పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మాంధాత కథ

  •  
  •  
  •  

9-167-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలు దుఃఖించుచుండు నంతఁ గొంత తడవునకు యువనాశ్వుని కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిహ్నంబులు గల కుమారుండు జన్మించి తల్లి లేని కతంబునఁ గడుపునకు లేక యేడ్చుచుండ, నింద్రుండు వచ్చి, శిశువునకు నాకఁలి దీఱుకొఱకు వాని నోటం దన వ్రేలిడినం, ద్రావిన కతంబున వాని పేరు మాంధాత యని నిర్దేశించి చనియె; నివ్విధంబున.
^ షోడశ మహారాజులు

టీకా:

వారలు = వారు; దుఃఖించుచున్ = బాధపడుతు; ఉండన్ = ఉండగా; అంతన్ = అప్పుడు; కొంత = కొంచము; తడవున్ = సేపటి; కున్ = కి; యువనాశ్వుని = యువనాశ్వునియొక్క; కడుపున్ = గర్భమును; వ్రక్కలించుకొని = పగులగొట్టికొని; చక్రవర్తి = రాజాధిరాజ; చిహ్నంబులు = గుర్తులు; కల = కలిగిన; కుమారుండు = పుత్రుడు; జన్మించి = పుట్టి; తల్లి = అమ్మ; లేని = లేకపోయిన; కతంబునన్ = కారణముచేత; కడుపున్ = ఆకలితీరుట; కు = కు; లేక = దారిలేక; ఏడ్చుచుండన్ = ఏడుస్తుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చి = వచ్చి; శిశువున్ = చంటిపిల్లవాని; కున్ = కి; ఆకలి = ఆకలి; తీఱు = తీరుట; కొఱకున్ = కోసము; వాని = అతని; నోటన్ = నోటిలో; తన = తనయొక్క; వ్రేలున్ = వేలును; ఇడినన్ = పెట్టగా; త్రావినన్ = తాగిన; కతంబునన్ = కారణముచేత; వాని = అతని; పేరు = నామము; మాంధాత = మాంధాత {మాంథాత – సూర్యవంశ రాజు, షోడశమహారాజులలో ఒకడు, సం. విణ. గొప్పవాడు, వ్యు. (మామ్ ధే తృచ్) కృ. ప్ర., నన్ను ఈతడు తొలగించగలడు అని దేవేంద్రుడు వెఱపొందినందున ఈతనికి ఈ వ్యవహార నామము}; అని = అని; నిర్దేశించి = పెట్టి; చనియెన్ = వెళ్లెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

వారు అలా బాధపడుతూ ఉండగా, యువనాశ్వుని గర్భాన్ని పగులగొట్టికొని రాజాధిరాజ గుర్తులు కలిగిన పుత్రుడు పుట్టాడు. తల్లి లేకపోడంతో ఆకలితీరక ఏడవ సాగాడు. ఇంద్రుడు వచ్చి చంటిపిల్లవాడికి ఆకలి తీరుట కోసం అతని నోటిలో తన వేలు పెట్టాడు. అందుచేత అతని నామము మాంధాత అని పెట్టి వెళ్లాడు. ఈ విధముగ....