పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-154-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మయ్యంబరీషునకు విరూపుండును, గేతుమంతుండును, శంభుండును ననువారు మువ్వురు గొడుకు; లందుఁ గేతుమంతుడును శంభుండును హరింగూర్చి తపంబు చేయువారై వనంబునకుం జనిరి; విరూపునికిఁ బృషదశ్వుండును, బృషదశ్వునకు రథీతరుండును గలిగి; రమ్మహాత్మునికి సంతతి లేకున్ననంగిరసుఁ డను మునీంద్రుం డతని భార్యయందు బ్రహ్మతేజోనిధు లయిన కొడుకులం గలిగించె వారలు రథీతరగోత్రులు నాంగిరసులను బ్రాహ్మణులునై యితరు లందు ముఖ్యులయి ప్రవర్తిల్లి" రని చెప్పి శుకుం డిట్లనియె.

టీకా:

వినుము = వినుము; ఆ = ఆ; అంబరీషున్ = అంబరీషున; కున్ = కు; విరూపుండును = విరూపుడు; కేతుమంతుడును = కేతుమంతుడు; శంభుండును = శంభుడు; అనువారు = అనెడివారు; మువ్వురు = ముగ్గురు (3); కొడుకులు = పుత్రులు; అందు = వారిలో; కేతుమంతుడును = కేతుమంతుడు; శంభుండును = శంభుడు; హరిన్ = విష్ణుని; గూర్చి = గురించి; తపంబున్ = తపస్సు; చేయువారు = చేసెడివారు; ఐ = అయ్యి; వనంబున్ = అడవికి; చనిరి = వెళ్ళిపోయిరి; విరూపున్ = విరూపుని; కిన్ = కి; పృషదశ్వుండును = పృషదశ్వుడు; పృషదశ్వున్ = పృషదశ్వుని; కిన్ = కి; రథీతరుండును = రథీతరుడు; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కిన్ = కి; సంతతి = పిల్లలు; లేకున్న = లేకపోవుటచేత; అంగిరసుడు = అంగిరసుడు; అను = అనెడి; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; అతని = అతనియొక్క; భార్య = రాణి; అందున్ = అందు; బ్రహ్మతేజస్సు = బ్రాహ్మణతేజస్సు; నిధులు = అధికముగ కలవారు; అయిన = ఐన; కొడుకులన్ = పుత్రులను; కలిగించెన్ = పుట్టించెను; వారలు = వారు; రథీతర = రథీతర అనెడి; గోత్రులు = గోత్రమున పుట్టినవారు; అంగిరసులు = అంగిరసులు; అను = అనెడి; బ్రాహ్మణులున్ = బ్రాహ్మణులు; ఐ = అయ్యి; ఇతరులు = మిగతావారి; అందు = లో; ముఖ్యులు = ప్రసిద్ధిచెందినవారు; అయి = ఐ; ప్రవర్తిల్లిరి = వర్తించిరి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

వినుము. ఆ అంబరీషునకు విరూపుడు కేతుమంతుడు శంభుడు అని ముగ్గురు (3) పుత్రులు. వారిలో కేతుమంతుడు శంభుడు ఇద్దరు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయారు. విరూపునికి పృషదశ్వుడు. పృషదశ్వుడికి రథీతరుడు పుట్టారు. అతనికి పిల్లలు లేకపోవుటచేత అంగిరసుడు అనెడి మునిముఖ్యుడు అతని రాణి అందు బ్రాహ్మణ తేజస్సు పుత్రులను పుట్టించాడు. వారు రథీతర అను గోత్రంతో పుట్టిన అంగిరసులు అనె బ్రాహ్మణులుగా ప్రసిద్ధి చెందారు.” అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు.