పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-33-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొడుకు సుద్యమ్నుండు ఘోరాటవుల కేఁగ-
వందుచు మనువు వైస్వతుండు
నకు బిడ్డలు గల్గఁ ప మాచరించెను-
రిఁగూర్చి నూఱేండ్లు మునలోన,
రి యంత నిక్ష్వాకుఁ డాదిగాఁ బదుగురు-
పుత్రుల నిచ్చెను, బొసఁగ; వారి
యందుఁ బృషద్ధ్రాఖ్యుఁ నువాఁడు, గురునాజ్ఞ-
విమల ధర్మంబులు వెలయఁబూని

9-33.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుల కదుపులఁ గాచుచు, లుమొగిళ్ళు
చ్చి నడురేయి జోరున వాన గురియ,
మంద విడియించి, చుట్టు నేఱక యుండె
డవి మొకములు చొరకుండ రసికొనుచు.

టీకా:

కొడుకు = కుమారుడు; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; ఘోర = భయంకరమైన; అడవుల్ = అడవులకు; ఏగన్ = వెళ్ళగా; వందుచున్ = సంతాపపడుతు; మనువు = మనువు; వైవస్వతుండు = వైవస్వతుడు; తన = అతని; కున్ = కి; బిడ్డలు = పుత్రులు; కల్గన్ = పొందుటకోసము; తపమున్ = తపస్సును; ఆచరించెన్ = చేసెను; హరిన్ = నారాయణుని; కూర్చి = గురించి; నూఱు = వంద; ఏండ్లు = సంవత్సరములు; యమున = యమునాతీరము; లోనన్ = అందు; హరి = నారాయణుడు; అంతన్ = అంతట; ఇక్ష్వాకుడు = ఇక్ష్వాకుడు; ఆదిగా = మున్నగు; పదుగురు = పదిమంది; పుత్రులన్ = కుమారులను; ఇచ్చెను = ప్రసాదించెను; పొసగన్ = చక్కగా; వారిన్ = వారి; అందున్ = లో; పృషద్ధ్ర = పృషద్ధ్రుడు; అనువాడు = అనెడివాడు; గురున్ = గురువుయొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞప్రకారము; విమల = స్వచ్ఛమైన; ధర్మంబులున్ = ధర్మములను; వెలయన్ = ప్రసిద్ధముగా; పూని = ధరించి.
పసుల = పసువుల; కదుపులన్ = మందలను; కాచుచు = కాచుచు; పలు = దట్టమైన; మొగిళ్ళు = మబ్బులు; వచ్చి = చేరి; నడురేయి = అర్థరాత్రి; జోరున = భోరుమని; వాన = వర్షము; కురియన్ = కురియగా; మందన్ = మందను; విడియించి = ఒకచోటజేర్చి; చుట్టున్ = అన్నిపక్కలను; ఏమఱక = కనిపెట్టుకొని; ఉండెన్ = ఉండెను; అడవి = క్రూర; మొకములు = జంతువులు; చొరబడకుండన్ = దాడిచేయకుండగ; అరసికొనుచు = చూసుకొంటూ.

భావము:

అలా కుమారుడు సుద్యుమ్నుడు అడవులకు వానప్రస్థాశ్రమం స్వీకరించి వెళ్ళిపోడంతో, మనువు వైవస్వతుడు ఎంతో సంతాపం చెందాడు. యమునాతీరంలో వైవస్వతుడు పుత్రులు కోసం నారాయణుని గురించి వంద సంవత్సరములు తపస్సు చేసాడు. నారాయణుడు అంతట ఇక్ష్వాకుడు మున్నగు పదిమంది కుమారులను ప్రసాదించాడు. వారి లో పృషధ్రుడు గురువు ఆజ్ఞ మేరకు స్వచ్ఛమైన ధర్మములను పాటిస్తూ, పసుల మందలను కాస్తున్నాడు. ఒకనాడు, దట్టమైన మబ్బులు కమ్మి అర్థరాత్రి భోరుమని వర్షము కురుస్తుంటే, క్రూర జంతువులు దాడిచేయకుండగ చూసుకొంటూ మందను ఒకచోట చేర్చి అన్ని ప్రక్కలను కనిపెట్టుకొని ఉన్నాడు.