పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-201-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శునశ్శేపుని ప్రభావంబు వెనుక వివరించెద; నంత భార్యాసహితుం డైన హరిశ్చంద్రు వలనం బ్రీతుండై విశ్వామిత్రుండు నిరస్తదోషుం డైన యతనికి ముఖ్యజ్ఞానంబు గృప జేసిన మనం బన్నమయంబు గావున, మనంబున నన్నరూపి యైన పృథివి నెఱంగి, పృథివిని జలంబువలన నడంచి, జలంబుఁ దేజంబువలన నింకించి, తేజంబు వాయువు వలనం జేరిచి, వాయువు నాకాశంబునం గలిపి, యాకాశంబుఁ దామసాహంకారంబునందు లయంబు చేసి, యహంకారత్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్త్వంబునకు లోకంబులు సృజించెద నను తలంపైన మహత్తత్త్వంబు నందు విషయాకారంబు నివర్తించి, విషయవర్జితంబైన మహత్తత్త్వంబును బరతత్త్వంబుగా నెఱుంగుచు నయ్యెఱుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబు చేసి, యయ్యెఱుకను నిర్వాణసుఖపారవశ్యంబునం బరిహరించి, సకలబంధవిముక్తుండై హరిశ్చంద్రుం డవాఙ్మానస గోచరంబయిన నిజరూపంబుతో వెలుంగుచుండె; నతని కుమారునకు రోహితునకు హరితుండు పుట్టె; హరితునకుఁ జంపనామ ధేయుఁడు జనియించె; నతండు దనపేర జంపానగరంబు నిర్మించె; నా చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుండు జనియించి; రందు బాహుకుండు

టీకా:

శునశ్శేపుని = శునశ్శేపుని; ప్రభావంబున్ = మహిమను; వెనుకన్ = తరువాత; వివరించెదన్ = తెలిపెదను; అంతన్ = అప్పుడు; భార్యా = భార్యతో; సహితుండు = కూడ ఉన్నవాడు; ఐన = అయిన; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; వలనన్ = వలన; ప్రీతుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; నిరస్త = విడిచిన; దోషుండు = దోషములుగలవాడు; ఐన = అయినట్టి; అతని = అతని; కిన్ = కి; ముఖ్య = పరమ; జ్ఞానంబున్ = విద్యను; కృపచేసినన్ = దయతోఇవ్వగా; మనంబున్ = మనస్సు; అన్నమయంబున్ = అన్నస్వరూపము; కావునన్ = కనుక; మనంబునన్ = మనసునందు; అన్న = ఆహారమును; రూపి = రూపించునది; ఐన = అయిన; పృథివిన్ = భూమిని; ఎఱింగి = తెలిసికొని; పృథివినిన్ = భూమిని; జలంబున్ = నీటి; వలనన్ = అందు; అడంచి = కలిపి; జలంబున్ = నీటిని; తేజంబున్ = తేజస్స; వలనన్ = అందు; ఇంకించి = లీనముచేసి; తేజంబున్ = తేజస్సును; వాయువు = వాయువు; వలనన్ = అందు; చేరిచి = చేర్చి; వాయువున్ = వాయువును; ఆకాశంబునన్ = ఆకాశమునందు; కలిపి = లయంజేసి; ఆకాశంబున్ = ఆకాశమును; తామసాహంకారంబు = తామసాహంకారము; అందున్ = లో; లయంబున్ = కలిసిపోవునట్లు; చేసి = చేసి; అహంకార = అహంకారములు; త్రయంబున్ = మూటిని; మహత్తత్త్వంబునన్ = మహత్తత్త్వమునందు; డిందించి = విలీనముచేసి; పరతత్త్వంబున్ = పరతత్వమున; కున్ = కు; లోకంబువ్ = లోతములను; సృజించెదను = సృష్టించెదను; అను = అనెడి; తలంపు = భావము; ఐన = అయినట్టి; మహత్తత్త్వంబునన్ = మహత్తత్త్వము; అందున్ = అందు; విషయాకారంబున్ = ఇంద్రియార్థములను; నివర్తించి = తొలగించి; విషయ = ఇంద్రియార్థమునండు; వర్జితంబు = విడువబడినది; ఐన = అయినట్టి; మహత్తత్త్వంబునున్ = మహత్తత్త్వమును; పరతత్త్వంబున్ = పరతత్వము; కాన్ = అయినట్లు; ఎఱుంగుచున్ = తెలియుచు; ఆ = ఆ; ఎఱుక = తెలివిడి, జ్ఞానము; వలనన్ = వలన; సంసార = సంసారమునపడుటకు; హేతువు = కారణభూతము; ఐన = అయినట్టి; ప్రకృతిని = ప్రకృతిని; భస్మంబు = బూడిద; చేసి = చేసి; ఆ = ఆ; ఎఱుగను = తెలవిడిని, జ్ఞానమును; నిర్వాణ = ముక్తి; సుఖ = సౌఖ్యపు; పారవశ్యంబునన్ = పరవశముతో; పరిహరించి = తొలగించి; సకల = సమస్తమైన; బంధ = బంధనములనుండి; విముక్తుండు = విడివడినవాడు; ఐ = అయ్యి; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; అవాఙ్మానస = వాక్కు మనసులకతీతమై; గోచరంబు = తెలిసెడిది; అయిన = ఐన; నిజ = ఆత్మ; రూపంబున్న = స్వరూపము; తోన్ = తోటి; వెలుంగుచున్ = ప్రకాశించుచు; ఉండెన్ = ఉండెను; అతని = అతని; కుమారున్ = పుత్రుని; కున్ = కి; రోహితున్ = రోహితుని; కున్ = కి; హరితుండు = హరితుడు; పుట్టెన్ = జన్మించెను; హరితున్ = హరితున; కున్ = కు; చంప = చంపుడు అనెడి; నామధేయుండు = పేరుగలవాడు; జనియించెన్ = పుట్టెను; అతండు = అతడు; తన = తనయొక్క; పేరన్ = పేరుతో; చంపా = చంపా యనెడి; నగరంబున్ = నగరమును; నిర్మించెన్ = కట్టించెను; ఆ = ఆ; చంపుని = చంపుని; కిన్ = కి; సుదేవుండున్ = సుదేవుడు; సుదేవుని = సుదేవుని; కిన్ = కి; విజయుండు = విజయుడు; విజయున్ = విజయుని; కున్ = కు; రురుకుండు = రురుకుడు; రురుకున్ = రురుకుని; కున్ = కి; వృకుండున్ = వృకుండును; వృకున్ = వృకున; కున్ = కు; బాహుకుండు = బాహుకుడు; జనియించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; బాహుకుండు = బాహుకుడు.

భావము:

ఆ శునశ్శేపుడి మహిమను తరువాత చెప్తాను. ఆ యాగానికి సంతోషించిన విశ్వామిత్రుడు దయతో అప్పుడు దోషరహితుడు అయిన హరిశ్చంద్రుడికి అతని భార్యకి ముఖ్యఙ్ఞానాన్ని ఇచ్చాడు. అంత హరిశ్చంద్రుడు మనస్సు అన్న స్వరూపము కనుక, అన్నరూపి అయిన భూమిని తెలుసుకున్నాడు. భూమిని నీటి అందు కలిపి, నీటిని తేజస్సు అందు లీనంచేసి, తేజస్సును వాయువు అందు చేర్చి, వాయువును ఆకాశమునందు లయంజేసి, ఆకాశాన్ని తామసాహంకారంలో కలిపాడు. అహంకారాలు మూటిని మహత్తత్త్వమునందు విలీనముచేసి, పరతత్వంబునకు లోకాలను సృష్టించెదను అను భావమైన మహత్తత్త్వములో ఇంద్రియార్థాలను తొలగించాడు. అవి తొలగిపోగా మహతత్వమును పరతత్వముగా తెలుసుకున్నాడు. ఆ తెలివిడి వలన సంసారానికి కారణభూతం అయిన ప్రకృతిని బూడిద చేసాడు. ఆ తెలవిడిని ముక్తి సౌఖ్యం పొందిన పరవశంతో తొలగించి, సకల బంధాలనుండి విడివడ్డాడు. అంత హరిశ్చంద్రుడు వాక్కు, మనసులు అతీతమైన ఆత్మ స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని పుత్రుడు రోహితునికి హరితుడు జన్మించాడు. హరితునకు చంపుడు పుట్టాడు. అతడు తన పేరుతో చంపానగరము నిర్మించాడు. ఆ చంపునికి సుదేవుడు, సుదేవునికి విజయుడు, విజయునికి రురుకుడు, రురుకునికి వృకుడు, వృకునకు బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు అను...