పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కడలిలో నావను గాచుట

  •  
  •  
  •  

8-732-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; నంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; పలికిన = పలుకగా; సంతసించి = సంతోషించి; మత్స్యరూపంబునన్ = మత్స్యావతారముతో; మహాసముద్రంబునన్ = మహాసముద్రమునందు; విహరించు = క్రీడించెడి; హరి = విష్ణుమూర్తి; పురాణపురుషుండు = ఆదివిష్ణుడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సాంఖ్యయోగ = సాంఖ్యయోగము; క్రియా = ఆచరణతో; సహిత = కూడినది; అగు = అయిన; పురాణసంహితన్ = పురాతనవేదభాగమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను; ఆ = ఆ; మహారాజు = మహారాజు; ముని = మునులతో; సమేతుండు = కూడి ఉన్నవాడు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతునిచే; నిగదితంబు = చెప్పబడినది; ఐ = అయ్యి; సనాతనంబు = అతిపురాతనము; అగు = అయిన; బ్రహ్మస్వరూపంబున్ = బ్రహ్మజ్ఞానమును; విని = విని; కృతార్థుండు = ధన్యుడు; అయ్యెన్ = అయ్యెను; అతండు = అతడు; ఈ = ఈ; మహాకల్పంబునన్ = మహాకల్పమునందు; వివస్వతుండు = వివస్వతుడు; అనంబరగిన్ = అనెడిపేరుకలవాడైన; సూర్యున్ = సూర్యున; కున్ = కు; శ్రాద్ధదేవుండు = శ్రాద్ధదేవుడు; అనన్ = అనబడువాడై; జన్మించి = పుట్టి; శ్రీహరి = విష్ణుమూర్తి; కృపా = దయ; వశంబునన్ = వలన; ఏడవ = ఏడవ (7); మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; ఆ = ఆ; విధంబునన్ = విధముగ; పెనురేయి = ప్రళయకాలము; నిండున్ = పూర్తి అగు; అంతకున్ = అంతవరకు; సంచరించి = విహరించి; జలచరాకారుండు = మత్స్యావతారుడు; అగు = అయిన; నారాయణుండు = విష్ణువు; తత్ = ఆ; నిశాంత = కల్పంతెల్లవారుఝాము {నిశాంతము - నిశ (రాత్రి, ప్రళయము) అంతము (చివర), కల్పము ఉదయించబోవుసమయము}; సమయంబునన్ = సమయమునందు.

భావము:

ఈ విధంగా సత్యవ్రతుడు ప్రార్థన చేయగా విని, మత్స్య రూపంతో సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించాడు. మునులతోపాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడైయ్యాడు. సత్యవ్రతుడు ఈకల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల ఏడవమనువు అయ్యాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆవిధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతున్నాడు.