పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-248-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా బ్రాహ్మణి గోపించి “కామార్తనయిన నాదు పెనిమిటిని భక్షించితివి గావున నీవు నెలఁతలంబొందఁ జేరినవేళ మరణంబుఁ బొందు” మని కల్మాషపాదుని శపించి, పతిశల్యంబులతో నగ్నిప్రవేశంబు జేసి సుగతికిం జనియె; నంతఁ బండ్రెండేండ్లు చనిన నా రాజు మునిశాపనిర్ముక్తుండై.

టీకా:

అంతన్ = అంతట; బ్రాహ్మణి = బ్రాహ్మణస్త్రీ; కొపించి = కొపగించి; కామ = కోరికలతో; ఆర్తన్ = దుఃఖిస్తున్నదానిని; అయిన = ఐన; నాదు = నాయొక్క; పెనిమిటిని = భర్తను; భక్షించితివి = తినివేసితివి; కావున = కనుక; నీవున్ = నీవు; నెలతలన్ = స్త్రీలను; పొందన్ = కలియుటకు; చేరిన = వెళ్లిన; వేళ = సమయమునందు; మరణంబున్ = చావును; పొందుము = పొందుగాక; అని = అని; కల్మాషపాదుని = కల్మాషపాదుని; శపించి = శపించి; పతి = భర్త; శల్యంబులన్ = ఎముకల; తోన్ = తోటి; అగ్నిప్రవేశము = సహగమనము; చేసి = చేసి; సుగతి = ముక్తి; కిన్ = కి; చనియెన్ = వెళ్ళెను; అంతన్ = అంతట; పండ్రెండు = పన్నెండు; ఏండ్లు = సంవత్సరములు; చనినన్ = గడవగా; ఆ = ఆ; రాజు = రాజు; ముని = ముని ఇచ్చిన; శాప = శాపమునుండి; నిర్ముక్తుండు = విడుదలైనవాడు; ఐ = అయ్యి.

భావము:

అంతట ఆ బ్రాహ్మణి కొపగించి. “కామార్తురాలైన నా యొక్క భర్తను భక్షించేసావు. కనుక, నీవు స్త్రీసాంగత్యానికి వెళ్లావంటే మరణించెదవు గాక.” అని కల్మాషపాదుని శపించింది. పిమ్మట భర్త ఎముకలతో సహగమనం చేసి ఉత్తమగతి పొందింది. పన్నెండు ఏళ్ళు గడిచాక కల్మాషపాదుడికి ముని శాపం తీరింది.