పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-129-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు-
నీవ చంద్రుండవు; నీవ జలము;
నీవ నేలయు; నింగి నీవ; సమీరంబు-
నీవ; భూతేంద్రియ నికర మీవ;
నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును-
నీవ యజ్ఞంబును; నీవ ఫలము;
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు-
నీవ కాలంబును; నీవ జగము;

9-129.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవ బహుయజ్ఞభోజివి; నీవ నిత్య
మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి
స్త్రముఖ్యమ! కావవే చాలు మునిని.

టీకా:

నీవ = నీవే; పావకుడవు = అగ్నివి; నీవ = నీవే; సూర్యుండవున్ = సూర్యుడవు; నీవ = నీవే; చంద్రుండవు = చంద్రుడవు; నీవ = నీవే; జలము = నీరు; నీవ = నీవే; నేలయున్ = భూమి; నింగి = ఆకాశము; నీవ = నీవే; సమీరంబు = గాలివి; నీవ = నీవే; భూత = ప్రాణులు; ఇంద్రియ = ఇంద్రియముల; నికరము = సమూహము; ఈవ = నీవే; నీవ = నీవే; బ్రహ్మంబును = సృష్టికర్తవు; నీవ = నీవే; సత్యంబును = సత్యము; నీవ = నీవే; యజ్ఞంబును = యజ్ఞము; నీవ = నీవే; ఫలము = యజ్ఞఫలితము; నీవ = నీవే; లోకేశులున్ = సర్వలోకాధిపతులు; నీవ = నీవే; సర్వ = అందరిలోను; ఆత్మయున్ = ఉండెడివాడవు; నీవ = నీవే; కాలంబును = కాలము; నీవ = నీవే; జగమున్ = భువనము.
నీవ = నీవే; బహు = అనేకములైనట్టి; యజ్ఞ = యజ్ఞఫలమును; భోజివి = పొందెడివాడవు; నీవ = నీవే; నిత్య = శాశ్వతమైన; మూల = ఆధారభూతమైన; తేజంబున్ = తేజస్సువి; నీవు = నీ; కున్ = కు; నేన్ = నేను; మ్రొక్కువాడన్ = నమస్కరించుచున్నాను; నీరజాక్షుండు = విష్ణుమూర్తి {నీరజాక్షుండు - నీరజ (పద్మము)లవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; చాల = బాగ; మన్నించునట్టి = గౌరవించెడి; శస్త్ర = ఆయుధ; ముఖ్యమ = శ్రేష్ఠమ; కావవే = కాపాడుము; చాలు = ఇకచాలును; మునిని = ఋషిని.

భావము:

“శ్రీమహావిష్ణువు గౌరవించే ఆయుధ శ్రేష్ఠమ! నీవే అగ్నివి; నీవే సూర్యుడవు; నీవే చంద్రుడవు; నీవే నీరు; నీవే భూమి; ఆకాశము నీవే; గాలివి నీవే; సకల ప్రాణులు, ఇంద్రియాలు నీవే; సృష్టికర్తవు నీవే; సత్యం నీవే; యజ్ఞం నీవే; నీవే యజ్ఞఫలితం; సర్వలోకాధిపతులు నీవే; నీవే సర్వాత్మవు; నీవే కాలం; నీవే భువనము; నీవే యజ్ఞఫలమును పొందేవాడవు; నీవే నిత్య మూల తేజస్సువి; నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇకచాలును ఈ ఋషిని కాపాడు.