పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-540-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు యయాతికి దేవయాని నిచ్చి శుక్రుండు శర్మిష్ఠాసంగమంబు చేయకు మని యతని నియమించి పనిచె; పిదప దేవయానియు న య్యయాతివలన యదు తుర్వసులను కుమారులం గనియెను; ఒక్క రేయి చెఱంగుమాసి, దేవయాని వెలుపలనున్నయెడ శర్మిష్ఠ యెడరు వేచి యేకాంతంబున యయాతి కడకుం జని, చెఱకువింటి జోదు పువ్వుటంపఱ కోహటించి తన తలంపు జెప్పిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; యయాతి = యయాతి; కిన్ = కి; దేవయానినిన్ = దేవయానిని; ఇచ్చి = భార్యగా నిచ్చి; శుక్రుండు = శుక్రుడు; శర్మిష్ఠా = శర్మిష్ఠ యొక్క; సంగమంబున్ = కవయుట; చేయకుము = చేయవద్దు; అని = అని; అతని = అతనిని; నియమించి = హెచ్చరించి; పనిచెన్ = పంపించెను; పిదపన్ = తరువాత; దేవయానియున్ = దేవయాని; ఆ = ఆ; యయాతి = యయాతి; వలన = కి; యదు = యదువు; తుర్వసులు = తుర్వసుడులు; అను = అనెడి; కుమారులన్ = పుత్రులను; కనియెను = పుట్టించెను; ఒక్క = ఒకానొక; రేయి = రాత్రి; చెఱంగుమాసి = ఋతుమతియై; దేవయాని = దేవయాని; వెలుపలనున్న = బయటున్న; ఎడన్ = సమయము నందు; శర్మిష్ఠ = శర్మిష్ఠ; ఎడరు = అవకాశమునకై; వేచి = ఎదురు చూసి; ఏకాంతంబునన్ = ఒంటరిగా; యయాతి = యయాతి; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; చెఱకువింటిజోదు = మన్మథుని {చెఱకువింటిజోదు - చెరుకుగడ విల్లుగా కలవాడు, మన్మథుడు}; పువ్వు = పూల; అంపఱన్ = బాణముల; కిన్ = కు; ఓహటించి = జంకి; తన = తన యొక్క; తలంపు = కోరిక; చెప్పినన్ = చెప్పగా.

భావము:

ఈ విధంగా శుక్రుడు యయాతికి దేవయానిని భార్యగా ఇచ్చి శర్మిష్ఠను కవయవద్దు అని హెచ్చరించి పంపించాడు. తరువాత దేవయాని యందు యయాతికి యదువు, తుర్వసుడు అనె పుత్రులు పుట్టారు. అవకాశంకోసం ఎదురు చూస్తున్న శర్మిష్ఠ, ఒక రాత్రి ఋతుమతియై దేవయాని బయట ఉన్న సమయం చూసి, ఒంటరిగా యయాతి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పింది.