పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

  •  
  •  
  •  

9-354-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి; యిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; వారలు = వారు; ఏము = మేము; వాల్మీకి = వాల్మీకి; పౌత్రులము = మనుమలము; రాఘవేశ్వరుని = శ్రీరాముని; యాగంబున్ = యజ్ఞమును; చూడన్ = చూచుటకు; వచ్చితిమి = వచ్చాము; అనవుడు = అనగా; మెల్లన = మెల్లిగా; నగి = నవ్వి; యెల్లి = రేపు; ప్రొద్దున = ఉదయము; మీ = మీయొక్క; తండ్రిన్ = తండ్రిని; ఎఱింగెదరు = తెలిసికొనెదరు; రండు = రండి; అని = అని; ఒక్క = ఒకానొక; నివాసంబున్ = గృహమున; కున్ = కు; సత్కరించి = గౌరవించి; పనిచెన్ = పంపించెను; మఱు = తరువాత; నాడు = దినమున; సీతన్ = సీతను; తోడ్కొని = వెంటబెట్టుకొని; కుశలవులన్ = కుశలవులను; ముందటన్ = ముందు; ఇడుకొని = ఉంచుకొని; వాల్మీకి = వాల్మీకి; వచ్చి = వచ్చి; రఘుపుంగవునిన్ = శ్రీరాముని {రఘుపుంగవుడు - రఘువంశములో శ్రేష్ఠుడు, రాముడు}; కని = చూసి; అనేక = పెక్కు; ప్రకారంబులన్ = విధములుగ; వినుతించి = స్తుతించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. “మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం.” వారి పలుకులు విని మెల్లిగా నవ్వి, “రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురు గాని, రండి.” అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకిమహర్షి సీతను, కుశలవులను వెంటబెట్టుకొని వచ్చి శ్రీరాముని పెక్కువిధములుగా స్తుతించి ఇలా అన్నాడు.