పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-258-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము.

టీకా:

అట్టి = అటువంటి; ఖట్వాంగున్ = ఖట్వాంగుని; కున్ = కి; దీర్ఘబాహుండు = దీర్ఘబాహుడు; దీర్ఘబాహున్ = దీర్ఘబాహుని; కున్ = కి; రఘువు = రఘువు; రఘువున్ = రఘువున; కున్ = కు; పృథుశ్రవణుండున్ = పృథుశ్రవణుడు; పృథుశ్రవణున్ = పృథుశ్రవణుని; కున్ = కి; అజుండును = అజుడు; అజున్ = అజుని; కున్ = కి; దశరథుండును = దశరథుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; దశరథున్ = దశరథుని; కున్ = కి; సుర = దేవతలచే; ప్రార్థితుండు = వేడబడినవాడు; ఐ = అయ్యి; పరబ్రహ్మమయుండు = పరబ్రహ్మస్వరూపము; ఐన = అయిన; హరి = నారయణుడు; నాల్గు = నాలుగు (4); విధంబులున్ = రకములుగ; ఐ = అయ్యి; శ్రీరామ = శ్రీరాముడు; లక్ష్మణ = లక్ష్మణుడు; భరత = భరతుడు; శత్రుఘ్న = శత్రుఘ్నుడు; నామంబులన్ = అనెడి పేర్లతో; నిజ = తనయొక్క; అంశ = అంశతో; సంభూతుండ = అవతరించినవాడు; ఐ = అయ్యి; జన్మించె = పుట్టెను; తత్ = వారి; చరిత్రంబున్ = కథను; వాల్మీకి = వాల్మీకుడు; ప్రముఖులు = మొదలగుముఖ్యులు; ఐన = అయిన; మునుల్ = ఋషుల; చేత = వలన; వర్ణితంబు = వివరింపబడినది; ఐనను = అయినప్పటికి; చెప్పెదన్ = చెప్పెదను; సావధానుండవు = సావధానుండవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము.ౌ

భావము:

ఆ ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. వారి కథను వాల్మీకి మున్నగు మహర్షుల వలన వివరింపబడింది. ఆ ఇతిహాసాన్ని చెప్తాను శ్రద్ధగా విను.