పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-422-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వేదవిభాగంబు గల్పించి, యాగంబుచేసి, పురూరవుం డూర్వశి యున్న గంధర్వలోకంబునకుం జనియె నతనికి నూర్వశి గర్భంబున నాయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు, విజయుం డన నార్గురు పుత్రులు గలిగి; రందు శ్రుతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు శ్రుతంజయుండును, రయునకు శ్రుతుండు నేకుం డన నిరువును, జయునకు నమితుండును, విజయునకు భీముండును జనించి రా భీమునకుఁ గాంచనుండు, కాంచనునకు హోత్రకుండు, హోత్రకునకు గంగాప్రవాహంబు పుక్కిటం బెట్టిన జహ్నుండు, జహ్నునకుఁ బూరుండు పూరునకు బాలకుండు, బాలకునకు నజకుం, డజకునకుఁ గుశుండు, కుశునకుఁ గుశాంబుండు ధూర్తయుండు వసువు కుశనాభుం డన నలువురును సంభవించి; రందు గుశాంబునకు గాధి యను వాఁడు గలిగె నా గాధి రాజ్యంబు చేయుచుండ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వేద = వేదములను; విభాగంబున్ = విడి భాగములుగ; కల్పించి = తయారుచేసి; యాగంబున్ = యజ్ఞములు; చేసి = చేసి; పురూరవుండు = పురూరవుడు; ఊర్వశి = ఊర్వశి; ఉన్న = ఉన్నట్టి; గంధర్వలోకంబున్ = గంధర్వలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అతని = అతని; కిన = కి; ఊర్వశి = ఊర్వశి యొక్క; గర్భంబునన్ = కడుపులో; ఆయువు = ఆయువు; శ్రుతాయువు = శ్రుతాయువు; సత్యాయువు = సత్యాయువు; రయుండు = రయుడు; జయుండు = జయుడు; విజయుండు = విజయుడు; అనన్ = అనెడి; ఆర్గురు = ఆరుగురు (6); పుత్రులు = కొడుకులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; శ్రుతాయువున్ = శ్రుతాయువున; కున్ = కు; వసుమంతుండును = వసుమంతుడు; సత్యాయువున్ = సత్యాయువున; కున్ = కు; శ్రుతంజయుండును = శ్రుతంజయుడు; రయున్ = రయున; కున్ = కు; శ్రుతుండున్ = శ్రుతుడు; అనేకుండు = అనేకుడు; అనన్ = అనెడి; ఇరువురును = ఇద్దరు; జయున్ = జయున; కున్ = కు; అమితుండును = అమితుడు; విజయున్ = విజయున; కున్ = కు; భీముండును = భీముడు; జనించిరి = పుట్టిరి; ఆ = ఆ; భీమున్ = భీముని; కున్ = కు; కాంచనుండున్ = కాంచనుడు; కాంచనున్ = కాంచనున; కున్ = కు; హోత్రకుండున్ = హోత్రకుడు; హోత్రకున్ = హోత్రకున; కున్ = కు; గంగా = గంగ యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహమును; పుక్కిటన్ = పుగ్గలలో; పెట్టిన = ధరించినట్టి; జహ్నుండు = జహ్నుడు; జహ్నున్ = జహ్నున; కున్ = కు; పూరుండు = పూరుడు; పూరున్ = పూరున; కున్ = కు; బాలకుండు = బాలకుడు; బాలకున్ = బాలకున; కున్ = కు; అజకుండు = అజకుడు; అజకున్ = అజకున; కున్ = కు; కుశుండు = కుశుడు; కుశున్ = కుశున; కున్ = కు; కుశాంబుండు = కుశాంబుడు; ధూర్తయుండు = ధూర్తయుడు; వసువు = వసువు; కుశనాభుండు = కుశనాభుడు; అనన్ = అనెడి; నలువురును = నలుగురు (4); సంభవించిరి = పుట్టరి; అందున్ = వారిలో; కుశాంబున్ = కుశాంబుని; కున్ = కి; గాధి = గాధి; అను = అనెడి; వాడున్ = వాడు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; గాధి = గాధి; రాజ్యంబున్ = రాజ్యము; చేయుచుండన్ = చేస్తుండగా.

భావము:

ఈ విధంగా వేదవిభాగాలు కల్పించుకుని యాగాలు చేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వలోకానికి వెళ్ళాడు. అతనికి ఊర్వశి యందు ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు, అని ఆరుగురు (6) కొడుకులు పుట్టారు. వారిలో శ్రుతాయువునకు వసుమంతుడు; సత్యాయువునకు శ్రుతంజయుడు; రయునకు శ్రుతుడు, అనేకుడు అని ఇద్దరు; జయునకు అమితుడు; విజయునకు భీముడు పుట్టారు. ఆ భీమునికి కాంచనుడు; కాంచనునకు హోత్రకుడు; హోత్రకునకు గంగని పుక్కిట పట్టిన జహ్నుడు; జహ్నునకు పూరుడు; పూరునకు బాలకుడు; బాలకునకు అజకుడు; అజకునకు కుశుడు; కుశునకు కుశాంబువు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు పుట్టారు. వారిలో కుశాంబునికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేస్తుండగా.