పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-368-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వశిష్ఠుండు శపించిన, నిమియును వశిష్ఠుని దేహంబు పడుఁ గాక యని మరల శపియింప, నవ్వశిష్ఠుండు మిత్రావరుణుల వలనఁ గడపట నూర్వశికి జన్మించె; గురుశాపంబున బ్రహ్మజ్ఞాని యైన నిమి విగతదేహుండైన, నతని దేహంబు మునీశ్వరులు గంధ వస్తువులం బొదివి, దాఁచి దొరకొన్న సత్త్రయాగంబు చెల్లంచిరి; కడపట దేవగణంబులు మెచ్చి వచ్చిన వారలకు నిమిదేహంబు చూపి “బ్రదుకం జేయుం” డనవుడు వారలు “నిమిప్రాణంబు వచ్చుం గాక” యని పలికిన నిమి తనదేహంబు చొరనొల్లక యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వశిష్ఠుండు = వశిష్ఠుడు; శపించినన్ = శపించగా; నిమియును = నిమి; వశిష్ఠుని = వశిష్ఠుని; దేహంబుపడుగాక = మరణించుగాక; అని = అని; మరల = తిరిగి; శపియింపన్ = శపించగా; ఆ = ఆ; వశిష్ఠుండు = వశిష్టుడు; మిత్రావరణుల = మిత్రావరుణుల; వలనన్ = వలన; కడపట = చివరకి; ఊర్వశి = ఊర్వశి; కిన్ = కి; జన్మించెన్ = పుట్టెను; గురు = గురువుయొక్క; శాపంబునన్ = శాపమువలన; బ్రహ్మజ్ఞాని = బ్రహ్మజ్ఞాని; ఐన = అయినట్టి; నిమి = నిమి; విగతదేహుండు = శరీరమువదలినవాడు; ఐనన్ = కాగా; అతనిన్ = అతనియొక్క; దేహంబున్ = శరీరమును; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; గంధవస్తువులన్ = సుగంధద్రవ్యములలో; పొదవి = కూర్చి; దాచి = భద్రపరచి; దొరకొన్న = ప్రారంభించిన; సత్త్రయాగంబున్ = సత్త్రయాగమున; చెల్లించిరి = పూర్తిచేసిరి; కడపట = చివరలో; దేవ = దేవతల; గణంబులున్ = సమూహములు; మెచ్చి = సంతోషించి; వచ్చిన = వచ్చినట్టి; వారలు = వారి; కున్ = కి; నిమి = నిమియొక్క; దేహంబున్ = పార్థివ శరీరమును; చూపి = చూపించి; బ్రతుంకన్ = జీవించునట్లు; చేయుండు = చేయండి; అనవుడు = అనగా; వారలు = వారు; నిమి = నిమియొక్క; ప్రాణంబు = జీవము; వచ్చుంగాక = తిరిగిపొందవలసినది; అని = అని; పలికినన్ = చెప్పగా; నిమి = నిమి; తన = తనయొక్క; దేహంబున్ = దేహమునందు; చొరన్ = ప్రవేశించుటకు; ఒల్లకన్ = అంగీకరించకుండ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా వశిష్ఠుడు నిమిని మరణించు గాక అని శపించగా, నిమి వశిష్ఠుని మరణించు గాక అని తిరిగి శపించాడు. వశిష్టుడు పిమ్మట మిత్రావరుణుల వలన ఊర్వశికి పుట్టాడు. గురుశాపంవలన బ్రహ్మజ్ఞాని నిమి శరీరంవదలాడు. అతని పార్థివ శరీరాన్ని మునిశ్రేష్ఠులు సుగంధద్రవ్యాలలో భద్రపరచి, ప్రారంభించిన సత్త్రయాగం పూర్తిచేసారు. చివరలో దేవతలు సంతోషించి రాగా వారిని నిమిని మరల జీవించేలా చేయమని వేడారు, వారు తథాస్తు అన్నారు, కాని నిమి తన దేహంలో ప్రవేశించడానికి అంగీకరించకుండ ఇలా అన్నాడు.