పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-91-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వ్రతంబు చేసి, యా వ్రతాంతంబునం గార్తికమాసంబున మూఁడు రాత్రు లుపవసించి, కాళిందీజలంబుల స్నాతుండయి, మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సుసంపన్నుం డయి, హరి నభిషేకంబు జేసి, మనోహరంబు లయిన గంధాక్షతంబులు సమర్పించి యభినవామోదంబులైన పుష్పంబులం బూజించి తదనంతరంబ.

టీకా:

ఇట్లు = ఇలా; వ్రతంబున్ = వ్రతమును; చేసి = ఆచరించి; ఆ = ఆ; వ్రత = వ్రతముయొక్క; అంతం = పూర్తిఅయినప్పుడు; కార్తిక = కార్తీక; మాసంబునన్ = నెలలో; మూఁడు = మూడు (3); రాత్రులు = రోజులురాత్రులందు; ఉపవసించి = నిరాహారముగనుండి; కాళిందీ = యమునానదిలోని; జలంబులన్ = నీటిలో; స్నాతుండు = స్నానముచేసినవాడు; అయి = అయ్యి; మధు = మధు యనెడి; వనంబునన్ = తోటలో; మహాభిషేక = మహాభిషేకపు; విధానంబునన్ = పద్దతితో; విహిత = అవసరమైన; పరికర = సాధనములు; సుసంపన్నుండు = పుష్కలముగాగలవాడు; అయి = అయ్యి; హరిన్ = హరిప్రతిమకు; అభిషేకంబున్ = అభిషేకము; చేసి = ఆచరించి; మనోహరంబులు = చక్కటివి; అయిన = ఐన; గంధ = గంధములు; అక్షతంబులన్ = అక్షింతలు; సమర్పించి = నివేదించి; అభినవ = సరికొత్త; ఆమోదంబులు = సువాసనులుగలవి; ఐన = అయినట్టి; పుష్పంబులన్ = పూలతో; పూజించి = పూజచేసి; తదనంతరంబ = ఆతరువాత.

భావము:

ఇలా కార్తిక మాసంలో వ్రతము ఆచరించి ఆ వ్రతాంతమున మూడు రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పిమ్మట యమునానది నీటిలో స్నానము చేసాడు. మధువనంలో మహాభిషేకానికి కావలసిన పరికరాలు అన్నీ పుష్కలంగా సమకూర్చుకున్నాడు. హరిప్రతిమకు అభిషేకం చేసి మనోహరములైన గంథాక్షతలను సమర్పించాడు. సువాసనా భరితాలైన నవనవలాడే పూలతో పూజించి, తరువాత....