లుకఁ డని నిలుచు; శశిముఖి
లువిడి హృదయమునఁ జనవు యమును గదురన్.
టీక:- పలికెదన్ = పలకరించెదను; అని = అని; గమకముగొను = యత్నించును; పలికినన్ = పలకరించినను; కడు = మిక్కిలి; అలుగు = కోపించును; విభుడు = ప్రభువు; ప్రతి = మారు; వచనములన్ = మాటలు; పలుకడు = పలుకడు; అని = అని; నిలుచున్ = ఆగిపోవును; శశిముఖి = లక్ష్మీదేవి; బలువిడిన్ = వేగముగ; హృదయమునన్ = హృదయము నందు; చనవు = మచ్చిక; భయమునున్ = భయమును; కదురన్ = అతిశయించగా.
భావము:- ఆ చల్లనితల్లి చంద్రవదన శ్రీలక్ష్మి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దాం అనుకుంది. కానీ ఆ ఉగ్ర రూపం చూస్తుంటే, మాట్లాడితే మండిపడతాడేమో బదులు పలుకడేమో అని ఆగిపోయింది. మనస్సులో ఒక వైపు చనువు, ఒక వైపు భయమూ కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది.
ఈ అమృత గుళిక సర్వలఘు కంద పద్యం. ఇది లక్ష్మీ దేవి తడబాటును చూపుతోంది. అలాగే గజేంద్ర మోక్షణము ఉపాఖ్యానంలో కూడా విష్ణుని వెనుక ఏగుచున్న లక్ష్మీదేవి తడబాటునకు వాడిన అమృత గుళిక “అడిగెద నని” కూడ సర్వలఘు కంద పద్యమే.

232
ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి శంకించి శాంతుడైన వెనుక డగ్గఱెదనని చింతించుచున్న వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప నితరుల కలవిగాదని ప్రహ్లాదుం జీరి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నరహరి = నరసింహుని; రూపంబు = రూపము; వారిజనివాసినిన్ = లక్ష్మీదేవిని {వారిజనివాసిని - వారిజ (పద్మము నందు) నివాసిని (నివసించెడి యామె), లక్ష్మి}; వీక్షించి = చూసి; శంకించి = అనుమానపడి; శాంతుడు = శాంతించినవాడు; ఐన = అయిన; వెనుక = తరువాత; డగ్గఱిదన్ = దగ్గరకు వెళ్ళెదను; అని = అని; చింతించుచున్న = ఆలోచించుచుండగా; వారిజసంభవుండు = బ్రహ్మదేవుడు {వారిజసంభవుడు - వారిజ (పద్మమునందు) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; రోషంబున్ = కోపమును; నివారింపన్ = తగ్గించుటకు; ఇతరులు = ఇతరుల; కిన్ = కి; అలవి = వీలు; కాదు = కాదు; అని = అని; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చీరి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- పద్మాలయ లక్ష్మీదేవి ఇలా నరకేసరి రూపం చూసి సందేహించి, ఆయన శాంతించిన పిమ్మట దగ్గరకు వెళ్తాను అనుకుంది. ఆమె మనోభావం గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ ఉగ్ర నరసింహుని కోపం తగ్గించటం ప్రహ్లాదుడితో తప్పించి ఇంక ఎవరివల్లా కాదని తలచి అతనిని పిలిచి ఇలా అన్నాడు.

233
తీండ్ర మగు రోషమున మీ
తండ్రి నిమిత్తమునఁ జక్రి దారుణమూర్తిన్
వేండ్రము విడువఁడు మెల్లన
తండ్రీ! శీతలునిఁ జేసి యచేయఁగదే.
టీక:- తీండ్రము = ప్రచండమైనది; అగు = అయిన; రోషమునన్ = కోపముతో; మీ = మీ; తండ్రి = తండ్రి; నిమిత్తమునన్ = కారణముచేనైన; చక్రి = విష్ణువు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; దారుణ = భయంకరమైన; మూర్తిన్ = రూపమును; వేండ్రము = తాపమును; విడువడు = వదులుట లేదు; మెల్లన్ = మెల్లిగా; తండ్రీ = నాయనా; శీతలునిన్ = చల్లబడినవానిగా; చేసి = చేసి; దయచేయగదే = అనుగ్రహింపుము.
భావము:- “నాయనా! ప్రహ్లాదా! చక్రాయుధముగా కలవాడైన విష్ణుమూర్తి నీ తండ్రి కారణంగా తీవ్రతరమైన కోపం గలిగిన ఉగ్ర రూపం ధరించాడు. ఇంకా ఆ తాపం వదలటం లేదు. మెల్లిగా దరిచేరి స్వామిని శాంతింప చెయ్యి.”

234
అనిన "నౌఁ గాక" యని మహాభాగవతశేఖరుం డయిన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు జేసిన భక్తపరాధీనుం డగు నయ్యీశ్వరుం డాలోకించి కరుణాయత్తచిత్తుండై.
టీక:- అనినన్ = అనగా; ఔగాక = సరే; అని = అని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శేఖరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐన; బాలకుండు = పిల్లవాడు; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములను; ముకుళించి = జోడించి; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; అమంద = చురుకైన; వినయ = అణకువ; వివేకంబులన్ = వివేకములతో; నరసింహ = నరసింహ రూపమున గల; దేవుని = దేవుని; సన్నిధి = సమీపమున; కిన్ = కి; చని = వెళ్ళి; సాష్టాంగదండప్రణామంబున్ = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగదండప్రణామము - అష్టాంగములు (కాళ్ళు చేతులు రొమ్ము నొసలు భుజములు) నేలను తాకునట్లు కఱ్ఱవలె సాగిలపడి చేసడి ప్రణామము (నమస్కారము)}; చేసినన్ = చేయగా; భక్త = భక్తుల; పర = ఎడ; అధీనుండు = వశ మగువాడు; అగు = ఐన; ఆ = ఆ; ఈశ్వరుండు = భగవంతుడు; ఆలోకించి = చూసి; కరుణా = దయా; ఆయత్త = కలిగిన; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి;
భావము:- ఇలా అని బ్రహ్మదేవుడు అనగానే పరమ భాగవతుడు భక్తశేఖరుడు అయిన ప్రహ్లాదుడు “అలాగే” అని, చేతులు జోడించి, మెల్లమెల్లగా ఉగ్ర నరసింహుని సమీపించాడు; మిక్కిలి వినయంతో వినమ్రంతో ఆయన దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు చేసాడు; అంతట భక్తవత్సలుడైన నారాయణుడు ప్రసన్నుడై ప్రహ్లాదుడిని ప్రేమగా చూశాడు.

235
ప్రావ మొప్ప నుత్కటకృపామతియై కదియంగఁ జీరిఁ సం
శోభిత దృష్టిసంఘములఁ జూచుచు బాలుని మౌళి యందు లో
కాభినుతుండు పెట్టె నసురాంతకుఁ డుద్భట కాలసర్ప భీ
తాయదాన శస్తము నర్గళ మంగళ హేతు హస్తమున్.
టీక:- ప్రాభవము = ఠీవి; ఒప్పన్ = ఒప్పుచుండగా; ఉత్కట = అతిశయించిన; కృపా = కరుణా; మతి = హృదయుడు; ఐ = అయ్యి; కదియంగన్ = దగ్గరకు; చీరి = పిలిచి; సంశోభిత = మిక్కిలి ప్రకాశించెడి; దృష్టిన్ = కన్నుల; సంఘములన్ = సమూహములతో; చూచుచున్ = చూచుచు; బాలుని = పిల్లవాని; మౌళిన్ = తల; అందున్ = పైన; లోకాభినుతుండు = నరసింహస్వామి {లోకాభినుతుడు - లోకములచే అభినుతుడు (కీర్తింపబడువాడు), నరసింహుడు}; పెట్టెన్ = పెట్టెను; అసురాంతకుండు = నరసింహస్వామి {అసురాంతకుడు - అసుర (రాక్షసుని) అంతకుడు (చంపినవాడు), నరహరి}; ఉద్భట = క్రూరమైన; కాల = కాలము యనెడి; సర్పమున్ = పామునకు; భీత = భయపడినవారికి; అభయ = అభయమును; దాన = ఇచ్చెడి; శస్తమున్ = శ్రేష్ఠమైనదానిని; అనర్గళ = అడ్డులేని; మంగళ = శుభములకు; హేతున్ = కారణమైనదానిని; హస్తమున్ = చేతిని.
భావము:- నరహరి మనసులో కరుణ ఉప్పొంగింది; చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడిని దగ్గరకు పిలిచాడు; వాత్యల్యపురస్సరంగా చూస్తూ, ఆ రాక్షస సంహారి తన హస్తంతో మస్తకాన్ని ఆప్యాయంగా నిమిరాడు. ప్రశస్తమైన ఆ హస్తం కాలసర్ప భయాన్ని తొలగించేది; నిత్యమంగళం ప్రసాదించేది.

236
ఇట్లు హరి కరస్పర్శనంబున భయ విరహితుండును, బ్రహ్మజ్ఞాన సహితుండును, బులకిత దేహుండును, సముత్పన్న సంతోషబాష్పసలిలధారా సమూహుండును, బ్రేమాతిశయ గద్గద భాషణుండును, వినయ వివేక భూషణుండును, నేకాగ్ర చిత్తుండును, భక్తిపరాయత్తుండును నయి య ద్దేవుని చరణ కమలంబులు దన హృదయంబున నిలిపికొని కరకమలంబులు ముకుళించి యిట్లని వినుతించె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = నరసింహుని; కర = చేయి; స్పర్శంబునన్ = తగులుటవలన; భయ = భయము; విరహితుండును = పూర్తిగా లేనివాడును; బ్రహ్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానముతో; సహితుండును = కూడినవాడును; పులకిత = గగుర్పాటు చెందిన; దేహుండును = శరీరము గలవాడును; సముత్పన్న = చక్కగా పుట్టిన; సంతోష = ఆనంద; బాష్పసలిల = కన్నీటి; ధారా = ధారలతో; సమూహుండును = కూడినవాడును; ప్రేమా = భక్తి యొక్క; అతిశయ = అతిశయము చేత; గద్గద = డగ్గుతికపడిన; భాషుండును = మాటలు గలవాడు; వినయ = వినయము; వివేక = వివేకములచే; భూషణుండును = అలంకారముగ గలవాడు; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండును = మనసు గలవాడు; భక్తి = భక్తి; పర = ఎడల; ఆయత్తుండునున్ = పరవశమైనవాడు; అయి = అయ్యి; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; చరణ = పాదములు యనెడి; కమలములున్ = పద్మములను; తన = తన యొక్క; హృదయంబునన్ = హృదయములో; నిలిపికొని = ఉంచుకొని; కర = చేతులు యనెడి; కమలంబులున్ = పద్మములను; ముకుళించి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వినుతించె = స్తుతించెను.
భావము:- నరసింహస్వామి చేతి స్పర్శతో ప్రహ్లాదునికి భయం పోయింది; బ్రహ్మజ్ఞానం కలిగింది, దేహం పులకరించింది; ఆనందభాష్పాలు ధారలు కట్టాయి; ఆప్యాయతతో కంఠం గాద్గదికం అయింది; వినయవివేకాలు మరింత శోభ చేకూర్చాయి; చిత్తానికి ఏకాగ్రత చిక్కింది; మనసు భక్తితో పరవశించిపోయింది; హృదయంలో హృషీకేశుడి పాదపద్మాలను నిలిపికొన్నాడు; చేతులు జోడించి నరహరిని ఇలా స్తుతించాడు.

ప్రహ్లాదుడు స్తుతించుట

237
రుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
ము ముట్టన్ నుతిచేయ నోపరఁట; నే క్షస్తనూజుండ గ
ర్వదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ ర్ణింప శక్తుండనే?”
టీక:- అమరుల్ = దేవతలు; సిద్ధులు = సిద్ధులు; సంయమి = ముని {సంయమీశ్వరులు - సంయమము (హింసాదులవలన విరమించుట) కలవారు, ముని}; ఈశ్వరులు = శ్రేష్ఠులు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; సతాత్పర్య = ఏకాగ్రత గల; చిత్తములన్ = మనసులతో; నిన్నున్ = నిన్ను; బహు = పలు; ప్రకారములన్ = విధములచే; నిత్యంబున్ = ఎల్లప్పుడు; విచారించి = విచారించినను; పారముముట్టన్ = తుద వరకు; నుతిన్ = స్తుతించుట; చేయన్ = చేయుటకు; ఓపరట = సరిపోరట; నేన్ = నేను; రక్షస్ = రాక్షసుని; తనూజుండన్ = పుత్రుడను {తనూజుండు - తనువున పుట్టినవాడు, కొడుకు}; గర్వ = గర్వము; మద = మదముల; ఉద్రిక్తుడన్ = విజృంభణములు గలవాడను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; జడమతిన్ = మూర్ఖుడను; వర్ణింపన్ = కీర్తించుటకు; శక్తుండనే = సమర్థుండనా ఏమి (కాను).
భావము:- దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దైత్యునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుంది?

238
మున్ వంశముఁ దేజమున్ శ్రుతము సౌంర్యంబు నుద్యోగమున్
నిపుణత్వంబుఁ బ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్
హోమంబులుఁ జాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ
థఁపు చందంబున భక్తి జేయవలయుం దాత్పర్య సంయుక్తుఁడై.
టీక:- తపమున్ = తపస్సుచేయుట; వంశమున్ = కులము; తేజమున్ = తేజస్సు; శ్రుతము = వేదశాస్త్రాధ్యయనము; సౌందర్యమున్ = అందము; ఉద్యోగమున్ = ప్రయత్నము; నిపుణత్వంబున్ = నేర్పరితనము; ప్రతాప = పరాక్రమము; పౌరుషములున్ = పౌరుషము; నిష్ఠ = పూనిక; బల = శక్తి; ప్రజ్ఞలున్ = సామర్థ్యములు; జప = జపము చేయుట; హోమంబులున్ = హోమములు చేయుటలు; చాలవు = సరిపోవు; ఈశ్వర = ప్రభూ; భవత్ = నీకు; సంతుష్టి = మెప్పు కలిగించుట; కై = కొఱకు; దంతియూథంపు = గజేంద్రుని {దంతియూథము - దంతి (ఏనుగు) యూథము (వీరుడు), గజేంద్రుడు}; చందంబునన్ = వలె; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; తాత్పర్య = దాని యందే లగ్నమగుటతో {తాత్పర్యము - దాని యందే లగ్న మగుట, ఏకాగ్రత}; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ప్రభూ! నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు. పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మెక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.

239
లజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర
త్వములన్ యజ్ఞ తపోనసూయలఁ గడున్ ర్పించు ధాత్రీసురో
త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్
తన్ నిన్ను నయించెనేని, నిజ వం శ్రీకరుం డౌఁ దుదిన్.
టీక:- అమల = స్వచ్ఛమైన; జ్ఞాన = జ్ఞానము; సు = మంచి; దాన = దానములు; ధర్మరతి = నీతి; సత్య = సత్యము; క్షాంతి = ఓర్పు; నిర్మత్సరత్వములన్ = ఈర్ష్య లేకపోవుటలు; యజ్ఞ = యాగములు; తపస్ = తపస్సు చేయుట; అనసూయలన్ = అసూయ లేకపోవుటలతో; కడున్ = మిక్కిలి; దర్పించు = గర్వపడెడి; ధాత్రీసురోత్తమున్ = బ్రాహ్మణశ్రేష్ఠుని {ధాత్రీసురోత్తముడు - ధాత్రీసుర (భూమిపైని దేవతల వంటివాడైన బ్రాహ్మణ) ఉత్తముడు (శ్రేష్ఠుడు)}; కంటెన్ = కంటెను; శ్వపచుండు = నీచజాతివాడు {శ్వపచుడు - కుక్కలను తినువాడు, చండాలుడు}; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; మనస్ = మనస్సు; అర్థ = ధనము; ప్రాణ = ప్రాణము, జీవితకాలము; వాక్ = మాట; కర్మముల్ = పనులు ఎడ; సమతన్ = సమత్వముతో; నిన్నున్ = నిన్ను; నయించెనేని = పొందినచో; నిజ = తన; వంశ = కులమునకు; శ్రీకరుడు = వన్నెతెచ్చినవాడు; ఔ = అగును; తుదిన్ = చివరకు.
భావము:- నిర్మల జ్ఞానం, దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.

