పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-657-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత ముద్గలునినుండి బ్రాహ్మణకులంబై, ముద్గల గోత్రంబు నా నెగడె; భర్మ్యాశ్వపుత్రుండైన యా ముద్గలునికి దివోదాసుండు, నహల్యయను కన్యకయునుం బుట్టి; రా యహల్య యందు గౌతమునికి శతానందుండు పుట్టె; శతానందునికి ధనుర్వేద విశారదుండయిన సత్యధృతి పుట్టె; నతం డొకనాఁడు వనంబున నూర్వశిం గనిన నతనికి రేతఃపాతంబై, తద్వీర్యంబు శరస్తంబంబునం బడి మిథునం బయ్యె; నా సమయంబున.

టీకా:

అంతన్ = అంతట; ముద్గలుని = ముద్గలుని; నుండి = తో మొదలై; బ్రాహ్మణ = విప్ర; కులంబున్ = వంశము; ఐ = ఏర్పడి; ముద్గలగోత్రంబున్ = ముద్గలగోత్రంబున్; నాన్ = అనబడి; నెగడెన్ = అతిశయించెను; భర్మ్యాశ్వ = భర్మ్యాశ్వుని; పుత్రుండు = కొడుకు; ఐన = అయినట్టి; ఆ = ఆ; ముద్గలుని = ముద్గలుని; కిన్ = కి; దివోదాసుండున్ = దివోదాసుడు; అహల్య = అహల్య; అను = అనెడి; కన్యకయునున్ = ఆడపిల్ల; పుట్టిరి = జనించిరి; ఆ = ఆ; అహల్య = అహల్య; అందున్ = వలన; గౌతముని = గౌతముని; కిన్ = కి; శతానందుండున్ = శతానందుడు; పుట్టెన్ = జనించెను; శతానందుని = శతానందుని; కిన్ = కి; ధనుర్వేద = విలువిద్య, యజుర్వేదమునకు ఉపవేదము; విశారదుండు = పండితుడు; అయిన = ఐన; సత్యధృతి = సత్యధృతి; పుట్టెన్ = జన్మించెను; అతండు = అతడు; ఒక = ఒకానొక; నాడు = దినమున; వనంబున్ = అడవియందు; ఊర్వశిన్ = ఊర్వశిని; కనినన్ = చూడగా; అతని = అతని; కిన్ = కి; రేతః = ఇంద్రియ; పాతంబు = స్ఖలనము; ఐ = అయ్యి; తత్ = ఆ; వీర్యంబు = ఇంద్రియము; శరస్తంబంబునన్ = రెల్లుగడ్డిపైన; పడి = పడి; మిథునంబున్ = కవలులుగా; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అంతట ముద్గలుడి వంశం బ్రాహ్మణ కులం ఏర్పడి ముద్గలగోత్రంతో ప్రసిద్ధం అయింది. భర్మ్యాశ్వుని కొడుకు అయిన ఆ ముద్గలునికి దివోదాసుడు అనే కొడుకు, అహల్య అనే కూతురు పుట్టారు. ఆ అహల్య వలన గౌతమునికి శతానందుడు పుట్టాడు. శతానందునికి ప్రముఖ విలువిద్యా నిపుణుడు సత్యధృతి పుట్టాడు. అతడు ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా అయ్యారు. ఆ సమయంలో.