నవమ స్కంధము : పరశురాముని కథ
- ఉపకరణాలు:
ఆ రాజేంద్రుఁడు రావణు
"నోరీ! యిటమీఁద నూరకుండుము; జగతిన్
వీరుఁడ ననకుము; కాచితిఁ
బోరా!" యని సిగ్గు పఱచి పుచ్చెన్ మరలన్.
టీకా:
ఆ = ఆ; రాజ = రాజులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; రావణున్ = రావణుని; ఓరీ = ఒరేయ్; ఇట = ఇక; మీదన్ = పైన; ఊరకుండుము = ఊరకపడియుండు; జగతిన్ = లోకములో; వీరుడను = శూరుడను; అనకుము = అని చెప్పుకొనకు; కాచితిన్ = తప్పుకాసాను; పోరా = వెళ్ళిపోరా; అని = అని; సిగ్గు = అవమాన; పఱచి = పరచి; పుచ్చెన్ = పంపించెను; మరలన్ = వెనుకకు
భావము:
ఆ రాజశ్రేష్ఠుడు రావణుని. “ఒరేయ్! రావణా! ఇక పైన ఊరక పడి ఉండు. లోకంలో శూరుడను అని చెప్పుకోకు. ఈసారికి నీ తప్పుకాసాను వెళ్ళిపోరా.” అని అవమానించి పంపించాడు.