240
జ్ఞుండు చేసిన యారాధనములఁ జే;
ట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁ డగుటఁ;
జేపట్టు నొకచోట; సిద్ధ మీశ్వరునకు;
ర్థంబు లేకుండు తఁడు పూర్ణు
డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁ;
జేయుట ధర్మంబు; చేసెనేని
ద్దంబుఁ జూచిన ళికలలామంబు;
ప్రతిబింబితం బగు గిది మరల

ర్థములు దోఁచుఁ; గావున ధికబుద్ధి
క్తి జేయంగవలయును క్తిఁ గాని
మెచ్ఛఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ
రమ కరుణుండు హరి భక్తబాంధవుండు.
టీక:- అజ్ఞుండు = తెలియనివాడు; చేసిన = చేసినట్టి; ఆరాధనములన్ = భక్తిని; చేపట్టడు = స్వీకరింపడు; ఈశ్వరుడు = భగవంతుడు; కృపాళుడు = దయ గలవాడు; అగుటన్ = అగుటచేత; చేపట్టున్ = స్వీకరించును; ఒకచోట = ఒక్కోసారి; సిద్ధము = సత్యము; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; అర్థంబున్ = ప్రయోజనము; లేకుండున్ = ఉండదు; అతడు = అతడు; పూర్ణుడు = పరిపూర్ణమైనవాడు; ఐనన్ = అయినను; అర్థములు = ఎల్లవవిషయములు; ఈశ్వర = భగవంతునికి; అర్పణంబులున్ = సమర్పితములు; కాగన్ = అగునట్లు; చేయుట = చేయుట; ధర్మంబు = న్యాయము; చేసెనేని = చెసినచో; అద్దంబున్ = అద్దము (దర్పణము)న; చూచిన = చూసినచో; అళికలలామంబు = నొసలిబొట్టు; ప్రతిబింబితంబు = ప్రతిబింబించినది; అగు = అయ్యెడి; పగిదిన్ = వలె; మరల = మరల; అర్థములన్ = ప్రయోజనములు; తోచున్ = కలుగును; కావున = కనుక; అధిక = ఉన్నతమైన.
బుద్ధిన్ = బుద్ధితో; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; భక్తిన్ = భక్తిని; కాని = కాని; మెచ్చడు = మెచ్చుకొనడు; అర్థంబుల్ = పదార్థములు; ఒసగెడు = సమర్పించెడి; మేరలు = సమయములలో; అందున్ = అందు; పరమ = అతిమిక్కిలి; కరుణుండు = దయ గలవాడు; హరి = విష్ణుమూర్తి; భక్త = భక్తులకు; బాంధవుడు = బంధువు వంటివాడు.
భావము:- భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడువక చేయవలెను.

241
కావున నల్పుఁడ సంస్తుతి
గావించెద వెఱపు లేక లనేరుపునన్;
నీ ర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!
టీక:- కావునన్ = కనుక; అల్పుడ = చిన్నవాడను; సంస్తుతి = స్తోత్రములు; కావించెద = చేసెదను; వెఱపు = బెదురు; లేక = లేకుండగ; కల = కలిగినంత; నేరుపునన్ = సామర్ధ్యముతో; నీ = నీ యొక్క; వర్ణనమునన్ = స్తుతించుటవలన; ముక్తి = మోక్షపదమున; కిన్ = కు; పోవున్ = వెళ్ళును; అవిద్యన్ = అవిద్యను; జయించి = జయించి; పురుషుండు = మానవుడు; అనంతా = నారాయణా {అనంతుడు - అంతము లేనివాడు, హరి}.
భావము:- శాశ్వతుడా! శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక, నేను అల్పుడను. కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా, బెదరకుండా నా నేర్పుకొలది స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు.

242
త్త్వాకరుఁడ వైన ర్వేశ! నీ యాజ్ఞ;
శిరముల నిడుకొని చేయువారు
బ్రహ్మాదు లమరులు య మందుచున్నారు;
నీ భీషణాకృతి నేఁడు చూచి;
రోషంబు మాను నీ రుచిరవిగ్రహములు;
ల్యాణకరములు గాని భీతి
రములు గావు లోములకు వృశ్చిక;
న్నగంబుల భంగి యముఁ జేయు

సుర మర్దించితివి; సాధుర్ష మయ్యె;
వతరించిన పనిదీఱె లుక యేల?
లుషహారివి సంతోషకారి వనుచు
నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ!
టీక:- సత్త్వాకరుడవు = నారయణుడవు {సత్త్వాకరుడు - సత్త్వగుణమునకు ఆకరుడు (ప్రధానుడు), విష్ణువు}; ఐన = అయిన; సర్వేశ = నరసింహా {సర్వేశుడు - సర్వులకును ఈశుడు, హరి}; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; శిరములనిడుకొని = నెత్తిన పెట్టుకొని; చేయువారు = చేసెడివారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; అదుల్ = మొదలైన; అమరుల్ = దేవతలు; భయమున్ = భయమును; అందుచున్నారు = పొందుతున్నారు; నీ = నీ యొక్క; భీషణ = భయంకరమైన; ఆకృతి = రూపము; నేడు = ఇప్పుడు; చూచి = చూసి; రోషంబున్ = కోపమును; మాను = విడువుము; నీ = నీ యొక్క; రుచిర = అందమైన; విగ్రహములు = రూపములు; కల్యాణ = శుభములను; కరములు = కలిగించెడివి; కాని = తప్పించి; భీతి = భయమును; కరములు = కలిగించెడివి; కావు = కావు; లోకముల్ = లోకముల; కున్ = కు; వృశ్చిక = తేళ్ళు; పన్నగంబుల = పాముల; భంగిన్ = వలె; భయమున్ = భయమును; చేయు = కలిగించెడి; అసురన్ = రాక్షసుని.
మర్ధించితివి = చంపితివి; సాధు = సజ్జనులకు; హర్షము = సంతోషము; అయ్యెన్ = అయినది; అవతరించిన = అవతరించినట్టి; పని = ప్రయోజనము; తీఱెన్ = తీరినది; అలుక = కోపము; ఏల = ఎందుకు; కలుష = పాపములను; హారివి = హరించెడివాడవు; సంతోష = సంతోషములను; కారివి = కలిగించెడివాడవు; అనుచున్ = అనుచు; నిన్నున్ = నిన్ను; తలతురు = భావించెదరు; లోకులు = ప్రజలు; నిర్మలాత్మ = నరసింహా {నిర్మలాత్మ - నిర్మల (స్వచ్ఛమైన) ఆత్మ (స్వరూపుడు), విష్ణువు}.
భావము:- ఓ జగదీశ్వరా! నారసింహా! నీవు సత్త్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు, ఇవాళ నీ భీషణ ఆకృతి చూసి బెదిరిపోతున్నారు. ప్రభూ! శాంతించు. నీ సుందర రూపాలు లోకానికి కల్యాణకారకాలు భక్తిప్రేరకాలు తప్పించి భయంకరాలు కావు కదా! తేలు లాగా, పాములాగా నిత్యం ప్రజలకు భయం పుట్టించే పాపాత్ము డూ రాక్షసుడూ అయిన మా తండ్రి హిరణ్యకశిపుని పరిమార్చావు. జనులు అందరికి సంతోషం సమకూరింది. నరకేసరి అవతార ప్రయోజనం సిద్ధించింది. ఇంకా ఈ సంతోష సమయంలో ఇంత కోపం ఎందుకు! ప్రజలు అందరూ నిన్ను సంతోషాలు కలుగజేసేవాడవనీ, పాపాలను తొలగించేవాడవనీ భావిస్తున్నారు నిర్మలమైన ఆత్మ స్వరూపా! నారాయణా! రోషము విడువుము, శాంతించుము.

243
దంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
యున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
సింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భ సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే.
టీక:- ఖర = వాడియైన; దంష్ట్రా = కోరలు; భ్రుకుటి = బొమముడి; సటా = జటలు; నఖయును = గోరులు; ఉగ్ర = భయంకరమైన; ధ్వానయున్ = ధ్వనికలది; రక్త = రక్తమంటిన; కేసరయున్ = జూలు గలది; దీర్ఘతర = మిక్కిలి పోడవైన {దీర్ఘము - దీర్ఘతరము - దీర్ఘతమము}; ఆంత్ర = పేగులు; మాలికయున్ = మాలలు గలది; భాస్వత్ = వెలుగుతున్న; నేత్రయున్ = కన్నులు గలది; ఐనన్ = అయిన; ఈ = ఈ; నరసింహ = నరసింహుని; ఆకృతిన్ = ఆకారమును; చూచి = చూసి; నేన్ = నేను; వెఱవన్ = బెదరను; పూర్ణ = పూర్తిగ; క్రూర = క్రూరమైన; దుర్వార = దాటరాని; దుర్భర = భరింపరాని; సంసార = సంసారము యనెడి; దావాగ్ని = కార్చిచ్చున; కిన్ = కు; వెఱతు = బెదరెదను; నీ = నీ యొక్క; పాద = పాదములను; ఆశ్రయున్ = ఆశ్రయించినవానినిగా; చేయవే = చేయుము.
భావము:- ప్రభూ! భీకరమైన కోరలూ, కనుబొమలూ, జటలూ, గోళ్ళూ, భీషణ ధ్వనులు, రక్త రంజితమైన కేసరాలూ, మెడలో పొడవుగా వ్రేలాడుతున్న దండల్లా ఉన్న ప్రేగులూ తోటి పరమ భీకరమైన నీ ఉగ్రనరసింహ రూపం చూసి నేను ఏమాత్రం భయపడను. కానీ పూర్తిగా క్రూరమైనదీ, భయంకరమైనదీ, భరింపరానిదీ, నికృష్టమైనది అయిన సంసారమనే దావాగ్నిని చూసి మాత్రం బెదిరిపోతున్నాను. కరుణించి నీ చరణసన్నిధిలో నాకు ఆశ్రయం ప్రసాదించు.

244
దేవా! సకల యోను లందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖనివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బరదేవతవు నైన నీవగు బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖపుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణులైన భక్తులం జేరి యుండెద; బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తంబయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడు వాని నావయును, దక్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత నుపేక్షితుం డయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు; జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యే యింద్రియంబులం జేసి యేమిటి కొఱకు నెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబయిన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాదిభావంబున రూపాంతరంబు నొందించు నట్టి వివిధప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ; నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరితయై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజియించు; అవిద్యార్పితవికారంబును వేదోక్తకర్మప్రధానంబును సంసారచక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కరుండును సమర్థుండు లేడు; విజ్ఞాననిర్జిత బుద్ధిగుణుండవు; నీ వలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తం బయిన సంసారచక్రంబుఁ జేయుచుండు; సంసారదావదహన తంతప్యమానుండ నగు నన్ను రక్షింపుము.
టీక:- దేవా = భగవంతుడా; సకల = అఖిలమైన; యోనులు = గర్భములు; అందును = లోను; సుఖ = సుఖము; వియోగంబును = తొలగుట; దుఃఖ = దుఃఖము; సంయోగ = కలుగుటలు; సంజనితంబు = పుట్టింపబడినది; ఐన = అయిన; శోక = దుఃఖము యనెడి; అనలంబునన్ = అగ్నిలో; దందహ్యమానుండను = మిక్కిలి కాల్చబడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = శోకమును; నివారకంబున్ = పోగొట్టునది; కాని = కాని; దేహ = దేహము; ఆది = మొదలగువాని యందు; అభిమానంబునన్ = మమకారముచేత; మోహితుండను = మాయలోపడినవాడను; ఐ = అయ్యి; పరిభ్రమించుచున్న = తిరుగుతున్న; ఏను = నేను; నా = నా; కున్ = కు; ప్రియుండవు = ఇష్టుడవు; సఖుండవు = స్నేహితుడవు; పరదేవతవు = ఆరాధ్య దేవతవు; ఐన = అయిన; నీవి = నీవి; అగు = ఐన; బ్రహ్మ = బ్రహ్మచేత; గీతంబులు = కీర్తింపబడినవి; అయిన = ఐన; లీలా = విలాసములకైన; అవతార = అవతారముల యొక్క; కథా = గాథలు; విశేషంబులన్ = వృత్తాంతములను; పఠియించుచు = అధ్యయనము చేయుచు; రాగాది = రాగద్వేషాదులనుండి; నిర్ముక్తుండను = విడివడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = దుఃఖముల; పుంజములన్ = సమూహములను; తరియించి = దాటి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు యనెడి; కమల = పద్మముల; స్మరణ = తలచుట; సేవా = కొలచుటల యందు; నిపుణులు = నేర్పరులు; ఐన = అయిన; భక్తులన్ = భక్తులను; చేరి = చేరి; ఉండెదన్ = ఉండెదను; బాలునిన్ = పిల్లలను; తల్లిదండ్రులును = తల్లిదండ్రులు; రోగిని = జబ్బుపడినవానిని; వైద్య = వైద్యునిచే; దత్తంబు = ఈయబడినది; అయిన = ఐన; ఔషధంబును = ఔషధము; సముద్రంబునన్ = సాగరమునందు; మునింగెడు = మునిగిపోతున్న; వానిన్ = వానిని; నావయును = పడవ; తక్క = తప్పించి; ఒరులు = ఇతరులు; రక్షింపన్ = కాపాడుటకు; నేరని = చాలని, సమర్థులుకాని; తెఱంగునన్ = విధముగ; సంసార = సంసారము యొక్క; తాప = తాపత్రయములచే, బాధలచే {తాపత్రయములు - 1ఆధ్యాత్మికము (తనవలన కలిగెడి బాధలు) 2ఆదిభౌతికములు (ఇతర భూతాదుల వలని బాధలు) 3ఆదిదైవికములు (దైవికములు ప్రకృతి వైపరీత్యాదుల వలని బాధలు)}; తప్యమానుండు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; నీ = నీ; చేతను = వలన; ఉపేక్షితుండు = అశ్రద్ధ చేయబడినవాడు; అయిన = ఐన; వానిన్ = వానిని; ఉద్ధరింపన్ = ఉద్ధరించుటకు; నీవు = నీవు; తక్క = తప్పించి; అన్యుండు = ఇతరుడు ఎవడును; సమర్థుండు = నేర్పు గలవాడు; కాడు = కాడు; జగంబులన్ = లోకము లందు; ఎవ్వండు = ఎవడైనను; ఏమి = ఎట్టి; కృత్యంబు = కార్యము; ఎవ్వని = ఎవని; చేతన్ = చేత; ప్రేరితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్య; ఏ = ఏ; ఇంద్రియంబులన్ = సామర్ధ్యముల; చేసి = వలన; ఏమిటి = ఎందు; కొఱకు = కు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; సంబంధి = సంబంధము గలవాడు {నవవిధసంబంధములు - 1పితృపుత్ర సంబంధము 2రక్ష్యరక్షక సంబంధము 3శేషిశేష సంబంధము 4భర్తృభర్త సంబంధము 5జ్ఞాతృజ్ఞేయ సంబంధము 6స్వస్వామి సంబంధము 7శరీరిశరీర సంబంధము 8 ఆధారాధేయ సంబంధము 9భోక్తృభోగ్య సంబంధము}; ఐ = అయ్యి; ఏ = ఏ; స్థలంబునన్ = చోటు నందు; ఏ = ఏ; సమయంబున్ = సమయము; అందున్ = లో; ఏమి = ఎట్టి; రూపంబునన్ = ఆకారముతో; ఏ = ఎట్టి; గుణంబునన్ = గుణములతో; అపరంబు = ఇహలోకపువి, శ్రేష్ఠము కానివి; అయిన = ఐన; జనక = తండ్రి; ఆది = మొదలగు; భావంబున్ = తలపులను; ఉత్పాదించి = కలిగించి; పరంబు = పరలోకపువి, శ్రేష్ఠమైనవి; బ్రహ్మ = పరబ్రహ్మతత్వము; ఆది = మొదలగు; భావంబునన్ = భావములగా; రూపాంతరంబున్ = రూపము మారుటను; ఒందించున్ = కలిగించు; అట్టి = అటువంటి; వివిధ = రకరకముల; ప్రకారంబులు = విధానములు; అన్నియున్ = సర్వమును; నిత్యముక్తుండవున్ = శాశ్వతమైన ముక్తి గలవాడవు; రక్షకుండవున్ = కాపాడెడివాడవు; ఐన = అయిన; నీవ = నీవే; నీ = నీ యొక్క; అంశంబు = అంశ, భాగము; ఐన = అయిన; పురుషున్ = మానవుని; కిన్ = కి; నీ = నీ యొక్క; అనుగ్రహంబునన్ = దయవలన; కాలంబు = కాలము; చేతన్ = చేత; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; కర్మమయంబును = కర్మరూపము; బల = బలముతో; యుతంబునున్ = కూడినది; ప్రధాన = ప్రధానము యనెడి; లింగంబును = గురుతు కలది; ఐన = అయిన; మనంబును = మనసును; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; సృజియించున్ = సృష్టించును; అవిద్యా = మాయచేత; అర్పిత = కల్పింబడిన; వికారంబును = వికారములు గలది {వికారములు - మార్పువలన కలుగునవి, ఇవి షోడశము (16) ఏకాదశేంద్రియములు మరియు పంచభూతములు}; వేద = వేదము లందు; ఉక్త = చెప్పబడిన; కర్మ = కర్మలే; ప్రధానంబును = ముఖ్యముగా గలది; సంసార = సంసారము యనెడి; చక్ర = చక్రము; ఆత్మకంబు = రూపమైనది; ఐన = అగు; ఈ = ఈ; మనమును = మనసును; నిన్నున్ = నిన్ను; సేవింపక = కొలువకుండగ; నియమించి = కట్టడిచేసికొని; తరియింపన్ = తరించుటను; ఒక్కరుండును = ఒకడైనను; సమర్థుండు = నేర్చినవాడు; లేడు = లేడు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానముచే; నిర్జిత = జయింపబడిన; బుద్ధిన్ = బుద్ధి; గుణుండవు = గుణములు గలవాడవు; నీ = నీ; వలనన్ = చేత; వశీకృత = స్వాధీనము చేసికొనబడిన; కార్య = కార్యములను, పనులను; సాధన = చక్కజేయ; శక్తి = సామర్థ్యము గలది; ఐన = అయిన; కాలంబున్ = కాలమును; మాయ = మాయ; తోడన్ = తోటి; కూడ = కలిపి; షోడశవికార = షోడశవికారములతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; సంసార = పునర్జన్మల; చక్రంబున్ = పునరావృతమును; చేయుచుండున్ = కలిగించుచుండును; సంసార = సంసారము యనెడి; దావదహనన్ = కార్చిచ్చుచే; తంతప్యమానుండను = బాధింపబడుచున్నవాడను; అగు = అయిన; నన్నున్ = నన్ను; రక్షింపుము = కాపాడుము.
భావము:- భగవంతుడా! జన్మజన్మలలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.
చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడిన వానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.
నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది. ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకమూ అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు. నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!

