పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పాండవ కౌరవుల కథ

  •  
  •  
  •  

9-671-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ విచిత్రవీర్యునికిఁ గాశిరాజుకూఁతుల, నంబికాంబాలికల భీష్ముండు బలాత్కారంబున దెచ్చి వివాహంబు చేసిన విచిత్రవీర్యుండు వారలం దగిలి మనోజరాగమత్తుండై, చిరకాలంబు నానావిధక్రీడల విహరించుచు, రాజయక్ష్మ పీడితుండై, మృతుం డయ్యె; నంత.

టీకా:

ఆ = ఆ; విచిత్రవీర్యుని = విచిత్రవీర్యుని; కిన్ = కి; కాశిరాజు = కాశిరాజు; కూతులన్ = పుత్రికలను; అంబిక = అంబిక; అంబాలికలన్ = అంబాలికలను; భీష్ముండు = భీష్ముడు; బలాత్కారంబునన్ = బలవంతముగా; తెచ్చి = తీసుకొని వచ్చి; వివాహంబున్ = పెండ్లి; చేసినన్ = చేయగా; విచిత్రవీర్యుండు = విచిత్రవీర్యుడు; వారలన్ = వారిని; తగిలి = మరిగి; మనోజ = మదన; రాగ = భావములతో; మత్తుండు = మత్తెక్కినవాడు; ఐ = అయ్యి; చిరకాలంబున్ = చాలా రోజులు; నానావిధ = రకరకముల; క్రీడలన్ = క్రీడలతో; విహరించుచున్ = తిరుగుతు; రాజయక్ష్మ = క్షయరోగ; పీడితుండు = బాధితుడు; ఐ = అయ్యి; మృతుండు = మరణించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన = అంతట.

భావము:

ఆ విచిత్రవీర్యునికి కాశిరాజు పుత్రికలను అంబిక అంబాలికలను భీష్ముడు బలవంతంగా తీసుకొని వచ్చి పెండ్లి చేసాడు. విచిత్రవీర్యుడు వారిని మరిగి కామాకుల చిత్తుడు అయ్యాడు. చాలా కాలం వారితో రకరకాల క్రీడలతో తిరిగాడు. చివరికి క్షయరోగంతో మరణించాడు. అంతట.

9-672-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అని సతులవలన సుతుల
సు! కను" మని తల్లి పనుప సొరిదిం గనియెన్
ధృరాష్ట్ర పాండు విదురుల
నుచరితుఁడు బాదరాయణుండు నరేంద్రా!

టీకా:

అతని = అతని; సతుల = భార్యల; వలనన్ = అందు; సుతులన్ = పుత్రులను; సుత = కొడుకా; కనుము = పుట్టించుము; అని = అని; తల్లి = తల్లి; పనుపన్ = ఆజ్ఞాపించగా; సొరిదిన్ = వరుసగా; కనియెన్ = పుట్టించెను; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు; పాండు = పాండుడు; విదురులన్ = విదురుడులను; నుత = స్తుతింపబడెడి; చరితుడు = వర్తనకలవాడు; బాదరాయణుండు = వ్యాసమహర్షి; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! తల్లి సత్యవతీదేవి వ్యాసుని పిలిచి “కొడుకా! విచిత్రవీర్యుని భార్యల అందు పుత్రులను పుట్టించు” అని ఆజ్ఞాపించింది. ఆ ప్రకారం సచ్చరిత్రుడైన వ్యాసుడు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని వరుసగా పుట్టించాడు.

9-673-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత, ధృతరాష్ట్రునికి గాంధారి యందు దుర్యోధనాదులగు కొడుకులు నూర్వురును, దుశ్శలయను కన్యకయును జన్మించిరి; మృగశాప భయంబునం జేసి, భార్యలం బొంద వెఱచిన పాండునకుఁ గుంతీదేవియందు ధర్మానిలేంద్రుల ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జునులను మువ్వురును, మాద్రిదేవివలన నాసత్యప్రసాదంబున నకుల సహదేవులను వారిద్ధఱునుగా నేవురు పుట్టి; రయ్యేవురకును ద్రుపదరాజపుత్రి యైన ద్రౌపది యందుఁ గ్రమంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసేనుండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతకర్ముండును నన నేవురు పుట్టిరి; మఱియు యుధిష్ఠిరునకుఁ బౌరవతి యందు దేవకుండును, భీమసేనునికి హిడింబయందు ఘటోత్కచుండును, గాళి యందు సర్వగతుండును, సహదేవునికి విజయ యందు సుహ్రోత్రుండును, నకులునకు రేణుమతి యందు నిరమిత్రుండును, నర్జునునకు నులూపి యను నాగకన్యక యందు నిలావంతుండును, మణలూరుపతిపుత్రి యయిన చిత్రాంగద యందు బబ్రువాహనుండును, సుభద్రయందు శౌర్యధైర్య తేజోవిభవంబుల నఖిలరాజనికరంబునం బ్రఖ్యాతుండైన యభిమన్యుండును జన్మించి; రందు బబ్రువాహనుం డర్జునునియోగంబున మాతామహుని గోత్రంబునకు వంశకర్త యయ్యె.

