పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-332-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండె; నప్పుడు.

టీకా:

అంతన్ = అంతట; వసిష్టుండు = వసిష్ఠుడు; అరుగుదెంచి = వచ్చి; శ్రీరామచంద్రుని = శ్రీరామచంద్రప్రభువు; జటా = జటలుకట్టిన జుట్టు; బంధంబున్ = చిక్కు; విడిపించి = తీసి; కులవృద్దులున్ = కులపెద్దలు; తానునున్ = అతను; సమంత్రంబుగ = మంత్రయుక్తముగ; దేవేంద్రుని = ఇంద్రుని; మంగళస్నానంబు = మంగళస్నాననాలు; చేయించు = చేయించెడి; బృహస్పతి = బృహస్పతి; చందంబునన్ = వలె; సముద్ర = సముద్రపు; నదీ = నదుల; జలంబులన్ = నీటితో; అభిషేకంబున్ = స్నానము; చేయించెన్ = చేయించెను; రఘువరుండును = శ్రీరాముడును {రఘువరుడు - రఘు వంశపు శ్రేష్ఠుడు, రాముడు}; సీతా = సీతాదేవి; సమేతుండు = కూడా ఉన్నవాడు; ఐ = అయ్యి; జలకంబులు = స్నానములు; ఆడి = చేసి; మంచి = చక్కటి; పుట్టంబులున్ = బట్టలను; కట్టికొని = ధరించి; కమ్మని = సువాసనలుగల; పువ్వులున్ = పూలను; తుఱిమి = ముడిచికొని; సుగంధంబులన్ = సుగంధములను; అలందికొని = రాసుకొని; తొడవులున్ = ఆభరణములను; తొడిగికొని = అలంకరించుకొని; తన = తన; కున్ = కు; భరతుడు = భరతుడు; సమర్పించిన = అప్పగించిన; రాజ = పట్టపు; సింహాసనంబునన్ = సింహాసనముపై; కూర్చుండి = కూర్చుండి; అతనిన్ = అతనిని; మన్నించి = ఆదరించి; కౌసల్య = కౌసల్యాదేవి; కున్ = కి; ప్రియంబు = సంతోషము; చేయుచు = కలిగించుచు; జగత్ = లోకము; పూజ్యంబుగాన్ = పూజించునట్లు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = ఏలుతూ; ఉండెను = ఉండెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

అంతట, ఇంద్రుడికి మంగళస్నానాలు చేయించె బృహస్పతి వలె, వసిష్ఠులవారు వచ్చి కులపెద్దలు తాను శ్రీరామచంద్రునికి జటలు కట్టిన జుట్టు చిక్కు తీసి, మంత్రయుక్తంగా పవిత్రమైన సముద్రపు నీటితో, నదుల నీటితో స్నానాలు చేయించారు. శ్రీరాముడు సీతాదేవి స్నానాలు చేసి, చక్కటి బట్టలను ధరించి, సువాసనలుగల పూలు ముడిచికొని, సుగంధాలను రాసుకొని, ఆభరణాలు అలంకరించుకొని, తనకు భరతుడు అప్పగించిన పట్టపు సింహాసనంపై కూర్చున్నారు. భరతుని ఆదరిస్తూ కౌసల్యాదేవి సంతోషించేలా, లోకం పూజించేలా రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఆ సమయంలో....