పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మాంధాత కథ

  •  
  •  
  •  

9-183-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొక్కనాఁడు మాంధాతృమేదినీవల్లభుండు “మునీశ్వరుం డెందుఁ బోయెఁ గూఁతు లెక్కడ నలజడి పడుచున్నవారలో” యని తలంచి వెదకవచ్చి, యొక్క మహాగహనంబున మణిమయ సౌధంబులం జక్రవర్తియుంబోలెఁ గ్రీడించుచున్న తాపస రాజుం గని, సంతసించి, వెఱఁగుపడి, మన్ననలం బొంది మెల్లన కూఁతులం బొడగని సత్కరించి యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; మాంధాతృ = మాంధాతయనెడి; మేదినీవల్లభుండు = రాజు {మేదినీవల్లభుడు - భూమికి భర్త, రాజు}; ముని = మునులలో; ఈశ్వరుండు = గొప్పవాడు; ఎందున్ = ఎక్కడికి; పోయెన్ = వెళ్లపోయెనో; కూతులున్ = కుమార్తెలు; ఎక్కడన్ = ఎక్కడ; అలజడిపడుచున్ = ఖంగారుపడుతు; ఉన్నవారలో = ఉన్నారో; అని = అని; తలంచి = విచారించి; వెదకన్ = అన్వేషించుటకు; వచ్చి = వచ్చి; ఒక్క = ఒకానొక; మహాగహనంబునన్ = మహాటవిలో; మణి = మణులు; మయ = పొదగిన; సౌధంబులన్ = భవనములందు; చక్రవర్తి = సార్వభౌముని {చక్రవర్తి - భూమండలమంతా అధికారము వర్తించువాడు, సార్వభౌముడు}; పోలెన్ = వలె; క్రీడించుచున్న = విహరించుచున్న; తాపస = ముని; రాజున్ = శ్రేష్ఠుని; కని = చూసి; సంతసించి = సంతోషించి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; మన్ననలన్ = మర్యాదలు; పొంది = పొంది; మెల్లన = మెల్లిగా; కూతులన్ = కుమార్తెలను; పొడగని = చూసి; సత్కరించి = గౌరవించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అంతట ఒకానొక దినమున మాంధాత తన కుమార్తెలతో ముని ఎక్కడికి వెళ్లాడో, ఎలా ఉన్నారో అనే ఆందోళనతో, వెతక సాగాడు. ఒక మహాటవిలో మణులు పొదగిన భవనాలలో సార్వభౌముడి వలె విహరిస్తున్న మునిని చూసి అచ్చెరువొంది, సంతోషించాడు. మర్యాదలు పొంది మెల్లిగా కుమార్తెలను ఇలా అడిగాడు.