పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-410-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పెక్కుభంగుల నయ్యింతి పరుషపుపలుకులను కఱకువాలమ్ములు చెవులఁజొనుప, నా రాజశేఖరుం డంకుశంబుపోట్లనడరు మదగజంబు చందంబునఁ జీర మఱచి దిగంబరుండై లేచి వాలు కేలనంకించి, యా నడురేయి దొంగల నఱికివైచి మేషంబుల విడిపించుకొని, తిరిగివచ్చు నెడ.

టీకా:

అని = అని; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగా; ఆ = ఆ; ఇంతి = వనిత; పరుషపు = నిష్ఠూరపు; పలుకులు = మాటలు; అను = అనెడి; కఱకు = కర్కశమైన; వాలమ్ములన్ = కత్తులను; చెవులన్ = చెవుల లోపలకి; చొనుపన్ = దూర్చగా; ఆ = ఆ; రాజ = రాజులలో; శేఖరుండు = గొప్పవాడు; అంకుశంబు = అంకుశముచేత; పోట్లన్ = పొడచుటచేత; అడరు = త్వరపడెడి; మద = మదించిన; గజంబున్ = ఏనుగు; చందంబునన్ = వలె; చీర = వస్త్రము; మఱచి = మరిచిపోయి; దిగంబరుండు = దిసమొలవాడు; ఐ = అయ్యి; లేచి = పైకిలేచి; వాలున్ = కత్తిని; కేలన్ = చేతిలో; అంకించి = అందుకొని; అ = ఆ; నడురేయిన్ = అర్థరాత్రి; దొంగలన్ = దొంగలను; నఱకివైచి = తెగనరికి; మేషంబులన్ = పొట్టేళ్ళను; విడిపించుకొని = విడిపించికొని; తిరిగి = వెనుకకు; వచ్చున్ = వచ్చెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

అని రకరకాలుగా ఆ ఊర్వశి కత్తులు చెవుల్లో దూర్చినట్లుగా నిష్ఠూరాలు ఆడుతోంది. ఆ రాజోత్తముడు అంకుశం పోటు తిని కలవరపడే ఏనుగులా, దిగంబరుడిగానే లేచి కత్తి అందుకొన్నాడు. అంత అర్థరాత్రిలోనూ దొంగలను తెగనరికి పొట్టేళ్ళను విడిపించుకుని తిరిగి వచ్చేసరికి..