టీకా:

అంతన్ = అంతట; ధృతరాష్ట్రుని = ధృతరాష్ట్రుని; కిన్ = కి; గాంధారి = గాంధారి; అందున్ = వలన; దుర్యోధన = దుర్యాధనుడు; ఆదులు = మున్నగువారు; అగు = అయిన; కొడుకులు = పుత్రులను; నూర్వురునున్ = వందమంది (100); దుశ్శల = దుశ్శల; అను = అనెడి; కన్యకయును = ఆడపిల్ల; జన్మించిరి = పుట్టిరి; మృగ = లేడిరూపముని పెట్టిన; శాప = శాపము యొక్క; భయంబునన్ = భయము; జేసి = వలన; భార్యలన్ = భార్యలను; పొందన్ = కవియుటకు; వెఱచిన = బెదరినట్టి; పాండున్ = పాండురాజున; కున్ = కు; కుంతీదేవి = కుంతీదేవి; అందున్ = ఎడల; ధర్మ = యమధర్మరాజు; అనిల = వాయుదేవుని; ఇంద్రుల = ఇంద్రుడుల యొక్క; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; యుధిష్ఠిర = యుధిష్ఠరుడు; భీమ = భీముడు; అర్జునులు = అర్జునుడులు; అను = అనెడి; మువ్వురును = ముగ్గురు; మాద్రిదేవి = మాద్రిదేవి; వలనన్ = ఎడల; నాసత్య = అశ్వనీదేవతల; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; నకుల = నకులుడు; సహదేవులనున్ = సహదేవులను; వారిన్ = వారని; ఇద్ధఱును = ఇద్దరును; కాన్ = అయ్యి; ఏవురు = ఐదుగురు; పుట్టిరి = జన్మించిరి; ఏవురు = ఐదుగుర; కున్ = కు; ద్రుపద = ద్రుపద; రాజ = రాజు యొక్క; పుత్రి = కుమార్తి; ఐన = అయిన; ద్రౌపది = ద్రౌపది; అందున్ = వలన; క్రమంబునన్ = వరుసగా; ప్రతివింధ్యుడును = ప్రతివింధ్యుడును; శ్రుతసేనుండును = శ్రుతసేనుడు; శ్రుతకీర్తియున్ = శ్రుతకీర్తి; శతానీకుండును = శతానీకుడు; శ్రుతకర్ముండునున్ = శ్రుతకర్ముండును; అను = అనెడి; ఏవురు = ఐదుగురు; పుట్టిరి = జనించిరి; మఱియునున్ = ఇంకను; యుధిష్ఠరున్ = యుధిష్ఠరున; కున్ = కు; పౌరవతి = పౌరవతి; అందున్ = వలన; దేవకుండును = దేవకుడు; భీమసేనుని = భీమసేనుని; కిన్ = కి; హిడింబి = హిడింబి; అందున్ = వలన; ఘటోత్కచుండును = ఘటోత్కచుడు; కాళి = కాళి; అందున్ = వలన; సర్వగతుండును = సర్వగతుడు; సహదేవుని = సహదేవుని; కిన్ = కి; విజయ = విజయ; అందున్ = వలన; సుహోత్రుండును = సుహోత్రుడును; నకులున్ = నకులున; కు = కు; రేణుమతి = రేణుమతి; అందున్ = వలన; నిరమిత్రుండునున్ = నిరమిత్రుడు; అర్జునున్ = అర్జునున; కున్ = కు; ఉలూపి = ఉలూపి; అను = అనెడి; నాగకన్యక = నాగవంశపుస్త్రీ; అందున్ = వలన; ఇలావంతుడును = ఇలావంతుడు; మణలూరు = మణిపురము; పతి = రాజు యొక్క; పుత్రి = కుమార్తె; అయిన = ఐన; చిత్రాంగద = చిత్రాంగద; అందున్ = వలన; బబ్రువాహనుండును = బబ్రువాహనుడు; సుభద్ర = సుభద్ర; అందున్ = వలన; శౌర్య = పరాక్రమము; ధైర్య = ధైర్యము; తేజస్ = తేజస్సు; విభవంబులన్ = వైభవములతో; అఖిల = సమస్తమైన; రాజ = రాజుల; నికరంబునన్ = సమూహమునందు; ప్రఖ్యాతుండు = ప్రసిద్ధుడు; ఐన = అయినట్టి; అభిమన్యుండును = అభిమన్యుడు; జన్మించిరి = పుట్టరి; అందున్ = వారిలో; బబ్రువాహనుండున్ = బబ్రువాహనుడు; అర్జునున్ = అర్జుని యొక్క; నియోగంబునన్ = పనుపు ప్రకారము; మాతామహుని = తాత (తల్లికితండ్రి) యొక్క; గోత్రంబున్ = వంశమున; కున్ = కు; వంశకర్త = వంశమునునిలబెట్టువాడు; అయ్యె = అయ్యెను.

