పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : చంద్రవంశారంభము

  •  
  •  
  •  

9-377-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత వేల్పులతో రక్కసులకుఁ గయ్యం బయ్యె; బృహస్పతితోడి వైరంబునం జేసి, రాక్షసులుం దానును శుక్రుండు చంద్రునిం జేపట్టి సురాచార్యునిం బోఁదోలిన, హరుండు భూతగణసమేతుండై, తన గురుపుత్రుండైన బృహస్పతిం జేపట్టె; దేవేంద్రుండు సురగణంబులుం దానును బృహస్పతికి నడ్డంబు వచ్చె; నయ్యవసరంబున బృహస్పతి భార్యానిమిత్తంబున రణంబు సురాసుర వినాశకరం బయ్యె; నాలోన బృహస్పతి తండ్రి యగు నంగిరసుండు చెప్పిన విని, బ్రహ్మదేవుండు వచ్చి చంద్రుని గోపించి, గర్భిణియైన తారను మరల నిప్పించినం జూచి బృహస్పతి దాని కిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; వేల్పులు = దేవతల; తోన్ = తోటి; రక్కసుల్ = రాక్షసుల; కున్ = కు; కయ్యంబున్ = యుద్ధము; అయ్యెన్ = జరిగినది; బృహస్పతి = బృహస్పత్; తోడి = తోటి; వైరంబునన్ = శత్రుత్వము; రాక్షసులున్ = రాక్షసులు; తానునున్ = అతను; శక్రుండు = శుక్రుడు; చంద్రునిన్ = చంద్రుని; చేపట్టి = పక్షముజేరి; సురాచార్యునిన్ = బృహస్పతిని {సురాచార్యుడు - దేవతల గురువు, బృహస్పతి}; పోదోలినన్ = వెళ్ళగొట్టగా; హరుండు = పరమశివుడు; భూతగణ = భూతగణములతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; తన = తనయొక్క; గురువు = అంగిరసుని {శివుని గురువు అంగిరసుడు అతని కొడుకు బృహస్పతి}; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; బృహస్పతిన్ = బృహస్పతిని; చేపట్టెన్ = పక్షము చేరెను; దేవేంద్రుండు = ఇంద్రుడు; సుర = దేవతల; గణంబులున్ = గణములు; తానునున్ = అతను; బృహస్పతి = బృహస్పతి; కిన్ = కి; అడ్డంబున్ = అండగా; వచ్చెన్ = వచ్చను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; బృహస్పతి = బృహస్పతియొక్క; భార్యా = భార్య; నిమిత్తంబున = విషయమై; రణంబున్ = యుద్ధము; సురా = దేవతలను; అసుర = రాక్షసులను; వినాశకరంబు = నాశనముచేయునది; అయ్యెన్ = అయినది; ఆలోనన్ = ఇంతలో; బృహస్పతి = బృహస్పతియొక్క; తండ్రి = తండ్రి; అగు = ఐన; అంగిరసుండు = అంగిరసుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; వచ్చి = వచ్చి; చంద్రునిన్ = చంద్రుని; కోపించి = కోపపడి; గర్భిణి = కడుపుతోనున్నామె; ఐన = అయిన; తారను = తారను; మరల = వెనుకకు; ఇప్పించినన్ = ఇప్పించగా; చూచి = చూసి; బృహస్పతి = బృహస్పతి; దాని = ఆమె; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంతలో దేవదానవ యుద్ధం వచ్చింది. దేవ గురువు బృహస్పతితో ఉన్న శత్రుత్వం వలన రాక్షస గురువు శుక్రుడు చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని వెళ్ళగొట్టాడు. పరమశివుడు భూతగణాలతో సహా తన గురువు అంగిరసుని కుమారుడైన బృహస్పతి పక్షంలో చేరాడు. అతను, ఇంద్రుడు, దేవతాగణాలు బృహస్పతికి అండగా వచ్చాయి. ఆ సమయమలో బృహస్పతి భార్య గురించి దేవరాక్షస యుద్ధం ఉభయ పక్షాలకు నాశనకరం అయింది. అంతట, అంగిరసుడు చెప్పగా బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని కోపపడి, కడుపుతో ఉన్న తారను వెనుకకు ఇప్పించాడు. బృహస్పతి ఆమెతో ఇలా అన్నాడు.