పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-279-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజేంద్రుఁడు గాంచె భూరివిధరత్నాగారమున్ మీన కుం
భీగ్రాహకఠోరమున్ విపుల గంభీరంబు నభ్రభ్రమ
ద్ఘోరాన్యోన్యవిభిన్నభంగభవనిర్ఘోషచ్ఛటాంభఃకణ
ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారముం జేరువన్.

టీకా:

ఆ = ఆ; రాజ = రాజులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; కాంచెన్ = చూసెను; భూరివిధ = పెక్కు విధములైన {భూరి - అతి పెద్ద సంఖ్య 1 తరువాత 34 సున్నాలుంటాయి అదే వెయ్యికైతే 3 మాత్రమే ఉంటాయి}; రత్న = రత్నములు; ఆగారమున్ = ఉన్నదానిని; మీన = చేపలు; కుంభీర = నక్రము, మొసలి; గ్రాహ = నీటిపాము, మొసళ్ళతో; కఠోరమున్ = దాటరానిదానిని; విపుల = మిక్కిలి; గంభీరంబున్ = గంభీరమైనది; అభ్ర = ఆకాశమునకు; భ్రమత్ = ఎగిసిపడెడి; ఘోరన్ = భయంకరముగ; అన్యోన్య = పరస్పరము; విభిన్ని = ఢీకొనెడి; భంగ = అలల; భవత్ = వలన కలిగిన; నిర్ఘోష = పెద్ద చప్పుడుచేస్తూ; ఛటత్ = గుంపులు గుంపుల; అంభః = నీటి; కణ = తుంపరలతో; ప్రారుద్ధ = లెస్సగా అరికట్టబడిన; అంబర = ఆకాశపు; పారమున్ = అవధులుకలదానిని; లవణ = ఉప్పు; పారావారమున్ = సముద్రమును; చేరువన్ = దగ్గరగా.

భావము:

బహు రత్ననిధిగా ప్రసిద్ధమైనది, భీకరమైన చేపలు, మొసళ్ళు తిమింగలాలతో దాటరానిది, ఆకాశానికి ఎగిసిపడె అలలు కలది, నీటి తుంపరలతో ఆకాశపు అవధులు తాకేది, గంభీరమైన హోరు కలది అయిన ఆ లవణ సముద్రాన్ని దగ్గరగా ఆ రామ రాజశ్రేష్ఠుడు చూసాడు.