పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-487-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా రాముండు శమంతపంచకంబున రాజరక్తంబులం దొమ్మిది మడుఁగులు గావించి తండ్రిశిరంబు దెచ్చి, శరీరంబుతో సంధించి, సర్వదేవమయుండగు దేవుండు దాన కావునఁ దన్నునుద్దేశించి యాగంబుంజేసి, హోతకుం దూర్పును, బ్రహ్మకు దక్షిణ భాగంబును, నధ్వరునకుఁ బడమటి దిక్కును, నుద్గాతృనకునుత్తర దిశయు, నున్నవారల కవాంతరదిశలును, గశ్యపునకు మధ్యదేశంబును, నుపద్రష్టకు నార్యావర్తంబును, సదస్యులకుం దక్కిన యెడలును గలయనిచ్చి బ్రహ్మనది యైన సరస్వతియం దవబృథస్నానంబు చేసి, కల్మషంబులం బాసి, మేఘవిముక్తుండయిన సూర్యుండునుం బోలె నొప్పుచుండె; నంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాముండు = పరశురాముడు; శమంతపంచకంబునన్ = శమంతపంచకమున; రాజ = క్షత్రియ; రక్తంబులన్ = రక్తములతో; తొమ్మిది = తొమ్మిది (9); మడుగులున్ = చెరువులను; కావించి = చేసి; తండ్రి = తండ్రి యొక్క; శిరంబున్ = తలను; తెచ్చి = తీసుకువచ్చి; శరీరంబు = మొండెము; తోన్ = తోటి; సంధించి = చేర్చి; సర్వదేవ = సమస్త దేవతలు; మయుండు = తానైనవాడు; అగు = ఐన; దేవుండు = దేవుడు; తాన = తనే; కావునన్ = కనుక; తన్నున్ = తనను; ఉద్దేశించి = గురించి; యాగంబున్ = యజ్ఞము; చేసి = చేసి; హోత = ఋత్విక్కున; కున్ = కు; తూర్పునున్ = తూర్పుభాగము; బ్రహ్మ = బ్రహ్మ; కున్ = కు; దక్షిణ = దక్షిణపు; భాగంబునున్ = భాగమును; అద్వరున్ = అధ్వరున; కున్ = కు; పడమటి = పశ్చిమ; దిక్కునున్ = వైపు భాగమును; ఉద్గాతృన్ = ఉద్గాత; కున్ = కు; ఉత్తర = ఉత్తర; దిశన్ = వైపు భాగమును; ఉన్న = మిగిలిన; వారలు = వారి; కిన్ = కి; అవాంతరదిశలునున్ = మూలల భాగములు; కశ్యపున్ = కశ్యపున; కున్ = కు; మధ్య = నడిమి; ప్రదేశంబున్ = స్థలములను; ఉపద్రష్ట = ఉపద్రష్ట; కున్ = కు; ఆర్యావర్తంబును = ఆర్యావర్తము; సదస్యుల్ = సభ్యుల; కున్ = కు; తక్కిన = మిగిలిన; ఎడలున్ = ప్రదేశములు; కలయన్ = ఉన్నదంతా; ఇచ్చి = ఇచ్చేసి; బ్రహ్మ = పరమపవిత్రమైనట్టి; నది = నది; ఐన = అయిన; సరస్వతి = సరస్వతీనది; అందున్ = లో; అవబృథస్నానంబున్ = అవబృథస్నానము {అవబృథము - యఙ్ఙము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేసెడి కర్మము}; చేసి = చేసి; కల్మషంబులన్ = పాపములను; పాసి = పోగొట్టుకొని; మేఘ = మబ్బుల నుండి; విముక్తుండు = విడివడినవాడు; అయిన = ఐన; సూర్యుండునున్ = సూర్యుని; పోలెన్ = వలె; ఒప్పుచుండెను = చక్కగ నుండెను; అంత = అంతట.

భావము:

ఇంకా. ఆ పరశురాముడు శమంత పంచకం వద్ద క్షత్రియ రక్తాలతో తొమ్మిది మడుగులు చేసాడు. తండ్రి తలను తీసుకొని వచ్చి శరీరంతో చేర్చి సర్వదేవమయుడు ఐన దేవుడు తనే కనుక తన గురించి తనే యాగం చేసాడు. హోతకు తూర్పుదిక్కు, బ్రహ్మకు దక్షిణపు దిక్కు, అధ్వరునికి పశ్చిమ దిక్కు, ఉద్గాతకు ఉత్తర దిక్కు మిగిలిన వారికి మూలలను, కశ్యపునకు మధ్యదేశాన్ని, ఉపద్రష్టకు ఆర్యావర్తం, సదస్యులకు మిగిలిన ప్రదేశాలు ఇచ్చాడు. పిమ్మట సరస్వతీనదిలో అవబృథస్నానం చేసి పాపాలను పోగొట్టుకొని మబ్బులనుండి విడిచిన సూర్యునిలా ప్రకాశించాడు. అంతట...