245
నులు దిక్పాలుర సంపదాయుర్విభ;
ములు గోరుదురు భవ్యంబు లనుచు;
వి యంతయును రోషహాసజృంభితమైన;
మాతండ్రి బొమముడి హిమఁ జేసి
విహతంబులగు; నట్టి వీరుండు నీ చేత;
నిమిషమాత్రంబున నేఁడు మడిసె;
కావున ధ్రువములు గావు బ్రహ్మాదుల;
శ్రీవిభవంబులు జీవితములుఁ;

గాలరూపకుఁ డగు నురుక్రమునిచేత
విదళితములగు; నిలువవు; వేయు నేల?
యితర మే నొల్ల నీ మీఁది యెఱుక గొంత
లిగియున్నది గొలుతుఁ గింరుఁడ నగుచు.
టీక:- జనులు = మానవులు; దిక్పాలురన్ = దిక్పాలకాదులను {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పునకు) 2అగ్ని (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరుతి) 5వరుణుడు (పడమర) 6వాయువు (వాయవ్యము) 7కుబేరుడు (ఉత్తరమునకు) 8ఈశానుడు (ఈశాన్యములకు) పాలకులు}; సంపద = సంపదలు, కలిమి; ఆయుర్ = జీవితకాలము; విభవములున్ = వైభవములను, ఇవి సౌఖ్యములవంటివి; కోరుదురు = కోరుచుందురు; భవ్యంబులు = గొప్పవి; అనుచున్ = అనుచు; అవి = అవి; అంతయున్ = అన్నియును; రోష = రోషపూరిత; హాస = నవ్వుచేత; విజృంభితము = చెలరేగినది; ఐన = అయిన; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; బొమముడి = ముఖము చిట్లించిన మాత్ర; మహిమన్ = ప్రభావము; చేసి = వలన; విహతంబులు = నష్టములు; అగున్ = అగును; అట్టి = అటువంటి; వీరుండు = శూరుడు; నీ = నీ; చేతన్ = వలన; నిమిష = రెప్పపాటుకాలము; మాత్రంబునన్ = మాత్రములోనే; నేడు = ఈ దినమున; మడిసె = మరణించెను; కావునన్ = అందుచేత; ధ్రువములు = నిత్యములు; కావు = కావు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారి; శ్రీ = సిరి; విభవంబులు = వైభవములు; జీవితములున్ = బతుకులు; కాల = కాలము; రూపకుడు = స్వరూపమైనవాడు; అగు = అయిన; ఉరుక్రముని = విష్ణుమూర్తి {ఉరుక్రముడు - ఉరు (గొప్ప) క్రముడు (పరాక్రమము గలవాడు), విష్ణువు}; చేత = వలన.
విదళితములు = చీల్చబడినవి; అగున్ = అగును; నిలువవు = నిలబడవు; వేయున్ = అనేకమాటలు; ఏలన్ = ఎందుకు; ఇతరమున్ = మిగిలినవి ఏవియును; ఏన్ = నేను; ఒల్లన్ = ఒప్పుకొనను; నీ = నీ; మీది = అందలి; ఎఱుక = వివేకము; కొంత = కొంచము; కలిగియున్నది = కలదు; కొలతున్ = కొలచెదను; కింకరుండను = సేవకుడను; అగుచు = అగుచు.
భావము:- ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్పాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి. కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.

246
ఎంమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ
ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁ డుగాక యు
ద్దం మన్మథవహ్ని నెప్పుడుఁ ప్తుఁడై యొకనాఁడుఁ జే
రండు పారము దుష్టసౌఖ్య పరంపరాక్రమణంబునన్.
టీక:- ఎండమావుల = మృగతృష్ణలను {ఎండమావులు - మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలు వలె కనబడు నీడలు, భ్రాంతులు, మృగతృష్ణ, మరీచిక}; వంటి = పోలెడి; భద్రములు = సౌఖ్యములు; ఎల్లన్ = అన్నియును; సార్థములు = ప్రయోజన సహితములు; అంచున్ = అనుచు; మర్త్యుడు = మరణించువాడు, మనిషి; రోగ = జబ్బులకు; నిధానము = స్థానమైన; దేహము = శరీరము; తోన్ = తోటి; విరక్తుడు = విరాగము చెందినవాడు; కాక = కాకుండగ; ఉద్దండ = తీవ్రమైన; మన్మథ = కామ మనెడి; వహ్నిన్ = అగ్నిచేత; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తప్తుండు = బాధపడెడివాడు; ఐ = అయ్యి; ఒకనాడున్ = ఒకనాటికిని; చేరండు = చేరలేడు; పారము = తీరమును; దుష్ట = చెడ్డవి యగు; సౌఖ్య = సౌఖ్యముల; పరంపరా = సమూహము లందు; ఆక్రమణంబునన్ = లోబడుట వలన.
భావము:- ఎండమావుల వంటివి ఈ సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ దుష్టసౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ తీరం చేరలేడు.

247
శ్రీహిళా, మహేశ, సరసీరుహగర్భుల కైన నీ మహో
ద్దాకరంబుచే నభయదానము జేయవు; నేను బాలుఁడం
దాస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని
స్సీ దయం గరాంబుజము శీర్షముఁజేర్చుట చోద్య మీశ్వరా!
టీక:- శ్రీమహిళా = లక్ష్మీదేవి {శ్రీమహిళ - శ్రీ (సంపదలకు) మహిళ (తల్లి), లక్ష్మి}; మహేశ = పరమశివుడు {మహేశుడు - మహా (గొప్ప) ఈశుడు, శివుడు}; సరసీరుహగర్భుల = బ్రహ్మల {సరసీరుహగర్భుడు - సరసీరుహ (పద్మమున) గర్భుడు (కలిగినవాడు), బ్రహ్మ}; కైనన్ = కి అయినను; నీ = నీ యొక్క; మహా = గొప్ప; ఉద్దామ = స్వతంత్రమైన; కరంబు = చేయి; చేన్ = చేత; అభయ = అభయమును; దానము = ఇచ్చుట; చేయవు = చేయవు; నేను = నేను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; తామస = తమోగుణ సంగతమైన; వంశ = కులమున; సంభవుడన్ = పుట్టినవాడను; దైత్యుడను = రాక్షసుడను; ఉగ్ర = భయంకరమైన; రజోగుణుండన్ = రజోగుణము గలవాడను; నిస్సీమ = హద్దులేని; దయన్ = కరుణతో; కర = చేయి యనెడి; అంబుజమున్ = పద్మమును; శీర్షమునన్ = తలపైన; చేర్చుట = పెట్టుట; చోద్యము = అద్భుతము; ఈశ్వరా = నరసింహా {ఈశ్వరుడు - ప్రభువు, విష్ణువు}.
భావము:- ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ దివ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.

