నవమ స్కంధము : పాండవ కౌరవుల కథ
- ఉపకరణాలు:
నీవు తక్షకాహి నిహతుండ వని విని
సకలసర్పలోక సంహృతముగ
సర్పయాగ మింక జనమేజయుఁడు చేయఁ
గలఁడు పూర్వరోషకలితుఁ డగుచు.
టీకా:
నీవున్ = నీవు; తక్షక = తక్షకుడు అనెడి; అహి = సర్పమువలన; నిహతుండవు = మరణించినవాడవు; అని = అని; విని = విని; సకల = సమస్తమైన; సర్ప = సర్పముల; లోక = సమూహము; సంహృతముగన్ = భస్మమగునట్లుగ; సర్పయాగము = సర్పయాగమును; ఇంకన్ = ఇకపైన; జనమేజయుడు = జనమేయుడు; చేయగలడు = చేయబోవుచున్నాడు; పూర్వ = పాత; రోష = పగ; కలితుండు = కలవాడు; అగుచున్ = ఔతు.
భావము:
నీవు తక్షకుడు అనే పాము కాటు వలన మరణిస్తావు. ఆ సంగతి వినిన నీ కుమారుడు జనమేయుడు పగబట్టి, పాములు అన్నీ భస్మమయ్యేలా సర్పయాగం చేస్తాడు.