పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సప్తమహర్షులను శీతాచలంబునకుఁ బంపుట

  •  
  •  
  •  

3-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని విన్నవించిన మునిజనంబులం గనుంగొని మహేశ్వరుం డతులిత కరుణాపూరిత మానసుం డై యిట్లనియె.

టీకా:

అతులిత = అసమానమైన.

భావము:

అని విన్నవించిన మునులను చూసి పరమేశ్వరుడు అసమాన దయాహృదయంతో ఇలా అన్నాడు.

3-27-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శీతాచలేంద్రునికూఁతుఁ బార్వతికన్య
తిమోదమున మాకు డిగి రండు
డురాజవదనకు సుంకు వేమడిగిన
నెంతైన మైకొని యిచ్చి రండు
దిరాక్షి నాతండు నకిచ్చునట్లుగాఁ
బెంపార నుంగ్రముఁ బెట్టిరండు
పాలకూళ్లు గుడిచి బాలను మనసొమ్ము
చేసిరం డనువొందఁ జేసి రండు
3-27.1-ఆ.
దియె మాకు మెచ్చు నెల్ల భంగులనైన
దీనిఁ జేయవలయుఁ దెఱఁగు మెఱసి
దలిపోవ నిదియె డుమంచిలగ్నంబు
భూధరేంద్రపురికిఁ బోయి రండు.

టీకా:

మోదము = సంతోషము; ఉడు = నక్షత్రము; సుంకము = శుల్కము; మైకొను = సమ్మతించు; మదిరాక్షి = అందగత్తె (ప్రేమతో కూడిన మత్తు చూపులు కలామె); ఉంగ్రము = ఉంగరము; పాల్కకూడు = పాలు అన్నము, పరమాన్నము; కుడిచి = తిని; అనువు = అనుకూలము; తెఱగు = చక్కన; కడు = మిక్కలి, చాలా; లగ్నము = శుభసమయం; భూధరేంద్రుడు = హిమవంతుడు.

భావము:

“హిమవంతుని కూతురైన పార్వతి కన్యను చాలా సంతోషంతో మాకోసం అడిగి రండి. ఆ చంద్రముఖికి శుల్కము ఏమడిగినా ఎంతైనా సమ్మతించి ఇచ్చి రండి. ఆమెను మనకిచ్చేట్లుగా నిశ్చయము చేసుకుని ఉంగరము పెట్టి రండి. పరమాన్నము తిని బాలను మనసొమ్ము చేసి రండి. పని సానుకూలముగా చేసి రండి. అన్ని విధాలా ఇదే మాకు మీరు చేసే మేలు. దీనిని చక్కగా చేసి రండి. వెళ్ళడానికిదే చాలా మంచి శుభ సమయం. అతని పట్టణానికి వెళ్ళి రండి.”

3-28-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి యన్యపురుషావలోకనంబు సేయక వసిష్ఠపాదావలోకనంబు సేయుచున్న పతివ్రతాశిరోమణియగు నరుంధతింజూచి శివుం డిట్లనియె.

టీకా:

అన్యపురుషావలోకనము = పర పురుషులను చూచుట.

భావము:

అని చెప్పి పర పురుషులను చూడక భర్తయైన వశిష్టుని పాదాలనే చూచెడి పతివ్రతా శిరోమణి యైన అరుంధతితో శివుడిలా అనెను.

3-29-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“వనితా! కూఁతులఁ బెండ్లి సేయు నెడలన్ వాచాలకుల్ తల్లులే
నిలోకంబులు పల్కుఁ గాన సతి నీ ద్రీశు నిల్లాలితో
నొరం గన్నియకున్ వరుండు దగు మీరూహింపఁగా నేల యి
మ్మనికార్యంబు ఘటింపఁగాఁ బలుకుమీఁ యంభోజపత్రేక్షణా!”

టీకా:

వాచాలకుడు = చక్కగా మాట్లాడువాడు; ఒనరు = సరిపోవు; అంభోజపత్రేక్షణ = కలువరేకులవంటి కన్నులుకలది.

భావము:

“పద్మదళాయతాక్షీ! వనితా! అరుంధతీదేవీ! కుమార్తెల పెండ్లి చేసేటప్పుడు చక్కగా మాట్లాడేవారు తల్లులే యని లోకప్రసిద్ధి. కావున నీవు పర్వతరాజు భార్యయైన మేనకతో సతీకన్యకు వరుడు సరిపోతాడు. ఇంకా మీరు ఆలోచించడమెందుకు? యిమ్మని పని జరిగేలా మాట్లాడండి.”