248
మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున.
టీక:- మహాత్మా = గొప్పవాడా; సుజనుల్ = దేవతలు; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; అందును = ఎడలను; దుర్జనులు = రాక్షసులు; ఐన = అయిన; మా = మా; అందును = ఎడలను; సేవా = కొలచినందులకు; అనురూపంబులు = తగినవి; కన్ = అగునట్లు; పక్ష = స్వపక్షమువారు; అపక్షంబులు = పరపక్షమువారను తలపు; లేక = లేకుండగ; కల్పవృక్షంబు = కల్పవృక్షము; చందంబునన్ = విధముగ; ఫల = ఫలితములను; ప్రదానంబు = ఇచ్చుటను; చేయుదువు = చేసెదవు; కందర్ప = మన్మథునితో, కామముతో; సమేతంబు = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూపంబునన్ = నూతిలో; కూలుచున్న = పడిపోతున్నట్టి; మూఢ = తెలివిహీనులైన; జనులన్ = వారిని; కూడి = కలిసి; కూలెడు = కూలిపోవుచున్న; నేను = నేను; భవదీయ = నీ యొక్క; భృత్యుండు = దాసుండు; అగు = అయిన; నారదుని = నారదుని; అనుగ్రహంబునన్ = దయ; చేసి = వలన; నీ = నీ యొక్క; కృప = కరుణ; కున్ = కు; పాత్రుండను = తగినవాడను; ఐతి = అయితిని; నన్నున్ = నన్ను; రక్షించి = కాపాడి; మత్ = నా యొక్క; జనకుని = తండ్రిని; వధియించుట = చంపుట; నా = నా; అందున్ = ఎడల; పక్షపాతంబు = మొగ్గుచూపుట; కాదు = కాదు; దుష్ట = చెడ్డ; దనుజ = రాక్షసులను; సంహారంబును = చంపుట; శిష్ట = మంచివారు; భృత్య = దాసులు; ముని = మునుల యైన; జన = వారిని; రక్షా = కాపాడెడి; ప్రకారంబును = విధానము; నీ = నీ; కున్ = కు; నైజ = సహజ; గుణంబులు = లక్షణములు; విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; గుణా = త్రిగుణముల {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; సృజియించి = సృష్టించి; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; హేతుభూత = కారణభూతమైన; గుణ = లక్షణములతో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; రక్షక = కాపాడుట; సంహార = చంపుటలను; కార = కలిగించుట; ఆది = మొదలగు; నానా = వివిధరకముల; రూపంబులన్ = రూపములలో; ఉండుదువు = ఉండెదవు; సత్ = సత్తు, సత్యమైనది; అసత్ = అసత్తు, సత్యదూరమైనది; కారణ = కారణము; కార్యా = కార్యముల; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; కున్ = కు; పరమ = ముఖ్య; కారణంబు = హేతువు; నీవ = నీవే; నీ = నీ యొక్క; మాయ = మహిమ; చేతన్ = వలన; వీడు = ఇతడు; తాన్ = తను; అనియెడి = అనెడి; బుద్ధి = బుద్ధి; వికల్పంబున్ = భ్రాంతిచే; తోచున్ = అనిపించును; కాని = తప్పించి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరము; ఎద్దియున్ = ఏదియు; లేదు = లేదు; బీజంబున్ = విత్తు; అందున్ = లో; వస్తుమాత్ర = అణువంతది; భూత = అయినట్టి; సౌక్ష్మ్యంబును = చిన్నది యగుటను; వృక్షంబు = చెట్టును; అందున్ = వానిలో; నీలత్వ = నీలపురంగు; ఆది = మొదలగు; వర్ణంబునున్ = రంగులు; కలుగు = కలిగెడి; తెఱంగునన్ = విధముగనే; విశ్వంబున్ = జగత్తున; కున్ = కు; నీ = నీ; అంద = అందే; జన్మ = పుట్టుట; స్థితి = ఉండుట; ప్రకాశ = వృద్ధినొందుట; నాశంబులున్ = నాశనములు; కలుగున్ = కలుగును; నీ = నీ; చేతన్ = వలన; అయిన = గలిగినట్టి; విశ్వంబున్ = జగత్తు; నీ = నీ; అంద = అందే; నిలుపుకొని = ఉంచుకొని; తొల్లి = పూర్వము; ప్రళయకాల = ప్రళయకాలము నందలి; పారావారంబునన్ = (పాల) సముద్రము నందు; పన్నగేంద్ర = ఆదిశేషుడను; పర్యంకంబునన్ = పాన్పుపైన; క్రియా = పనులు; రహితుండవు = మానినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖమును; అనుభవంబున్ = అనుభవించుటను; చేయుచున్ = చేయుచు; నిద్రితుని = నిద్రించువాని; భంగిన్ = వలె; యోగ = యోగధ్యానమున; నిమీలిత = సగము మూయబడిన; లోచనుండవు = కన్నులు గలవాడవు; ఐ = అయ్యి; మెలంగుచున్ = వర్తించుచు; కొంత = కొంత; కాలంబున్ = సమయమున; కున్ = కు; నిజ = నీకు సంబంధించిన; కాల = కాలము యొక్క; శక్తి = ప్రభావము; చేతన్ = వలన; ప్రేరితంబులు = ప్రేరేపింబడినవి; ఐ = అయ్యి; ప్రకృతి = అవిద్యా; ధర్మంబులు = గుణములు; అయిన = ఐన; సత్వాదిగుణంబులన్ = త్రిగుణములను; అంగీకరించి = స్వీకరించి; సమాధిన్ = ధ్యానసమాధిని; చాలించి = ఆపి; విలసించుచున్న = విలసిల్లిన; నీ = నీ యొక్క; నాభి = బొడ్డు; అందున్ = అందు; వట = మఱ్ఱి; బీజంబు = విత్తనము; వలనన్ = వలన; ఉద్భవించు = పుట్టెడి; వటంబు = మఱ్ఱచెట్టు; తెఱంగునన్ = విధముగ; ఒక్క = ఒక; కమలంబు = పద్మము; సంభవించెన్ = పుట్టినది; అట్టి = అటువంటి; కమలంబు = పద్మము; వలనన్ = నుండి; నాల్గు = నాలుగు (4); మోముల = ముఖములుగల; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; జన్మించి = పుట్టి; దిశలు = అన్ని ప్రక్కలకు; వీక్షించి = చూసి; కమలంబున్ = పద్మమున; కున్ = కు; ఒండు = ఇతరమైనది; అయిన = ఐన; రూపంబున్ = ఆకారములు; లేకుండుటన్ = లేకపోవుటను; చింతించి = యోచించి; జల = నీటి; అంతరాళంబున్ = లోనికి; ప్రవేశించి = చేరి; జలంబుల్ = నీటి; అందున్ = లో; నూఱు = వంద (100); దివ్యవత్సరంబులు = దివ్యసంవత్సరములు {దివ్యసంవత్సరము - 360 మానవ సంవత్సరములు (దేవతల దినము - మానవ సంవత్సరము)}; వెదకి = వెతికి, అన్వేషించి; తన = తన యొక్క; జన్మంబున్ = పుట్టుక; కునున్ = కు; ఉపాదాన = ప్రధాన {ఉపాదానకారణము - కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు}; కారణంబు = హేతువు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; దర్శింపన్ = చూచుటకు; సమర్థుండు = శక్తి గలవాడు; కాక = కాలేక; మగిడి = మరల; కమలంబు = పద్మము; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; విస్మయంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; చిర = ఎంతో; కాలంబున్ = కాలము; నిర్భర = భరింపరాని; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; పృథివి = భూమి; అందున్ = లో; గంధంబు = వాసన; కను = చూచెడి; చందంబునన్ = విధముగనే; తన = తన; అందున్ = లోననే; నానా = పలు; సహస్ర = వేలకోలది; వదన = మోములు; శిరః = తలలు; నయన = కన్నులు; నాసా = ముక్కులు; కర్ణ = చెవులు; వక్త్ర = నోర్లు; భుజ = భుజములు; కర = చేతులు; చరణుండును = పాదములు గలవాడు; బహు = అనేకమైన; విధ = రకముల; ఆభరణుండును = అలంకారములు గలవాడు; మాయా = మాయతో; కలితుండును = కూడినవాడు; మహా = గొప్ప; లక్షణ = గుణములు; లక్షితుండును = ప్రకాశించెడివాడును; నిజ = తన; ప్రకాశ = ప్రకాశముచేత; దూరీకృత = పోగొట్టబడిన; తముండును = అజ్ఞానము గలవాడు; పురుషోత్తముడును = పురుషులలో శ్రేష్ఠుడు; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; దర్శించెన్ = చూచెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- మహాత్మా! నరకేసరి రూపదారీ! శ్రీహరీ! బ్రహ్మాది దేవతలకూ, దుష్టాత్ములము అయిన మాకూ ఏమాత్రం పక్షపాతం లేకుండా కొలచిన భక్తి చూసి ఫలితాన్ని ప్రసాదిస్తావు. అలా స్వ పర భేదం లేకుండా అనుగ్రహించటంలో కల్పవృక్షానివి. మన్మథుడు విహరించే సంసారకూపంలో మదాంధులుతో పాటూ నేనూ పడవలసిన వాడను. నీ దాసుడు అయిన నారద మహర్షుల వారి ఉపదేశం వలన నీ కృప పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించటం నా మీది పక్షపాతంతో కాదు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ నీ సహజగుణాలు కదా. విశ్వమూర్తివీ, విరాట్ స్వరూపానివీ నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు. ఆ సృష్టిలో ప్రవేశిస్తావు. కారణభూత రూపా లైన గుణములతో నీవే రక్షకుడవుగా, శిక్షకుడవుగా నానా రూపాలూ ధరిస్తావు, నిత్యా అనిత్య, కార్య కారణ సంబంధం కలిగిన ఈ ప్రపంచానికి మూలకారణం నువ్వే. నీ మాయ చేతనే వీడూ, వాడూ, నేను, నువ్వూ అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప ఇతరమైన దేదీ లేదు.
విత్తనంలో అతి సూక్ష్మరూపంలో వస్తుతత్వం నిక్షిప్తం అయినట్లు, వృక్షంలో నీలం మొదలైన రంగులు దాగి ఉన్నట్లు, విశ్వం నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ, నాశనములను పొందుతుంది. నీ చేత సృష్మింపబడిన ఈ విశ్వాన్ని నువ్వు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద క్రియారహితంగా శయనించి, ఆత్మానందం అనుభవిస్తూ యోగనిద్రలో ఉంటావు. యోగి నిద్రపోతున్నట్లు నిమీలిత నేత్రాలతో శయనించి ఉంటావు. కొంత కాలానికి స్వకీయమైన కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైన సత్త్వాది గుణాలను స్వీకరించి, సమాధి చాలించి, తేజరిల్లుతుంటావు. అటువంటి సమయంలోనే వటబీజం నుండి మహా వృక్షం వెలువడే విధంగా, నీ నాభి కమలం నుండి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. నాలుగు ముఖాలతో నాలుగువైపులా పరిశీలించాడు, కమలం తప్ప మరొకటేదీ కనబడలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి నూరు (100) దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధానకారణమైన నిన్ను దర్శించలేక పోయాడు. మళ్ళీ కమలం చేరి, ఆశ్చర్యపడి, చాలాకాలం గొప్ప తపస్సు చేసాడు. చివరకు పృథివి యందు గంథాన్ని కనుగొన్నట్లు, తనలో నిన్ను చూడగలిగాడు. అపుడు నువ్వు సహస్ర శీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్ర వదనుండవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీనులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర, చరణలతో ఒప్పుతూ దర్శనమిచ్చావు. నానాలంకార భూషితుడవు, మాయా మయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవూ, తమస్సును తొలగించువాడవూ, పురుషోత్తముడవూ అయిన విశ్వవిరాట్ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు.

249
ఘోకవదనుఁడ వై మధు
కైభులం ద్రుంచి నిగమణముల నెల్లం
బాటించి యజున కిచ్చిన
కూస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా!
టీక:- ఘోటకవదనుడవు = హయగ్రీవావతారుడవు {ఘోటకవదనుడు - గుఱ్ఱపుముఖము గలవాడు, హయగ్రీవుడు, విష్ణువు}; ఐ = అయ్యి; మధు = మధుడు; కైటభుల్ = కైటభులను; త్రుంచి = చంపి; నిగమ = వేదములు; గణములన్ = సమూహములను; ఎల్లన్ = అన్నిటిని; పాటించి = ఉద్ధరించి; యజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చినట్టి; కూటస్థుడవు = పరమాత్మవు {కూటస్థుడు - సర్వకాల సర్వాస్థల యందు వికారము నొందక ఒక్కతీరున శాశ్వతుడుగా నుండు వాడు, కూటము వలె నిర్వికారముగా నుండు వాడు, పరమాత్మ, విష్ణువు}; ఈశ్వరుడవు = ప్రభువవు; కోవిదవంద్యా = నరసింహా {కోవిదవంద్యుడు - కోవిదుల (పండితుల)చే వంద్య (నమస్కరింపబడువాడు), విష్ణువు}.
భావము:- ఓ పరమేశ్వరా! నరసింహా! నీవు పండితులచే వంద్యమానుడవు. ఆ సమయంలో హయగ్రీవావతారుడవై వచ్చి మధుకైటభ రాక్షసులను సంహరించావు. వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అటువంటి కూటస్థుడవైన భగవానుడవు నీవు,

250
ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కృత = కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపరంబులన్ = ద్వాపరయుగములను; మూడు = మూడు(3); యుగంబులు = యుగములు; అందును = లోను; తిర్యక్ = జంతువుల, వరాహాది; మానవ = మనుష్యల, రామ కృష్ణాది; ముని = మునుల, నారద వ్యాసాది; జలచర = మత్స్యకూర్మ; ఆకారంబులన్ = రూపములలో; అవతరించి = అవతరించి; లోకంబులన్ = లోకములను; ఉద్ధరించుచు = కాపాడుచు; ధరించుచు = పాలించుచు; హరించుచు = నశింపజేయుచు; యుగ = ఆయా యుగములకు; అనుకూల = అనుకూలమైన; ధర్మంబులన్ = ధర్మములను; ప్రతిష్ఠించుచున్ = పాదుకొలుపుచు; ఉందువు = ఉందువు; దేవా = నరసింహా; అవధరింపుము = వినుము.
భావము:- ఇలా ప్రతి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అనుమూడు యుగాలలోనూ జంతు, మానవ, ఋషి, జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, హరిస్తూ ఉంటావు; ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తుంటావు. ఓ నరకేసరి దేవా! ఇంకా విను.

251
కామహర్షాది సంటితమై చిత్తంబు;
వదీయ చింతనదవి చొరదు;
ధురాదిరసముల రగి చొక్కుచు జిహ్వ;
నీ వర్ణనమునకు నిగుడనీదు;
సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి;
తావకాకృతులపైఁ గులుపడదు;
వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు;
వినవు యుష్మత్కథావిరచనములు;

ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు
వులు గొలుపదు వైష్ణవర్మములకు;
డఁగి యుండవు కర్మేంద్రిములు పురుషుఁ
లఁచు, సవతులు గృహమేధిఁ లఁచు నట్లు.
టీక:- కామ = కోరిక; హర్ష = సంతోషము; ఆది = మొదలైనవాని; సంఘటితము = కూడినది; ఐ = అయ్యి; చిత్తంబు = మనసు; భవదీయ = నీ యొక్క; చింతన = స్మరించెడి; పదవిన్ = ఉన్నతస్థితి, త్రోవ; చొరదు = ప్రవేశించదు; మధుర = తీపి; ఆది = మొదలగు; రసములన్ = రుచులను; మరగి = అలవాటుకు బానిస యై; చొక్కుచున్ = మిథ్యానందము నొందుచు; జిహ్వ = నాలుక; నీ = నీ యొక్క; వర్ణనమున్ = కీర్తించుటకు; నిగుడనీదు = సాగనీయదు; సుందరీ = అందమైన; ముఖులన్ = ముఖము కల వారిని; చూడన్ = చూచుటను; కోరుచున్ = ఆశించుచు; చూడ్కి = చూపులు; తావకీన = నీ యొక్క; ఆకృతుల = రూపముల; పైన్ = మీద; తగులుపడదు = లగ్నము కాదు; వివిధ = అనేక రకములైన; దుర్భాషలున్ = చెడుమాటలను; వినన్ = వినుటను; కోరు = కోరెడి; వీనులు = చెవులు; వినవు = వినవు; యుష్మత్ = నీ యొక్క; కథా = గాథల; విరచనములున్ = చక్కటి రచనలను.
ఘ్రాణము = ముక్కు; ఉరవడిన్ = వేగముగా; తిరుగున్ = స్పందించును; దుర్గంధముల్ = చెడు వాసనల వైపున; కున్ = కు; తవులుగొలుపదు = లగ్నము కానీయదు; వైష్ణవ = విష్ణునకు ప్రీతికరములైన; ధర్మముల = ధర్మముల; కున్ = కు; అణగి = వశములై; ఉండవు = ఉండవు; కర్మేంద్రియములు = పనులుచేసెడి సాధనములు {పంచకర్మేంద్రియములు - 1వాక్ 2పాణి 3పాద 4పాయు 5ఉపస్థులు}; పురుషున్ = మానవుని; కలచున్ = కలత నొందిచును; సవతులు = సవతులు; గృహమేధిన్ = గృహస్థుని; కలచునట్లు = కలతపెట్టు విధముగ.
భావము:- ఈ చిత్తం ఉందే కామం, హర్షం మున్నగు గుణాలతో నిండి ఉండి, నీ చింతన మార్గంలో ప్రవేశించదు; నాలుక మాధుర్యం మొదలైన రుచులకు అలవాటు పడి, నీ నామ స్మరణామృతం రుచి చూడదు; కన్నులు కామినీ ముఖం చూడాలని కోరుతాయి, కానీ నీ దివ్యమంగళమూర్తిని దర్శించటానికి లగ్నం కావు; రకరకాల దుర్భాషలు వినగోరే ఈ చెవులు, నీ కథలను వినవు; నాసిక దుర్వాసనలకేసి పోవటానికి అలవాటు పడి, వైష్ణవ ధర్మ సుగంధాలు ఆఘ్రాణించదు; గృహస్థును సవతులు అందరూ చుట్టుముట్టి వేపుకు తిన్నట్లు, కర్మేంద్రియాలు నిత్యం పురుషుడిని బాధిస్తాయి.

252
ఇ వ్విధంబున నింద్రియంబులచేతఁ జిక్కుపడి స్వకీయ పరకీయ శరీరంబు లందు మిత్రామిత్ర భావంబులు జేయుచు జన్మమరణంబుల నొందుచు సంసారవైతరణీ నిమగ్నంబైన లోకంబు నుద్ధరింటుట లోక సంభవ స్థితి లయ కారణుండ వైన నీకుం గర్తవ్యంబు; భవదీయ సేవకులమైన మా యందుఁ బ్రియభక్తు లయిన వారల నుద్ధరింపుము.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = లాగున; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = వలన; చిక్కుపడి = తగుల్కొని; స్వకీయ = తమ యొక్క; పరకీయ = ఇతరుల యొక్క; శరీరంబుల్ = దేహముల; అందున్ = ఎడల; మిత్రా = చెలిమి; అమిత్ర = విరోధ; భావంబులన్ = తలపులను; చేయుచున్ = చేయుచు; జన్మ = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందుచున్ = పొందుచు; సంసార = సంసారము యనెడి; వైతరణిన్ = వైతరణీనది యందు {వైతరణీనది - నరకము దారిలో నుండెడి నిప్పుల యేరు}; నిమగ్నంబు = మునిగినది; ఐన = అగు; లోకంబున్ = లోకములను; ఉద్ధరించుచు = తరింపజేయుట; లోక = లోకముల; సంభవ = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవున్ = కారణభూతుడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; కర్తవ్యంబు = చేయదగినది; భవదీయ = నీ యొక్క; సేవకులము = దాసులము; ఐన = అయిన; మా = మా; అందున్ = అందలి; ప్రియ = ఇష్టమైన; భక్తులు = భక్తులు; అయిన = ఐన; వారలన్ = వారిని; ఉద్ధరింపుము = కాపాడుము.
భావము:- అలా ఇంద్రియాల వలలో చిక్కుకుని లోకం తన వారి విషయంలో మిత్రత్వం, పరుల విషయంలో శత్రుత్వం పాటిస్తూ ఉంటుంది. జనన మరణ వలయాలలో తిరుగుతూ ఉంటుంది. సంసారం అనే వైతరణిలో మునిగిపోతూ ఉంటుంది ఈ లోకం. ఈ లోకాన్ని ఉద్ధరించాలంటే సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవలననే సాధ్యపడుతుంది. అది నీ కర్తవ్యం కూడా. నీ సేవకులము అయిన మాలో నీ కిష్టమైన భక్తులను ఉద్ధరించు.

