పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-315-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విభీషణసంస్థాపనుండయి రామచంద్రుఁడు సీతాలక్ష్మణ సమేతుండయి సుగ్రీవ హనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుం డయి, వేల్పులు గురియు పువ్వులసోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువుజాడలు సీతకు నెఱిఁగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చె; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విభీషణ = విభీషణుని; సంస్థాపనుండు = స్థిరపరచినవాడు; అయి = అయ్యి; రామచంద్రుండు = శ్రీరాముడు; సీత = సీత; లక్ష్మణ = లక్ష్మణుడు; సమేతుండు = కూడనున్నవాడు; అయి = ఐ; సుగ్రీవ = సుగ్రీవుడు; హనుమత్ = హనుమంతుడు; ఆదులన్ = మున్నగువారిని; కూడికొని = కలుపుకొని; పుష్పక = పుష్పకవిమానము; ఆరూఢుండు = ఎక్కినవాడు; అయి = ఐ; వేల్పులు = దేవతలు; కురియు = కురిపించెడి; పువ్వులన్ = పూల; సోనలన్ = జల్లులందు; తడియుచున్ = తడుస్తూ; తొల్లి = ఇంతకుపూర్వము; వచ్చిన = వచ్చినట్టి; తెరువు = దారి; జాడలు = గుర్తులు; సీత = సీత; కున్ = కి; ఎఱిగించుచున్ = తెలుపుతూ; మరలి = తిరిగి; నందిగ్రామంబున్ = నందిగ్రామమున; కున్ = కు; వచ్చెను = వచ్చెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:

ఈ విధంగా శ్రీరాముడు విభీషణుని లంకా రాజ్యంలో ప్రతిష్ఠించాడు. పిమ్మట, శ్రీరాముడు సీతాలక్ష్మణ, సుగ్రీవ, హనుమంతాదుల సమేతంగా పుష్పకవిమానం ఎక్కాడు. దేవతలు పూల జల్లులు కురిపిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన దారి, గుర్తులు సీతకి చూపుతూ తిరిగి నందిగ్రామానికి వచ్చాడు. ఆ సమయానికి...