భావము:

అంతట, ధృతరాష్ట్రునికి గాంధారి వలన దుర్యాధనాదులు వందమంది పుత్రులు, దుశ్శల అను పుత్రిక పుట్టారు. లేడి రూపంలో ఉన్న ముని పెట్టిన శాప భయం వలన భార్యలను కవియుటకు బెదరిన పాండురాజునకు కుంతీదేవి ఎడల యమధర్మరాజు అనుగ్రహంతో యుధిష్ఠరుడు; వాయుదేవుని అనుగ్రహంతో భీముడు ; ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అనె ముగ్గురు కుమారులు; మాద్రిదేవి ఎడల అశ్వనీదేవతల అనుగ్రహం వలన నకులుడు, సహదేవుడు అని ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు కలిగారు. ఆ ఐదుగురకు ద్రుపద రాజు కూతురు ద్రౌపది వలన వరుసగా ప్రతివింధ్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతకర్ముడు అని ఐదుగురు పుట్టి ఉపపాండవులు అని పేరుపొందారు. ఇంకా, యుధిష్ఠిరునకు పౌరవతి వలన దేవకుడు; భీమసేనునికి హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు; సహదేవునికి విజయ వలన సుహోత్రుడు, నకులునకు రేణుమతి వలన నిరమిత్రుడు; అర్జునునకు ఉలూపి అనే నాగకన్య వలన ఇలావంతుడు, మణిపుర రాజు కుమార్తె చిత్రాంగద వలన బబ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు పుట్టాడు. ఆ అభిమన్యుడు మిక్కిలి పరాక్రమం, ధైర్యం, తేజస్సు, వైభవాలతో సకల రాజులలో ప్రసిద్ధుడు అయ్యాడు. వారిలో బబ్రువాహనుడు అర్జునుని ఆనతి మేర తన మాతామహుని చేరి వారి వంశం నిలబెట్టాడు.

9-674-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యసుపూజ్య! నీ జనకుఁడై యభిమన్యుఁడు; భూవరేంద్రమూ
ర్ధన్యుఁడు; ధన్యమార్గణ కదంబవిదారితవైరివీర రా
న్యుఁడు; జన్యభీత గురుసైన్యుఁడు; సైన్యసమూహనాథదృ
ఙ్మాన్యుఁడు; మాన్యకీర్తి; మహిమం దనరెం గురువంశకర్త యై.

టీకా:

అన్యసుపూజ్య = శత్రులచే కీర్తింపబడువాడ; నీ = నీ యొక్క; జనకుడు = తండ్రి; ఐ = అయ్యి; అభిమన్యుడు = అభిమన్యుడు; భూవరేంద్రా = రాజులచే; మూర్ధన్యుడు = ముఖ్యుడు; ధన్య = దివ్యమైన; మార్గణ = బాణముల; కదంబ = సమూహములతో; విదారిత = చీల్చిచెండాడబడిన; వైరి = శత్రు; రాజన్యుడున్ = రాజోత్తములు కలవాడు; జన్య = కలిగిన; భీత = భయపడిన; కురు = కౌరవ; సైన్యుడు = సైన్యము కలవాడు; సైన్యసమూహనాథ = గొప్ప సేనానాయకుల; దృక్ = దృష్టిలో; మాన్యుడు = గౌరవింపదగినవాడు; మాన్యకీర్తి = గొప్పకీర్తికలవాడు; మహిమన్ = వైభవముతో; తనరెన్ = అతిశయించెను; కురు = కౌరవ; వంశకర్త = వంశమును నిలబెట్టువాడు; ఐ = అయ్యి.

భావము:

శత్రులు సైతం గౌరవించే పరీక్షిత్తూ! నీ తండ్రి అభిమన్యుడు గొప్ప క్షత్రియోత్తముడు, దివ్యమైన శరపరంపరలతో శత్రురాజులను చీల్చిచెండాడు. యుద్ధంలో శత్రువులైన కౌరవ సైన్యాలను భయ కంపితులను చేసాడు. శత్రు సేనానాయకులచే గౌరవం పొందేవాడు. గొప్ప కీర్తి కలవాడు. కౌరవ వంశాన్ని నిలబెట్టాడు.

9-675-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ అభిమన్యునకు నుత్తర యందు నీవు జన్మించితివి.

టీకా:

ఆ = ఆ; అభిమన్యున్ = అభిమన్యున; కున్ = కు; ఉత్తర = ఉత్తర; అందున్ = వలన; నీవున్ = నీవు; జన్మించితివి = పుట్టితివి .

భావము:

ఆ అభిమన్యునకు ఉత్తర వలన పరీక్షిత్తూ! నీవు పుట్టావు.

9-676-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్రోసుతు తూపువేఁడిమి
బ్రాణంబులఁ బాసి హరికృపాదర్శన సం
త్రాణంబున బ్రతికితికా
క్షోణీశ్వర! మున్ను నీ శిశుత్వమువేళన్.

టీకా:

ద్రోణసుతు = అశ్వత్థామ యొక్క; తూపు = బాణపు; వేడిమిన్ = అగ్నికి; ప్రాణంబులన్ = జీవములు; పాసి = పోయి; హరి = విష్ణుమూర్తి యొక్క; కృపా = కరుణా; దర్శన = కటాక్షములచే; సంత్రాణంబునన్ = చక్కగా కాపాడబడుటచే; బ్రతికితికా = జీవించితివిగదా; క్షోణీశ్వర = రాజ; మున్ను = ఇంతకు ముందు; నీ = నీ యొక్క; శిశుత్వము = గర్భస్థశిశువుగా నున్న; వేళన్ = సమయము నందు.

భావము:

మహారాజా! ఇంతకు ముందు నీవు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, అశ్వత్థామ బాణాగ్నికి పోతున్న నీ ప్రాణాలు విష్ణుమూర్తి కరుణా కటాక్షములతో తిరిగి వచ్చి, బ్రతికావు కదా.

9-677-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కుమారులు జనమేజయ, శ్రుతసేన, భీమసే, నోగ్రసేను లను నల్వురు వీరల యందు.

టీకా:

నీ = నీ; కుమారులు = పుత్రులు; జనమేజయ = జనమేజయుడు; శ్రుతసేన = శ్రుతసేనుడు; భీమసేన = భీమసేనుడు; ఉగ్రసేనులు = ఉగ్రసేనుడు; అను = అనెడి; నల్వురున్ = నలుగురు (4); వీరల = వీరి; అందు = లో .

భావము:

నీ కొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అని నలుగురు. వీరిలో.

9-678-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవు తక్షకాహి నిహతుండ వని విని
కలసర్పలోక సంహృతముగ
ర్పయాగ మింక నమేజయుఁడు చేయఁ
లఁడు పూర్వరోషలితుఁ డగుచు.

టీకా:

నీవున్ = నీవు; తక్షక = తక్షకుడు అనెడి; అహి = సర్పమువలన; నిహతుండవు = మరణించినవాడవు; అని = అని; విని = విని; సకల = సమస్తమైన; సర్ప = సర్పముల; లోక = సమూహము; సంహృతముగన్ = భస్మమగునట్లుగ; సర్పయాగము = సర్పయాగమును; ఇంకన్ = ఇకపైన; జనమేజయుడు = జనమేయుడు; చేయగలడు = చేయబోవుచున్నాడు; పూర్వ = పాత; రోష = పగ; కలితుండు = కలవాడు; అగుచున్ = ఔతు.

భావము:

నీవు తక్షకుడు అనే పాము కాటు వలన మరణిస్తావు. ఆ సంగతి వినిన నీ కుమారుడు జనమేయుడు పగబట్టి, పాములు అన్నీ భస్మమయ్యేలా సర్పయాగం చేస్తాడు.

9-679-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నతండు సర్వధరణీమండలంబును జయించి, కావషేయుండు పురోహితుండుగా నశ్వమేధంబు చేయంగలవాఁడు. వానికి శతానీకుండు జనియించి, యాజ్ఞవల్క్యునితోడ వేదంబులు పఠించి, కృపాచార్యునివలన విలువిద్యనేర్చి, శౌనకునివలన నాత్మజ్ఞానంబు బడయఁగలవాఁ; డా శతానీకునికి సహస్రానీకుండు వానికి నశ్వమేధజుం, డశ్వమేధజునికి నాసీమకృష్ణుం; డాసీమకృష్ణునకు నిచకుం; డా నిచకుండు గజాహ్వయంబు నదిచే హృతంబుగాఁ, గౌశంబి యందు వసియించు; నాతనికి నుప్తుం; డుప్తునికిఁ జిత్రరథుండు, చిత్రరథునకు శుచిరథుండు, శుచిరథునికి వృష్టిమంతుండు, వృష్టిమంతునికి సుషేణుండు, సుషేణునికి సుపీతుండు, సుపీతునికి నృచక్షువు, నృచక్షువునకు సుఖానిలుండు, సుఖానిలునికిఁ బరిప్లవుండు, బరిప్లవునకు మేధావి, మేధావికి సునయుండు, సునయునికి నృపంజయుండు, నృపంజయునికి దూర్వుండు, దూర్వునికి నిమి, నిమికి బృహద్రథుండు, బృహద్రథునకు సుదాసుండు, సుదాసునికి శతానీకుండు, శతానీకునకు దుర్దమనుండు, దుర్దమనునికి విహీనరుండు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుండు, మితునకు క్షేమకుండు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు; వాఁడు నిర్వంశుండై, దేవర్షి సత్కృతుండై, కలియుగంబు నందు జనంగలవాఁడు.

టీకా:

మఱియున్ = ఇంకను; అతండు = అతను; సర్వ = సమస్తమైన; ధరణీమండలంబును = భూచక్రమును; జయించి = గెలిచి; కావషేయుండు = కావషేయుడు; పురోహితుండు = పురోహితునిగా; అశ్వమేధంబున్ = అశ్వమేధయాగమును; చేయంగలవాడు = చేయును; వాని = అతని; కిన్ = కి; శతానీకుండున్ = శతానీకుడు; జనియించి = పుట్టి; యాజ్ఞవల్క్యుని = యాజ్ఞవల్కుని; తోడన్ = తోటి; వేదంబులున్ = వేదములను; పఠించి = చదివి; కృపాచార్యుని = కృపాచార్యుని; వలనన్ = వద్ద; విలువిద్యన్ = విలువిద్యను; నేర్చి = నేర్చుకొని; శౌనకుని = శౌనకుని; వలనన్ = వద్ద; ఆత్మజ్ఞానంబు = ఆత్మజ్ఞానమును; పడయగలవాడు = పొందును; ఆ = ఆ; శతానీకుని = శతానీకుని; కిన్ = కి; సహస్రానీకుండు = సహస్రానీకుడు; వాని = అతని; కిన్ = కి; అశ్వమేధజుండున్ = అశ్వమేధజుడు; అశ్వమేధజుని = అశ్వమేధజుని; కిన్ = కి; ఆసీమకృష్ణుండు = ఆసీమకృష్ణుడు; ఆసీమకృష్ణున్ = ఆసీమకృష్ణున; కున్ = కు; నిచకుండు = నిచకుడు; ఆ = ఆ; నిచకుండు = నిచకుడు; గజాహ్వయంబున్ = హస్తినాపురము; నది = గంగానది; చేన్ = చేత; హృతంబు = కొట్టుకుపోయినది; కాన్ = కాగా; కౌశంబి = కౌశంబి; అందున్ = లో; వసియించున్ = నివసించును; ఆతని = అతని; కిన్ = కి; ఉప్తుండున = ఉప్తుడు; ఉప్తుని = ఉప్తుని; కిన్ = కి; చిత్రరథుండు = చిత్రరథుడు; చిత్రరథున = చిత్రరథున; కున్ = కి; శుచిరథుండు = శుచిరథుడు; శుచిరథుని = శుచిరథుని; కిన్ = కి; వృష్టిమంతుండున్ = వృష్టిమంతుడు; వృష్టిమంతుని = వృష్టిమంతుని; కిన్ = కి; సుషేణుండున్ = సుషేణుడు; సుషేణుని = సుషేణుని; కిన్ = కి; సుపీతుండున్ = సుపీతుడు; సుపీతుని = సుపీతుని; కిన్ = కి; నృచక్షువు = నృచక్షువు; నృచక్షువున్ = నృచక్షున; కున్ = కు; సుఖానిలుండున్ = సుఖానిలుడు; సుఖానిలుని = సుఖానిలుని; కిన్ = కి; పరిప్లవుండున్ = పరిప్లవుడు; పరిప్లవున్ = పరిప్లవున; కున్ = కు; మేధావి = మేధావి; మేధావి = మేధావి; కిన్ = కి; సునయుండున్ = సునయుడు; సునయుని = సునయుని; కిన్ = కి; నృపజయుండున్ = నృపజయుండు; నృపజయుని = నృపజయుని; కిన్ = కి; దూర్వుండు = దూర్వుడు; దూర్వుని = దూర్వుని; కిన్ = కి; నిమి = నిమి; నిమి = నిమి; కిన్ = కి; బృహద్రథుండున్ = బృహద్రథుడు; బృహద్రథున్ = బృహద్రథున; కున్ = కు; సుదాసుండున్ = సుదాసుడు; సుదాసుని = సుదాసును; కిన్ = కి; శతానీకుండు = శతానీకుడు; శతానీకున్ = శతానీకుని; కున్ = కు; దుర్దమనుండు = దుర్దమనుడు; దుర్దమనుని = దుర్దమనుని; కిన్ = కి; విహీనరుండున్ = విహీనరుడు; విహీనరుని = విహీనరుని; కిన్ = కి; దండపాణి = దండపాణి; దండపాణి = దండపాణి; కిన్ = కి; మితుండు = మితుడు; మితున్ = మితున; కున్ = కు; క్షేమకుండు = క్షేమకుడు; క్షేమకున్ = క్షేమకున; కున్ = కు; బ్రహ్మక్షత్రుండు = బ్రహ్మక్షత్రుడు; వాడు = అతను; నిర్వంశుండు = సంతతిలేనివాడు; ఐ = అయ్యి; దేవ = దేవతలచేత; ఋషి = మునులచేత; సత్కృతుండు = గౌరవింపబడినవాడు; ఐ = అయ్యి; కలియుగంబునన్ = కలియుగము; అందున్ = లో; చనంగలవాడు = విలసిల్లుతాడు.

భావము:

ఇంకా జనమేజయుడు సమస్త భూమండలం జయించి కావషేయుడిని పురోహితునిగా పెట్టుకుని అశ్వమేధయాగం చేస్తాడు. అతనికి శతానీకుడు పుట్టి యాజ్ఞవల్కుని దగ్గర వేదాలను చదివి, కృపాచార్యుని వద్ద విలువిద్యను నేర్చుకొని, శౌనకుని వద్ద ఆత్మజ్ఞానం పొందుతాడు. ఆ శతానీకునికి సహస్రానీకుడు; అతనికి అశ్వమేధజుడు; అశ్వమేధజునికి ఆసీమకృష్ణుడు; ఆసీమకృష్ణునకు నిచకుడు పుడతారు; ఆ నిచకుడు హస్తినాపురం గంగానది చేత కొట్టుకుపోడంతో కౌశంబినగరంలో నివసిస్తాడు. అతనికి ఉప్తుడు; ఉప్తునికి చిత్రరథుడు; చిత్రరథునికి శుచిరథుడు; శుచిరథునికి వృష్టిమంతుడు; వృష్టిమంతునికి సుషేణుడు; సుషేణునికి సుపీతుడు; సుపీతునికి నృచక్షువు; నృచక్షునకు సుఖానిలుడు; సుఖానిలునికి పరిప్లవుడు; పరిప్లవునకు మేధావి; మేధావికి సునయుడు; సునయునికి నృపజయుడు; నృపజయునికి దూర్వుడు; దూర్వునికి నిమి; నిమికి బృహద్రథుడు; బృహద్రథునకు సుదాసుడు; సుదాసునికి శతానీకుడు; శతానీకునికి దుర్దమనుడు; దుర్దమనునికి విహీనరుడు; విహీనరునికి దండపాణి; దండపాణికి మితుడు; మితునకు క్షేమకుడు; క్షేమకునకు బ్రహ్మక్షత్రుడు పుడతారు; అతను నిస్సంతైనా, దేవతలచేత మునులచేత గౌరవింపబడి కలియుగంలో విలసిల్లుతాడు.

9-680-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి నిటమీఁదఁ బుట్టెడు
ధాధీశ్వరుల నిఖిలనుజేశ్వరులన్
నిమాంతవిదులఁ జెప్పెద
సుగుణాలంకార! ధీర! సుభగవిచారా!

టీకా:

జగతిన్ = భూలోకమునన్; ఇట = ఇక; మీదన్ = పై; పుట్టెడు = పుట్టబోయెడి; మగధ = మగధదేశపు; అధీశ్వరుల = ప్రభువులను; నిఖిల = అందరు; మనుజేశ్వరులన్ = రాజులను; నిగమాంత = వేదాంత; విదులన్ = జ్ఞానులను; చెప్పెదన్ = తెలిపెదను; సుగుణ = సుగుణములను; అలంకార = అలంకారములు గలవాడ; ధీర = ధీరుడ; సుభగవిచారా = పుణ్యవంతుడా.

భావము:

మహాధీరుడా! పుణ్యవంతుడా! సుగుణాలు అలంకారంగా కలవాడ! పరీక్షిత్తూ! భూలోకంలో ఇక పై పుట్టబోయె మగధదేశపు ప్రభువులను వేదాంత వేత్తలైన రాజులను గురించి చెప్తాను.

9-681-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జరాసంధపుత్రుండయిన సహదేవునికి మార్జాలి, మార్జాలికి శ్రుతశ్రవుండు, శ్రుతశ్రవునకు నయుతాయువు, నయుతాయువునకు నిరమిత్రుండు, నిరమిత్రునకు సునక్షత్రుండు, సునక్షత్రునికి బృహత్సేనుండు, బృహత్సేనునికిఁ గర్మజిత్తు, గర్మజిత్తునకు శ్రుతంజయుండు, శ్రుతంజయునకు విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకు శ్రుతుండు, శ్రుతునకు దృఢసేనుండు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకుఁ బురంజయుండును జన్మించెద” రని చెప్పి మఱియు నిట్లనియె.

టీకా:

జరాసంధ = జరాసంధుని; పుత్రుండు = కుమారుడు; అయిన = ఐన; సహదేవుని = సహదేవుని; కిన్ = కి; మార్జాలి = మార్జాలి; మార్జాలి = మార్జాలి; కిన్ = కి; శ్రుతశ్రవుండు = శ్రుతశ్రవుడు; శ్రుతశ్రవున్ = శ్రుతశ్రవున; కున్ = కు; అయుతాయువు = అయుతాయువు; అయుతాయున్ = అయుతాయువున; కున్ = కు; నిరమిత్రుండున్ = నిరమిత్రుడు; నిరమిత్రున్ = నిరమిత్రున; కున్ = కు; సునక్షత్రుండు = సునక్షత్రుడు; సునక్షత్రుని = సునక్షత్రుని; కిన్ = కి; బృహత్సేనుండున్ = బృహత్సేనుడు; బృహత్సేనుని = బృహత్సేనుని; కిన్ = కి; కర్మజిత్తున్ = కర్మజిత్తు; కర్మజిత్తున్ = కర్మజిత్తున; కున్ = కు; శ్రుతంజయుండున్ = శ్రుతంజయుడు; శ్రుతంజయున్ = శ్రుంతంజయున; కున్ = కు; విప్రుండు = విప్రుడు; విప్రున్ = విప్రున; కున్ = కు; శుచి = శుచి; శుచి = శుచి; కిన్ = కి; క్షేముండున్ = క్షేముడు; క్షేముని = క్షేముని; కిన్ = కి; సువ్రతుండు = సువ్రతుడు; సువ్రతున్ = సువ్రతున; కున్ = కు; ధర్మనేత్రుండు = ధర్మనేత్రుడు; ధర్మనేత్రున్ = ధర్మనేత్రున; కున్ = కు; శ్రుతుండున్ = శ్రుతుడు; శ్రుతున్ = శ్రుతున; కున్ = కు; దృఢసేనుండు = దృఢసేనుడు; దృఢసేనుని = దృఢసేనుని; కిన్ = కి; సుమతి = సుమతి; సుమతి = సుమతి; కిన్ = కి; సుబలుండు = సుబలుడు; సుబలున్ = సుబలున; కున్ = కు; సునీతుండున్ = సునీతుడు; సునీతున్ = సునీతున; కున్ = కు; సత్యజిత్తు = సత్యజిత్తు; సత్యజిత్తు = సత్యజిత్తున; కున్ = కు; విశ్వజిత్తున్ = విశ్వజిత్తు; విశ్వజిత్తున్ = విశ్వజిత్తున; కున్ = కు; పురంజయుండును = పురంజయుండు; జన్మించెదరు = పుట్టెదరు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

జరాసంధుని కుమారుడు సహదేవుడు; సహదేవునికి మార్జాలి; మార్జాలికి శ్రుతశ్రవుడు; శ్రుతశ్రవునకు అయుతాయువు; అయుతాయువునకు నిరమిత్రుడు; నిరమిత్రునకు సునక్షత్రుడు; సునక్షత్రునికి బృహత్సేనుడు; బృహత్సేనునికి కర్మజిత్తు; కర్మజిత్తునకు శ్రుతంజయుడు; శ్రుతంజయునకు విప్రుడు; విప్రునకు శుచి; శుచికి క్షేముడు; క్షేమునికి సువ్రతుడు; సువ్రతునకు ధర్మనేత్రుడు; ధర్మనేత్రునకు శ్రుతుడు; శ్రుతునకు దృఢసేనుడు; దృఢసేనునికి సుమతి; సుమతికి సుబలుడు; సుబలునకు సునీతుడు; సునీతునకు సత్యజిత్తు; సత్యజిత్తునకు విశ్వజిత్తు; విశ్వజిత్తునకు పురంజయుడు పుట్టెదరు.” అని చెప్పి పిమ్మట ఇలా అన్నాడు.

9-682-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము; మగధదేశవిభులు జరాసంధ
ప్రముఖ ధరణిపతులు ప్రబలయశులు
వీరు కలియుగమున వేయేండ్ల లోపలఁ
బుట్టి గిట్టఁగలరు భూవరేంద్ర!

టీకా:

వినుము = వినుము; మగధ = మగధ అనెడి; దేశ = దేశమునకు; విభులు = రాజులు; జరాసంధ = జరాసంథుడు; ప్రముఖ = మున్నగు; ధరణీపతులున్ = రాజులను; ప్రబల = మిక్కిలి; యశులు = కీర్తిమంతులు; వీరున్ = వీరు; కలియుగమునన్ = కలియుగమునందు; వేయి = వెయ్యి (1000); ఏండ్లు = సంవత్సరముల; లోపలన్ = లోగానే; పుట్టి = జనించి; గిట్టగలరు = నశించెదరు; భూవరేంద్రా = మహారాజా.

భావము:

“మహారాజా! విను. మగధ దేశరాజులు జరాసంథుడు మున్నగువారు మిక్కిలి కీర్తిమంతులు. వీరు కలియుగంలో వెయ్యి సంవత్సరముల లోగానే జనించి నశిస్తారు.

9-683-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యయాతికొడు కనువునకు సభానరుండుఁ, జక్షువుఁ, బరోక్షుండు నను వారు మువ్వురు పుట్టి; రందు సభానరునికిఁ గాలనాథుండు, గాలనాథునకు సృంజయుండు, సృంజయనకుఁ బురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మహామనసుండు, మహామనసునకు సుశీనరుండు తితిక్షువన నిరువురు జన్మించి; రందు సుశీనరునకు శిబి వన క్రిమి దర్పు లన నలువురు జన్మించి; రందు శిబికి వృషదర్ప సువీర మద్ర కేకయులు నలువురు పుట్టిరి; తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలియుఁ, బుట్టి; రా బలివలన నంగ వంగ కళింగ సింహ పుండ్రాంధ్రులను పేర్లుగలవా రార్వురు కుమారులు పుట్టిరి; వారలు దూర్పు దేశంబులకు రాజులయి దేశంబులకుఁ దమ తమ నామ ధేయంబు లిడి, యేలిరి; సువీరునకు సత్యరథుండు సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుఁడు, ధర్మరథునకుఁ జిత్రరథుండుఁ బుట్టి; రా చిత్రరథుండు రోమపాదుండు నాఁ బరఁగె.

టీకా:

యయాతి = యయాతి యొక్క; కొడుకు = పుత్రుడు; అనువున్ = అనువున; కున్ = కు; సభానరుండున్ = సభానరుడు; చక్షువున్ = చక్షువు; పరోక్షుండున్ = పరోక్షుడు; అను = అనెడి; వారు = వారు; మువ్వురు = ముగ్గురు (3); పుట్టిరి = జనించిరి; అందున్ = వారిలో; సభానరుని = సభానరుని; కాలనాథుండున్ = కాలనాథుడు; కాలనాథున్ = కాలనాథున; కున్ = కు; సృంజయుండున్ = సృంజయుడు; సృంజయున్ = సృంజయున; కున్ = కు; పురంజయుండున్ = పురంజయుడు; పురంజయున్ = పురంజయున; కున్ = కు; జనమేజయుండున్ = జనమేజయుడు; జనమేజయున్ = జనమేజయున; కున్ = కు; మహాశాలుండు = మహాశాలు; మహాశాలుని = మహాశాలుని; కిన్ = కి; మహామనసుండున్ = మహామనసుడు; మహామనసున్ = మహామనసున; కున్ = కు; సుశీనరుండున్ = సుశీనరుడు; తితిక్షువు = తితిక్షువు; అనన్ = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); జన్మించిరి = పుట్టరి; అందున్ = వారిలో; సుశీనరున్ = సుశీనరున; కున్ = కు; శిబి = శిబి; వన = వనుడు; క్రిమి = క్రిమి; దర్పులు = దర్పుడు; అననన్ = అనగా; నలువురు = నలుగురు (4); జన్మించిరి = పుట్టిరి; శిబి = శిబి; కిన్ = కి; వృషదర్ప = వృషదర్పుడు; సువీర = సువీరుడు; మద్ర = మద్రుడు; కేకయులున్ = కేకయుడు; నలువురు = నలుగురు (4); పుట్టిరి = జన్మించిరి; తితిక్షువున్ = తితిక్షువున; కున్ = కు; రుశద్రథుండు = రుశద్రథుడు; రుశద్రథున్ = రుశద్రథున; కున్ = కు; హేముండున్ = హేముండును; హేమున్ = హేమున; కున్ = కు; సుతపుండున్ = సుతపుడు; సుతపున్ = సుతపున; కున్ = కు; బలియుని = బలి; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; బలి = బలి; వలనన్ = వలన; అంగ = అంగుడు; వంగ = వంగుడు; కళింగ = కళింగుడు; సింహ = సింహుడు; పుండ్ర = పుండ్రుడు; ఆంధ్రులు = ఆంధ్రుడు; అను = అనెడి; పేర్లు = నామములు; కల = కలిగిన; వారు = వారు; ఆర్వురున్ = ఆరుగురు (6); కుమారులు = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; వారలు = వారు; తూర్పు = తూర్పు దిక్కునగల; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; రాజులు = రాజులు; అయి = ఐ; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; తమతమ = వారివారి; నామధేయంబులు = పేర్లు; ఇడి = పెట్టి; ఏలిరి = పరిపాలించిరి; సువీరున్ = సువీరున; కున్ = కు; సత్యరథుండున్ = సత్యరథుడు; సత్యరథుని = సత్యరథున; కిన్ = కు; దివిరథుండున్ = దివిరథుడు; దివిరథుని = దివిరథుని; కిన్ = కి; ధర్మరథుండున్ = ధర్మరథుడు; ధర్మరథున్ = ధర్మరథున; కున్ = కు; చిత్రరథుండున్ = చిత్రరథుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; చిత్రరథుండు = చిత్రరథుడు; రోమపాదుండున్ = రోమపాదుడు; నాన్ = అని; పరగె = ప్రసిద్ధుడాయెను.

భావము:

యయాతి కొడుకు అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అని ముగ్గురు పుట్టారు. వారిలో సభానరునికి కాలనాథుడు; కాలనాథునకు సృంజయుడు; సృంజయునకు పురంజయుడు; పురంజయునకు జనమేజయుడు; జనమేజయునకు మహాశాలుడు; మహాశాలునికి మహామనసుడు; మహామనసునకు సుశీనరుడు, తితిక్షువు అని ఇద్దరు పుట్టారు. వారిలో సుశీనరునకు శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అని నలుగురు కలిగారు. శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని నలుగురు జన్మించారు. తితిక్షువునకు రుశద్రథుడు; రుశద్రథునకు హేముండు; హేమునకు సుతపుడు; సుతపునకు బలి జన్మించారు. ఆ బలికి అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు అని ఆరుగురు పుత్రులు పుట్టారు. వారు తూర్పు రాజ్యాలకు రాజులు అయి, ఆయా రాజ్యాలకు వారివారి పేర్లు పెట్టి పరిపాలించారు. సువీరునకు సత్యరథుడు; సత్యరథునకు దివిరథుడు; దివిరథునికి ధర్మరథుడు; ధర్మరథునకు చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడు రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు.