పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వసుదేవుని వంశము

  •  
  •  
  •  

9-722-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అ య్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహంబయ్యె; నయ్యంగనకుఁ బాండురాజువలన ధర్మజ, భీమార్జునులు పుట్టి; రమ్మగువ చెల్లెలగు శ్రుతదేవయనుదానిం గారూషకుం డైన వృద్ధ శర్మ పెండ్లియాడె; నయ్యిద్దఱకు మునిశాపంబున దంతవక్త్రుండను దానవుండు జన్మించె; దాని తోడంబుట్టువగు శ్రుతకీర్తిని గేకయరాజైన ధృష్టకేతుండు పెండ్లియాడె; నా దంపతులకుఁ బ్రతర్దనాదులేవురు పుట్టరి; దాని భగిని యైన రాజాధిదేవిని జయత్సేనుండు పరిణయంబయ్యె; నా మిథునంబునకు విందానువిందులు సంభవించిరి; చేదిదేశాధిపతి యైన దమఘోషుండు శ్రుతశ్రవసను బరిగ్రహించె; వారలకు శిశుపాలుం డుదయించె. వసుదేవుని తమ్ముఁడైన దేవభాగునికిఁ గంసయందుఁ జిత్రకేతుబృహద్బలు లిరువురు జనించిరి; వాని భ్రాతయగు దేవశ్రవుండనువానికిఁ గంసవతి యందు వీరుండును నిషుమంతుండును నుప్పతిల్లిరి; వాని సోదరుండయిన కంకునికిఁ గంక యనుదానికి బకుండు, సత్యజిత్తు, పురుజిత్తు, ననువారుద్భవిల్లిరి; వాని సహజుండయిన సృంజయునికి రాష్ట్రపాలి యందు వృషదుర్మర్షణాదు లావిర్భవించిరి; వాని యనుజాతుం డయిన శ్యామకునకు సురభూమి యందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి; వాని తమ్ముండైన వత్సుండు మిశ్రకేశియను నప్సరస యందు వృకాది సుతులం గనియె; వాని యనుజుండైన వృకుండు దూర్వాక్షి యందుఁ దక్ష పుష్కర సాళ్వాదుల నుత్పాదించె; వాని జఘన్యజుండయిన యనీకుండు సుదామని యనుదాని యందు సుమిత్రానీక బాణాదులయిన గొడుకులం బడసె; వాని యనుజుం డైన యానకుండు గర్ణికయందు ఋతుధామ జయులం గాంచె; వసుదేవునివలన రోహిణి యందు బలుండును గదుండును సారణుండును దుర్మదుండును విపులుండును ధ్రువుండును గృతాదులును, బౌరవి యందు సుభద్రుండును భద్రబాహుండును దుర్మదుండును భద్రుండును భూతాదులుం గూడ బన్నిద్దఱును, మదిర యందు నందోపనంద కృతక శ్రుత శూరాదులును గౌసల్య యందుఁ గేశియు, రోచన యందు హస్త హేమాంగాదులును, నిళ యందు యదు ముఖ్యులయిన యురువల్కలాదులును, ధృతదేవ యందుఁ ద్రిపృష్ఠుండును, శాంతిదేవ యందుఁ బ్రశ్రమ ప్రశ్రితాదులును, నుపదేవ యందుఁ గల్పవృష్ట్యాదులు పదుండ్రును, శ్రీదేవ యందు వసుహంస సుధన్వాదు లార్గురును, దేవరక్షిత యందు గదాదులు దొమ్మండ్రును, సహదేవయందుఁ బురూఢ శ్రుతముఖ్యు లెనమండ్రును, దేవకి యందుఁ గీర్తిమంతుండును సుషేణుండును భద్రసేనుండును ఋజువును సమదనుండును భద్రుండును సంకర్షణుండును నను వా రేడ్వురును బుట్టిరి; మఱియును.

టీకా:

ఆ = ఆ; ఉవిదనున్ = యువతిని; నీ = నీ యొక్క; ప్రపితామహుండు = ముత్తాత; ఐన = అగు; పాండురాజు = పాండురాజు; వివాహంబు = పెండ్లి; అయ్యెన్ = ఆడెను; ఆ = ఆ; అంగన = స్త్రీ; కున్ = కి; పాండురాజు = పాండురాజు; వలనన్ = వలన; ధర్మజ = ధర్మజుడు; భీమ = భీముడు; అర్జునులున్ = అర్జునుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; మగువ = స్త్రీ; చెల్లెలు = చిన్నసోదరి; అగు = ఐన; శ్రుతదేవ = శుతదేవ; అను = అనెడి; దానిన్ = ఆమెను; కారూషకుండు = కారూశదేశపురాజు; ఐన = అయిన; వృద్ధశర్మ = వృద్ధశర్మ; పెండ్లియాడెన్ = వివాహముచేసుకొనెను; ఆ = ఆ; ఇద్దఱి = ఇద్దరు (2); కున్ = కు; ముని = ఋషి; శాపంబునన్ = శాపమువలన; దంతవక్త్రుండు = దంతవక్త్రుడు; అను = అనెడి; దానవుండు = రాక్షసుడు; జన్మించెన్ = పుట్టెను; దాని = ఆమె యొక్క; తోబుట్టువు = సోదరి; అగు = ఐన; శ్రుతకీర్తిని = శ్రుతకీర్తిని; కేకయ = కేకయ దేశమునకు; రాజు = రాజు; ఐన = అయిన; ధృష్టకేతుండు = ధృష్టకేతుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసికొనెను; ఆ = ఆ; దంపతుల్ = దంపతుల; కున్ = కు; ప్రతర్దన = ప్రతర్దనుడు; ఆదులు = మున్నగువారు; ఏవురున్ = ఐదుగురు; పుట్టిరి = జన్మించిరి; దాని = ఆమె యొక్క; భగిని = సోదరి; ఐన = అయినట్టి; రాజాధిదేవిని = రాజాధిదేవిని; జయత్సేనుండు = జయత్సేనుడు; పరిణయంబున్ = పెండ్లి; అయ్యెన్ = ఆడెను; ఆ = ఆ; మిథునంబున్ = దంపతుల; కున్ = కు; వింద = విందుడు; అనువిందులు = అనువిందుడు; సంభవించిరి = పుట్టిరి; చేది = చేది; దేశ = రాజ్యమునకు; అధిపతి = ప్రభువు; ఐన = అయిన; దమఘోషుండు = దమఘోషుడు; శ్రుతశ్రవసనున్ = శ్రుతశ్రవసను; పరిగ్రహించెన్ = పెండ్లాడెను; వారల = వారి; కున్ = కి; శిశుపాలుండు = శిశుపాలుడు; ఉదయించెన్ = పుట్టెను; వసుదేవుని = వసుదేవుని; తమ్ముడు = తమ్ముడు; ఐన = అయిన; దేవభాగుని = దేవభాగుని; కిన్ = కి; కంస = కంస; అందున్ = తో; చిత్రకేతు = చిత్రకేతుడు; బృహద్బలులు = బృహద్బలుడు; ఇరువురు = ఇద్దరు (2); జనించిరి = పుట్టిరి; వాని = అతని; భ్రాత = సోదరుడు; అగు = ఐన; దేవశ్రవుండు = దేవశ్రవుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; కంసవతి = కంసవతి; అందున్ = తో; వీరుండును = వీరుడును; నిషుమంతుండును = నిషుమంతుడు; ఉప్పతిల్లిరి = పుట్టిరి; వాని = అతని; సోదరుండు = సహోదరుడు; అయిన = ఐన; కంకుని = కంకుని; కిన్ = కి; కంక = కంక; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; బకుండున్ = బకుడు; సత్యజిత్తు = సత్యజిత్తు; పురుజిత్తున్ = పురుజిత్తు; అను = అనెడి; వారు = వారు; ఉద్బవిల్లిరి = పుట్టిరి; వాని = ఆతని; సహజుండు = సోదరుడు; అయిన = ఐన; సృంజయుని = సృంజయుని; కిన్ = కి; రాష్ట్రపాలి = రాష్ట్రపాలి; అందున్ = తో; వృష = వృషుడు; దుర్మర్షణ = దుర్మర్షణుడు; ఆదులు = మున్నగువారు; ఆవిర్భవించిరి = పుట్టిరి; వాని = అతని; అనుజాతుండు = సోదరుడు; అయిన = ఐన; శ్యామకున్ = శ్యామకున; కున్ = కు; సురభూమి = సురభూమి; అందున్ = లో; హరికేశ = హరికేశుడు; హిరణ్యాక్షులు = హిరణ్యాక్షుడు; ప్రభవించిరి = పుట్టిరి; వాని = అతని; తమ్ముండు = తమ్ముడు; ఐన = అయిన; వత్సుండు = వత్సుడు; మిశ్రకేశి = మిశ్రకేశి; అను = అనెడి; అప్సరస = అప్సరస; అందున్ = ఎడల; వృక = వృకుడు; ఆది = మున్నగు; సుతులన్ = పుత్రులను; కనియెన్ = పుట్టించెను; వాని = అతని; అనుజుండు = సోదరుడు; ఐన = అయిన; వృకుండు = వృకుడు; దూర్వాక్షి = దూర్వాక్షి; అందున్ = ఎడల; దక్ష = దక్షుడు; పుష్కర = పుష్కరుడు; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మున్నగువారిని; ఉత్పాదించెన్ = పుట్టించెను; వాని = ఆతని; జఘన్యజుండు = సోదరుడు; అయిన = ఐన; అనీకుండు = అనీకుడు; సుదామని = సుదామని; అను = అనెడి; దాని = ఆమె; అందున్ = ఎడల; సుమిత్రానీక = సుమిత్రానీకుడు; బాణ = బాణుడు; ఆదులు = మున్నగువారు; అయిన = ఐన; కొడుకులన్ = పుత్రులను; పడసె = పొందెను; వాని = అతని; అనుజుండు = అనుజుడు; ఐన = అయిన; ఆనకుండున్ = ఆనకుడు; కర్ణిక = కర్ణిక; అందున్ = తో; ఋతుధామ = ఋతుధాముడు; జయులన్ = జయుడులను; కాంచె = పుట్టించెను; వసుదేవుని = వసుదేవుని; వలనన్ = వలన; రోహిణి = రోహిణి; అందున్ = తో; బలుండునున్ = బలుడు; గదుండునున్ = గదుడు; సారణుండునున్ = సారణుడు; దుర్మదుండును = దుర్మదుడు; విపులుండునున్ = విపులుడు; ధ్రువుండును = ధ్రువుడును; కృత = కృతుడు; ఆదులును = మున్నగువారు; పౌరవి = పౌరవి; అందున్ = తో; సుభద్రుండును = సుభద్రుడును; భద్రబాహుండును = భద్రబాహుడు; దుర్మదుండునున్ = దుర్మదుడు; భద్రుండునున్ = భద్రుడు; భూత = భూతుడు; ఆదులున్ = మున్నగువారు; కూడన్ = కలిసి; పన్నిద్ధఱున్ = పన్నెండుమంది (12); మదిర = మదిర; అందున్ = తో; నంద = నందుడు; ఉపనంద = ఉపనందుడు; కృతక = కృతకుడు; శ్రుత = శ్రుతుడు; శూర = శూరుడు; ఆదులును = మున్నగువారు; కౌసల్య = కౌసల్య; అందున్ = అందు; కేశియున్ = కేశి; రోచన = రోచన; అందున్ = తోటి; హస్త = హస్తుడు; హేమాంగద = హేమాంగదుడు; ఆదులునున్ = మున్నగువారు; ఇళ = ఇళ; అందున్ = అందు; యదు = యదువంశపు; ముఖ్యులు = ముఖ్యమైనవారు; అయిన = ఐన; ఉరువల్కల = ఉరువల్కలుడు; ఆదులునున్ = మున్నగువారు; ధృతదేవ = ధృతదేవ; అందున్ = అందు; త్రిపృష్ఠుండును = త్రిపృష్ఠుండును; శాంతిదేవ = శాంతిదేవ; అందున్ = అందు; ప్రశ్రమ = ప్రశ్రముడు; ప్రశ్రిత = ప్రశ్రితుడు; ఆదులునున్ = మున్నగువారు; ఉపదేవ = ఉపదేవ; అందున్ = అందు; కల్పవృష్ట = కల్పవృష్టుడు; ఆదులున్ = మున్నగువారు; పదుండ్రును = పదిమంది (10); శ్రీదేవ = శ్రీదేవ; అందున్ = అందు; వసుహంస = వసుహంసుడు; సుధన్వ = సుధన్వుడు; ఆదులు = ఆదులు; ఆర్గురును = ఆరుగుర (6); దేవరక్షిత = దేవరక్షిత; అందున్ = అందు; గద = గదుడు; ఆదులు = మున్నగువారు; తొమ్మండ్రును = తొమ్మిదిమంది; సహదేవ = సహదేవ; అందున్ = అందు; పురూఢ = పురూఢుడు; శ్రుత = శ్రుతుడు; ముఖ్యులు = మున్నగువారు; ఎనమండ్రును = ఎనిమిదిమంది (8); దేవకి = దేవకి; అందున్ = తోటి; కీర్తిమంతుండును = కీర్తిమంతుడు; సుషేణుండును = సుషేణుడు; భద్రసేనుండును = భద్రసేనుడు; ఋజువును = ఋజువు; సమదనుండును = సమదనుడు; భద్రుండునున్ = భద్రుడు; సంకర్షణుండునున్ = సంకర్షణుడు; అను = అనెడి; వారు = వారు; ఏడ్వురును = ఏడుగురు; పుట్టిరి = జన్మించిరి; మఱియును = ఇంకను.

భావము:

ఆ కుంతిని నీ ముత్తాత పాండురాజు పెండ్లాడాడు. ఆమెకి పాండురాజు వలన ధర్మజుడు, భీముడు, అర్జునుడు జన్మించారు; ఆమె చెల్లెలు శ్రుతదేవను కారూశదేశపురాజు వృద్ధశర్మ వివాహమాడాడు. వారికి ఋషి శాపం వలన దంతవక్త్రుడు అనె రాక్షసుడు పుట్టాడు; ఆమె సోదరి శ్రుతకీర్తిని కేకయ దేశపురాజు ధృష్టకేతుడు వివాహం చేసికొన్నాడు. వారికి ప్రతర్థనుడు మున్నగు ఐదుగురు జన్మించారు; ఆమె సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు పెండ్లాడాడు. ఆ దంపతులకు విందుడు, అనువిందుడు పుట్టారు; శ్రుతశ్రవసను చేది రాజ్యాధిపతి దమఘోషుడు పెండ్లాడెను. వారికి శిశుపాలుడు పుట్టాడు; వసుదేవుని తమ్ముడు దేవభాగునికి కంసతో చిత్రకేతుడు, బృహద్బలుడు అని ఇద్దరు పుట్టారు; అతని సోదరుడు దేవశ్రవుడికి కంసవతితో వీరుడు, నిషుమంతుడు పుట్టారు; అతని సహోదరుడు కంకునికి భార్య కంక యందు బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు పుట్టారు; ఆతని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలితో వృషుడు, దుర్మర్షణుడు మున్నగువారు పుట్టారు; అతని సోదరుడు శ్యామకునకు సురభూమితో హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు; అతని తమ్ముడు వత్సుడు మిశ్రకేశి అనెడి అప్సరస ఎడల వృకుడు మున్నగు పుత్రులను పుట్టించాడు; అతని సోదరుడు వృకుడు దూర్వాక్షి ఎడల దక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మున్నగువారిని పుట్టించాడు; ఆతని సోదరుడు అనీకుడు సుదామని అనెడి ఆమె ఎడల సుమిత్రానీకుడు, బాణుడు మున్నగు పుత్రులను పొందాడు; అతని అనుజుడు ఆనకుడు కర్ణికతో ఋతుధాముడు, జయుడులను పుట్టించాడు; వసుదేవుని వలన రోహిణితో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగువారు; పౌరవితో సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మున్నగు పన్నెండుమంది; మదిరతో నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు, మున్నగువారు; కౌసల్య అందు కేశి; రోచన తోటి హస్తుడు, హేమాంగదుడు మున్నగువారు; ఇళ అందు ఉరువల్కలుడు మున్నగువారు; ధృతదేవ అందు త్రిపృష్ఠుండు; శాంతిదేవ అందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు మున్నగువారు; ఉపదేవ అందు కల్పవృష్టుడు మున్నగు పదిమంది (10); శ్రీదేవ అందు వసుహంసుడు, సుధన్వుడు ఆదులు ఆరుగురు; దేవరక్షిత అందు గదుడు మున్నగు తొమ్మిదిమంది; సహదేవ అందు పురూఢుడు, శ్రుతుడు, మున్నగు ఎనిమిదిమంది (8); దేవకి తోటి కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనెడి వారు ఏడుగురు జన్మించాక.......