పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-372-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నతండు విదేహజుండు గావున వైదేహుం డనియు మథనజాతుండు గావున మిథిలుం డనియు ననం బరగె; నమ్మిథులుని చేత నిర్మితం బయినది మిథిలానగరంబు నాఁ బరగె; నా జనకునకు నుదావసుండును, నుదావసునకు నందివర్ధనుండును, నందివర్థనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును బుట్టిరి; ఆతనికి మహావీర్యుండును, నతనికి సుధృతియు, నతనికిఁ ధృష్టకేతుండును, నతనికి హర్యశ్వుండును, నతనికి మరువును, నతనికిఁ బ్రతింధకుండును, నతనికిఁ గృతర యుండును, నతనికి దేవమీఢుఁడును, నతనికి విధృతుండును, నతనికి మహాధృతియు, నతనికి గీర్తిరాతుండును, నతనికి మహారోముండును, నతనికి స్వర్ణరోముండును, నతనికి హ్రస్వరోముండును, నత నికి సీరధ్వజుండును పుట్టిరి.

టీకా:

మఱియున్ = ఇంకను; అతండు = అతడు; విదేహజుండు = నిర్జీవదేహమునందు పుట్టినవాడు; వైదేహుండు = వైదేహుడు; అనియున్ = అని; మథన = మధించుటచేత; జాతుండు = పుట్టినవాడు; కావున = కనుక; మిథిలుండు = మిథిలుడు; అనియున్ = అన; అనన్ = అనబడుచు; పరగెన్ = ప్రసిద్ధిని పొందెను; ఆ = ఆయొక్క; మిథులుని = మిథులునిచేత; నిర్మితంబు = కట్టించబడినది; అయినది = అయినట్టి; మిథిలానగరంబు = మిథిలానగరము; నా = అని; పరగెన్ = పిరసుద్ధమైనది; జనకున్ = జనకుని; కున్ = కు; ఉదావసుండునున్ = ఉదావసుడు; ఉదావసున్ = ఉదావసున; కున్ = కు; నందివర్దనుండును = నందివర్దనుడు; నందివర్దనున్ = నందివర్దనుని; కున్ = కి; సుకేతుండును = సుకేతుడు; సుకేతున్ = సుకేతుని; కున్ = కి; దేవరాతుండును = దేవరాతుడు; దేవరాతున్ = దేవరాతున; కున్ = కు; బృహద్రథుండును = బృహద్రథుడు; పుట్టిరి = జన్మించిరి; అతని = అతని; కిన్ = కి; మహావీర్యుండును = మహావీర్యుడు; అతని = అతని; కిన్ = కి; సుధృతియున్ = సుధృతి; అతని = అతని; కిన్ = కి; ధృష్టకేతుండును = ధృష్టకేతుడు; అతని = అతని; కిన్ = కి; హర్యశ్వుండును = హర్యశ్వుడు; అతని = అతని; కిన్ = కి; మరువునున్ = మరువు; అతని = అతని; కిన్ = కి; ప్రతింధకుండును = ప్రతింధకుడు; అతని = అతని; కిన్ = కి; కృతరయుండును = కృతరయుడు; అతని = అతని; కిన్ = కి; దేవమీఢుడున్ = దేవమీఢుడు; అతని = అతని; కిన్ = కి; విధృతుండును = విధృతుడు; అతని = అతని; కిన్ = కి; మహాధృతియున్ = మహాధృతి; అతని = అతని; కీర్తిరాతుండును = కీర్తిరాతుడు; అతని = అతని; కిన్ = కి; మహారోముండును = మహారోముడు; అతని = అతని; కిన్ = కి; స్వర్ణరోముండును = స్వర్ణరోముడు; అతని = అతని; కిన్ = కి; హ్రస్వరోముండును = హ్రస్వరోముడు; అతని = అతని; కిన్ = కి; సీరధ్వజుండును = సీరధ్వజుడు; పుట్టిరి = కలిగిరి.

భావము:

ఇంకా అతడు నిర్జీవదేహం నుండి పుట్టాడు కనుక వైదేహుడు అని; మధించుటచేత పుట్టినవాడు కనుక మిథిలుడు అని పేరు పొందాడు. ఆ మిథులునిచే కట్టించబడింది మిథిలానగరం అని ప్రసిద్ధమైంది. జనకునికి ఉదావసుడు; ఉదావసునకు నందివర్దనుడు; నందివర్దనునికి సుకేతుడు; సుకేతునికి దేవరాతుడు; దేవరాతునకు బృహద్రథుడు జన్మించారు. అతనికి మహావీర్యుడు; అతనికి సుధృతి; అతనికి ధృష్టకేతుడు; అతనికి హర్యశ్వుడు; అతనికి మరువు; అతనికి ప్రతింధకుడు; అతనికి కృతరయుడు; అతనికి దేవమీఢుడు; అతనికి విధృతుడు; అతనికి మహాధృతి; అతనికి కీర్తిరాతుడు; అతనికి మహారోముడు; అతనికి స్వర్ణరోముడు; అతనికి హ్రస్వరోముడు; అతనికి సీరధ్వజుడు పుట్టారు.