253
వద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తైక చిత్తుండ నై
బెడన్ సంసరణోగ్రవై తరణికిన్; భిన్నాత్ములై తావకీ
గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్
సుతిం గానని మూఢులం గని మదిన్ శోకింతు సర్వేశ్వరా!
టీక:- భగవత్ = భగవంతుని {భగవంతుని గుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; దివ్య = దివ్యమైన; గుణ = గుణషట్కము (6); అనువర్తన = అనుసరించుటవలని; సుధా = అమృతము; ప్రాప్త = లభించుట యందలి; ఏక = ఏకాగ్రమైన; చిత్తుండను = చిత్తము గలవాడను; ఐ = అయ్యి; బెగడన్ = బెదరను; సంసరణ = సంసారము యనెడి; ఉగ్ర = భయంకరమైన; వైతరణి = వైతరణీనది; కిన్ = కి; భిన్నాత్మలు = భేదబుద్ధి గలవారు; ఐ = అయ్యి; తావకీయ = నీ యొక్క; గుణ = గుణముల; స్తోత్ర = స్తుతించుట యందు; పరాఙ్ముఖత్వమునన్ = వ్యతిరిక్తతచే; మాయా = మిథ్యా; సౌఖ్య = సుఖములను; భావంబులన్ = భావములలో; సుగతిన్ = ఉత్తమగతిని; కానని = చూడని; మూఢులన్ = అజ్ఞానులను; కని = చూసి; మదిన్ = మనసు నందు; శోకింతున్ = దుఃఖించెదను; సర్వేశ్వరా = నరసింహా {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}.
భావము:- ఓ లోకేశ్వరా! భగవంతుడవైన నీ దివ్యభవ్య సుగుణాలను కీర్తించటం అనే అమృత పానం చేశాను. నీ చింతనంతోనే నా చిత్తం నిండిపోయింది. కనుక సంసారమనే దారుణ వైతరణిని చూసి నేను ఏమాత్రం భయపడటం లేదు. కానీ భేదభావంతో, నీ గుణకీర్తనకు విముఖులు అయి, మాయా సౌఖ్యాలలో పడి, దుర్గతి పొందే మూర్ఖులను చూసి బాధపడుతున్నాను.

254
దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయి యుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువు లగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబు లయి విక్రయించువారికి జీవనోపాయంబు లయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులు గావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున.
టీక:- దేవా = భగవంతుడా; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; నిజ = సత్యమైన; విముక్త = విడువబడిన; కాములు = కోరికలు గలవారు; అయి = అయ్యి; విజన = నిర్జన; స్థలంబులన్ = ప్రదేశము లందు; తపంబున్ = తపస్సును; ఆచరింతురు = చేయుదురు; కాముకత్వంబున్ = కోరికలకు లొంగెడి గుణమును; ఒల్లక = అంగీకరింపక; ఉండు = ఉండెడి; వారి = వారి; కిన్ = కి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరమైన; శరణంబు = శరణము; లేదు = లేదు; కావునన్ = కనుక; నిన్నున్ = నిన్ను; సేవించెదరు = కొలిచెదరు; కొందఱు = కొంతమంది; కాముకులు = కోరికలు గలవారు; కర = చేతులు; ద్వయ = రెంటిచేతను; కండూతి = దురద; చేతన్ = వలన; తనియని = తృప్తిచెందని; చందంబునన్ = విధముగ; తుచ్ఛంబు = నీచమైనది; అయి = అయ్యి; పశు = పశువులు; పక్షి = పక్షులు; క్రిమి = పురుగులు; కీట = కీటకములకు; సామాన్యంబు = సామాన్యధర్మము; అయిన = ఐన; మైథున = సురతము; ఆదిన్ = మొదలగానిచే; గృహమేధి = గృహస్థులు; సుఖంబులన్ = సుఖము లందు; తనియక = తృప్తిచెందక; కడపడటన్ = చివరకు; అతి = మిక్కిలి; దుఃఖవంతులు = దుఃఖము గలవారు; అగుదురు = అగుదురు; నీ = నీ; ప్రసాదంబున్ = అనుగ్రహము; కల = కలిగిన; సుగుణుండు = సజ్జనుడు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; మౌన = మౌనముగా నుండెడి; వ్రత = దీక్ష; జప = జపము; తపస్ = తపస్సు; శ్రుత = వేదశాస్త్రములను చదువుకొనుట; అధ్యయనంబులును = మననము చేసికొనుట; నిజ = తన; ధర్మ = ధర్మములను; వ్యాఖ్యాన = వివరించుకొనుచు; విజన = నిర్జన; స్థల = ప్రదేశము లందు; నివాస = నివసించుట; సమాధులను = యోగసమాధులు; మోక్ష = ముక్తిపద; హేతువులు = సాధనములు; అగున్ = అయినట్టివి; అయిన = అయిన; ఇవి = ఇవి; పదియున్ = పది (10); ఇంద్రియ = ఇంద్రియ; జయంబు = నిగ్రహము; లేని = లేని; వారి = వారి; కిన్ = కి; భోగ = అనుభవైక; అర్థంబులు = ప్రయోజనములు; అయి = అయ్యి; విక్రయించు = అమ్ముకొను; వారి = వారి; కిన్ = కి; జీవనోపాయంబులు = జీవనోపాధులు; అయి = అయ్యి; డాంభికుల్ = దంభముబూనువారల; కున్ = కు; వార్తా = వృత్తాంత; కరంబులు = జనకములు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; సఫలంబులు = సార్థకములు {సఫలంబులు - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు}; కావు = కావు; భక్తి = భక్తి; లేక = లేకుండగ; భవదీయ = నీకు సంబంధించిన; జ్ఞానంబు = ఎరుక; లేదు = లేదు; రూప = ఆకారము; రహితుండవు = లేనివాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; బీజ = విత్తు; అంకురంబుల = మొలకల; కైవడిన్ = వలె; కారణ = కారణము; కార్యంబులు = కార్యములు; అయిన = ఐన; సత్ = శాశ్వతము; అసత్ = భంగురములునైన; రూపంబులు = రూపంబులు; రెండును = రెండును (2); ప్రకాశమానంబులు = తెలియబడుచున్నవి; అగున్ = అగును; ఆ = ఆ; రెంటి = రెంటి; అందునున్ = లోను; భక్తియోగంబునన్ = భక్తియోగముచేత; బుద్ధిమంతులు = జ్ఞానులు; మథనంబునన్ = తరచి చూచుట ద్వారా; దారువులు = కట్టెల; అందున్ = లో; వహ్నిన్ = అగ్ని; కనియెడి = తెలిసికొను; తెఱంగునన్ = విధముగ; నిన్నున్ = నిన్ను; పొడగందురు = చూచెదరు; పంచభూత = పృథివ్యాదుల; తన్మాత్రంబులును = లేశములు, పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ప్రాణ = పంచప్రాణములు; ఇంద్రియంబులును = దశేంద్రియములు; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; అహంకార = అహంకారము, మమత్వము; చిత్తంబులును = చిత్తములు; నీవ = నీవే; సగుణంబును = గుణసహితమైనవి; నిర్గుణంబును = గుణరహితమైనవి; నీవ = నీవే; గుణ = గుణము లందు; అభిమానులు = తగులము గలవారు; అయిన = ఐనచో; జనన = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందున్ = పొందును; విబుధులు = విద్వాంసులు; ఆది = పుట్టుక; అంతంబులున్ = చావులను; కానక = తెలియక; నిరుపాధింకుడవు = ఉపాధిరహితుండవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానము గలవారు; అయిన = ఐన; విద్వాంసులు = పండితులు; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనము చేయుట; ఆది = మొదలైన; వ్యాపారంబులు = పనులను; మాని = విడిచి; వేదాంత = వేదాంతములచే; ప్రతిపాద్యుండవు = వర్ణింపబడినవాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; సమాధి = యోగసమాధి యొక్క; విశేషంబులన్ = భేదములచేత; ఎఱింగి = తెలిసికొని; సేవింతురు = కొలచెదరు; అదిగావునన్ = అందుచేత.
భావము:- భగవంతుడా! మునీశ్వరులు కోరికలు వదలి ఏకాంత ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కామవికారాలు లేనివాళ్లకు నీ కంటె కాంక్షించ దగ్గది మరేదీ ఉండదు; అందుకే నేను నిన్ను సేవిస్తాను. దురద వేసిందని రెండు చేతులతోటి గోక్కున్నా దురద తీరదు, తృప్తి పొందలేరు. అలాగే కాముకులు తుచ్ఛమైన పశుపక్ష్యాదులకూ క్రిమి కీటకాలకూ సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగితేలుతూ, ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారు. నీ దయ పొందిన బుద్ధిమంతుడు నిష్కాముడై దివ్య సుఖం పొందుతాడు.
1) మౌనం, 2) వ్రతం, 3) జపం, 4) తపం, 5) స్మరణం, 6) అధ్యయనం, 7) స్వధర్మం, 8) వ్యాఖ్యానం, 9) ఏకాంతవాసం, 10) ఏకాగ్రత అనే ఈ పది ముముక్షువులకు మోక్షహేతువులు, ఈ పదీ (అ) ఇంద్రియ నిగ్రహం లేనివారికి భోగకారణాలు. (ఇ) విక్రయించే వారికి జీవనోపాయాలు, (ఉ) ఆడంబరులకు కాలక్షేపవిషయాలు. ఇలాంటి వారికి ఈ మోక్షహేతువులు సఫలం కావు. భక్తి భావం మనసులో లేనివారికి నీ తత్వజ్ఞానం అంతుపట్టదు,
రూపంలేని నీ యందు, విత్తనాల నుండి మొలకలు బయలుదేరినట్లు, కార్య కారణాలైన, అసత్తు సత్తు రూపాలు రెండూ తేజరిల్లుతూ ఉంటాయి. బుద్ధిమంతులు భక్తియోగంతో, ఆరణిలో అగ్నిని కనుగొన్నట్లు, ఆ రెంటిలోనూ నిన్ను దర్శిస్తారు. 1) భూమి, 2) జలము, 3) అగ్ని, 4) వాయువు, 5) ఆకాశం అనే పంచభూతాలూ; 1) శబ్దము, 2) స్పర్శము, 3) రూపము, 4) రసము, 5) గంధము అనే పంచతన్మాత్రలూ; 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము అనే పంచప్రాణాలూ; 1 చెవి, 2 చర్మము, 3 కన్ను, 4 నాలుక, 5 ముక్కు, 6 నోరు, 7 చేయి, 8 కాలు, 9 గుదము, 10 రహస్యేంద్రియము అనే దశేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ నీవే. సగుణం, నిర్గుణం నీవే. సత్త్వ, రజ, స్తమో గూణాభిమానులూ, జననమరణాలు పొందే వారూ అయిన పండితులు, నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఉపాధిరహితుడవు అయిన నిన్ను గుర్తించలేరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని, వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్రచిత్తంతో దర్శించి సేవిస్తుంటారు.

255
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ;
మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు;
లుమాఱు నాలుకఁ లుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు;
ప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై;
చింతించి మక్కువఁ జిక్కఁడేని

నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె?
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన
వేది యైన మహాతత్త్వవేది యైన.
టీక:- నీ = నీ యొక్క; గృహ = గుడి; అంగణ = ముంగిలి; భూమి = ప్రదేశము నందు; నిటలంబు = నొసలు; మోవంగ = తాకునట్లు; మోదించి = ముదమంది; నిత్యంబున్ = ప్రతిదినము; మ్రొక్కడేని = నమస్కరింపనిచో; నీ = నీ యొక్క; మంగళ = శుభకరములైన; స్తవ = స్తోత్రముల; నికర = సమూహము యొక్క; వర్ణంబులు = అక్షర సముదాయము; పలు = అనేక; మాఱు = సార్లు; నాలుకన్ = నాలుకతో; పలుకడేని = పలుకనిచో; నీ = నీకు; అధీనములు = సమర్పించినవి; కాన్ = అగునట్లు; నిఖిల = సర్వ; కృత్యంబులు = కార్యములు; ప్రియ = ఇష్టపూర్వక; భావమునన్ = తలపులతో; సమర్పింపడేని = సమర్పించనిచో; నీ = నీ; పద = పాదములు యనెడి; అంబుజములన్ = పద్మములను; నిర్మల = స్వచ్ఛమైన; హృదయుడు = హృదయము గలవాడు; ఐ = అయ్యి; చింతించి = ధ్యానించి; మక్కువ = ప్రేమ యందు; చిక్కడేని = తగుల్కొననిచో.
నిన్నున్ = నిన్ను; చెవులార = చెవులనిండుగా; వినడేని = విననిచో; నీ = నీ; కున్ = కు; సేవన్ = పూజ; చేయన్ = చేయుటకు; రాడేని = రాకపోయినచో, సిద్దపడనిచో; బ్రహ్మంబున్ = పరబ్రహ్మ స్వరూపమైన నిన్ను; చెందగలడే = పొందగలడా ఏమి, లేడు; యోగి = యోగసాధన చేయువాడు; ఐనన్ = అయినను; తపోవ్రతయోగి = తపస్సు వ్రతము గల యోగి; ఐనన్ = అయినను; వేది = వేదములు చదివిన వాడు; ఐనన్ = అయినను; మహా = గొప్ప; తత్త్వవేది = తత్త్వజ్ఞానము గలవాడు; ఐనన్ = అయినను.
భావము:- నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కని వాడు; మంగళకరాలైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకని వాడూ; కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడూ; నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించని వాడూ; చెవులారా నీ సంకీర్తనలు వినని వాడూ; చేతులారా నీ సేవ జేయనివాడూ; యోగి అయినా, మహా తపశ్శక్తిశాలి యైన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు.

256
కావున భవదీయ దాస్యయోగంబుఁ గృపజేయు" మని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణం డయిన హరి రోషంబు విడిచి; యిట్లనియె.
టీక:- కావునన్ = కనుక; భవదీయ = నీ యొక్క; దాస్య = సేవచేసికొనుట; యోగంబున్ = లభించు తెరువు; కృపజేయుము = దయతో కలిగింపుము; అని = అని; ప్రణతుండు = నమస్కరించువాడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; వర్ణనంబుల = స్తోత్రముల; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; నిర్గుణుండు = రాగద్వేషాదులు లేనివాడు {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10 అసూయ 11దంభము 12దర్పము 13 అహంకారము}; అయిన = ఐన; హరి = విష్ణువు; రోషంబున్ = కోపమును; విడిచి = వదలివేసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- నీ సేవ చేయని వాడు పరమ పదం చేరలేడు కనుక, నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు” అని ప్రహ్లాదుడు వందన మాచరించాడు. ఆ సంస్తుతికి సంతోషించి, గుణరహితుడూ భగవంతుడూ నైన శ్రీనృసింహస్వామి రోషం మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు.

257
"సంతోషించితి నీ చరిత్రమునకున్ ద్భద్ర మౌఁగాక నీ
యంర్వాంఛితలాభ మెల్లఁ గరుణాత్తుండనై యిచ్చెదం
జింతం జెందకు భక్తకామదుఁడ నే సిద్ధంబు దుర్లోక్యుఁడన్
జంతుశ్రేణికి నన్నుఁ జూచినఁ బునర్జన్మంబు లే దర్భకా!
టీక:- సంతోషించితి = ముదము నందితిని; నీ = నీ యొక్క; చరిత్రమున్ = నడవడిక; కున్ = కు; సత్ = మంచి; భద్రము = శుభములు; ఔగాక = కలుగుగాక; నీ = నీ యొక్క; అంతర్ = మనసు లోపల; వాంఛిత = కోరుచున్న; లాభము = ప్రయోజనములు; ఎల్లన్ = అన్నిటిని; కరుణా = కృప; ఆయత్తుండను = కలిగినవాడను; ఐ = అయ్యి; ఇచ్చెదన్ = ఇచ్చెదను; చింతంజెందకు = విచారపడకు; భక్త = భక్తుల యొక్క; కామదుడన్ = కోర్కెల తీర్చువాడను; నేన్ = నేను; సిద్ధంబు = తప్పక జరుగునది; దుర్లోక్యుండన్ = చూడ శక్యముగాని వాడను; జంతు = జీవ; శ్రేణి = కోటి; కిన్ = కి; నన్నున్ = నన్ను; చూచినన్ = దర్శించిన మాత్రమున; పునర్జన్మంబు = మరలపుట్టుట; లేదు = ఉండదు; అర్భకా = బాలుడ.
భావము:- “బాలకా! ప్రహ్లాదా! నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. నీ ప్రవర్తనకు చాలా సంతోషించాను. నీకు మిక్కిలి శుభం కలుగుతుంది. నేను భక్తుల కోరికలు తప్పక తీర్చే వాడిని. నీ మనసులో వాంఛించే వరాలను దయాహృదయుడనై అనుగ్రహిస్తాను. ఏ దిగులూ పెట్టుకోకు. నేను చూడశక్యంకాని వాడినే. కాని ప్రాణి కోటికి నన్ను ఒకసారి చూస్తే చాలు, పునర్జన్మ ఉండదు.

258
కలభావములను సాధులు విద్వాంసు
ఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ
గోర్కు లిమ్మటంచుఁ గోరుదు రిచ్చెదఁ
గోరు మెద్ది యైనఁ గుఱ్ఱ! నీవు."
టీక:- సకల = అఖిలమైన; భావములన్ = విధములచేతను; సాధులు = సజ్జనులు, దేవతలు; విద్వాంసులు = జ్ఞానులు; అఖిల = సమస్తమైన; భద్ర = క్షేమకరమైన; విభుడన్ = ప్రభువును; ఐన = అయిన; నన్నున్ = నన్ను; కోర్కులు = కోరికలు; ఇమ్ము = ఇవ్వవలసినది; అని = అని; అటంచున్ = అనుచు; కోరుదురు = అడిగెదరు; ఇచ్చెదన్ = ఇచ్చెదను; కోరుము = కోరుకొనుము; ఎద్ది = ఏది; ఐనన్ = అయినను; కుఱ్ఱ = పిల్లవాడ; నీవు = నీవు.
భావము:- సకల శుభప్రదాతను నేను. నన్ను సాధువులూ, విద్వాంసులూ ఎన్నెన్నో రకాల కోరికలు కోరుతుంటారు. వారి కోరికలు తీరుస్తుంటాను. వత్సా! నీవు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను.”

259
అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియుకొఱకు వంచించి యిట్టానతిచ్చిన; నతండు నిష్కాముండైన యేకాంతి గావునఁ గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యిట్లనియె; ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి లేని నాకు వరంబు లిచ్చెదనని వంచింపనేల? సంసారబీజంబులును హృదయబంధకంబులు నయిన గామంబులకు వెఱచి ముముక్షుండనై సేమంబుకొఱకు నేమంబున నిన్నుం జేరితి; కామంబులును నింద్రియంబులును మనశ్శరీర ధైర్యంబులు మనీషా ప్రాణ ధర్మంబులును లజ్జాస్మరణలక్ష్మీసత్యతేజోవిశేషంబులును నశించు; లోకంబు లందు భృత్యు లర్థకాము లయి రాజుల సేవింతురు రాజులుం బ్రయోజనంబు లర్థించి భృత్యులకు నర్థంబు లొసంగుదు; రవ్విధంబు గాదు; నాకుం గామంబు లేదు; నీకుం బ్రయోజనంబు లే; దయినను దేవా! వరదుండ వయ్యెద వేనిఁ గామంబులు వృద్ధిఁబొందని వరంబుఁ గృపజేయుము; కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుం డగు నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ!" యని ప్రణవ పూర్వకంబుగా నమస్కరించిన హరి యిట్లనియె.
టీక:- అని = అని; పరమేశ్వరుండు = నరసింహుడు {పరమేశ్వరుడు - పరమ (సర్వాతీతమైన) ఈశ్వరుడు, విష్ణువు}; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; అందు = ఎడల; కల = ఉన్నట్టి; సకామత్వంబున్ = కోరికలి గలిగి యుండుట; తెలియు = తెలుసుకొనుట; కొఱకు = కోసము; వంచించి = వక్రీకరించి, డొంకతిరుగుడుగా; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చినన్ = చెప్పగా; అతండు = అతడు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; ఐన = అయినట్టి; ఏకాంతి = ఆత్మనిష్ఠాపరుడు {ఏకాంతి - ఏక (ఒకే) అంతి (అంత్య ఫలము, ముక్తి) మాత్రము కోరెడివాడు, ఆత్మనిష్ఠాపరుడు}; కావునన్ = కనుక; కామంబు = కోరికలు; భక్తి = భక్తి యందు; యోగంబున్ = కూడి యుండుట; కున్ = కి; అంతరాయంబు = విఘ్నములు; అని = అని; తలచి = భావించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉత్పత్తి = పుట్టినది; మొదలు = మొదలుపెట్టి; కామ = కోరికలు {కామాది - అరిషడ్వర్గములు, 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్సర్యము}; ఆది = మొదలైనవాని; అనుభవ = అనుభవించుట యందు; ఆసక్తి = ఆసక్తి; లేని = లేనట్టి; నా = నా; కున్ = కు; వరంబుల్ = వరములను; ఇచ్చెదన్ = ఇచ్చెదను; అని = అని; వంచింపన్ = మోసపుచ్చుట; ఏల = ఎందులకు; సంసార = సంసారమునకు; బీజములునున్ = కారణములైనవి; హృదయబంధకంబులు = తగులములు {హృదయబంధకములు - హదయమును జ్ఞానము వంక పోనీయక కట్టివేసెడివి, తగులములు}; అయిన = ఐన; కామంబుల్ = కోరికల; కున్ = కు; వెఱచి = బెదరి; ముముక్షుండను = ముక్తిబొంద కోరువాడను; ఐ = అయ్యి; సేమంబు = క్షేమము; కొఱకు = కోసము; నేన్ = నేను; నేమంబునన్ = నియమములతో; నిన్నున్ = నిన్ను; చేరితిన్ = ఆశ్రయించితిని; కామంబులును = కోరికలు; ఇంద్రియములు = ఇంద్రియములు; మనస్ = మనస్సు; శరీర = దేహము; ధైర్యంబులున్ = బలములు; మనీషా = ప్రజ్ఞలు, బుద్ధి; ప్రాణ = ప్రాణము; ధర్మంబులును = న్యాయములు; లజ్జ = సిగ్గు; స్మరణ = జ్ఞప్తి; లక్ష్మీ = సంపదలు; సత్య = సత్యము; తేజస్ = వర్చస్సు; విశేషంబులు = అతిశయములు; నశించు = క్షయమగు; లోకంబులు = లోకముల; అందున్ = లో; భృత్యులు = సేవకులు; అర్థ = ధనము; కాములు = కోరువారు; ఐ = అయ్యి; రాజులన్ = ప్రభువులను; సేవింతురు = కొలచెదరు; రాజులున్ = ప్రభువులును; ప్రయోజనంబులు = కావలసిన కార్యములు; అర్థించి = కోరి; భృత్యుల్ = సేవకుల; కున్ = కు; అర్థంబులు = ధనము,ప్రయోజనములను; ఒసంగుదురు = ఇచ్ఛెదరు; అవ్విధంబు = అలా; కాదు = కాదు; నా = నా; కున్ = కు; కామంబు = కోరదగినది; లేదు = లేదు; నీ = నీ; కున్ = కు; ప్రయోజనంబు = కావలసిన కార్యము; లేదు = లేదు; అయినను = ఐనను; దేవా = భగవంతుడ; వరదుండవు = వరముల నిచ్చువాడవు; అయ్యెదవేనిని = అగుదు నన్నచో; కామంబులు = కోరికలు; వృద్ధి = పెరగుట; పొందని = పొందని; వరంబున్ = వరములను; కృపజేయుము = దయతో నిమ్ము; కామంబులు = కోరికలు; విడిచిన = వదలివేసినచో; పురుషుండు = మానవుడు; నీ = నీ; తోడన్ = తోటి; సమాన = సమానమైన; విభవుండు = వైభవము గలవాడు; అగున్ = అగును; నరసింహ = నరసింహ {నరసింహుడు - నరుడు సింహము రూపములు కూడి యున్నవాడు, విష్ణువు}; పరమాత్మ = నరసింహ {పరమాత్మ - పర (సర్వాతీతమైన) ఆత్మ, విష్ణువు}; పురుషోత్తమ = నరసింహ {పురుషోత్తముడు - పురుషులలో (కారణభూతులలో) ఉత్తముడు, విష్ణువు}; అని = అని; ప్రణవ = ఓంకారము; పూర్వకంబు = ముందుండునది; కాన్ = అగునట్లు; నమస్కరించినన్ = నమస్కరించగా; హరి = నరసింహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా పరమేశ్వరుడు నరకేసరి, ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అన్నది తెలియటం కోసం కపటంగా “వరాలు కోరుకో ఇస్తాను” అని అన్నాడు. ప్రహ్లాదుడు జితేంద్రియులలో అగ్రగణ్యుడు, ఏకాంత భక్తుడు కాబట్టి, భక్తియోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకుని స్వామితో ఇలా పలికాడు “ఓ దేవదేవా! పుట్టుక నుండీ కామాది అనుభవాలలో ఆసక్తి లేని నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైన కామములు హృదయగ్రంథులు. అటువంటి కామములకు భయపడి నేను మోక్షార్థినై, క్షేమాన్ని కోరుతున్నవాడనై, నియమ వంతుడనై నీ సన్నిధికి వచ్చాను. కోరికలూ, ఇంద్రియాలూ, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, సిరిసంపదలు, తేజో విశేషాలూ సమస్తం నశించేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనంకోసం రాజులను ఆశ్రయిస్తారు. రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు. తండ్రీ! నరసింహా! పరమాత్మా! పరమపురుషా! నా సేవను ఆ విధంగా భావించకు. నాకా ఏ కోరికలు లేవు, నీకా నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నాకు వరప్రదానం చేస్తానంటే, కామములు వృద్ధిపొందని వరం దయతో అనుగ్రహించు. కామములు విడిచినవాడు, నీతో సమానమైన వైభవం పొందుతాడు” అని భక్తితో ప్రణవ పూర్వకంగా నమస్కారం చేసాడు ప్రహ్లాదుడు. అంతట భగవంతుడైన నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు.

260
"నీ యట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు;
గోర్కులు నా యందుఁ గోర నొల్ల;
ట్లైనఁ బ్రహ్లాద! సురేంద్రభర్తవై;
సాగి మన్వంతర మయ మెల్ల
నిఖిలభోగంబులు నీవు భోగింపుము;
ల్యాణబుద్ధి నా థలు వినుము;
కలభూతములందు సంపూర్ణుఁ డగు నన్ను;
జ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి

ర్మచయము లెల్ల ఖండించి పూజన
మాచరింపు మీశ్వరార్పణముగ;
భోగముల నశించుఁ బుణ్యంబు; వ్రతములఁ
బాప సంచయములు పాయు నిన్ను.
టీక:- నీ = నీ; అట్టి = వంటి; సుజ్ఞాన = మంచి జ్ఞానము నందు; నిపుణులు = నేర్పు గలవారు; ఏకాంతులున్ = అంతరంగ భక్తులు; నా = నా; అందున్ = నుండి; కోరన్ = కోరుకొనుటను; ఒల్లరు = అంగీకరించరు; అట్లైనన్ = అలా అయినప్పటికిని; ప్రహ్లాద = ప్రహ్లాదుడ; అసురేంద్ర = రాక్షసులకు; భర్తవు = రాజు యైనవాడవు; ఐ = అయ్యి; సాగి = ప్రవర్తిల్లి; మన్వంతర = మన్వంతర {మన్వంతరంబు - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహా యుగములు}; సమయము = కాలము; ఎల్లన్ = అంతయును; నిఖిల = సమస్తమైన; భోగంబులున్ = అనుభవింపదగినవానిని {అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము}; నీవు = నీవు; భోగింపుము = అనుభవింపుము; కల్యాణ = మంగళకరమైన; బుద్ధిన్ = బుద్ధితో; నా = నా గురించిన; కథలున్ = గాథలను; వినుము = వినుము; సకల = సర్వ; భూతములు = జీవుల; అందున్ = లోను; సంపూర్ణుడు = నిండి ఉండు వానిని; అగు = అయిన; నన్నున్ = నన్ను; యజ్ఞేశున్ = నారాయణుని; ఈశ్వరున్ = నారాయణుని; ఆత్మన్ = మనసున; నిలిపి = ధరించి.
కర్మ = కర్మముల; చయమున్ = సమూహములను; ఎల్లన్ = సమస్తమును; ఖండించి = త్రుంచి; పూజనము = అర్చన, కైంకర్యము; ఆచరింపుము = చేయుము; ఈశ్వర = భగవతునికి; అర్పణము = సమర్పించినది; కాన్ = అగునట్లు; భోగములన్ = బోగములవలన; నశించున్ = తొలగిపోవును; పుణ్యంబున్ = పుణ్యములు; వ్రతములన్ = దీక్షలతోటి; పాప = పాపములు; సంచయములు = కూడబెట్టినవి; పాయున్ = తొలగిపోవును; నిన్నున్ = నిన్ను.
భావము:- “ప్రహ్లాదా! నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు, ఏకాంత భక్తులు, కోరికలు ఏవీ కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతరం కాలం సకల భోగాలూ అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వ భూతాతంరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా, పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండిచి, ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. సుఖాలనూ అనుభవించుట చేత పూర్వం సంపాదించిన పుణ్యాలు వ్యయం అవుతాయి. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి.”

261
మఱియు నటమీఁదటఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్యవిరాజ మానంబును దివిజరాజజేగీయమానంబును బరిపూరిత దశదిశంబును నయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు; వినుము.
టీక:- మఱియున్ = ఇంకను; అటమీదటన్ = ఆ పైన; కాల = కాలము యొక్క; వేగంబునన్ = గతిచే; కళేబరంబున్ = ప్రాణము మినహా దేహము; విడిచి = వదలివేసి; త్రైలోక్య = ముల్లోకము లందును; విరాజమానంబును = మిక్కిలి ప్రకాశించునది; దివిజరాజ = దేవేంద్రునిచే {దివిజరాజు - దివిజుల (దేవతల)కు రాజు, దేవేంద్రుడు}; జేగీయమానంబునున్ = పొగడబడునది; పరిపూరిత = పూర్తిగా నిండిన; దశదిశంబునున్ = పది దిక్కులు గలది {దశదిశలు - అష్టదిక్కులు (8) మరియు కింద పైన}; అయిన = అయిన; యశంబు = కీర్తి; తోడన్ = తోటి; ముక్త = వీడిన; బంధుండవు = బంధనములు గలవాడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; డగ్గఱియెదవు = చేరెదవు; వినుము = వినుము.
భావము:- అటు పిమ్మట, కాలప్రవాహానికి లోబడి, కళేబరం వదలిపెట్టి, ముల్లోకాల లోనూ ప్రకాశించేదీ, దేవేంద్రుని చేత పొగడబడేదీ, దశదిక్కులందు పరిపూర్ణంగా నిండి ఉండేదీ అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు.

262
రుఁడు ప్రియముతోడ నాయవతారంబు,
నీ యుదారగీత నికరములను
మానసించునేని ఱి సంభవింపఁడు
ర్మబంధచయముఁ డచిపోవు.”
టీక:- నరుడు = మానవుడు; ప్రియము = ఆదరము; తోడన్ = తోటి; నా = నా యొక్క; అవతారంబున్ = అవతారమును; నీ = నీ యొక్క; ఉదార = గొప్ప; గీత = కీర్తిగానముల; నికరములనున్ = సమూహములను; మానసించునేని = తలపోసినచో; మఱి = ఇంక; సంభవింపడు = పుట్టడు; కర్మ = కర్మముల; బంధ = బంధనముల; చయమున్ = సర్వమును; కడచిపోవు = దాటేయును.
భావము:- మానవుడు నా ఈ నారసింహావతారాన్నీ, నీవు చేసిన ఈ సంస్తుతినీ నిండుగా మనసులో నిలుపుకుంటే, వానికి పునర్జన్మ ఉండదు. వాడు కర్మ బంధాలను దాటేస్తాడు.”

263
అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఇలా; అనియె = అనెను.
భావము:- అలా పరమపురుషుడు పలుకగా. ప్రహ్లాదుడు ఇలా అన్నాడు

264”
దంష్ట్రివై తొల్లి సోరుని హిరణ్యాక్షు;
నీవు చంపుటఁ జేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో;
కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
రిపంథి పగిది నీ క్తుండ నగు నాకు;
పకారములు జేసె తఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ;
గావున బాప సంఘంబువలనఁ

బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ వ్యగాత్ర!
రము వేఁడెద నా కిమ్ము నజనేత్ర!
క్తసంఘాత ముఖపద్మ ద్మమిత్ర!
క్త కల్మషవల్లికా టు లవిత్ర!"
టీక:- దంష్ట్రివి = వరాహాతారుడవు {దంష్ట్రి - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తొల్లి = పూర్వము; సోదరునిన్ = సహోదరుని; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; నీవు = నీవు; చంపుటన్ = సంహరించుట; చేసి = వలన; నిగ్రహమున = తిరస్కారముతో; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; రోష = కోపము నందు; నిర్మగ్నుడు = పూర్తిగా మునిగినవాడు; ఐ = అయ్యి; సర్వలోకేశ్వరున్ = హరిని {సర్వలోకేశ్వరుడు - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు}; పరమున్ = హరిని {పరము - పరాత్పరుడు, సర్వాతీతుడు, విష్ణువు}; నిన్నున్ = నిన్ను; ఎఱుగన్ = తెలియ; లేక = లేకపోవుటచే; పరిపంథి = శత్రువు {పరిపంథి - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు}; పగిదిన్ = వలె; నీ = నీ; భక్తుండను = భక్తుడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; అపకారములు = కీడు; చేసెన్ = చేసెను; అతడు = అతడు; నేడు = ఈ దినమున; నీ = నీ యొక్క; శాంత = శాంతింపజేసెడి; దృష్టి = చూపుల; చేన్ = వలన; నిర్మలత్వమున్ = పవిత్రతను; ఒందెన్ = పొందెను; కావున = కనుక; పాప = పాపముల; సంఘంబు = సమూహముల; వలనన్ = నుండి; పాసి = వీడినవాడై;
శుద్ద = స్వచ్ఛమైన; ఆత్మకుండు = ఆత్మ కలవాడు; కాగన్ = అగునట్లు; భవ్యగాత్ర = నరసింహ {భవ్యగాత్రుడు - దివ్యమంగళమైన గాత్ర (దేహము గలవాడు), విష్ణువు}; వరమున్ = వరమును; వేడెదన్ = కోరెదను; నా = నా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; వనజనేత్ర = నరసింహ {వనజనేత్రుడు - వనజ (పద్మము) వంటి నేత్ర (కన్నులు గలవాడు), విష్ణువు}; భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర = నరసింహ {భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు}; భక్తకల్మషవల్లికాపటులవిత్ర = నరసింహ {భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు}.
భావము:- “ఓ పద్మాక్షా! నారసింహా! నీవు భక్తుల ముఖాలనే పద్మాలకు పద్మముల మిత్రుడైన సూర్యుని వంటివాడవు. భక్తుల పాపాలు అనే లతల పాలిట లతలను తెగగోసే కొడవలి వంటివాడవు. తన తమ్ముడు హిరణ్యాక్షుడిని, పూర్వకాలంలో నీవు వరాహరూపంలో వచ్చి, సంహరించావని మా తండ్రి హిరణ్యకశిపుడు నీపై ద్వేషం, రోషం పెట్టుకున్నాడు. సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధవిరోధిగా భావించాడు. నేను నీ భక్తుడను అయ్యానని కోపంతో నన్ను నానా బాధలూ పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈవాళ నీ శాంత దృష్టి సోకి నిర్మలుడు అయ్యాడు. అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడు అయ్యేలా వరం ప్రసాదించు.”

265
అనిన భక్తునికి భక్తవత్సలుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; భక్తుని = భక్తుని; కిన్ = కి; భక్తవత్సలుండు = నరసింహుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యము గలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా భక్తాగ్రేస్వరుడైన ప్రహ్లాదుడు పలుకగా, భక్తుల ఎడ వాత్సల్యము చూపే వాడైన నరసింహావతారుడు.

266
నిభక్తుండవు నాకు నిన్నుఁ గనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ
ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ ర్తించు విజ్ఞాన దీ
జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
నుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ త్యంబు దైత్యోత్తమా!
టీక:- నిజ = నా యొక్త; భక్తుండవు = భక్తుడవు; నా = నా; కున్ = కు; నిన్నున్ = నిన్ను; కనుటన్ = జన్మనిచ్చుటచేత; నీ = నీ యొక్క; తండ్రి = తండ్రి; త్రిస్సప్త = ఇరవైయొక్క (21); పూర్వజులన్ = ముందు తరమువారితో; కూడి = కలిసి; పవిత్రుడు = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; శుభ = శ్రేయో; గతిన్ = మార్గమున; వర్తించున్ = నడచును; విజ్ఞాన = సుజ్ఞానము యనెడి; దీప = దీపముచే; జిత = తరించిన; భవ = సంసారము యనెడి; అంధకారులు = చీకటి (అజ్ఞానము) గలవారు; అగు = అయిన; మత్ = నా యొక్క; భక్తుల్ = భక్తులు; వినోదించు = క్రీడించెడి; దేశ = ప్రదేశము నందు; జనుల్ = వసించెడివారు; దుర్జనులు = చెడ్డవారు; ఐనన్ = అయినను; శుద్ధులు = పవిత్రులే; సుమీ = సుమా; సత్యంబున్ = నిజముగ; దైత్య = రాక్షసులలో; ఉత్తమ = ఉత్తముడ.
భావము:- “రాక్షస కులంలో ఉత్తమమైన వాడా! ప్రహ్లాదా! నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనడం వలన నీ తండ్రి ముయ్యేడు (27) ముందు తరాలవారితో పాటు శుభస్థితి పొందాడు. విజ్ఞానదీపికలు వెలిగించి సంసారా మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జను లైనా కూడా పరిశుద్ధులు అవుతారు. ఇది సత్యం.

267
న సూక్ష్మ భూత సంఘాతంబు లోపల;
నెల్ల వాంఛలు మాని యెవ్వ రయిన
నీ చందమున నన్ను నెఱయ సేవించిన;
ద్భక్తు లగుదురు త్పరులకు
గుఱిజేయ నీవ యోగ్యుఁడ వైతి విటమీఁద;
వేదచోదిత మైన విధముతోడఁ
జిత్తంబు నా మీఁదఁ జేర్చి మీ తండ్రికిఁ;
బ్రేతకర్మములు సంప్రీతిఁ జేయు

తఁడు రణమున నేఁడు నా యంగమర్శ
మున నిర్మల దేహుఁడై వ్యమహిమ
పగతాఖిల కల్మషుఁ డైఁ తనర్చి
పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!”
టీక:- ఘన = మిక్కిలి పెద్దవానినుండి; సూక్ష్మ = మిక్కిలి చిన్నవానివరకు; భూత = జీవుల; సంఘాతంబు = సమూహము; లోపల = లోను; ఎల్ల = సమస్తమైన; వాంఛలున్ = కోరికలను; మాని = వదలివేసి; ఎవ్వరైనన్ = ఎవరైనసరే; నీ = నీ; చందమునన్ = విధముగ; నన్నున్ = నన్ను; నెఱయన్ = నిండుగా; సేవించినన్ = కొలచినచో; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగుదురు = అయ్యెదరు; మత్ = నాకు; పరుల్ = చెందినవారి; కున్ = కి; గుఱి = దృష్టాంతముగ; చేయన్ = చూపుటకు; నీవ = నీవే; యోగ్యుడవు = తగినవాడవు; ఐతివి = అయినావు; ఇటమీద = ఇప్పటినుండి; వేద = వేదములచే; చోదితము = నిర్ణయింపబడినవి; ఐన = అయిన; విధము = పద్ధతి; తోడన్ = తోటి; చిత్తంబున్ = మనసును; నా = నా; మీదన్ = ఎడల; చేర్చి = లగ్నముచేసి; మీ = మీ యొక్క; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రేత = అపర, (పరలోకయాత్రకైన); కర్మములు = కర్మలు; సంప్రీతిన్ = ఇష్టపూర్తిగా; చేయుము = చేయుము; అతడు = అతడు.
రణంబునన్ = యుద్ధమున; నేడు = ఈ దినమున; నా = నా యొక్క; అంగ = శరీర; మర్శనమునన్ = స్పర్శచేత; నిర్మల = పావనమైన; దేహుడు = దేహము గలవాడు; ఐ = అయ్యి; నవ్య = నూతనమైన; మహిమన్ = వైభవముతో; అపగత = పోగొట్టబడిన; అఖిల = సమస్తమైన; కల్మషుడు = పాపములు గలవాడు; ఐ = అయ్యి; తనర్చి = ఒప్పి; పుణ్యలోకంబుల్ = పుణ్యలోకముల; కున్ = కు; ఏగున్ = వెళ్ళును; పుణ్యచరిత = పావనమైన నడవడిక గలవాడ.
భావము:- పావన మూర్తీ! ప్రహ్లాదా! నీలాగే ఎవరైనా సరే చిన్నవారైనా, పెద్దవారైనా, ఎల్లవాంఛలూ మాని నన్ను ఉపాసిస్తారో, వాళ్ళు నా భక్తులు, నా భక్తులలో నువ్వు ఉత్తముడవు. ఇంక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్తవిధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి. అతడు నా శరీరస్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు.”

268
అని యిట్లు నరసింహదేవుం డానతిచ్చిన హిరణ్యకశిపునకుం బ్రహ్లాదుండు పరలోకక్రియలు జేసి, భూసురోత్తములచేత నభిషిక్తుండయ్యె; నయ్యెడం బ్రసాద సంపూర్ణ ముఖుండైన శ్రీనృసింహదేవునిం జూచి దేవతాప్రముఖసహితుం డైన బ్రహ్మదేవుం డిట్లనియె,
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; నరసింహ = నరసింహుడు ఐన; దేవుడు = భగవంతుడు; ఆనతిచ్చినన్ = చెప్పగా; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపున; కున్ = కు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పరలోక = మరణానంతర యాత్ర కైన; క్రియలున్ = కార్యక్రమములను; చేసి = చేసి; భూసుర = బ్రాహ్మణ {భూసురులు - భూ (భూమిపైని) సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; ఉత్తముల = శ్రేష్ఠుల; చేతన్ = చేత; అభిషిక్తుండు = పట్టాభిషేక్తుడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; ఎడన్ = సమయములో; ప్రసాద = అనుగ్రహముచేత; సంపూర్ణ = నిండైన, తృప్తిచెందిన; ముఖుండు = ముఖము గలవాడు; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నృసింహ = నరసింహరూపుడైన; దేవునిన్ = భగవంతుని; చూచి = చూసి; దేవతా = దేవతలు; ప్రముఖ = మొదలగు ముఖ్యులతో; సహితుండు = కూడినవాడు; ఐన = అయిన; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా భగవంతుడైన నరసింహస్వామి చెప్పగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేసి బ్రాహ్మణోత్తములచేత, పట్టాభిషేక్తుడు అయ్యెను; ఆ సమయములో అనుగ్రహముతో నిండైన మోము గల శ్రీ నృసింహస్వామిని చూసి దేవతలు మొదలగు ముఖ్యులతో కూడిన బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికెను.

269
దేవదేవాఖిలదేవేశ! భూతభా;
న! వీఁడు నా చేత రముపడసి
త్సృష్టజనులచే రణంబు నొందక;
త్తుఁడై సకలధర్మములుఁ జెఱచి
నేఁడు భాగ్యంబున నీచేత హతుఁ డయ్యెఁ;
ల్యాణ మమరె లోముల కెల్ల
బాలు నీతని మహాభాగవతశ్రేష్ఠుఁ;
బ్రతికించితివి మృత్యు యముఁ బాపి

రముఁ గృపజేసితివి మేలు వారిజాక్ష!
నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ
గిలి చింతించువారలు దండధరుని
బాధ నొందరు మృత్యువు బారిఁ పడరు.”
టీక:- దేవదేవా = నరసింహ {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, హరి}; అఖిలదేవేశ = నరసింహ {అఖిలదేవేశుడు - ఎల్లదేవతలకు ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నరసింహ {భూతభావనుడు - సర్వజీవులను కాపాడువాడు, విష్ణువు}; వీడు = ఇతడు; నా = నా; చేతన్ = నుండి; వరమున్ = వరములను; పడసి = పొంది; మత్ = నా యొక్క; సృష్టి = పుట్టింపబడిన; జనుల్ = వారి; చేన్ = వలన; మరణంబున్ = చావును; ఒందకన్ = పొందనని; మత్తుడు = గర్వించినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; ధర్మములు = వేదధర్మములను; చెఱచి = పాడుచేసి; నేడు = ఈ దినమున; భాగ్యంబునన్ = అదృష్టబలమువలన; నీ = నీ; చేతన్ = చేతిలో; హతుడు = మరణించినవాడు; అయ్యెన్ = కాగలిగెను; కల్యాణము = శుభములు; అమరెన్ = కలిగెను; లోకముల్ = లోకములు; ఎల్లన్ = అన్నిటికిని; బాలున్ = కుఱ్ఱవానిని; ఈతని = ఇతనిని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శ్రేష్ఠున్ = ఉత్తముని; బ్రతికించితివి = కాపాడితివి; మృత్యు = మరణ; భయము = భయమును; పాసి = దూరముచేసి.
వరమున్ = వరమును; కృపజేసితివి = దయతో యిస్తివి; మేలు = లెస్స, మంచిది; వారిజాక్ష = నరసింహ {వారిజాక్షుడు – వారిజ (పద్మమువంటి) అక్షుడు(కన్నులు గలవాడు), విష్ణువు}; నీ = నీ యొక్క; నృసింహ = నరసింహ; అవతారంబున్ = అవతారమును; నిష్ఠ = స్థిరమైన పూనిక; తోడన్ = తోటి; తగిలి = విడువక; చింతించు = మననముచేయు; వారలు = వారు; దండధరునిబాధన్ = యమయాతనలను {దండధరుడు - దండించుటను ధరించినవాడు, యముడు}; ఒందరు = పొందరు; మృత్యువు = మరణము; బారిన్ = వాతను; పడరు = పడరు.
భావము:- “ఓ పద్మాక్షా! నరసింహావతారా! సర్వేశ్వరా! నీవు దేవతోత్తము లందరి పైన దేవుడవు. ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టించబడిన ప్రాణుల చేత చావని విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు; సకల ధర్మాలను మంటగలిపాడు; ఈ రోజు అదృష్టవశాత్తు నీ చేతిలో మరణం పొందాడు; లోకాలు అన్నిటికి మేలు కలిగింది. ఈ పిల్లాడు ప్రహ్లాదుడు పరమ భాగవతశ్రేష్ఠుడు; ఇతనికి దయతో మృత్యుభయం లేకుండా వరం ప్రసాదించావు. నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో ఉపాసించే వారు యముని వలన బాధలు బడరు; మృత్యు భయం పొందరు.”

270
అనిన నరసింహదేవుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; నరసింహ = నరసింహరూపుడైన; దేవుండు = దేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా బ్రహ్మ దేవుడు పలుకగా, నరసింహస్వామి ఇలా అన్నాడు.

