పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్స్యావతార కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-701-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడ పట దిగవిడువకు వెడలఁ దిగువు" మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె.

టీకా:

అదియునున్ = అదికూడ; ముహూర్తమాత్రంబున్ = కొద్దిసమయమున; కున్ = కే; మూడు = మూడు (3); చేతుల = చేతులంత, జానల; నిడుపు = పొడువు; ఐ = అయ్యి; ఉదంచంబున్ = బాన; నిండి = నిండిపోయి; పట్టుచాలక = పట్టకపోవుటచేత; వేఱొండు = ఇంకొకటి; తెమ్ము = తీసుకురమ్ము; అనవుడున్ = అనగా; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; కరుణాగుణంబున్ = దయకు; ఆటపట్టు = నిలయమైనవాడు; కావునన్ = కనుక; గండకంబున్ = పెద్దచేపను; ఒండొక్క = ఒకానొక; చిఱుత = చిన్న; మడుగునన్ = సరస్సునందు; ఉనిచెన్ = ఉంచెను; అదియునున్ = అది; ఆ = ఆ; సరోవర = సరస్సుయొక్క; జలంబున్ = నీళ్ళ; కున్ = కి; అగ్గలంబు = పెద్దది; ఐ = అయ్యి; తన = తన; కున్ = కు; సంచరింపన్ = మెలగుటకు; అది = అది; కొంచంబు = చిన్నది; అని = అని; పలికినన్ = అనగా; పుడమిఱేడు = రాజు; మంచివాడు = మంచివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆ = ఆ; కంచరంబున్ = జలచరమును; ఉదంచిత = ఎక్కువ; జల = నీరు; ఆస్పదంబు = ఉండెడిది; ఐన = అయిన; హ్రదంబున్ = పెద్దచెరువు; అందున్ = లో; ఇడియెన్ = ఉంచెను; అదియున్ = అది; ఆ = ఆ; సలిలలాశయంబున్ = జలాశయమున; కును = కుకూడ; అధికంబు = పెద్దది; ఐ = అయ్యి; పెరుగన్ = పెరిగిపోగా; ఇమ్ము = చోటు; చాలదు = సరిపోలేదు; అని = అని; చెప్పికొనిన = చెప్పగా; ఆ = ఆ; పుణ్యుండు = పుణ్యాత్ముడు; ఒప్పెడి = చక్కటి; నడవడిన్ = ప్రవర్తన; తప్పని = వదలని; వాడు = వాడు; ఐన = అయినట్టి; కతంబునన్ = కారణముచేత; ఆ = ఆ; మహా = గొప్ప; మీనంబును = చేపను; మహార్ణవంబునన్ = మహాసముద్రమునందు {మహార్ణవము - మహా (గొప్ప) అర్ణవము (ఉదకమునకు స్థానము, సముద్రము), మహాసముద్రము}; విడిచెన్ = వదలెను; అదియునున్ = దానితో; మకరాకరంబునన్ = సముద్రములో {మకరాకరము - మకరముల (మొసళ్ళ)కి ఆకరము (నివాసము), సముద్రము}; పడి = పడి; రాజున్ = రాజున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; పెను = పెద్ద; మొసళ్ళు = మొసళ్ళు; ముసురుకొని = చుట్టుముట్టి; కసిమెసంగి = చెలరేగి; మ్రింగెడిన్ = మింగేస్తాయి; ఇంతకాలంబు = ఇన్నాళ్ళు; నడపి = నడిపించి, కాపాడి; కడపట = చివరకు; దిగవిడువకున్ = వదలిపెట్టకు; వెడలన్ = బయటకు; తిగువుము = పడవేయుము; అని = అని; ఎలింగింపన్ = మొరపెట్టుకొనగా; తెలిసి = అర్థముచేసికొని; కడపటన్ = చివరకు; ఆ = ఆ; నీటితిరుగుడు = జలచరములలో; ప్రోడ = వివేకి; కున్ = తో; పుడమిఱేడు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = అనెను.

భావము:

ఒక్క క్షణంలో ఆ మీనం మూడు చేతుల పొడవు పెరిగిపోయి, (ఆంధ్ర వాచస్పతము చెయ్యి అంటే - రెండు మూరల పొడవు అంటే మూడడుగులు) ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగుకూడా సరిపోనంత పెరిగిపోయి “నాకు తిరగడానికి చోటు చాలటం లేదు” అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటంలేదని చెప్పుకుంది. బహు దొడ్డ సన్మార్గ చరితుడూ, పుణ్యశీలీ కనుక ఆ మహా మీనాన్ని తీసుకుని వెళ్ళి మహా సముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్ళకు నెలవు అని పేరుకదా. “ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళూ కాపాడి, ఇవాళ నన్ను ఇలా వదలివేయకు, బయటకు తీసుకురా” అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు.