పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-419-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మరలి, తన పురంబున నొక్క యేఁడుండి, పిదప నూర్వశి కడ కేఁగి యొక్క రేయి పురూరవుం డ య్యింతికడ నున్న నా వెలందియు "గంధర్వవరుల వేఁడికొనుము నన్నిచ్చెద"; రనవుడు నతండు గంధర్వవరులం బ్రార్థించిన వార లతండు పొగడుటకు మెచ్చి యగ్నిస్థాలి నిచ్చిన, నయ్యగ్నిస్థాలి నూర్వశింగా దలంచుచు దానితో నడవిం దిరుగుచుండి యొక్కనాఁ డది యూర్వశిగాదగ్నిస్థాలి యని యెఱింగి; వనంబున దిగవిడిచి, యింటికిఁ జనుదెంచి, నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండఁ ద్రేతాయుగంబు చొచ్చిన నా రాజు చిత్తంబునఁ గర్మబోధంబులయి వేదంబులు మూఁడు మార్గంబులం దోఁచిన, నా భూవరుండు స్థాలికడకుం జని యందు శమీగర్భజాతం బైన యశ్వత్థంబుఁ జూచి, యా యశ్వత్థంబుచేత నరణులు రెండు గావించి, ముందటి యరణి దానును, వెనుకటి యరణి యూర్వశియును, రెంటినడుమ నున్న కాష్ఠంబు పుత్రుండు నని, మంత్రంబు చెప్పుచుం ద్రచ్చుచుండ, జాతవేదుండను నగ్ని సంభవించి విహితారాధన సంస్కారంబునం జేసి యాహవనీయాది రూపియై నెగడి, పురూరవుని పుత్రుండని కల్పింపం బడియె; నా యగ్ని పురూరవునిఁ బుణ్యలోకంబునకుఁ బనుపం గారణం బగుటం జేసి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మరలి = వెనుదిరిగి; తన = తన యొక్క; పురంబునన్ = నగరము నందు; ఒక్క = ఒక; ఏడు = సంవత్సరం పాటు; ఉండి = ఉండి; పిదపన్ = తరువాత; ఊర్వశి = ఊర్వశి; కడ = వద్ద; ఏగి = వెళ్లి; ఒక్క = ఒకానొక; రేయి = రాత్రి; పురూరవుండు = పురూరవుడు; ఆ = ఆ; ఇంతి = పడతి; కడన్ = వద్ద; ఉన్నన్ = ఉండగా; ఆ = ఆ; వెలందియున్ = వేశ్య; గంధర్వ = గంధర్వులలో; వరులన్ = శ్రేష్ఠులను; వేడికొనుము = అడుగుము; నన్నున్ = నన్ను; ఇచ్చెదరు = ఇస్తారు; అనవుడున్ = అనగా; అతండు = అతను; గంధర్వులన్ = గంధర్వులను; ప్రార్థించినన్ = కోరగా; వారలు = వారు; అతండు = అతను; పొగడుటకు = స్తుతించుటకు; మెచ్చి = మెచ్చుకొని; అగ్నిస్థాలిన్ = కుంపటిని; ఇచ్చినన్ = ఇవ్వగా; ఆ = ఆ; అగ్నిస్థాలిన్ = కుంపటినే; ఊర్వశి = ఊర్వశి; కాన్ = ఐనట్లు; తలంచుచున్ = భావించుచు; దాని = దాని; తోనన్ = తోపాటు; అడవిన్ = అడవిలో; తిరుగుచుండి = తిరుగుతూ; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అది = అది; ఊర్వశి = ఊర్వశి; కాదు = కాదు; అగ్నిస్థాలి = కుంపటి; అని = అని; ఎఱింగి = తెలిసికొని; వనంబునన్ = అడవిలో; దిగవిడిచి = వదిలేసి; ఇల్లు = ఇంటి; కిన్ = కి; చనుదెంచి = వచ్చి; నిత్యంబున్ = ప్రతిరోజు; రాత్రి = రాత్రి; దానినన్ = దానినే; చింతించుచుండన్ = తలచుకొనుచుండగ; త్రేతాయుగంబున్ = త్రేతాయుగము; చొచ్చినన్ = ప్రవేశించగా; ఆ = ఆ; రాజు = రాజు; చిత్తంబునన్ = మనసు నందు; కర్మ = కర్మకాండ; బోధంబులు = తెలిసినవి; అయి = అయ్యి; వేదంబులున్ = వేదములు; మూడు = మూడు (3); మార్గంబులన్ = భాగములుగా; తోచినన్ = సాక్షాత్కరించగా; ఆ = ఆ; భూవరుండు = రాజు; స్థాలి = కుంపటి; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = దానిలో; శమీ = జమ్మిచెట్టు; గర్భ = లోంచి (కాండము); జాతంబు = పుట్టినది; ఐన = అయిన; అశ్వత్థంబున్ = రావిచెట్టును; చూచి = చూసి; ఆ = ఆ; అశ్వత్థంబున్ = రావిచెట్టు; చేతన్ = నుండి; అరణులు = అరణి కొయ్యలను {అరణి - ద్రచ్చినిప్పు పుట్టించెడు కొయ్యల జత, అరణి కొయ్యలు}; రెండు = రెంటిని (2); కావించి = తయారుచేసి; ముందటి = మొదటి; అరణి = అరణికొయ్య; తానును = అతనుగను; వెనుకటి = కింది; అరణి = అరణి కొయ్య; ఊర్వశి = ఊర్వశిగాను; రెంటి = రెండింటి; నడుమ = మధ్యన; ఉన్నట్టి = ఉన్నటువంటి; కాష్ఠంబు = పుల్ల; పుత్రుండు = కొడుకు; అని = అని; మంత్రంబు = మంత్రములను; చెప్పుచున్ = చదువుతూ; ద్రచ్చుచుండగా = మథించుచుండగ; జాతవేదుండు = జాతవేదుడు; అను = అనెడి; అగ్ని = నిప్పు; సంభవించి = పుట్టి; విహిత = నియమబద్దమైన; ఆరాధన = కొలుచుట; సంస్కారంబునన్ = క్రియల; చేసి = వలన; ఆహవనీయాది = త్రేతాగ్నులు {త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2దక్షిణాగ్ని 3గార్హపత్యము, మూడగ్నులు, శ్రౌతాగ్నులు}; ఆది = మున్నగు; రూపి = రూపములు కలది; ఐ = అయ్యి; నెగడి = బయటికి ప్రకాశించి; పురూరవుని = పురూరవుని; పుత్రుండు = కొడుకు; అని = అని; కల్పింపంబడియె = ఏర్పరచబడినది; ఆ = ఆ; అగ్ని = అగ్ని; పురూరవున్ = పురూరవుని; పుణ్యలోకంబులకు = సుగతులకు; పనుపన్ = పంపుటకు; కారణంబు = కారణము; అగుటన్ = అగుట; చేసి = వలన;

భావము:

ఈ విధంగా తిరిగి వెళ్ళి పురూరవుడు తన నగరంలో ఒక సంవత్సరంపాటు ఉండి, తరువాత ఊర్వశి వద్దకు వెళ్లాడు. ఒక రాత్రి ఆమె వద్ద గడిపాడు. ఆమె గంధర్వులను అడుగు నన్ను ఇస్తారు అనగా అతను గంధర్వులను కోరాడు. వారు అతని స్తుతికి మెచ్చి కుంపటిని ఇచ్చారు. ఆ కుంపటినే ఊర్వశి అని భావిస్తూ దానితోపాటు అడవిలో తిరుగుతుండగా, ఒకనాడు అది ఊర్వశి కాదు కుంపటి అని పురూరవునికి తెలిసింది. కుంపటిని అడవిలో వదిలేసి ఇంటికి వచ్చి రాత్రింపగళ్ళు ఆమె ధ్యాసతోనే గడపసాగాడు. ఇంతలో త్రేతాయుగం ప్రవేశించింది. ఆ రాజుకి చిత్తంలో కర్మభోద అయింది. వేదములు మూడు సాక్షాత్కరించాయి. అతను కుంపటి పారేసిన చోటుకి వెళ్ళాడు. అక్కడ జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టును చూసి, ఆ రావిచెట్టు నుండి రెండు అరణి కఱ్ఱలను తయారుచేసాడు. పై అరణిని తను అని, కింది అరణి ఊర్వశి అని, రెండింటి మధ్యన ఉన్న పుల్ల కొడుకు అని, మంత్రాలు చదువుతూ మథిస్తుంటే జాతవేదుడు అనె నిప్పు పుట్టింది. పురూరవుడు త్రయీవిద్యతో దాన్ని మూడగ్నులుగా సంస్కరించాడు. ఆ త్రేతాగ్ని ఆహవనీయాది రూపి అయి పురూరవుని కొడుకుగా కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుని సుగతులకు పంపుటకు సమర్థం అయింది.