పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-312-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దైతేయప్రమదా పరీత నతిభీతన్ గ్రంథి బంధాలక
వ్రాతన్ నిశ్శ్వసనానిలాశ్రుకణ జీవం జీవదారామ భూ
జాతన్ శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ
భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్.

టీకా:

దైతేయ = రాక్షస; ప్రమదా = స్త్రీలుచేత; పరీతన్ = చుట్టబడినామెను; అతి = మిక్కిలి; భీతన్ = భయపడుతున్నామెను; గ్రంథి = చిక్కుముళ్ళు; బంధ = కట్టిన; అలక = ముంగురుల; వ్రాతన్ = సమూహముకలామెను; నిశ్వాసన్ = నిట్టూర్పులు అనెడి; అనిలన్ = అగ్నికలామెను; అశ్రుకణ = కన్నీటి; జీవన్ = బొట్లచేత; జీవత్ = బతుకుచున్న; ఆరామ = ఉద్యానవనపు; భూజాతన్ = చెట్లుకలామెను; శుష్క = చిక్కిపోయిన; కపోల = చెక్కిళ్ళపై; కీలిత = చేర్చబడిన; కర = చేయి యనెడి; అబ్జాతన్ = పద్మమును; ప్రభూతన్ = ఉంచుకొన్నామెను; కృశీభూతన్ = మిక్కిలి కృశించినామెను; ప్రాణసమేతన్ = ప్రాణావశిష్టలానున్నామెను; సీతన్ = సీతను; కనియెన్ = చూసెను; భూమీశుడ = మహారాజు; ఆ = ఆ; ముందటన్ = ఎదురుగా.

భావము:

అక్కడ సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. ఆమె మిక్కిలి భయపడుతూ ఉంది. ఆమె జుట్టు చిక్కులు పడి అట్టలు కట్టింది. నిట్టూర్పులు నిగడిస్తూ, కన్నీరు కారుస్తూ, చిక్కిపోయిన చెక్కిళ్ళపై చేయి చేర్చి, కృశించిపోయి, ప్రాణావశిష్ట అయి ఉంది. అట్టి సీతాదేవిని శ్రీరాముడు చూసాడు.