పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-635-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియునా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురోహితుండుగా డెబ్బదియెనిమిదియును, గంగాతీరంబున నేఁబది యయిదును, నిట్లు నూటముప్పదిమూఁడశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగా నొనర్చి; దేవేంద్రవిభవంబున నతిశయించి, పదుమూఁడువేలునెనుబదినాలుగు కదుపుధేనువులుగలయది ద్వంద్వంబనం బరఁగు, నట్టి వేయి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁ గ్రేపులతోడ నలంకారసహితలం జేసి వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార తీర్థకూలంబున విప్రముఖ్యులకుఁ బుణ్యదినంబున గనక భూషణ శోభితంబులయి ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదునాలుగులక్షల నొసంగె; దిగ్విజయకాలంబున శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజులఁ బీచంబడంచి, రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం బెక్కండ్ర విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె; త్రిపురదానవుల జయించి; నిర్జరుల నిజమందిరంబుల నునిచె; నతని రాజ్యంబున గగన ధరణీతలంబులు ప్రజలుగోరిన కోరిక లిచ్చుచుండె; నివ్విధంబున.

టీకా:

మఱియున్ = ఇంకను; దౌష్యంతి = భరతుడు {దౌష్యంతి - దుష్యంతుని పుత్రుడు, భరతుడు}; యమునా = యమునానదీ; తటంబునన్ = ఒడ్డునందు; దీర్ఘతపుండు = దీర్ఘతపుడు; పురోహితుండు = పురోహితుడు; కాన్ = అయ్యుండగా; డెబ్బదియెనిమిదియును = డెబ్బైయెనిమిది (78); గంగా = గంగానదీ; తీరంబునన్ = ఒడ్డునందు; ఏబదియయిదునున్ = ఏభైయైదు (55); ఇట్లు = ఈ విధముగ; నూటముప్పదిమూడు = నూటముప్పైమూడు (133); అశ్వమేథ = అశ్వమేథము అనెడి; యాగంబులున్ = యాగములను; సదక్షిణముగా = నేర్పుగా చేయబడినవిగా; ఒనర్చి = చేసి; దేవేంద్ర = ఇంద్రుని వంటి; విభవంబునన్ = వైభవముతో; అతిశయించి = పెంపు కలిగి; పదుమూడువేలున్ = పదమూడువేల; ఎనుబదినాలుగు = ఎనభైనాలుగు; కదుపు = పాడి; ధేనువులున్ = ఆవులు; కలయది = కలది; ద్వంద్వంబున్ = ద్వంద్వము; అనన్ = అనగా; పరగున్ = తెలియబడును; అట్టి = అటువంటి; వేయి = వెయ్యి (1000); ద్వంద్వంబుల = ద్వంద్వముల; పాడి = పాలిచ్చునవైన; మొదవులన్ = ఆవులను; క్రేపుల = దూడలతో; తోడన్ = తోపాటు; అలంకారసహితలన్ = అలంకరింపబడినవిగా; చేసి = చేసి; వేవురు = వెయ్యిమంది (1000); బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; ఇచ్చి = దానముచేసి; మష్కార = మష్కారనదీ; తీర్థ = పుణ్యతీర్థము; కూలంబునన్ = గట్టుమీద; విప్ర = బ్రాహ్మణ; ముఖ్యుల్ = ప్రముఖుల; కున్ = కు; పుణ్యదినంబునన్ = మంచిరోజులలో, శ్రాద్ధదినములలో; కనక = బంగారపు; భూషణ = ఆభరణములతో; శోభితంబులు = విలసిల్లుతున్నవి; అయి = ఐ; ధవళ = తెల్లని; దంతంబులు = దంతములు; కల = కలిగిన; నల్లని = నల్లటి; ఏనుగులన్ = ఏనుగులను; పదునాలుగులక్షలన్ = పద్నాలుగులక్షలు (14,00,000); ఒసంగెన్ = దానముచేసెను; దిగ్విజయ = దిగ్విజయయాత్రచేసెడి; కాలంబునన్ = సమయమునందు; శక = శకుల; శబర = శబరుల; బర్బర = బర్బరుల; కష = కషుల; కిరాతక = కిరాతకుల; హూణ = హూణుల; మ్లేచ్ఛ = మ్లేచ్ఛుల; దేశంబులన్ = దేశము లందలి; రాజులన్ = రాజుల యొక్క; పీచంబు = గర్వము; అడంచి = అణిచివేసి; రసాతలంబునన్ = పాతాళములో; రాక్షస = రాక్షసుల యొక్క; కారాగృహంబుల = చెరసాలల; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; వేల్పుల = దేవతల; గరితలన్ = భార్యను; పెక్కండ్రన్ = అనేక మందిని; విడిపించి = విడుదలచేసి; తెచ్చి = తీసుకొని వచ్చి; వారల = వారి యొక్క; వల్లభులన్ = భర్తలతో; కూర్చెన్ = కలిపెను; త్రిపురదానవులన్ = త్రిపురాసురులను; జయించి = గెల్చి; నిర్జరులన్ = దేవతలను; నిజ = వారి యొక్క; మందిరంబులనున్ = ఇండ్లలో; ఉనిచెన్ = ఉండునట్లుచేసెను; అతని = అతని యొక్క; రాజ్యంబునన్ = రాజ్యము నందు; గగన = ఆకాశ; ధరణీ = భూ; తలంబులున్ = మండలములు; ప్రజలు = ప్రజలు; కోరిన = కోరినట్టి; కోరికలున్ = కోరికలను; ఇచ్చుచున్ = ఇస్తూ; ఉండెన్ = ఉండెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

అంతేకాక, భరతుడు దీర్ఘతపుడు పురోహితుడుగా యమునానది గట్టు మీద డెబ్బైయెనిమిది; గంగానది గట్టుమీద ఏభైయైదు; ఇలా నూటముప్పైమూడు అశ్వమేథ యాగాలు చేసాడు. ఇంద్రవైభవంతో అతిశయించాడు. పదమూడువేల ఎనభైనాలుగు పాడి ఆవులు కలదానిని ద్వంద్వము అంటారు. అటువంటి వెయ్యి ద్వంద్వముల అలంకరింపబడిన పాలిచ్చే ఆవులను, దూడల తోపాటు, వెయ్యిమంది విప్రులకు దానం చేసాడు. మష్కారా పుణ్యతీర్థం గట్టుమీద బ్రాహ్మణులకు శుభతిథులలో, శ్రాద్ధదినాలలో బంగారు ఆభరణములతో విలసిల్లుతున్న పద్నాలుగులక్షలు తెల్లని దంతాలు కల నల్లటి ఏనుగులను (14,00,000) దానం చేసాడు. దిగ్విజయ యాత్రచేసే సమయంలో శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజుల గర్వం అణిచేసాడు. పాతాళంలో రాక్షసుల బంధీలుగా ఉన్న అనేకమంది దేవతాస్త్రీలను విడిపించాడు. వారిని తెచ్చి వారి భర్తలతో కలిపాడు. త్రిపురాసురులను గెల్చి దేవతలను వారి వారి స్థానాలలో ఉండేలా చేసాడు. అతని రాజ్యంలో భూమ్యాకాశాలు ప్రజలు కోరిన కోరికలు తీరుస్తూ ఉండేవి. ఈ విధంగా.