పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ద్రుహ్యానుతుర్వసులవంశము

  •  
  •  
  •  

9-699-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లతిరథునకుఁ గానీనుండైన కర్ణుండు కొడుకయ్యె; కర్ణునకు వృషసేనుండు పుట్టె; నయ్యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు నారబ్దుండు, నారబ్ధునకు గాంధారుండు, గాంధారునకు ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్మదుండు, దుర్మదునకుఁ బ్రచేతసుండు, బ్రచేతసునకు నూర్గురు పుట్టి, మ్లేచ్ఛాధిపతులయి, యుదగ్దిశ నాశ్రయించిరి; తుర్వసునకు వహ్ని, వహ్నికి భర్గుండు, భర్గునకు భానుమంతుండు, భానుమంతునకుఁ ద్రిసానువు, ద్రిసానువునకుఁ గరంధముండును, గరంధమునకు మరుత్తుండు, నతనికి యయాతిశాపంబున సంతతి లేదయ్యె; వినుము.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అతిరథున్ = అతిరథున; కున్ = కు; కానీనుండు = కన్యకుపుట్టినవాడు; ఐన = అయిన; కర్ణుండు = కర్ణుడు; కొడుకున్ = పుత్రుడు; అయ్యెన్ = అయ్యెను; కర్ణున్ = కర్ణున; కున్ = కు; వృషసేనుండున్ = వృషసేనుడు; పుట్టెన్ = జన్మించెను; ఆ = ఆ; యయాతి = యయాతి; కొడుకు = పుత్రుడు; ఐన = అయినట్టి; ద్రుహ్యున్ = ద్రుహ్యున; కున్ = కు; బభ్రుసేతువున్ = బభ్రుసేతువు; బభ్రుసేతువున్ = బభ్రుసేతువున; కున్ = కు; ఆరబ్దుండున్ = ఆరబ్దుడు; ఆరబ్ధున్ = ఆరబ్ధున; కున్ = కు; గాంధారుండున్ = గాంధారుడు; గాంధారున్ = గాంధారున; కున్ = కు; ఘర్ముండున్ = ఘర్ముడు; ఘర్మున్ = ఘర్మున; కున్ = కు; ఘృతుండున్ = ఘృతుడు; ఘృతున్ = ఘృతున; కున్ = కు; దుర్మదుండున్ = దుర్మదుడు; దుర్మదున్ = దుర్మదున; కున్ = కు; ప్రచేతసుండున్ = ప్రచేతసుడు; ప్రచేతసున = ప్రచేతసున; కున్ = కు; నూర్గురు = వందమంది (100); పుట్టి = జనించి; మ్లేచ్ఛ = మ్లేచ్ఛదేశములకు; అధిపతులు = రాజులు; అయి = అయ్యి; ఉదగ్దిశ = ఉత్తరదిక్కుప్రాంతమును; ఆశ్రయించిరి = పాలించిరి; తుర్వసున్ = తుర్వసున; కున్ = కు; వహ్ని = వహ్ని; వహ్ని = వహ్ని; కిన్ = కి; భర్గుండున్ = భర్గుడు; భర్గున్ = భర్గున; కున్ = కు; భానుమంతుండు = భానుమంతుడు; భానుమంతున్ = భానుమంతున; కున్ = కు; త్రిసానువు = త్రిసానువు; త్రిసానువున్ = త్రిసానువున; కున్ = కు; కరంధముండును = కరంధముడు; కరంధమున్ = కరంధమున; కున్ = కు; మరుత్తుండున్ = మరుత్తుడు; అతని = అతని; కిన్ = కి; యయాతి = యయాతి యొక్క; శాపంబునన్ = శాపమువలన; సంతతి = సంతానము; లేదయ్యెన్ = కలుగలేదు; వినుము = వినుము.

భావము:

కన్యకుపుట్టినవాడైన కర్ణుడు ఈ విధంగా అతిరథుని కుమారుడు అయ్యాడు. కర్ణునకు వృషసేనుడు జన్మించాడు. ఆ యయాతి పుత్రుడు ద్రుహ్యునకు బభ్రుసేతువు; బభ్రుసేతువునకు ఆరబ్ధుడు; ఆరబ్ధునకు గాంధారుడు; గాంధారునకు ఘర్ముడు; ఘర్మునకు ఘృతుడు; ఘృతునకు దుర్మదుడు; దుర్మదునకు ప్రచేతసుడు; ప్రచేతసునకు వందమంది పుత్రులు పుట్టి మ్లేచ్ఛదేశాలకు రాజులై ఉత్తరదిక్కు ప్రాంతాలను పాలించారు. తుర్వసునకు వహ్ని; వహ్నికి భర్గుడు; భర్గునకు భానుమంతుడు; భానుమంతునకు త్రిసానువు; త్రిసానువునకు కరంధముడు; కరంధమునకు మరుత్తుడు; అతనికి యయాతి శాపం వలన సంతానం కలుగలేదు. వినుము.