పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-193-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులపఱచుట విని వసిష్ఠుండు విశ్వామిత్రునిఁ గృధ్రమ్మవు గమ్మని శపించె; విశ్వామిత్రుండును వసిష్ఠుని బకంబవు గమ్మని శపించె; పక్షిరూపు లయ్యును వైరంబు మానక యయ్యిరువురును యుద్ధంబు చేసి రంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదు నుపదేశంబున వరుణోపాసనంబు నతి భక్తితోఁ జేయ నా వరుణుండు ప్రత్యతక్షంబైన నతనిక మ్రొక్కి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; నెగులు = బాధ; పఱచుట = పెట్టుట; విని = విని; వసిష్ఠుండు = వసిష్టుడు; విశ్వామిత్రునిన్ = విశ్వామిత్రుని; గృధ్రవున్ = గ్రద్దవు; కమ్ము = ఐపోవుము; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను; విశ్వామిత్రుండునున్ = విశ్వామిత్రుడు; వసిష్టుని = వసిష్టుని; బకంబవు = కొంగవు; కమ్ము = ఐపోవుము; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను; పక్షి = పక్షిగా; రూపులు = స్వరూపముపొందినవారు; అయ్యును = అయినప్పటికిని; వైరంబున్ = శత్రుత్వమును; మానక = వదలక; ఆ = ఆ; ఇరువురును = ఇద్దరు; యుద్ధంబున్ = యుద్ధము; చేసిరి = చేసిరి; అంతన్ = అంతట; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; పుత్రులు = కొడుకులు; లేక = కలుగపోవుటచేత; నారదున్ = నారదుని; ఉపదేశంబునన్ = సలహాప్రకారము; వరుణ = వరుణదేవుని; ఉపాసనంబున్ = పూజను; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; చేయన్ = ఆచరించగా; ఆ = ఆ; వరుణుండు = వరుణదేవుడు; ప్రత్యక్షంబు = ప్రత్యక్షము; ఐనన్ = కాగా; అతనికి = అతనికి; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ మాదిరిగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధ పెట్టుట విని వసిష్టుడు విశ్వామిత్రుని గ్రద్దవు ఐపోమని శాపమిచ్చాడు. విశ్వామిత్రుడు వసిష్టుని కొంగవు ఐపోమని శాపమిచ్చాడు. పక్షులుగా అయినా శత్రుత్వమును వదలక ఆ ఇద్దరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతట హరిశ్చంద్రుడు కొడుకులు కలుగక నారదుని సలహాప్రకారం వరుణదేవుని పూజించాడు. వరుణదేవుడు ప్రత్యక్షము కాగా నమస్కరించి ఈ విధముగ పలికాడు.