271
”మన్నించి దేవశత్రుల
కెన్నఁడు నిటువంటి వరము లీకుము పా పో
త్పన్నులకు వరము లిచ్చుట
న్నగముల కమృత మిడుట పంకజగర్భా!”
టీక:- మన్నించి = సమ్మానించి; దేవశత్రుల్ = రాక్షసుల; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; ఇటువంటి = ఇలాంటి; వరములు = వరములను; ఈకుము = ఈయకుము; పాపన్ = నీచపు; ఉత్పన్నుల్ = జన్మము గలవారి; కున్ = కి; వరముల్ = వరములను; ఇచ్చుట = ప్రసాదించుట; పన్నగముల్ = పాముల; కున్ = కు; అమృతము = అమృతము; ఇడుట = ఇచ్చుట; పంకజగర్భా = బ్రహ్మదేవుడా {పంకజగర్భుడు - పంకజ (పద్మమున) గర్భుడ (పుట్టినవాడు), బ్రహ్మ}.
భావము:- “పద్మసంభవా! బ్రహ్మదేవా! దేవతా ద్వేషులను ఆదరించి ఇక ఎప్పుడూ ఇలాంటి వరాలను ఇవ్వకు. పాపాత్ములకు వరములు ఇవ్వటం, పాములకు పాలు పోయటం వంటిది సుమా.”

272
అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతాసమూహంబుచేఁ బూజితుఁడై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె; ప్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు జేసి బ్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతం బూజితుండై దీవించె; నంత నీశానాది నిఖిల దేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబునకుఁ జనిరి; ఇట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి బ్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు లను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె; ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించె; తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం బ్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె; నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంత రసంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తు లై హరిం గదిసి" రని చెప్పి నారదుం డిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చి = చెప్పి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; సమూహంబు = సమూహముల; చేన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; భగవంతుండు = షడ్గుణైశ్వర్యసంపన్నుడు {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నరసింహ = నరసింహరూప; దేవుండు = దేవుడు; తిరోహితుండు = అదృశ్యుడు, అంతర్ధానుడు; అయ్యెన్ = అయ్యెను; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడుకూడ; శూలి = పరమశివుని {శూలి - శూలాయుధము ధరించువాడు, శివుడు}; కిన్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; తమ్మిచూలి = బ్రహ్మదేవున {తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ}; కిన్ = కు; వందనంబులు = నమస్కారములు; చేసి = చేసి; ప్రజాపతుల్ = ప్రజాపతుల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భగవత్ = భగవంతుని; కళలు = అంశజులు; ఐన = అయిన; దేవతల్ = దేవతల; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కరించగా; చూచి = చూసి; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; శుక్ర = శుక్రుడు; ఆది = మొదలైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; దైత్య = దితివంశజుల; దానవ = దనుజుల; రాజ్యంబున్ = రాజ్యమున; కున్ = కు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; పట్టంబుగట్టి = పట్టాభిషిక్తునిజేసి; అతని = అతని; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; దీవించెన్ = ఆశీర్వదించెను; అంతన్ = అంతట; ఈశాన = ఈశానుడు; ఆది = మొదలైన; నిఖిల = ఎల్ల; దేవతలున్ = దేవతలును; వివిధంబులు = పలువిధములైన; ఆశీర్వాదంబుల = ఆశీర్వచనముల; చేతన్ = చేత; ఆ = ఆ; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; కృతార్థున్ = సార్థకున్; చేసి = చేసి; తమ్మిచూలిని = బ్రహ్మదేవుని; ముందటన్ = ముందుభాగమున; ఇడుకొని = ఉంచుకొని; నిజస్థానంబున్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; ఇట్లు = ఈ విధముగ; విష్ణుదేవుండు = విష్ణుమూర్తి; నిజ = తన; పార్శ్వచరులు = పక్కన మెలగువారు; ఇరువురు = ఇద్దరు (2); బ్రాహ్మణ = బ్రాహ్మణులైన సనకాదుల; శాపంబునన్ = శాపము; చేసి = వలని; ప్రథమ = మొదటి; జన్మంబునన్ = జన్మలో; దితి = దితియొక్క; పుత్రులు = కుమారులు; ఐన = అయిన; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; హిరణ్యకశిపులన్ = హిరణ్యకశిపులను; వరాహ = వరాహ; నారసింహ = నరసింహ; రూపంబులన్ = స్వరూపములలో; అవతరించి = అవతరించి; వధియించెన్ = సంహరించెను; ద్వితీయ = రెండవ (2); భవంబునన్ = జన్మములో; రాక్షస = రాక్షసకులమున; జన్మంబున్ = జన్మము; తాల్చిన = ధరించిన; రావణ = రావణుడు; కుంభకర్ణులను = కుంభకర్ణులను; శ్రీరామ = శ్రీరామ; రూపంబునన్ = స్వరూపముతో; సంహరించెన్ = చంపెను; తృతీయ = మూడవ (3); జన్మంబునన్ = జన్మలో; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రులు; అను = అనెడి; పేరులన్ = పేరులతో; ప్రసిద్ధి = పేరుపొందిన; వారలను = వారిని; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ; రూపంబునన్ = స్వరూపముతో; ఖండించెన్ = చంపెను; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మూడు = మూడు (3); జన్మంబులన్ = జన్మలలో; గాఢ = తీవ్రమైన; వైర = విరోధ; అనుబంధంబునన్ = సంబంధమువలన; నిరంతర = ఎడతెగకుండెడి; సంభావిత = అలవడిన; ధ్యానులు = ధ్యానముగలవారు; ఐ = అయ్యి; వారలు = వారు; నిఖిల = సమస్తమైన; కల్మష = పాపములనుండి; విముక్తులు = విడివడినవారు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; కదిసిరి = చేరిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈలాగున; అనియె = పలికెను.
భావము:- నృసింహస్వామి బ్రహ్మదేవునికి ఇలా తెలియజెప్పి, బ్రహ్మాది దేవతల పూజలను స్వీకరించి, అంతర్ధానం అయ్యాడు. ప్రహ్లాదుడు పరమేశ్వరునికి ప్రణామాలు ఆచరించాడు. విధాతకు వందనం చేసాడు. ప్రజాపతులకు ప్రణతులు చేసాడు. భగవదంశతో ప్రకాశించే దేవతలకు నమస్కారాలు చేసాడు. అంతట చతుర్ముఖ బ్రహ్మ, శుక్రుడు మొదలైన మునీంద్రులతో కలిసి ప్రహ్లాదుడిని దైత్య, దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి రాజ్యం అప్పజెప్పి, ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలను అందరిని అర్హమైన విధంగా పూజించాడు. ఈశానుడు మొదలగు సమస్త దేవతలు ప్రహ్లాదుడిని నానావిధ ఆశీస్సులతో ధన్యుడిని చేశారు. బ్రహ్మదేవుడితో సహా దేవతలు అందరూ తమతమ స్థానాలకు బయలుదేరి వెళ్ళారు.
ఇలా సనకాది విప్రోత్తముల శాపానికి గురైన ద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు. ద్వితీయజన్మలో రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరామునిగా అవతరించి అంతం చేసాడు. తృతీయజన్మగా శిశుపాల. దంతవక్త్రులుగా జన్మించారు. శ్రీకృష్ణుడై వారిని పరిమార్చాడు. ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరభావంతో నిరంతం హరి స్మరణ చేస్తూ వీళ్ళు శాప విముక్తులు అయ్యారు. చివరకు స్వస్థానం అయిన వైకుంఠ ఆ ద్వారపాలకులు చేరారు.” అని నారద మహర్షి, మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు.

273
శ్రీ మణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హాముఁ బుణ్య భాగవతుఁడైన నిశాచరనాథపుత్ర సం
చాము నెవ్వఁడైన సువిచారత విన్నఁ బఠించినన్ శుభా
కాముతోడ నే భయముఁ ల్గని లోకముఁ జెందు భూవరా!
టీక:- శ్రీ = శోభకరము; రమణీయము = మనోజ్ఞము; ఐన = అయిన; నరసింహ = నరసింహుని; విహారమున్ = క్రీడ; ఇంద్రశత్రు = హిరణ్యాక్షుని; సంహారమున్ = చంపుట; పుణ్య = పావన; భాగవతుడు = భాగవతుడు; ఐన = అయిన; నిశాచరనాథపుత్ర = ప్రహ్లాదుని {నిశాచరనాథపుత్రుడు - నిశాచర రాజు (రాక్షస రాజు యైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; సంచారమున్ = నడవడికను; ఎవ్వడు = ఎవరు; ఐనన్ = అయినను; సు = చక్కటి; విచారతన్ = విమర్శతో; విన్నన్ = వినినను; పఠించినన్ = చదివినను; శుభ = మంగళ; ఆకారము = విగ్రహము; తోడన్ = తోటి; ఏ = ఎట్టి; భయమున్ = భయము; కల్గని = కలగనట్టి; లోకమున్ = లోకమును; చెందున్ = చేరును; భూవర = రాజా.
భావము:- “మహారాజా! ధర్మజ! శుభకరమైన శ్రీ నరసింహ అవతారం; విహారం; హిరణ్యకశిపుని సంహారం; పుణ్యమూర్తి ప్రహ్లాదుని సంచారం; మంచి మనస్సుతో వినిన, చదివిన మానవుడు ఏ భయమూ కలుగని పుణ్యలోకానికి చేరుకుంటాడు.

274
జాతప్రభవాదులున్ మనములోఁ ర్చించి భాషావళిం
లుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁడై చిత్తప్రియుండై మహా
సంధాయకుఁడై చరించు టది నీ భాగ్యంబు రాజోత్తమా!
టీక:- జలజాతప్రభవ = బ్రహ్మదేవుడు {జలజాతప్రభవుడు - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించినవాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారు కూడ; మనము = మనసుల; లోన్ = లోపల; చర్చించి = తరచిచూసుకొని; భాషావళిన్ = వాక్కులచేత; పలుకన్ = పలుకుటకు; లేని = వశము కాని; జనార్దన = విష్ణుమూర్తి {జనార్దనుడు - వ్యు. జన్మ మరణార్యర్థయతీ- నాశయతీతి, జనన మరణములను పోగొట్టువాడు, విష్ణువు}; ఆహ్వయ = పేరు గల; పరబ్రహ్మంబు = పరమాత్మ; నీ = నీ యొక్క; ఇంటి = నివాసము; లోన్ = అందు; చెలి = మిత్రుడు; ఐ = అయ్యి; మేనమఱంది = మేనత్తకొడుకు; ఐ = అయ్యి; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; ఐ = అయ్యి; చిత్త = మనసునకు; ప్రియుండు = ఇష్టుడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; ఫల = ఫలితములను; సంధాయకుండు = కూర్చువాడు; ఐ = అయ్యి; చరించుట = మెలగుట; అది = అది; నీ = నీ యొక్క; భాగ్యంబు = అదృష్టము; రాజోత్తమ = రాజులలో ఉత్తముడ.
భావము:- రాజోత్తమా! ధర్మరాజా! బ్రహ్మాదులు సైతం ఆలోచించి, పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీకృష్ణుడు. అంతటివాడు మీకు మిత్రుడుగా, బావమరిదిగా, మంత్రిగా, ఆత్మప్రియుడుగా, మహా ఫల ప్రదాతగా నీ ఇంటిలో విహారం చేయటం నీ మహాభాగ్యం.” అని ధర్మరాజునకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్ర వివరించాడు.

పూర్ణి

275
ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
టీక:- ధరణిదుహితృరంతా = శ్రీరామా {ధరణిదుహితృరంతుడు - ధరణీ (భూదేవి) దుహితృ (కుమార్తె) యైన సీతతో రంతుడు (క్రీడించువాడు), రాముడు}; ధర్మమార్గానుగంతా = శ్రీరామా {ధర్మమార్గానుగంతుడు - ధర్మమార్గ (ధర్మమార్గమును) అనుగంతుడు (అనుసరించువాడు), రాముడు}; నిరుపమనయవంతా = శ్రీరామా {నిరుపమనయవంతుడు - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతి గలవాడు), రాముడు}; నిర్జరారాతిహంతా = శ్రీరామా {నిర్జరారాతిహంత - నిర్జరారాతి (దేవతలశత్రువు లగు రాక్షసులను) హంత(చంపినవాడు), రాముడు}; గురుబుధసుఖకర్తా = శ్రీరామా {గురుబుధసుఖకర్త - గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ (సౌఖ్యమును) కర్త (ఏర్పరచినవాడు), రాముడు}; కుంభినీచక్రభర్తా = శ్రీరామా {కుంభినీచక్రభర్త - కుంభినీ (భూ) చక్ర (మండలమునకు) భర్త (నాథుడు), రాముడు}; సురభయపరిహర్తా = శ్రీరామా {సురభయపరిహర్త - సుర (దేవతల) భయ (భయమును) పరిహర్త (పోగొట్టినవాడు), రాముడు}; సూరిచేతోవిహర్తా = శ్రీరామా {సూరిచేతోవిహర్త - సూరి (జ్ఞానుల) చేతః (చిత్తములలో) విహర్త (క్రీడించువాడు), రాముడు}.
భావము:- భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని నీతి గలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలమును ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.

276
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన బ్రహ్మవరము లిచ్చుట, ప్రహ్లాద చరిత్రంబు, ప్రహ్లాదుని హింసించుట, ప్రహ్లాదుని జన్మంబు, నృసింహరూపావిర్భావంబు, దేవతల నరసింహ స్తుతి, ప్రహ్లాదుండు స్తుతించుట యను కథలు గల నారసింహ విజయము అను ప్రహ్లాద భక్తిఅనెడి ఉపాఖ్యానంబు సంపూర్ణము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; పరమేశ్వర = పరమశివుని; కరుణా = కృపవలన; కలిత = పుట్టిన; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = కుమారుడైనా; సహజ = సహజసిద్ధమైన; పాండిత్య = పండితప్రజ్ఞ గల; పోతన = పోతన యనెడి; అమాత్య = శ్రేష్ఠునిచేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; వరములు = వరములను; ఇచ్చుట = ప్రసాదించుట; ప్రహ్లాద = ప్రహ్లాదుని యొక్క; చరిత్రంబు = వర్తనములు; ప్రహ్లాదుని = ప్రహ్లాదుడిని; హింసించుట = బాధించుట; ప్రహ్లాదుని = ప్రహ్లాదుడి యొక్క; జన్మంబు = జన్మము; నృసింహరూప = నరసింహావతారుని; ఆవిర్భావంబు = ప్రత్యక్షము అగుట; దేవతల = దేవతలు చేసిన; నరసింహ = నరసింహస్వామి; స్తుతి = స్తోత్రములు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; స్తుతించుట = నరసింహస్వామిని నుతించుట; అను = అను; కథలు = ఘట్టములు; కల = కలిగిన; నారసింహ విజయము = నరసింహస్వామి విజయము; అను = అను; ప్రహ్లాద భక్తి= ప్రహ్లాదునిభక్తి; అనెడి = అనెడి; ఉపాఖ్యానంబు = వృత్తాంతము; సంపూర్ణము = సమాప్తము.
భావము:- ఇది శుభకరమైన పరమశివుని కృపవలన పుట్టిన కేసనమంత్రి యొక్క కుమారుడూ, సహజసిద్ధమైన పండితప్రజ్ఞగల పోతనామాత్యుని చేత ప్రణీతమయిన బ్రహ్మదేవుడు వరములు ప్రసాదించుట, ప్రహ్లాదుని యొక్క చరిత్ర, ప్రహ్లాదుని హింసించుట, ప్రహ్లాదుని యొక్క జన్మము, నరసింహావతారుని ఆవిర్భావము, దేవతల నరసింహ స్తుతి, ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతించుట; అను ఘట్టములు కలిగిన నారసింహ విజయము అను ప్రహ్లాద భక్తి అనెడి వృత్తాంతము సమాప్తము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు