పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-653-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రంతిదేవుండు విజ్ఞానగర్భిణి యగు భక్తివలనఁ బరమపదంబునకుం జనియె; నంత గర్గునకు శిని జన్మించె. శినికి గార్గ్యుండు గలిగె; నాతనినుండి బ్రాహ్మణకులంబయ్యె; మహావీర్యునికి నురుక్షయుండును, నురుక్షయునకుఁ ద్రయారుణియుఁ గవియుఁ బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి; వారును బ్రాహ్మణులయి చనిరి; బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండు, సుహోత్రునకు హస్తియు జనించి రా హస్తి దన పేర హస్తినాపురంబు నిర్మించె నా హస్తికి నజమీఢుండును ద్విమీఢుండును బురుమీఢుండును నన మువ్వురు జనియించి; రం దజమీఢుని వంశంబునం బ్రియమేధాదులు గొందరు పుట్టి బ్రాహ్మణులయి చని; రయ్యజమీఢునికి బృహదిషుడు నతని పుత్రుండు బృహద్దనువు, నతనికి బృహత్కాయుండు, నతనికి జయద్రథుండు, నతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువుఁ గాశ్యుండు వత్సుండునన నలువురు జనించి; రందు రుచిరాశ్వునకుఁ బ్రాజ్ఞుండును, నతనికిఁ బృథుసేనుండును, బృథుసేనునికిఁ బారుండును, వానికి నీపుండు, నీపునికి నూర్వురు గొడుకులును బుట్టిరి; మఱియును.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రంతిదేవుండు = రంతిదేవుడు; విజ్ఞాన = స్వస్వరూపజ్ఞాన కారణము; అగు = ఐన; భక్తి = భక్తి; వలనన్ = వలన; పరమపదంబున్ = మోక్షమును; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట; గర్గున్ = గర్గున; కున్ = కు; శిని = శిని; జన్మించె = పుట్టెను; శిని = శిని; కిన్ = కి; గార్గ్యుండున్ = గార్గ్యుడు; కలిగెన్ = పుట్టెను; ఆతని = అతని; నుండి = నుండి; బ్రాహ్మణ = బ్రాహ్మణ; కులంబున్ = కులము; అయ్యెన్ = కలిగెను; మహావీర్యుని = మహావీర్యుని; కిన్ = కి; ఉరుక్షయుండును = ఉరుక్షయుడు; ఉరుక్షయున్ = ఉరుక్షయున; కున్ = కు; త్రయారుణియున్ = త్రయారుణి; కవియున్ = కవి; పుష్కరారుణియున్ = పుష్కరారుణి; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; సంభవించిరి = పుట్టిరి; వారునున్ = వారు; బ్రాహ్మణులు = విప్రులు; అయి = అయ్యి; చనిరి = పోయిరి; బ్రహ్మక్షత్రుని = బ్రహ్మక్షత్రుని; కి = కి; సుహోత్రుండున్ = సుహోత్రుడు; సుహోత్రున్ = సుహోత్రున; కున్ = కు; హస్తియున్ = హస్తి; జనించిరి = పుట్టిరి; ఆ = ఆ; హస్తి = హస్తి; తన = తన; పేరన్ = పేరుమీద; హస్తినాపురంబున్ = హస్తినాపురమును; నిర్మించెను = కట్టించెను; ఆ = ఆ; హస్తి = హస్తి; కిన్ = కి; అజమీఢుండును = అజమీఢుడు; ద్విమీఢుండు = ద్విమీఢుడు; పురుమీఢుడునున్ = పురుమీఢుడు; అనన్ = అనెడి; మువ్వురు = ముగ్గురు; జనియించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; అజమీఢుని = అజమీఢుని; వంశంబునన్ = వంశమునందు; ప్రియమేధ = ప్రియమేధుడు; ఆదులున్ = మొదలగువారు; కొందరు = కొంతమంది; పుట్టి = కలిగి; బ్రాహ్మణులు = బ్రాహ్మణులు; అయి = అయ్యి; చనిరి = పోయిరి; ఆ = ఆ; అజమీఢుని = అజమీఢుని; కిన్ = కి; బృహదిషుడున్ = బృహదిషుడు; అతని = అతని; పుత్రుండు = కుమారుడు; బృహద్దనువున్ = బృహద్దనువు; అతని = అతని; కిన్ = కి; బృహత్కాయుండున్ = బృహత్కాయుడు; అతని = అతని; కిన్ = కి; జయద్రథుండున్ = జయద్రథుడు; అతని = అతని; కిన్ = కి; విశ్వజిత్తు = విశ్వజిత్తు; విశ్వజిత్తున్ = విశ్వజిత్తున; కున్ = కు; సేనజిత్తు = సేనజిత్తు; సేనజిత్తున్ = సేనజిత్తున; కున్ = కు; రుచిరాశ్వుండున్ = రుచిరాశ్వుడు; దృఢహనువున్ = దృఢహనువు; కాశ్యుండు = కాశ్యుడు; వత్సుండున్ = వత్సుడు; అనన్ = అనగా; నలువురు = నలుగురు; జనించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; రుచిరాశ్వున్ = రుచిరాశ్వున; కున్ = కున్; ప్రాజ్ఞుండునున్ = ప్రాజ్ఞుడు; అతని = అతని; కిన్ = కి; పృథుసేనుండనున్ = పృథుసేనుడు; పృథుసేనుని = పృథుసేనుని; కిన్ = కి; పారుండును = పారుడు; వాని = అతని; కిన్ = కి; నీపుండునున్ = నీపుడు; నీపుని = నీపుని; కిన్ = కి; నూర్వురు = వందమంది (100); కొడుకులున్ = పుత్రులు; పుట్టిరి = జనించిరి; మఱియును = ఇంకను.

భావము:

ఈ విధంగా రంతిదేవుడు ఆత్మజ్ఞాన కారణమైన భక్తితో మోక్షానికి వెళ్ళాడు. అంతట గర్గునకు శిని పుట్టాడు; శినికి గార్గ్యుడు, అతనికి బ్రాహ్మణ కులం పుట్టాయి. మహావీర్యునికి ఉరుక్షయుడు; ఉరుక్షయునకు త్రయారుణి, కవి, పుష్కరారుణి అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు విప్రులైపోయారు. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుడు; సుహోత్రునకు హస్తి పుట్టారు. ఆ హస్తి తన పేరుమీద హస్తినాపురం నిర్మించాడు. ఆ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో అజమీఢుని వంశంలో ప్రియమేధుడు మున్నగు కొంతమంది పుట్టి బ్రాహ్మణులు అయిపోయారు. ఆ అజమీఢునికి బృహదిషుడు; అతనికి బృహద్దనువు; అతనికి బృహత్కాయుడు; అతనికి జయద్రథుడు; అతనికి విశ్వజిత్తు; విశ్వజిత్తునకు సేనజిత్తు; సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనగా నలుగురు కుమారులు పుట్టారు. వారిలో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు; అతనికి పృథుసేనుడు; పృథుసేనునికి పారుడు; అతనికి నీపుడు; నీపునికి వందమంది పుత్రులు పుట్టారు. ఇంకా....