పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కార్తవీర్యుని చరిత్ర

  •  
  •  
  •  

9-703-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యర్జునునకుం గల పుత్రసహస్రంబునం బరశురామునిబారికిం దప్పి జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువు, నూర్జితుండు నను వారేవురు బ్రతికిరి; జయధ్వజునకుఁ దాళజంఘుండును, దాళజంఘునకు నౌర్వముని తేజంబున నూర్వురు గొడుకులును గలిగి; రందుఁ బ్రథముండు వీతిహోత్రుండు మధువునకు వృక్ణుండు, వృక్ణునకుఁ బుత్రశతంబు పుట్టె; నందుఁ బ్రథముఁడు వృష్ణి; మఱియు మధు వృష్ణి యదువుల యా వంశంబులవారు మాధవులు వృష్ణులు యాదవులు ననం బరఁగిరి; యదుపుత్రుం డైన క్రోష్ణువునకు వృజినవంతుండు, వృజినవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు భేరుశేకుండు, భేరుశేకునకుఁ జిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండుం బుట్టిరి.

టీకా:

ఆ = ఆ; అర్జునున్ = అర్జున; కున్ = కు; కల = ఉన్నట్టి; పుత్ర = కుమారులు; సహస్రంబునన్ = వేయిమందిలో (1,000); పరశురాముని = పరశురాముని; బారి = దెబ్బకు; కిన్ = కి; తప్పి = తప్పించుకొని; జయద్వజుండున్ = జయద్వజుడు; శూరసేనుండున్ = శూరసేనుడు; వృషణుండున్ = వృషణుడు; మధువున్ = మధువు; ఊర్జితుండున్ = ఊర్జితుడు; అను = అనెడి; వారున్ = వారు; ఏవురు = ఐదుగురు; బ్రతికిరి = బతికిపోయిరి; జయద్వజున్ = జయద్వజున; కున్ = కు; తాళజంఘుడును = తాళజంఘుడు; తాళజంఘున్ = తాళజంఘున; కున్ = కు; ఔర్వముని = ఔర్వముని; తేజంబునన్ = తేజస్సువలన; నూర్వురు = వందమంది (100); కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టరి; అందున్ = వారిలో; ప్రథముండు = మొదటివాడు; వీతిహోత్రుండు = వీతిహోత్రుడు; మధువున్ = మధువున; కున్ = కు; వృక్ణుండున్ = వృక్ణుడు; వృక్ణున్ = వృక్ణున; కున్ = కు; పుత్ర = కొడుకులు; శతంబున్ = నూరుమంది (100); పుట్టెన్ = జన్మించెను; అందున్ = వారిలో; ప్రథముడు = మొదటివాడు; వృష్టి = వృష్టి; మఱియున్ = ఇంకను; మధు = మధుడు; వృష్ణి = వృష్ణి; యదువుల = యదువులయొక్క; ఆ = ఆయా; వంశంబుల = వంశముల; వారున్ = వారు; మాధవులు = మాధవులు; వృష్ణులు = వృష్ణులు; యాదవులు = యాదవులు; అనన్ = అనగా; పరగిరి = ప్రసిద్ధులైరి; యద = యదువు యొక్క; పుత్రుండు = కొడుకు; ఐన = అయిన; క్రోష్టువున్ = క్రోష్టువున; కున్ = కు; వృజినవంతుండున్ = వృజినవంతుడు; వృజినవంతున = వృజినవంతున; కున్ = కు; శ్వాహితుండు = శ్వాహితుడు; శ్వాహితున్ = శ్వాహితున; కున్ = కు; భేరుశేకుండున్ = భేరుశేకుడు; భేరుశేకున్ = భేరుశేకున్; కున్ = కు; చిత్రరథుండున్ = చిత్రరథుడు; చిత్రరథున్ = చిత్రరథున; కున్ = కు; శశిబిందుండు = శశిబిందుడు; పుట్టిరి = జన్మించిరి.

భావము:

ఆ కార్తవీర్యార్జునకు వెయ్యిమంది కుమారులు. ఆ వెయ్యిమందిలో పరశురాముని దెబ్బ తప్పించుకొని జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు మాత్రమే బతికిబట్టకట్టారు. జయద్వజునకు తాళజంఘుడు; తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన వందమంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు; మధువునకు వృక్ణుడు; వృక్ణునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో మొదటివాడు వృష్ణి; ఇంకా విను. మధువు వంశంవారు మాధవులు; వృష్ణి వంశంవారు వృష్ణులు; యదువు వంశంవారు యాదవులు; అనగా ప్రసిద్ధులు అయ్యారు. యదువు కొడుకు క్రోష్టువు; అతనికి వృజినవంతుడు; వృజినవంతునకు శ్వాహితుడు; శ్వాహితునకు భేరుశేకుడు; భేరుశేకునకు చిత్రరథుడు; చిత్రరథునకు శశిబిందుడు పుట్టాడు.